Total Pageviews

Friday, February 28, 2014

ఏమి మందు గద్దె యింతులాల యీ - రామ కు తిరుపతి రాముడే మందు

//ప// ఏమి మందు గద్దె యింతులాల యీ
రామ కు తిరుపతి రాముడే మందు

//చ// వెలసెటి విరహాన వేగేటి యింతికి
చెలియలాల యేమి సేతమే
చలివేడివలపుల చవిగన్న యీపెకు
వలపించిన తనవరుడే మందు

//చ// పొదిగొన్న తమకానఁ బొరలెటి కాంతకు
చెదరక మమమేమి సేతమే
వుదుటఁ గోరికల నొనరెటి యీపెకు
మదిలోపలి తనమగడే మందు

//చ// పొల్లవోని యాస బొరలెటి మగువకు
చెల్లఁబోమన మేమి సేతమే
కొల్లగా రతి నింతిఁ గూడినాఁ డీపెకు
నల్లని శ్రీవేంకటనాథుడే మందు


ముఖ్య పదాల అర్ధం:
కద్దు: కలదు
యింతులాల: చెలులారా
రామ: స్త్రీ
తిరుపతి రాముడే: వేంకటేశ్వరుడు
చవిగన్న: రుచి తెలుసుకున్న
యీపెకు: యీకె= స్త్రీ
పొదిగొన్న= పొదిగొను: కప్పు, ఆవరించు
తమకానఁ: విరహాన
పొర్లు: పొర్లాడు (To roll over, to roll on the ground)
చెదరక: చెదరకుండా
ఉదుట గోరికల: ఉధృతి/ఎక్కువగా ఉన్న కోరికలు (Bigness, vigour)
ఒనరు: కలుగు
మదిలోపలి: హృదయములోపలి
పొల్లవోని: తగ్గని, తరగని, క్షయించని, To decrease.
యాస బొరలెటి: ఆశతో పొర్లాడే
చెల్లఁబో: తగ్గించడానికి
కొల్లగా: మిక్కిలిగా, ఎక్కువగా
రతి నింతిఁ గూడినాఁ డీపెకు: రతీదేవిని భార్యగా పొందినవాడు చెలిని ఆవహించి ఉన్నాడు (మన్మధుడు)


భావం:
లలితమైన పదాలతో అన్నమయ్య అమ్మవారి విరహవేదనని తెలియజేస్తున్నారు. అమ్మవారు వేంకటేశ్వరుని విరహం వల్ల ఒళ్ళు వేడెక్కి, పరధ్యానంగా పడుకున్నారు. చెలులు వచ్చి అమ్మవారి ఒంటి వేడిని చూసి మనం ఏ మందు ఇవ్వగలము ఈ వేడికి? అని తమలో తాము చర్చించుకుంటున్నారు.

చెలులూ! ఏ మందు కలదే మన వద్ద ఈ  వేడిని తగ్గించడానికి? ఈ అందమైన యువతికి ఆ తిరుపతి రాముడే మందు.

విరహంతో వేగుతున్న ఈ పడతికి మనమేమి చేయగలమే  చెలులూ! తన భర్త వెచ్చని కౌగిళ్ళ రుచిని అనుభవించిన ఈమెకు ఆ ప్రేమని ఇవ్వగల ఆమె మగడే మందు. (ఆయనొచ్చి కౌగిళ్ళలోకి తీసుకుని ప్రేమని కురిపిస్తే ఈమె విరహం తగ్గుతుందన్నమాట).

విరహం బాగా కమ్ముకుని పాన్పు మీద అటూ, ఇటూ పొర్లాడుతున్న ఈమె తమకాన్ని పోగొట్టడానికి మనమేమి సేయగలమే? పెరిగిపోతున్న కోరికలను కలిగియున్న ఈమెకు ఆమె హృదయంలో కొలువైన ఆవిడ భర్తే మందు.   

భర్త వస్తాడని, ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటాడని తగ్గని ఆశతో పొర్లాడే ఈ యువతికి ఆ ఆశని తగ్గించడానికి మనమేమి సేయగలమే.. ఈమె శరీరాన్ని రతీదేవి భర్త ఐన మన్మధుడు పూనాడు, అది వదిలించడానికి నల్లని వేంకటనాధుడే మందు...


ఈ కీర్తన ఇక్కడ వినండి:
http://annamacharya-lyrics.blogspot.in/2014/02/808emi-mamdu-gadde-yimtulala-yi.html 

Thursday, February 27, 2014

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము - యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

//ప// ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము
యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

//చ// అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు
ధర సింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను
మరుదల్లి యలమేలుమంగమోమై నిలిచె

//చ// బిసములు శంఖమును పెనుచక్రవాకము-లా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను
మసలక దానలమేలుమంగ మేనై నిలిచె

//చ// అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండగాను
ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద
పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె

ముఖ్యపదాల అర్ధం:
చక్కదనము: అందము, Prettiness, beauty
అరచంద్రుడుఁ: ప్రకాశిస్తూన్న అర్ధ చంద్రుడు (నుదురు)
చకోరాలు: చకోరపక్షివంటి కన్నులు 
అద్దాలు: నున్నని ప్రతిబింబాన్ని చూపే (చెక్కిళ్ళు)
సంపెగయు: ముక్కుకి ఉపమానం
ధర: భూమి
సింగిణులు: (సింగాణి, సింగిణీ, శింజినీ)=విల్లు (కను బొమ్మలకి ఉపమానం)
 శ్రీలు: చెవులు (శ్రీ ఆకృతిలో చెవులు)
తలిరు: పల్లవము, చిగురు A sprout, a shoot. (ఎర్రని చిగురు వంటి పెదవులు)
తుమ్మిదలు: నల్లని కురులకి ఉపమానం
మరుదల్లి: మన్మధుడి తల్లి 
బిసములు:  తామెరతూండ్లు (Fibres, film, as of the water lily) (చేతులకి ఉపమానం)
శంఖమును: కంబువు (A conch shell, a conch used as a horn) కంఠమునకు ఉపమానం
పెనుచక్రవాకములు: పెద్ద చక్రవాక పక్షులు (స్తనములకి ఉపమానం)
ఆకసము: విశాలమైన నడుము కి ఉపమానం 
నీలపుఁజేరు: నీలము+చేరు= నీలమణుల తో  చేసిన మొలత్రాడు కరికుంభాలు: ఏనుగు కుంభస్థలము (వంటి పెద్ద పిరుదులు)
పొసగను: చేకూడగా (To agree, fit)
ఇవి యెల్లా: ఇవన్నీ
నొక పోడిమై: ఒక లక్షణము (A sign or mark)
నిలువగాను: నిలబడగా
మసలక: తచ్చాడు, తిరుగు
తాను నలమేలుమంగ మేనై నిలిచె: అలమేల్మంగ శరీరమై నిలిచాయి
అనటులు: ఊతనిచ్చునవి (తొడలు కి ఉపమానం)
అంపపొదులు: అమ్ముల పొది= బాణాలు పెట్టుకును చోటు (వాడియైన గోళ్ళకి ఉపమానం అయ్యుండచ్చు)
అబ్జములు: పద్మములు (పాదాలకి ఉపమానం)
ముత్తేలు: ముత్యములు (తెల్లని గోళ్ళకి ఉపమానం)
ఒనరు: కలుగు, పొసగు 
వరుసఁ గూడి వుండగాను: వరుస గా ఉండగా 
ఉరముమీద: వక్షస్థలము మీద
పనుపడు: ఇముడు, సరిపడు 

భావం: 
ఈ సంకీర్తనలో అన్నమయ్య అలమేల్మంగ అంగాంగవర్ణన చేస్తూ, యే ఒక్క శరీరభాగాన్నీ పేరు చెప్పకుండా ఈ భూమి మీద ఉన్న అత్యంత సుందరమైన వస్తువులను మాత్రమే చెప్తూ వాటితో పోల్చుకుని ఆమె అందాన్ని మనల్నే ఊహించుకోమంటున్నారు. సన్నివేశం ప్రకారం చెలులు ఒకరితో ఒకరు అమ్మవారి అందాన్ని వర్ణించుకుంటున్నట్లుంటుంది. 

ఈ చెలియ (అలమేల్మంగ) అందాన్ని ఏమని పొగడగలమే! ఆవిడ అందం దేనితో పోల్చినా అంతకంటే ఎక్కువగానే ఉంది. 

సగం ప్రకాశిస్తూన్న తెల్లని చంద్రుడు భూమి మీదకొచ్చి నిల్చినట్టు కాంతివంతంగా ఉంది ఆమె తెల్లని ఫాలభాగం (నుదురు). ఆమె కన్నులు చకోరపక్షులంత అందంగా ఉన్నాయి. నున్నని ఆమె మెరిసే చెంపలు ప్రతిబింబాన్ని చూపే అద్దాల్లా ఉన్నాయి. ఆమె ముక్కు విచ్చుకున్న సంపెంగ పువ్వులా నిటారుగా, సొగసుగా ఉంది. ఆమె కనుబొమ్మలు మన్మధుని విల్లులా వొంగి ఉన్నాయి. ఆమె చెవులు "శ్రీ" ఆకృతిలో రమణీయంగా ఉన్నాయి. పెదవులు లేత చిగురులా ఎర్రగా ఉన్నాయి. తుమ్మెద రెక్కల్లా నల్లని అందమైన కురులు కలిగి ఉన్నది. ఇవన్నీ మన్మధుడి తల్లి ఐన శృంగారవతి అలమేలుమంగకి  ముఖముగా నిలిచాయి. (అవన్నీ కలిపితే ఆమె ముఖము అయ్యింది)

ఆమె నున్న ని పొడవాటి చేతులు తామెరతూండ్లు వలే ఉన్నాయి. మూడు గీతలతో ఆమె కంఠము శంఖము వలే ఉన్నది. పెద్దవైన ఆమె చన్నులు చక్రవాక పక్షులు రాశి పోసినట్టుగా ఉబ్బెత్తుగా ఉన్నాయి. నల్లని ఆకాశము తాడుగా మారి చుట్టినట్టుగా ఆమె విశాలమైన నడుము ఉన్నది. యేనుగు కుంభస్థలము వలే విస్తారమైన పిరుదులు కలిగి ఉంది. ఇవన్నీ చక్కగా అమరుకొని ఒకచోట కలిస్తే అది అలమేల్మంగ శరీరమై నిలిచింది.

ఆమె శరీరానికి ఊతాన్నిచ్చే తొడలు అరటిబోదెల్లా బలంగా ఉన్నాయి. ఆమె వాడి గోళ్ళు అమ్ములపొదల్లో బాణాల్లా ఉన్నాయి. ఆమె పాదములు పద్మాల్లా సుతిమెత్తగా ఉన్నాయి. ఆమె కాలిగోళ్ళు ముత్యాల్లా మెరుస్తూన్నాయి. ఇవన్నీ ఒకచోట ఒద్దికగా కలిసి ఘనుడైన శ్రీవేంకటేశ్వరుని వక్షస్థలము మీద కొలువైయున్న అలమేల్మంగ పాదాల్లా ఉన్నాయి. 

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2014/02/807emani-pogadudume-yicheli-chakkadanamu.html        

Saturday, February 22, 2014

సందెకాడ బుట్టినట్టి - చాయల పంట యెంత చందమాయ చూడరమ్మ - చందమామ పంట

//ప// సందెకాడ బుట్టినట్టి - చాయల పంట యెంత 
చందమాయ చూడరమ్మ - చందమామ పంట

//చ// మునుపు పాలవెల్లి - మొలచి పండిన పంట
నినుపై దేవతల -  నిచ్చపంట
గొనకొని హరికన్ను- గొనచూపులపంట
వినువీధి నెగడిన - వెన్నెలల పంట

//చ// వలరాజు పంపున - వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి - జాజరపంట
కలిమి కామిని తోడ - కారుకమ్మినపంట
మలయుచు తమలోని - మర్రిమాని పంట

//చ// విరహుల గుండెలకు - వెక్కసమైన పంట
పరగచుక్కలరాశి - భాగ్యము పంట
అరుగై తూరుపుకొండ - నారగ బండిన పంట
యిరవై శ్రీ వేంకటేశు- నింటిలోని పంట

ముఖ్య పదాల అర్ధం:
సందెకాడ: సంధ్యాసమయంలో (సాయంత్రం)
చాయల పంట: వెలుతురుల పంట
చందమాయ: చందము+ఆయ=  విధముగా Manner, way; state, form. 
మునుపు: పూర్వము
పాలవెల్లి: పాల సముద్రం (పాలకడలి, పాల్కడలి, పాలకుప్ప, పాలమున్నీరు, పాలవాగు or పాలవెల్లి)
మొలచు: బయటకు వచ్చు, పుట్టు
నినుపు: పూర్ణమగు become full, filled 
నిచ్చపంట: నిత్యపు పంట
గొనకొను: యత్నించు, To attempt.
హరికన్నుగొనచూపులపంట: విష్ణువు కంటి కొన చూపుల పంట
వినువీధి: ఆకాశవీధి
నెగడు: వర్ధిల్లు, వెలయు
వలరాజు పంపున: మన్మధుడు పంపించిన
వలపు విత్తిన పంట: ప్రేమ నాటిన పంట
చలువ: చల్లని, Coolness, coldness, cold, శైత్యము పున్నమ: పౌర్ణమి 
జాజరపంట: జాజర పాటలు పాడించే పంట
కలిమి కామిని: సంపద కలిగిన శృంగారవతి ఐన లక్ష్మీదేవి తో కలిసి
తోటి కాడు: తోడబుట్టు 
మలయు: తిరుగు, వ్యాపించు 
మర్రిమాను పంట:  విస్తరించిన వటవృక్షము ల పంట
విరహుల: ఎడబాటు, వియోగము
వెక్కసము: మిక్కిలి, ఎక్కువగా, Excess, an extreme.
పరగు: ఉండు, ప్రకాశించు
చుక్కలరాశి: నక్షత్రముల సమూహము
అరుగుగ: ఇంటి ముందటి ఆవరణగా
తూరుపుకొండన: ఉదయాద్రిపై 
ఇరవు: స్థానము
శ్రీ వేంకటేశు యింటిలోని పంట: వేంకటేశ్వరుని ఇంట్లో పంట 

భావం:
అన్నమయ్య చంద్రోదయాన్ని జానపద భాషలో అత్యంత రమణీయంగా రచించారు. శ్రీవేంకటేశుని కీర్తించడానికి ఆయన ఎన్నుకోని పదాలు లేవు...

సంధ్యాసమయంలో ఉదయాద్రిమీద పుట్టిన అందమైన వెలుతురుల పంట చందమామని చూడండి...ఈ పంట ఎంత గొప్పదంటే, 

పాల సముద్రం లో మొలకెత్తి పండిన పంట. ఆకాశంలో ఉండే దేవతలకి నిత్యము ఉండే సంపూర్ణమైన పంట. (మన పంచాంగమే చంద్రమానాన్ని అనుసరించి ఉంది. కాబట్టి చంద్రునితో అన్ని గ్రహాలకూ (ఆయా అధిపతులకూ) సంబంధం ఉంటుంది. ఉదా: చంద్రమంగళ యోగం వంటి చంద్రాది యోగాలన్నింటికీ చంద్రుడే కారకుడు. కాబట్టి అన్నమయ్యవారు చంద్రునికీ దేవతలకి ఉండే అవినాభావ సంబంధాన్ని ఇంత అందంగా చెప్పారు). శ్రీమహావిష్ణువు కంటి కొనల కరుణా కటాక్ష వీక్షణల పంట ఆకాశవీధిలో చల్లని వెలుగు వెన్నెలల పంట. (శ్రీ మహావిష్ణువు ఒక కన్ను సూర్యుడు, మరో కన్ను చంద్రుడు అంటారు కదా! ఆ భావంలో రాసి ఉంటారు అన్నమయ్య)

ఈ భూమిపై అందరి మనస్సులలో మన్మధుడి ప్రభావం వల్ల కలి గే ప్రేమ అనే విత్తును నాటిన వలపు పంట. చల్లని పున్నమినాటి రాత్రులలో అందమైన యౌవ్వనవతులచే జాజరపాటలు పాడించే పంట. సంపదలు కలిగిన, శృంగారవతిఐ న లక్ష్మీ దేవికి తోడబుట్టిన పంట (చంద్రుడికి చెల్లెలు లక్ష్మీదేవి). రసాస్వాదకులకు మెల్లగా మనస్సులో మొదలై విస్తరిస్తూ  మర్రిచెట్టులా పెరిగి పెద్దదయ్యే పంట.

ప్రియురాలు/ప్రియుని ఎడబాటు జనులకు విరహతాపం పెంచే పంట. ప్రకాశించే నక్షత్రముల రాశికి భాగ్యమైన పంట. (అంటే, చంద్రుడు విశాఖా నక్షత్రములో పూర్ణచంద్రుడైతే అది వైశాఖమాసం. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది కార్తీక మాసం...అలా చంద్రుడితో ముడి పడిన మాసనామాల వల్ల నక్షత్రాలు గొప్ప భాగ్యాన్ని పొందాయంటున్నారు. ఇన్ని కోట్ల నక్షత్రాలలో కొన్నింటికి మాత్రమే మన పంచాంగంలో స్థాన దక్కడం చంద్రుు వాటికీ ఇచ్చిన భాగ్యమేనని అర్ధం కాబోలు) ఆకాశవీధిలో తూర్పు అరుగుమీద పండిన పంట. యింత గొప్పపంట శ్రీవేంకటేశ్వరుని యింటిలోంచి వచ్చిన పంట. (శ్రీవేంకటేశునికి బావమరిది కదా చంద్రుడు మరి)..

ఈ కీర్తన ఇక్కడ వినండి:
http://annamacharya-lyrics.blogspot.com.au/2006/10/25sandekada-puttinatti-chayala-panta.html

Sunday, February 16, 2014

కంటి శుక్రవారము గడియ లేడింట - అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని

//ప// కంటి శుక్రవారము గడియ లేడింట  
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని  

//చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి 

కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి 
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని

//చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి 

తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై 
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని

//చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు 

పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది 
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని

ముఖ్య పదాల అర్ధం:
కంటి= చూచితిని (కనుట అంటే చూచుట) 
గడియ లేడింట= తెల్లవారు ఝామున రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి 7x24=168 నిముషాలు. అంటే, తెల్లవారు ఝామున 2:48 ని.లు.)
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని: అలమేల్మంగ తో కూడిన శ్రీవారిని చూశాను   

సొమ్ములన్నీ కడబెట్టి: ఆభరణాలన్నీ తీసి ఓ మూలన పెట్టి
సొంపుతో గోణముగట్టి: అందముగా గోచీ కట్టి (A waist cloth or modesty piece) 
కదంబము: మిశ్రమము (A mixture) కదంబపొడి kadamba-poḍi. n. Pouncet. A fragrant powder compounded of various essence
చెమ్మతోన: తడితో, Damp, moist
వేష్టువలు: వేష్టనము: చుట్టుకొనడము (Surrounding, encompassing)

పసిడి గిన్నెల నించి: బంగారు గిన్నెలలో నింపి 
శిరసాదిగ: తల మొదలుగ 
దిగనలది: దిట్టముగా అలది
అచ్చెరపడి చూడ: ఆశ్చర్యపడి చూడగా
కన్నులకింపై: కన్నులకు చూడడానికి ఇంపుగా 

తట్టు పునుగే కూరిచి: పునుగుచట్టాన్ని కూర్చుకుని The perfume called Civet (పునుగు పిల్లి ఒక సమయంలో తన వంటిని దగ్గరలో ఉన్న చెక్కలకి గానీ, వస్తువులకి గానీ రుద్దుతుంది. ఆ సమయంలో ఆ పిల్లి నుంచి ఒక ద్రవం ఆ చట్రాలకి అంటుకుంటుంది.)   
చట్టలు చీరిచి: చంపు, చట్టలుపాపు, నాశనము చేయు  
నిప్పు పట్టి కరగించి: నిప్పులమీద పెట్టి కరిగించి 
వెండి పళ్యాల నించి: వెండి పళ్ళేలనిండా పునుగు తైలాన్ని నింపి
దట్టముగ మేనునిండ: శరీరం నిండా గట్టముగా పట్టించి, దిద్ది 
బిట్టు వేడుక: . హెచ్చు, అధికమైన సంతోషముతో Excess. A great action
మురియుచుండే: మురిసిపోతూన్న
బిత్తరి స్వామిని కంటి: ప్రకాశిస్తూ, సొగసుగా ఉండే స్వామిని చూశాను

భావం:
శుక్రవారం శ్రీవారికి అభిషేకం గొప్ప కన్నులపండుగగా జరిగే విశేషమైన సేవ. అన్నమయ్య కాలంలో తప్పక జరిగేది.ఇప్పుడు కూడా జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత "నిజపాద దర్శనం" పేరుతో దర్శనానికి అనుమతిస్తారు. అన్నమయ్య శ్రీవారికి అభిషేకాలు జరుతున్నప్పుడు పక్కనే నిలబడి నలుగు పాటలు, అభిషేకం పాటలు, హారతి పాటలు పాడేవారు. అభిషేకం అయ్యాక చందన తాంబూలాది సత్కారాలు  అందుకునేవారు. అలాంటి ఓ శుక్రవారం శ్రీవారి అభిషేకం జరుగుతున్నప్పుడు రాసిన పాట ఇది. అభిషేకం జరిగే విధానాన్ని కళ్ళకు కట్టినట్టు రాశారు అన్నమయ్య. 

శుక్రవారం తెల్లవారు ఝామున ఏడు గడియలకి (అంటే, రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి (అర్ధరాత్రి పన్నెండు గంటలనుంచి) 7x24=168 నిముషాలు. అంటే, శుక్రవారం తెల్లవారు ఝామున 2:48 ని.లు.) అలమేల్మంగతో కూడిన శ్రీవేంకటేశ్వరునికి అభిషేకాన్ని కన్నులారా చూశాను. 

ముందుగా శ్రీవారి విగ్రహం పై ఉన్న ఆభరణాలన్నీ తీసేసి ఒక మూలగా పెట్టారు. ఒక పట్టు గోచీని చాలా అందంగా, నేర్పరితనం తో  చుట్టారు. అనేక రకాల సుగంధాలను (చందనము, కర్పూరము, కుంకుమపువ్వు) కలిపిన పొడిని (కదంబము) ఓ కప్పు, పన్నీటి నీటి లో కలిపి ఒంటిని అభిషేకించారు. బట్టలని పన్నిటి చెమ్మతో స్వామి వారి తలకి, హృదయము మీద, మొల చుట్టూ చుట్టారు. నల్లని తుమ్మెద రంగులో ప్రశాంతముగా ఉన్న స్వామిని చూశాను.

పచ్చకప్పురము బాగా మెత్తగా నూరి, బంగారు గిన్నెల నిండా నింపి భక్తిగా తెచ్చి, తల నుంచి పాదముల వరకూ బాగా అలదారు (పట్టించారు). నల్లని మేని పై మెరుస్తూన్న పచ్చకప్పురము తో - స్వామిని అందరూ ఆశ్చర్యపడి చూస్తుండగా, అందరి కన్నులకూ విందును కలిగిస్తూ తెల్లని మల్లెపూవు వలే ఉన్న స్వామిని నా కన్నులారా చూశాను.    

పునుగు పిల్లి రుద్ది వదలిన చట్రాలని తెచ్చి, వాటిని శుభ్రం చేసి, ఆ చట్రాలని నిప్పులమీద కరిగించగా వచ్చిన సుగంధపు తైలాన్ని వెండి పళ్ళేలనిండా నింపి పట్టుకొచ్చి శ్రీవారి శరీరానికి బాగా దట్టముగా పట్టించి, నుదుటను తిలకముగా దిద్దినప్పుడు జరిగే ఆ వేడుకలో మురిసి, మెరసిపోతున్న స్వామిని నా కన్నులారా చూశాను.

(ఇప్పటికీ తిరుమలలో పునుగు పిల్లుల్ని తి.తి.దేవస్థానం ప్రత్యేకంగా పెంచుతోంది. శ్రీవారి సేవలలో పునుగు పిల్లి తైలానికి ప్రత్యేకత ఉంది. ఈ పునుగు తైలం తో శ్రీవారి విగ్రహానికి మర్ధన చేయడం వల్లే ఇంతకాలం ఆ సాలగ్రామ విగ్రహం చెడిపోకుండా, పగుళ్ళులేకుండా ఉంది..సాక్షాత్తూ శ్రీవారి సేవకై పుట్టిన పునుగు పిల్లి జాతి ఎంత అదృష్టం చేసుకుందో కదా! ఆ తైలం తయారీ విధానం మనకి తెలియకపోయినా, క్రింది చరణంలో అన్నమయ్య కళ్ళకి కట్టినట్టు వివరించారు)..ఈ కీర్తనని వివరిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని పొందాను..    

ఈ కీర్తనని ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2006/10/19kanti-sukravaramu.html