Total Pageviews

Sunday, June 7, 2015

అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము శ్రింగారరాయ(డ నీకు శ్రీసతినిధానము

//ప// అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయ(డ నీకు శ్రీసతినిధానము //ప//

//చ// కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ (ప్ర)హారాలు రత్నాలమేడలు //ప//

//చ// సతికి నీమెడ రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర //ప//

//చ// నెమ్మి నలమేల్మంగ నీ కాగిలి పెండ్లిపీట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీ భావమే భోగము //ప//

ముఖ్యపదాల అర్ధం:
అంగన: స్త్రీ
నిధానము: నిక్షేపము, దాచుకొన్నది A treasure
పానుపు: మంచము
ఉరము: వక్షస్థలము
ప్రమదము: ఆనందము
జలధి: సముద్రము
భుజాంతరము: రొమ్ము
రతిసాము: శృంగారంలో ఆట
కంభము: స్తంభము
వయ్యాంళి: వ్యాహాళి అనే పదం నుంచి వచ్చి ఉండవచ్చు (విహరించు)
బయలు: విశాలమైన మైదానము
మతించు: మదింపు (To estimate)
మితిలేని: హద్దు లేని, పరిమితిలేని
శ్రీవత్సము: విష్ణు వక్షస్థలమునందు ఉండెడి పుట్టు మచ్చ 
బండారు ముద్ర: కోశాధికారి =ఖజానాకి అధికారి] ముద్ర
నెమ్మి: ప్రేమ, Attachment, affection,
చిమ్ముల: జల్లబడిన
సేసపాలు: అక్షింతలు
మెడనూలు: బంగారు తీగలతో చేయబడిన దండలు A necklace made of gold threads plaited together
సరపణులు: బంగారు గొలుసులు An ornament of gold chains of two or more folds
పమ్మి: అతిశయించు, విజృంభించు

భావం:
అన్నమయ్య ఈ సంకీర్తనలో అత్యంత మనోహరమైన ఉపమానాలను వేసి శ్రీవారి, అమ్మవార్ల బంధాన్ని తెలియజేస్తున్నారు. 

ఓ శృంగారమూర్తీ! నీ భార్యకు నీవే గొప్ప సామ్రాజ్యము. నీ శరీర, మనస్సులనే రాజ్యాలకి ఆవిడే మహారాణి. నీకేమో ఆవిడ దాచిపెట్టిన గొప్ప సంపద.

నీ కఠినమైన వక్షస్థలము ఆవిడకి పద్మాలతో నేసిన మంచము. 
ఆనందమయమైన నీ తెల్లని మనసు ఆమెకు పాల సముద్రము.
నీ రొమ్ముభాగము ఆమెకు లతలతో అల్లిన పొదరిల్లు.
నీవు ధరించిన మెడలోని ఎత్తైన హారాలు ఆమెకు రతనాల మేడలు.

నీ పొడవాటి మెడ ఆమెకు రతిక్రీడ చేయు స్తంభము.
నీవు ఆమెకు సాటిలేని విహారము చేయు విశాలమైన మైదానము. 
అంచనా వేస్తే నీ మెడలో కౌస్తుభమణి ఆమె అందం చూసుకోడానికి ఉపయోగించే నిలువుటద్దము.
సాటిలేని నీ వక్షస్థలముపై ఉండెడి "శ్రీవత్సము" అనే పుట్టుమచ్చ ఆమెకు ధనాగారమునకు అధికారి అయినవాడు వేసే ముద్ర లాంటిది. 

అలమేల్మంగకు నీ ప్రేమపూరితమైన కౌగిలియే పెద్ద పెండ్లిపీట.
నీ శరీరంపై దట్టంగా చిమ్మిన గంధపు పూతయే పచ్చని తలంబ్రాలు.
మీ ఇద్దరి మెడల్లో కట్టిన బంగారపు తీగెలూ ఉయ్యాలకు వేసే బంగారు గొలుసులు [వారిద్దరి గాఢాలింగనాలకు వారి మెడల్లో ఉన్న బంగారు తీగలు పెనవేసుకుపోయి గొలుసుల్లా అయ్యాయి. వారి ఆలింగనాల్ని చెప్పడానికి కవి ఎన్నుకున్న ఉపమానం ఇది] 
ఓ శ్రీవేంకటేశ్వరా! అతిశయించు నీ భావమే ఆమెకు గొప్ప వైభోగము.