Total Pageviews

Monday, July 8, 2013

నెలత చక్కదనమే నిండు బంగారము నీకు - గలిగె గనక లక్ష్మీకాంతుడవైతి

//ప// నెలత చక్కదనమే నిండు బంగారము నీకు
గలిగె గనక లక్ష్మీకాంతుడవైతి

//చ// పడతినెమ్మోమునకు బంగారుకళలు దేరీ
వెడలేనెలవినవ్వే వెండిగనులు
అడియాలమగుమోవి నదె పగడపుదీగె
నిడువాలుదురుమే నీలముల రాశి

//చ// తరుణిపాదపుగోళ్ళు తళుకులవజ్రములు
పరగుజేతిగోళ్ళే పద్మరాగాలు
అరిదికన్నులతేట లాణిముత్తెపుసరులు
సరిబచ్చలకొండలు చనుమొనలు

//చ// చెలితేనెమాటలు జిగిబుష్యరాగాలు
వలపుతెరసిగ్గులు వైఢూర్యాలు
తొలకుననురాగాలే గొడ్డగోమేధికములు
కలసితీకెను శ్రీవేంకటేశ కౌగిటను

ముఖ్యపదార్ధం:
నెలత: స్త్రీ
భండారము= ఖజానా, ధనగృహము
నెమ్మోము: నెర+మోము= పూర్ణ చంద్రుని వంటి మొహము
సెలవి: పెదవి మూల
అడియాలము= అడుగు+అలము= చిహ్నము, గురుతుపట్టు
తురుము= కొప్పు
పరగు=ప్రకాశించు
అరిది= అపురూపమైన
సరులు= దండలు
జిగి= కాంతి, వెలుగు
ఈకె= ఈ+అక్క= ఈ ఆడది

భావం:
ఈ అందమైన యువతి చక్కదనమే నవ రత్నాలున్ననిండు ఖజానా నీకు. అందువల్లనే నువ్వు లక్ష్మీకాంతుడవైనావు. (అమ్మ నీ వక్షస్థలము పై అమరింది కాబట్టే నువ్వు ధనవంతుడయ్యావు..ఆమె చక్కదనమే నీకు వెలకట్టలేనంత ధనము)

నీ భార్య అందమైన పూర్ణచంద్రుని వంటి మొహమునకు బంగారు కళలు ఉన్నాయి. ఆమె పెదవి చిన్నగా చేసి నవ్వే చల్లని వెన్నెలనవ్వులే తెల్లని వెండి గనులు. ఆమె లేత చిరుగు వంటి ఎర్రని పెదవి పగడపు తీగెలు. ఒత్తైన నల్లని వాలు జడే (కొప్పు) ఇంద్రనీలముల రాశి.

ఆమె వాడైన పాదపు గోళ్ళే తళుకులీనే వజ్రాలు. మిలమిల మెరుస్తూన్న ఆ చేతి గోళ్ళే పద్మరాగాలు.  అపురూపమైన ఆ తేట కన్నులు ఆణిముత్యాల దండలు. ఆమె ఎత్తైన కుచ సంపద చక్కటి పచ్చల కొండలు.

చెలి మాట్లాడే తేనె మాటలు మెరుస్తూన్న పుష్యరాగాలు. ఆమె సిగ్గు తెరలు వైఢూర్యాలు. ఆమె నీపై చూపే ప్రేమలే పెద్ద గోమేధికాలు. ఇన్ని నవరత్నాల కొండలను పుష్కలంగా ధరించిన అమ్మ శ్రీవేంకటేశుని కౌగిటను కలిసింది. అందుకే శ్రీవేంకటేశుడు లక్ష్మీకాంతుడయ్యాడు.