Total Pageviews

Thursday, October 3, 2013

వందే వాసుదేవం శ్రీపతిం - బృందారకాధీశ వందిత పదాబ్జం [Vande vaasudevam sripatim]

ప// వందే వాసుదేవం శ్రీపతిం
బృందారకాధీశ వందిత పదాబ్జం 

చ// ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- 
చందనాంకిత లసత్-చారు దేహం 
మందార మాలికామకుట సంశోభితం
 కందర్పజనక మరవిందనాభం 

చ// ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం 
నిగమాదిసేవితం నిజరూపశేషప- 
న్నగరాజ శాయినం ఘననివాసం 

చ// కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జం 
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేంకటాచలాధీశం భజే

ముఖ్యపదార్ధం:
వందే: నమస్కరించుచున్నాను
వాసుదేవం: వసుదేవ సుతుని
శ్రీపతిం: లక్ష్మీదేవి పతిని
బృందారకాధీశ: బృందారక+అధీశ= దేవతలకి అధీశుడు (ఇంద్రుడు)
వందిత: పూజింపబడే
పదాబ్జం: పద్మముల వంటి పాదాలు గలిగిన వానిని 
ఇందీవరశ్యామం: నీటిలోపుట్టిన నల్లని కలువ వంటి దేహము కలిగిన వానిని
ఇందిరా: రమ యొక్క
కుచతటీ: కుచ, తటము= స్తనద్వయము 
చందనాంకిత: చందనముచే అలంకరింపబడిన
లసత్= ప్రకాశమానమైన 
చారు దేహం: అందమైన శరీరము 
మందార మాలికా: మందారమాలలచే
మకుట సంశోభితం: చక్కగా ప్రకాశించుచున్న కిరీటము గలిగిన
కందర్పజనకం: మన్మధుని తండ్రిని
అరవిందనాభం: పద్మము బొడ్డుయందు కలవానిని 

ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం: హృదయమునందు ధగధగ మంటూ మెరుస్తూన్న కౌస్తుభమణిని ధరించిన
ఖగ రాజ వాహనం= ఖ+గం= ఆకాశములో సంచరించు పక్షులకు రాజు (గరుత్మంతుడు)
కమలనయనం= కమలనేత్రుని 
నిగమాదిసేవితం= వేదాలచే సేవింపబడువానిని
నిజరూపశేషపన్నగరాజ శాయినం ఘననివాసం= సర్పరాజుపై శయనిస్తూ నివాసముగా చేసుకున్న వానిని  
కరిపురనాథసంరక్షణే తత్పరం= ధర్మరాజుని (రాజ్యాన్ని) నిరంతరము సంరక్షించుటకు ఉద్యుక్తుడైన వానిని
కరిరాజవరద: గజేంద్రుని రక్షించిన వాడు
సంగతకరాబ్జం= శరణుకోరిన వారికి స్నేహహస్తాన్ని అందించే పద్మముల వంటి చేతులు కలిగిన వాడు
సరసీరుహాననం= సరసీరుహ+ఆననమ్= సరస్సుయందు జనించిన (పద్మము) వంటి ముహము కలిగిన వానిని
చక్రవిభ్రాజితం= చేతియందు చక్రముచే ప్రకాశించు వానిని
తిరు వేంకటాచలాధీశం= తిరువేంకటాచలాధిపుని
భజే= భజించుచున్నాను

భావం: 
వాసుదేవునికి నమస్కరించుచున్నాను. బృందారకాధీశుని (ఇంద్రుని) చే పూజింపబడిన పాదములను కలవానికి నేను నమస్కరించుచున్నాను.

నల్ల కలువ వంటి దేహకాంతి గలవానికి, చందనము పూసుకున్న రమ యొక్క స్తనద్వయము వెలుగులో ప్రకాశించుచున్నవానిని, మందారమాలలను ధరించిన వానిని,  ధగధగ మెరుస్తూన్న కిరీటము గల వానిని, మన్మధుని తండ్రిని, బొడ్డు యందు పద్మము కలవానికి నేను వందనము చేయుచున్నాను.

హృదయము నందు మెరుస్తూన్న కౌస్తుభమణిని ధరించిన వానిని, గరుడపక్షి వాహనముగా గలవానిని, పద్మనేత్రుని, వేదాలచే కొనియాడబడువానిని, సర్పరాజుపై పవ్వళించేవానికి నేను వందనము చేయుచున్నాను.

ధర్మరాజునకు సహాయము చేయుటకు నిరంతరం ఉద్యుక్తుడైనవానిని, కరిరాజుని రక్షించిన వానికి, శరణుకోరిన వారికి స్నేహహస్తము అందించు పద్మము వంటి చేతులు కలవానిని, పద్మము వంటి ముఖము కలవానికి, చేతియందు చక్రముచే ప్రకాశించువాడు ఐన తిరువేంకటాచలాధిపునికి వందనము చేయుచున్నాను.