Total Pageviews

Friday, June 26, 2015

రావే కోడల రట్టడి కోడల - పోవే పోవే అత్తయ్య పొందులు నీతో చాలును

//ప// రావే కోడల రట్టడి కోడల 
పోవే పోవే అత్తయ్య పొందులు నీతో చాలును //రావే కోడల//

//చ// రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరులేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్లవారిండ్ల 
అంకెల దిరిగేవు అత్తయ్యా //రావే కోడల//

//చ// ఈడాడ నలుగురూ నేగురు మొగలతో 
కూడి సిగ్గులేని కోడల
వాడకు బదుగురి వలపించుకొని నీవు 
ఆడాడ దిరిగేవు అత్తయ్యా //రావే కోడల//

//చ// బొడ్డున బుట్టిన పూపనికే నిన్ను 
గొడ్డేరు తెస్తినె కోడల
గుడ్డము పయినున్న కోనేటిరాయుని 
నడ్డగించుకుంటి వత్తయ్యా //రావే కోడల//

ముఖ్యపదాల అర్ధం:
రట్టడి: రహస్యములేని, బహిర్గతము చేయు, నిందింపదగినది
పొందులు: పొందిక= సరిపడుట, ఇముడుట, స్నేహము [పొందుకాడు= స్నేహితుడు]
రంకె=కేక
 కొంకుకొసరులేని: భయము/సంకోచము లేని careless and heedless
పంకజము= బురదలో పుట్టినది (పద్మము)
దొడ్డవారు: ధనవంతులు
అంకెల= సంఖ్యలలో, లెక్కలలో
ఈడాడ: ఇక్కడ, అక్కడ
నలుగురూనేగురు= నలుగురు+అనేకురు
మొగలు: మగవాళ్ళు
పదుగురు: పదిమంది
వాడ: వీధి
వలపు: ప్రేమ
ఆడాడ: అక్కడ, అక్కడ
పూపడు: శిశువు
గొడ్డేరు: గుత్తసేయు (వ్యవసాయము సేయు)
గుడ్డము= గుడ్డాము: భూమిపై నున్న కొంతభాగము A plot of land (వేంకటాచలము అని అర్ధం తీసుకోవాలిక్కడ)
అడ్డగించు: ఆటంకం కలిగించు, నిరోధించు To stop, hinder, obstruct   

భావము:
అన్నమయ్య- ఈ సంకీర్తనలో అత్తా, కోడళ్ళ దెప్పిపొడుపుల్ని వివరిస్తున్నారు. ఇక్కడ అత్తగారు లక్ష్మీదేవి, కోడలు బ్రహ్మగారి భార్య ఐన సరస్వతీదేవి. [బ్రహ్మగారు విష్ణుని నాభికమలం లోనుంచి పుట్టారు కాబట్టి, సరస్వతీదేవి లక్ష్మికి కోడలు]

ఓ కోడలా! ఇలా రావే! ఓ నిందార్హమైన కోడలా! ఇటు రావే!
పోవే! అత్తయ్యా! ఫో, ఫో.. నీతో స్నేహం ఇక చాలు.

ఓ కోడలా! యేమాత్రం భయం, సిగ్గులేకుండా రాజులెదుట పెద్ద పెద్ద రంకెలు వేస్తావు నువ్వు. [కవులు రాజులెదుట తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు కాబట్టి, ఆ దృష్టితో రాసి ఉంటారు అన్నమయ్య]
అత్తయ్యా! నువ్వుమాత్రం, బురదలో పుట్టిన పద్మంవంటి ముఖం కలిగి ఉండి, ఎంతోమంది ధనికుల ఇళ్ళలో సంఖ్యల [ధనము] రూపంలో తిరగట్లేదా!

ఓ కోడలా! ఇక్కడో నలుగురు, అక్కడ ఎంతోమంది మగాళ్ళతో సిగ్గులేకుండా కలిసి ఉంటావు. [విద్వత్సభలో అనేకమంది కవుల నోట్లో నానుతూంటుంది, అని వ్యంగ్య భావన]
అత్తయ్యా! నువ్వు మాత్రం, వీధికో పదిమందితో ప్రేమ ఒలకబోస్తూ అక్కడ అక్కడా తిరగట్లేదా! [ప్రతీ వీధిలోనూ ధనికుల చేతుల్లో లక్ష్మి నలుగుతూంటుందని, కవి భావన]

సాక్షాత్తూ బొడ్డులోంచి పుట్టిన శిశువు [బ్రహ్మదేవుడు] కే నువ్వు గుత్త చేస్తావని [బ్రహ్మదేవుడు చేసే పని సృష్టిని చేయడం. ఆయనతో కలిసి వ్యవసాయం చేయడం అంటే, జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించడం] నిన్ను కోడలిగా తెచ్చానే కోడలా!
నువ్వు మాత్రం, వేంకటాచలముపై ఉన్న శ్రీవేంకటేశ్వరుని అడ్డగించి, నీవశం చేసుకున్నావు కదా! అత్తయ్యా! [నీకింక అడ్డేం ఉంది, అని కవి భావన]

Friday, June 19, 2015

లలితాంగి యౌవనము లావణ్యములప్రోవు - అలరి యిటువలె జేసెనమ్మా

//ప// లలితాంగి యౌవనము లావణ్యములప్రోవు
అలరి యిటువలె జేసెనమ్మా //ప//

//చ// జవ్వాది మిగుల నుష్ణముమీద సంపంగి
పువ్వు గట్టినది గన పొదలె దాపంబు
నివ్వటిలు గొజ్జంగి నీట నొయ్యన కడిగి
దువ్వటపు బయ్యెదను దుడువరమ్మా                       //ప//

//చ// మృగమదము గడు వేడి మెలుతతలపట్టునకు
అగలు గూడగ వేద నగ్గలంబాయ
బిగువైన కస్తూరి బేంట్లొయ్యనగోర
నగలించి తట్టుపునుగంటరమ్మా //ప//

//చ// విరహతాపంబునకు వేరొండు గతిలేదు
పొరసి వేగించినా బోదు
తిరువేంకటాచలాధిపుని మన్నన గాని
అరిదిమోహము దీరదమ్మా //ప//

ముఖ్యపదాల అర్ధం:
లలితాంగి: సున్నితమైన అంగముల కలది
లావణ్యము: సౌందర్యము
ప్రోవు: పోగు, సమూహము
అలరు: ప్రకాశించు
జవ్వాది: పునుగు Civet: a paste like pomatum
నివ్వటిలు: To spread, extend, overflow. వ్యాపించు 
గొజ్జంగి: మొగలి  పువ్వు [ఆడ మొగలి పువ్వు ను గొజ్జంగి అని, మొగ పువ్వుని కేతకీ అంటారుట.] A tree called Pandanus odoralissimus
ఒయ్యన: మృదువుగా
దువ్వటపు: దుప్పటము
బయ్యెద: ఆడువారు వక్షమును కప్పుకొను పైట
మృగమదము: కస్తూరీ మృగపు గంధం
మెలుత: స్త్రీ. యువతి 
కడు వేడి: మిక్కిలి వేడి
అగలు: పగులు, To break or go to pieces
అగ్గలము: మెండు, ఎక్కువగా
తట్టుపునుగు: పునుగుపిల్లినుండి సేకరించిన సుగంధ ద్రవము
వేరొండు: వేరొక ఉపాయము
పొరసు: వేరే విధానాలతో
వేగించు: తెల్లవారినా (ఇక్కడా రాత్రంతా జాగారము చేసినా)
మన్నన: గౌరవము, సమ్మానించడము (ఇక్కడ దగ్గరకు తీసుకోవడం)
అరిది: అపురాపమైన
మోహము: కాంక్ష 

భావము: 
అన్నమయ్య ఈ సంకీర్తనలో, అమ్మవారు శ్రీవారిపై నున్న విరహతాపాన్ని తగ్గించుకోడానికి ఏమేమి చేసిందో - చెలులు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నట్టుగా ఊహించి రచించారు. 

యౌవ్వనములో ఉన్న ఈ సున్నితాంగి (అలమేల్మంగ) అమిత సౌందర్యరాశి. ఆవిడ ఈ విధంగా చేసిందమ్మా!

శ్రీవారి విరహాన్ని భరించలేక శరీరానికి పునుగు తైలాన్ని రాసుకుంది. ఐనా, వేడి తగ్గక పోవడంతో సంపంగి పూలను చుట్టుకుంది. ఐనా, తాపము తగ్గట్లేదు. పోనీ, మొగలిపూరేకులు నానబెట్టిన నీటిలో ఓ బట్టను నానబెట్టి త్వరగా ఆవిడ మందపాటి పైటను తడి చేయండమ్మా!.  

ఈ అందమైన యువతి కస్తూరీమృగపు సుగంధపు కొవ్వును తలకు పట్టీలా వేసుకుంది. కానీ, ఆమె శరీరపు వేడికి ఈ కస్తూరి వేడి కూడా తోడై, ఆమెలో వేడి మరింత పెరిగిపోయింది. ఆమెలో ఉన్న వేడికి ఆ కస్తూరీ పూత ఎండిపోయి పెల్లలుగా ఐతే, మెల్లగా గోళ్ళతో ఆ పెల్లలను ఒలిచి, ఈ సారి తట్టుపుణుగును ఈమె శరీరంపై అంటడమ్మా!   

శ్రీవారిపై ఉన్న విరహతాపం తీరడానికి ఈమెకు వేరొక మార్గం లేదు. రాత్రంతా జాగారము చేసినా ఈమెకు తాపం తగ్గదు. శ్రీవేంకటేశ్వరుడు ఈమెను కౌగిలిలోకి తీసుకుని, ముద్దుచేస్తే తప్ప ఈమెకు ఆయన మీదున్న అపురూపమైన కాంక్ష తీరదు. అదొక్కటే మార్గం. 

పేజీ : 117, వాల్యూమ్ : 6, నెం. 161

Sunday, June 7, 2015

అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము శ్రింగారరాయ(డ నీకు శ్రీసతినిధానము

//ప// అంగనకు నీవె అఖిలసామ్రాజ్యము
శ్రింగారరాయ(డ నీకు శ్రీసతినిధానము //ప//

//చ// కమలాలపానుపు కాంతకు నీవురము
ప్రమదపు నీమనసు పాలజలధి
అమరు నీభుజాంతర మట్టె తీగెపొదరిల్లు
రమణీయ (ప్ర)హారాలు రత్నాలమేడలు //ప//

//చ// సతికి నీమెడ రతిసాము సేసేకంబము
ప్రతిలేని వయ్యాళి బయలు నీవు
మతించిన కౌస్తుభమణి నిలువుటద్దము
మితిలేని శ్రీవత్సము మించుబండారుముద్ర //ప//

//చ// నెమ్మి నలమేల్మంగ నీ కాగిలి పెండ్లిపీట
చిమ్ముల చందనచర్చ సేసపాలు
వుమ్మడి మెడనూళ్ళు వుయ్యాలసరపణులు
పమ్మి శ్రీవేంకటేశ నీ భావమే భోగము //ప//

ముఖ్యపదాల అర్ధం:
అంగన: స్త్రీ
నిధానము: నిక్షేపము, దాచుకొన్నది A treasure
పానుపు: మంచము
ఉరము: వక్షస్థలము
ప్రమదము: ఆనందము
జలధి: సముద్రము
భుజాంతరము: రొమ్ము
రతిసాము: శృంగారంలో ఆట
కంభము: స్తంభము
వయ్యాంళి: వ్యాహాళి అనే పదం నుంచి వచ్చి ఉండవచ్చు (విహరించు)
బయలు: విశాలమైన మైదానము
మతించు: మదింపు (To estimate)
మితిలేని: హద్దు లేని, పరిమితిలేని
శ్రీవత్సము: విష్ణు వక్షస్థలమునందు ఉండెడి పుట్టు మచ్చ 
బండారు ముద్ర: కోశాధికారి =ఖజానాకి అధికారి] ముద్ర
నెమ్మి: ప్రేమ, Attachment, affection,
చిమ్ముల: జల్లబడిన
సేసపాలు: అక్షింతలు
మెడనూలు: బంగారు తీగలతో చేయబడిన దండలు A necklace made of gold threads plaited together
సరపణులు: బంగారు గొలుసులు An ornament of gold chains of two or more folds
పమ్మి: అతిశయించు, విజృంభించు

భావం:
అన్నమయ్య ఈ సంకీర్తనలో అత్యంత మనోహరమైన ఉపమానాలను వేసి శ్రీవారి, అమ్మవార్ల బంధాన్ని తెలియజేస్తున్నారు. 

ఓ శృంగారమూర్తీ! నీ భార్యకు నీవే గొప్ప సామ్రాజ్యము. నీ శరీర, మనస్సులనే రాజ్యాలకి ఆవిడే మహారాణి. నీకేమో ఆవిడ దాచిపెట్టిన గొప్ప సంపద.

నీ కఠినమైన వక్షస్థలము ఆవిడకి పద్మాలతో నేసిన మంచము. 
ఆనందమయమైన నీ తెల్లని మనసు ఆమెకు పాల సముద్రము.
నీ రొమ్ముభాగము ఆమెకు లతలతో అల్లిన పొదరిల్లు.
నీవు ధరించిన మెడలోని ఎత్తైన హారాలు ఆమెకు రతనాల మేడలు.

నీ పొడవాటి మెడ ఆమెకు రతిక్రీడ చేయు స్తంభము.
నీవు ఆమెకు సాటిలేని విహారము చేయు విశాలమైన మైదానము. 
అంచనా వేస్తే నీ మెడలో కౌస్తుభమణి ఆమె అందం చూసుకోడానికి ఉపయోగించే నిలువుటద్దము.
సాటిలేని నీ వక్షస్థలముపై ఉండెడి "శ్రీవత్సము" అనే పుట్టుమచ్చ ఆమెకు ధనాగారమునకు అధికారి అయినవాడు వేసే ముద్ర లాంటిది. 

అలమేల్మంగకు నీ ప్రేమపూరితమైన కౌగిలియే పెద్ద పెండ్లిపీట.
నీ శరీరంపై దట్టంగా చిమ్మిన గంధపు పూతయే పచ్చని తలంబ్రాలు.
మీ ఇద్దరి మెడల్లో కట్టిన బంగారపు తీగెలూ ఉయ్యాలకు వేసే బంగారు గొలుసులు [వారిద్దరి గాఢాలింగనాలకు వారి మెడల్లో ఉన్న బంగారు తీగలు పెనవేసుకుపోయి గొలుసుల్లా అయ్యాయి. వారి ఆలింగనాల్ని చెప్పడానికి కవి ఎన్నుకున్న ఉపమానం ఇది] 
ఓ శ్రీవేంకటేశ్వరా! అతిశయించు నీ భావమే ఆమెకు గొప్ప వైభోగము. 

Friday, June 5, 2015

చిత్తజ గురుడ నీకు శ్రీమంగళం నా - చిత్తములో హరి నీకు శ్రీమంగళం

//ప// చిత్తజ గురుడ నీకు శ్రీమంగళం నా- 
చిత్తములో హరి నీకు శ్రీమంగళం                      //ప//

//చ// బంగారు బొమ్మవంటి పడతి నురముమీద 
సింగారించిన నీకు శ్రీమంగళం 
రంగుమీర పీతాంబరము మొలగట్టుకొని 
చెంగిలించే హరినీకు శ్రీమంగళం                       //ప//

//చ// వింత నీలమువంటి వెలదిని పాదముల 
చెంత బుట్టించిన నీకు శ్రీమంగళం 
కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా 
చింతామణివైన నీకు శ్రీమంగళం                     //ప//

//చ// అరిది పచ్చల వంటి యంగన శిరసుమీద 
సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీవేంకటేశ ఘనసంపదలతోడి
సిరివర నీకు నిదె శ్రీమంగళం                        //ప//

ముఖ్యపదాల అర్ధం:
చిత్తజ గురుడు: మనసునందు జనించిన (మన్మధునికి) తండ్రి
మంగళం: శుభకరము
పడతి: స్త్రీ
ఉరము: వక్షస్థలము
సింగారించు: అలంకరించు
రంగుమీర: పైన చెప్పిన బంగారపు రంగుని మించిన 
పీతాంబరము: బంగారు వర్ణము కలిగిన పట్టు వస్త్రము
మొల: కటిభాగము
చెంగలించు: ప్రకాశించు 
వెలది: స్త్రీ 
పాదముల చెంత: పాదాల వద్ద
చింతామణి: కోర్కెలు తీర్చే మణి The wishing stone, a fabulous gem or magic ruby
అరిది: అరుదైన 
పచ్చ: మరకతము (Emerald)
అంగన: ఆడుది
గరిమ: పెద్దదైన
సిరివర: లక్ష్మీదేవి వరించిన వాడు

భావం:
అన్నమయ్య అత్యంత మధురముగా రచించిన శ్రీవేంకటేశ్వరుని మంగళం పాట యిది. శ్రీబాలకృష్ణప్రసాద్ గారి దివ్యగాత్రంలో ప్రాణం పోసుకుంది ఈ పాట. అత్యంత సున్నితంగా పాడారాయన.. 

చిత్తజుడైన మన్మధునికి గురువు (తండ్రికూడా) అయిన నీకు (శ్రీ= నీ భార్య లక్ష్మికీ కూడా) శుభమగుగాక! మా మనసుల్లో తేజోమూర్తివైన ప్రకాశించే హరీ నీకు శ్రీమంగళంబగుగాక!

పచ్చని మేలిమి బంగారు వర్ణంతో మెరిసి పోతూన్న బొమ్మవంటి లక్ష్మీదేవిని వక్షస్థలముపై అలంకరించుకున్న నీకు శ్రీమంగళంబగుగాక!
పచ్చని రంగులు వెదజల్లే బంగారు వర్ణము కలిగిన పట్టు వస్త్రాన్ని మొలకు చుట్టుకుని దేదీప్యమానమై ప్రకాశించే శ్రీహరీ నీకు శ్రీమంగళంబగుగాక!

వింతైన నీలికాంతులు వెదజల్లే స్త్రీ అయిన ఆకాశగంగను పాదముల వద్ద పుట్టించిన నీకు శ్రీమంగళంబగుగాక!
కాంతులు వెదజల్లే కౌస్తుభమణిని మెడలో ధరించి భక్తుల కోర్కెలు దీర్చే చింతామణివైన నీకు శ్రీమంగళంబగుగాక!

అరుదైన మరకతమణి వలే ఆకుపచ్చని దేహకాంతి కలిగిన స్త్రీ (భూదేవి) శిరసుపై (వేంకటాచలముపై) ఉన్న సిరులన్నింటినీ ధరించి నిలిచిన నీకు శ్రీమంగళంబగుగాక!
శ్రీవేంకటేశుడవై ఘనమైన సంపదలతో బరువుగా నిల్చున్న ఓ లక్ష్మీదేవి వరించిన విష్ణుమూర్తీ, నీకు శ్రీమంగళంబగుగాక!

శ్రీపతి పుర నాయకా జయ చింతితాభీష్ట దాయకా

//ప// శ్రీపతి పుర నాయక జయ-
చింతితాభీష్ట దాయకా                                              //ప//

//చ// ఉన్నతోన్నత విగ్రహ - దాసోపరిస్థాననుగ్రహ
సన్నుతామర సుగ్రహ - సామ వేద పరిగ్రహ                  //ప//

//చ// జానకీ ప్రియ కారక  - శివసాధితాఖిలతారక 
మానుషా హిత మారక - మామకాఘనివారక              //ప//

//చ// శ్రీ వేంకట నాథ రూపక - సంచిత రఘు కుల దీపక 
భావ సంతోష ప్రాపక - అభంగ మంజుల చాపక             //ప//

ముఖ్యపదాల అర్ధం:
శ్రీపతి పురము: విష్ణుదేవుని నగరము (వైకుంఠము)
నాయక: నాయకుడు
జయ: జయమగుగాక
చింతిత+ అభీష్ట: కోరుకున్న కోర్కెలు
దాయక: ఇచ్చువాడు
ఉన్నతోన్నత విగ్రహ: అత్యున్నతమైన రూపుడు
దాస: దాసులకు
ఉపరిస్థాన: గొప్పదైన కైవల్యమును
అనుగ్రహ: ప్రసాదించువాడు
సన్నుత+అమర+సుగ్రహ: దేవతల సన్నుతులను గ్రహించువాడు
సామవేద: సామవేదము
పరిగ్రహ: ప్రేమతో స్వీకరించువాడు
జానకీ ప్రియకారక: సీతాదేవికి ఆనందం కలిగించువాడు
శివసాధిత: శివునిచే సాధింపబడిన
అఖిల తారక: గొప్ప తేజోమూర్తి
మానుష+అహిత మారక: మనుజులకు కలిగే చెడును సంహరించేవాడు
మామక+ అఘ నివారక: Mine, నావైన + పాపములను నివారించువాడు
శ్రీవేంకటనాధరూపక: లక్ష్మితోకూడిన వేంకటనాధ రూపమును ధరించిన వాడు
సంచిత: ఆర్జింపబడిన
రఘుకుల దీపక: రఘువంశమునకు వెలుగైనవాడు
సంతోష భావ ప్రాపక: సంతోషభావాలను అనుగ్రహించువాడు
అభంగ: విరిగిపోని
మంజుల చాపక: అందమైన విల్లును కలిగినవాడు

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య రఘునాయకుడే శ్రీవేంకటేశ్వరుడు, ఆయనే వైకుంఠాధిపతి విష్ణుదేవుడంటున్నారు.

ఓ వైకుంఠాధిపతి ఐన విష్ణుదేవుడా! కోరిన కోర్కెలు తీర్చేవాడా! నీకు జయమగుగాక

అత్యున్నతమైన స్వరూపముగలవాడా! సేవించినవారికి ఉన్నత స్థానమైన కైవల్యమును ప్రసాదించువాడా! నిరంతరము దేవతలచే సన్నుతింపబడేవాడా! సామవేద ప్రియుడా! నీకు జయమగు గాక.

సీతాదేవికి ఆనందమును కలిగించెడివాడా! పరమశివుడు సాధించిన నారాయణ మంత్ర స్వరూప తేజోమూర్తీ! మనుజులకు హితము చేకూర్చని వారలను సంహరించెడివాడా! నావి, నావంటి మనుజుల పాపములను నివారించెడివాడా! నీకు జయమగు గాక.

లక్ష్మీదేవిని ఉరమునందు నిల్పిన వేంకటేశ్వర రూపుడా! రఘుకులముకు దీపము వలె కీర్తిని ఆర్జించినవాడా! సంతోషభావాలను అనుగ్రహించువాడా! ఎన్నడూ విరగని విల్లును చేతియందు ధరించిన వాడా! (అంటే, ఓటమి ఎరుగని వాడని అర్ధం). నీకు జయమగుగాక.