Total Pageviews

Friday, February 25, 2011

నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ

నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ
నిన్నియును నొనగూడె నింతలోపలనె

సొలపు నీ కడగంటి చూపు హృదయము గాడి
లలినితడు శ్రీవత్సలాంఛనుండాయ
వెలది నిను బెడ బాసి విరహంపు మెయికాక
వలన నీతడు నీల వర్ణుడై నాడు

అదన నీ చనుగుబ్బలను చక్రముల చేత
పదిల పరపుచు చక్రపాణియైనాడు
సుదతి నీ దేహమున సొబగు కుంకుమపుత-
లెదిగి పీతాంబరంబీతనికి నాయ

ఆలింగనాపేక్ష ననయంబు నినుగూడ
లోలుడటుగాన నాలుగు చేతులాయ
శ్రీలలిత మూర్తియగు శ్రీవేంకటేశ్వరుడు
పాలించె నిను నీకె బరితోషమాయ

ముఖ్యపదాల అర్ధం:
నిన్ను గూడిన: నిన్ను కూడిన =నీతో కలసి
నిలువెల్ల: మొత్తం శరీరము (head to foot)
సొంపాయ = సొంపు అయ్యెను: అందము,సొగసు గా అయినాడు (Grace, Elegance)
నిన్నియును = ఇన్నియును
నొనగూడె = ఒనగూడె: సమకూరె
నింతలోపలనె: ఇంతలోనే

సొలపు: నిస్త్రాణ, పారవశ్యము (languishing, swooning, faintness)
నీ కడగంటి చూపు: నీ కనుచివర చూపు (To glance, view sidelong, to look askance)
హృదయము గాడి: మనస్సుకు తగిలి
లలినితడు = లలి + ఇతడు =లలి అంటే ప్రేమతో, క్రమముతో, వికాసము, ఉత్సాహము తో ఇతడు
శ్రీవత్సలాంఛనుండాయ: శ్రీవత్స+ లాంఛనుడు + ఆయె = శ్రీవత్సము అంటే విష్ణువక్షస్థలమందలి మచ్చ (A particular mark, said to be curl of hair, on the breast of Vishnu)
వెలది: స్త్రీ
నిను బెడ బాసి =నిను వెడ వాసి : నిను వదిలి నివసించి
విరహంపు =విరహము
మెయికాక : భరించలేక, తాళలేక (మొయి అంటే నల్లని మేఘము అని కూడా అర్ధం)
నీతడు నీల వర్ణుడై నాడు : ఈతడు (వేంకటేశుడు)నల్లటి రంగును పొందినాడు.

అదన: అధికమైన
నీ చనుగుబ్బలను: నీ చను గుబ్బలు + అను: నీ వక్షోజములు (స్తనములు, పాలిండ్లు) అను (చను అంటే వక్షోజం. గుబ్బ అంటే గుండ్రని)
చక్రముల చేత : చక్రముల చేత (అంటే ఆమె స్తనములు చక్రాల్లా పదునుదేరి గుండ్రంగా ఉన్నాయని చెప్పాలనుకున్నారేమో)
పదిల పరపుచు: భద్రముగా (To secure or take care of)
చక్రపాణియైనాడు: చక్రము పాణి (చేతి) యందు కలవాడు
సుదతి: స్త్రీ (అలమేలు మంగ ఇక్కడ)
నీ దేహమున కుంకుమపుత సొబగు: నీ శరీరమున పూసినటు వంటి కుంకుమపూత వలన వచ్చెడి సొగసు
లెదిగి పీతాంబరంబీతనికి నాయ: ఎదిగి + పీతాంబరం + ఇతనికి+ ఆయ = ఇతనికి పట్టు వస్త్రమైనది

ననయంబు = అనయము : ఎప్పుడూ, నిరంతరము
నినుగూడ : నిను కలసి
ఆలింగనాపేక్ష లోలుడటుగాన:  ఆలింగన + ఆపేక్ష + లోలుడు +అటు +గాన= కౌగిలి కోసం మిక్కిలి ఆశ, కోరిక కలిగినవాడు కాబట్టి
నాలుగు చేతులాయ: నాలుగు చేతులాయె
శ్రీలలిత మూర్తియగు శ్రీవేంకటేశ్వరుడు : మనోజ్ఞమైన, సుందరమైన (Beautiful, graceful, charming, lovely) రూపం కలిగిన శ్రీ వేంకటేశుడు
పాలించె నిను: నిన్ను పాలిస్తున్నాడు
నీకె = ఈకె: స్త్రీ
బరితోషమాయ = పరితోషమాయ: మిక్కిలి సంతోషము అయ్యెను (To rejoice greatly)

భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య అద్భుత భావుకతకు నిదర్శనం. శ్రీ విష్ణువు అనగానే శ్రీ వత్సాంకితుడు, చతుర్భుజుడు, పీతాంబరధారి, నీలవర్ణుడు, చక్రపాణి అని మనకి తెలుసు. కానీ ఆయనకి ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయ్?.. వీటన్నిటికీ కారణం అలమేలు మంగ అని అన్నమయ్య అంటున్నారు. అంతే కదా! భర్త గొప్పవాడయ్యేది భార్య సహకారం వల్లే కదా!

అలమేలు మంగ తో అన్నమయ్య అంటున్నారు. నిన్ను కలసినప్పుడు విభునికి కాలి గోళ్ళ లగాయితు, తల వెంట్రుకలవరకూ ఎన్నో కొత్త అందాలు సమకూరుతున్నాయి. మరింత అందంగా కన్పిస్తున్నాడు. నువ్వు మీ ఆయనను సిగ్గుతో తలదించుకుని, పారవశ్యంతో కనుల చివరనుండి చూసినప్పుడు, ఆ కనుల చూపుల నుండి వచ్చిన మన్మధ బాణాలు అతని హృదయాన్ని గుచ్చుకుని, ఆ వక్షస్థలం మీద ఒక మచ్చలా తయారైంది. అప్పటి నుండి అతడు శ్రీవత్సలాంఛనుడు (శ్రీవత్సము అంటే విష్ణువక్షస్థలమందలి మచ్చ) అయినాడు. నిన్ను వదిలి ఉండలేక, విరహతాపాన్ని (ఇక్కడ వేంకటేశ్వరుడు భూమి మీదకు రావడానికి కారణమైన వ్రుత్తాంతాన్ని తెలుసుకోవాలి. భృగుమహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నినప్పుడు, లక్ష్మీదేవి స్వామిని, విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఆమె విరహాన్ని) భరించలేక ఈయన నల్లగా మారిపోయాడు. అంతే కదా! బంగారం రంగులో మిస మిస లాడుతూ, మెరిసిపోతూ అమ్మవారు ఆయన సమక్షంలో ఉంటే, కాంతి ఆమెకు తగిలి పరావర్తనం చెంది, ఈయనపై పడి కొంచెం మెరుస్తూంటాడు. ఆవిడ ఎప్పుడైతే దూరమైందో నల్లని రంగుగా అయిపోయాడు ట.

అతని ఆధీనములో ఉన్న చక్రాల్లాంటి గుండ్రటి నీ అధికమైన స్తనములను జాగ్రత్త పరుస్తూ అతను చక్రపాణి అయినాడు. నీ శరీరమున పూసినటువంటి కుంకుమపూత (కుంకుమ పూత ఎర్రగా ఉంటుంది) వలన వచ్చెడి సొగసు ఇతనికి పట్టు వస్త్రమైనది. ఆ విధముగా పీతాంబరధారి (ఎర్రని పట్టు పంచె కట్టుకున్నవాడు) అయినాడు.

నిరంతరం నిన్ను కలిసి నీ కౌగిలో ఉండాలనుకునే ఆపేక్ష/కోరిక అధికముగా ఉండుటచేత ఆయనకు రెండు చేతులు సరిపోక నాలుగు చేతులు కావలసి వచ్చాయి. అందుకే చతుర్భుజుడైనాడు. మనోజ్ఞమైన/సుందరమైన మూర్తి శ్రీ వేంకటేశుడు ఈ విధంగా నిన్ను పాలిస్తున్నాడు. అమ్మా! ఎంతో సంతోషము అవుతోంది.


ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి.  
http://www.esnips.com/doc/7fb42f54-f6a7-4d02-90a2-b472917ae0e5/ninnugudinavibhuni_BKP_ChadrajyotiRagam

కొమ్మసింగారము లివి కొలది వెట్టగ రావు

కొమ్మసింగారము లివి కొలది వెట్టగ రావు
పమ్మిన యీసొబగులు భావించరే చెలులు

చెలియ పెద్దతురుము చీకట్లు గాయగాను
యెలమి మోముకళలు యెండ గాయగా
బలిసి రాతిరియు పగలు వెనకముందై
కలయ కొక్కట మించీ కంటీరటే చెలులు

పొందుగ నీకెచన్నులు పొడవులై పెరుగగా
నందమై నెన్నడుము బయలై వుండగా
ఇందునే కొండలు మిన్ను( గిందుమీదై యొక్కచోనే
చెంది వున్న వివివో చూచితిరటే చెలులు

శ్రీవేంకటేశువీపున( జేతు లీకెవి గప్పగా
యీవల నీతనిచేతు లీకె( గప్పగా
ఆవల( గొమ్మలు( దీగె ననలు( గొనలు నల్లి
చేవ దేరీని తిలకించితిరటే చెలులూ

ముఖ్య పదాల అర్ధాలు:
కొమ్మ: స్త్రీ (ఇక్కడ అలమేలు మంగ)
సింగారములు: అందాలు, శృంగారములు, అలంకారములు
కొలది వెట్టగ రావు: కొలచుటకు శక్యము కాదు. (అపరిమితమైన అందములు అని అర్ధం)
పమ్మిన: అతిశయించు, ఆవరించు
యీ సొబగులు: ఈ సౌందర్యములు
భావించరే చెలులు: తలచుకోండి చెలులూ

పెద్దతురుము: పెద్ద జడకొప్పు
చీకట్లు కాయగాను: చీకటి కాసినంత నల్లగా
యెలమి: తృప్తివలన
మోముకళలు: మొగము నందలి కాంతులు (brightness of her face)
యెండ గాయగా: ఎండ కాసినట్టుగా
బలిసి: మిక్కిలి బలముగా
రాతిరియు పగలు వెనకముందై: వెనక భాగం రాతిరి వలె(నల్లని కొప్పు వలన), ముందు భాగం పగలు వలే (సంతోషము వలన కాంతివంతమైన ముఖం వలన)
కలయ: అంతటా
ఒక్కట: అకస్మాత్తుగా, ఏకముగా
మించీ: అతిశయించి
కంటిరటే చెలులు: చూసితిరటే చెలులూ

పొందుగ: పొద్దికగా, చక్కగా అమరినట్టి
ఈకె: స్త్రీ
చన్నులు: వక్షోజములు
పొడవులై పెరుగగా : పొడవుగా పెరుగగ
అందమైన నెన్నడుము
బయలై వుండగా: యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము (A slender waist) బయటకి కనిపించుట (ఆకాశమంత నడుమన్నమాట)
ఇందునే కొండలు మిన్ను: ఈమె లోనే కొండలు, ఆకాశము (ఆకాశమంత నడుమన్నమాట)
కిందు, మీదై ఒక్కచోనే: క్రింద ఆకాశమంత నడుము, పైన కొండల వంటి స్తనములు ఒక్కచోటనే
చెందివున్న విదిగో చూచితిరటే చెలులు: చెంది ఉన్నాయి చూచితిరటే చెలులూ

శ్రీవేంకటేశువీపున: వేంకటేశ్వరుని వీపు భాగమున
చేతులు ఈకెవి: ఆవిడ చేతులు (ఈకె అంటే స్త్రీ అని ముందు చెప్పుకున్నాం)
కప్పగా: కప్పి ఉంచగా
యీవల ఈతని చేతులు: ఇటుపక్క ఈయన చేతులు (వేంకటేశ్వరునివి అన్నమాట)
ఈకె కప్పగా: ఆమెను కప్పగా (ఈ పాటికి మీకు అర్ధమై ఉంటుంది. ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకున్నారని)
ఆవల: అవతల
కొమ్మలు, తీగెలు, అనలు, కొనలు : అనలుకొనలుగా ఉండు to bloom, flourish తామరదంపలై పెరుగు, కోమలముగా పెరుగు
చేవదేరీ: బలముగా, ధైర్యముగా, నిండు హృదయముతో
అల్లి: అల్లికొనుట
తిలకించితిరటే చెలులూ: చూసితిరటే చెలులూ

భావం:
అన్నమయ్య ఈ కీర్తనలో అలమేలుమంగ విలాసాన్ని అత్యంత కమనీయంగా వర్ణించారు.
చెలికత్తెలు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. చెలి అందాలు కొలుచుటకు సాధ్యం కాకుండా ఉన్నాయి. అపరిమితమైన అందాల్లాగ. అతిశయించు ఆ అందాలను తలుచుకోండి చెలులూ!
చెలి జడకొప్పు చీకటి అంత నల్లగా, విభుని కలసిన తృప్తితో వెలిగిపోతున్న మొహం ఎండ అంత ప్రకాశవంతముగా, ముందుభాగం పగలు, వెనక భాగం రాత్రి గా ఒకేసారి అకస్మాత్తుగా రెండూ కలసి అతియయించే ఆమె అందం చూశారటే చెలులూ!
పొడవుగా పెరిగి, ఒద్దికగా అమరినట్టి చన్నులు(స్తనములు), యే ఆచ్చాదన లేకుండా అందమైన నడుము బయటకి కనిపిస్తూ, ఈమె లోనే కొండలు - ఆకాశము, క్రింద - మీద, ఉన్నట్టుగా (పైన స్తనములు కొండలు వలే,
క్రింద నడుము ఆకాశము (అంటే విశాలమైన నడుము అని చెప్పాలనుకున్నారేమో) వలే ఒకేచోట ఉన్నాయన్నమాట) ఎంత ముచ్చటగా ఉన్నాయో చూశారటే చెలులూ!
శ్రీ వేంకటేశ్వరుని వీపును ఆమె చేతులు కప్పి ఉంచగా, ఆతని చేతులు ఆమె వీపును కప్పి ఉంచగా, తామరదంపలై పెరుగు ప్రేమతో (కొలనులో తామెరలు దినదినము ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంటాయో), తీగెలు అడవుల్లో అల్లుకున్నంత బలంగా ఎంత గట్టిగా ఒకరినొకరు వాటేసుకున్నారో చూసితిరటే చెలులూ! 
(మూడవ చరణం చివర కొంత నా భావుకతను కలిపాను. ఏదైనా మార్పులున్న ఎడల తెలియజేయగలరు) 
 
ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి.
http://www.esnips.com/doc/bf21b7c4-cff6-49cd-9ebb-2a8c80fc4384/kommasimgaaramulivi_BKP