Total Pageviews

Tuesday, January 5, 2016

మఱవకువే చెలియ మదన రహస్య మిది - యెఱగుకొంటే మేలు ఇందులోనే ఉన్నది [Maravakuve cheliya madana rahasyamidi]

//ప// మఱవకువే చెలియ మదన రహస్య మిది
 యెఱగుకొంటే మేలు ఇందులోనే ఉన్నది

//చ// సేయరాని వినయము సేసితే దంపతులకు
 పాయని చుట్టరికమై పైకొనును
 యేయెడా మొగమాటము లెప్పుడు గలిగితేను
 మోయరానిమోపులై మునుకొను మోహము

//చ// యేపొద్దు మంచితనాన నెనసితే జాణలకు
 దాపురాలై వేడుకలు తతిగొనును
 కాపురపు సరవులే కడుగడు కరపితే
 ఆపరాని తమకము లలవడివుండును

//చ// తిరమైన రతులద్దితే నేరుపరులకు
 సరససల్లాపములు చవులు మించు
 యిరవై శ్రీవేంకటేశుడింతలోనె నిన్నుగూడె
 వరుసతో మెలగితే వలపు లీడేరును

ముఖ్యపదాల అర్ధం:
యెఱుగు: తెలుసుకొను
మునుకొను: ముందు ఉంచుకొను (ముందుగానే)
యేయెడ: ఎటు వైపైనా
పాయని: విడువని
దాపురము: ప్రాప్తి
తతి: సమూహము
సరవి: వరుస, క్రమము
కడు కడు: ఎక్కువ, ఎక్కువగా
కరపు: చేసితే
తిరమైన: స్థిరమైన
నేరుపరి: నేర్పరి
చవులు: రుచులు
యిరవు: స్థిరమైన
కూడె: కలిసె
ఈడేరును: తీరును

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య వయసులోను, దాంపత్యములోనూ పెద్దదైన చెలికత్తె గా మారి, అలమేల్మంగకు దాంపత్యరహస్యాన్ని బోధిస్తున్నారు. 

ఓ చెలియా! మరచిపోకు. ఇప్పుడు నే చెప్పేది మదన రహస్యము. తెలుసుకుంటే చక్కటి మేలు జరుగుతుంది.

దంపతులు ఒకరినొకరు ఎంత ఎక్కువగా గౌరవించుకుంటే వారి మధ్య బంధం విడిపోకుండా అంత ఎక్కువ స్థాయికి తీసుకెళ్తుంది. [నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దంపతులమధ్య బంధం ఎలా ఉంటుందో మనకి తెలుసు]
దంపతులిద్దరి మధ్య ఎప్పటికీ కొంచెం సిగ్గు అనేది ఉంటే, వారిద్దరికీ ఒకరిపైన ఒకరికి మోహం మోయలేనంత బరువుగా తయారవుతుంది. [అంటే, మొహమాటంలేకుండా మాటలు, చేతలు జారిపోతూంటే, వారిద్దరి మధ్య అనేక అభిప్రాయ బేధాలొచ్చి దంపతుల అన్యోన్యత తగ్గుతుందని- కవి భావన].

యే సాయంత్రమైతే స్త్రీ తన భర్తతో మంచితనంగా మసలుకుంటుందో, ఆ స్త్రీలకు ఆ రాత్రి భర్తతో శృంగార వేడుకలు లెక్ఖలేనంతగా ఉంటాయి. [భర్త ఇంటికి రాగానే, యే స్త్రీ ఐతే చక్కగా మాట్లాడి, ఆయన కంటికి యింపుగా కన్పిస్తుందో, ఆ స్త్రీకి ఆమె భర్తవల్ల ఆ సాయంత్రం గొప్ప ఆనందం కలుగుతుందని- కవి భావన] 
భార్యాభర్తలకు ప్రతీ రాత్రీ చక్కటి శృంగార రాత్రిగా మారి, అలాంటివి అనేక రాత్రులు వరుసగా గడిపితే, వారిద్దరిమధ్య  మోహావేశము ఆపలేనంతగా ఉంటుంది. [వారిరువురి మధ్య బంధం గట్టిపడి, ఒకరిపై ఒకరికి మోహము నిరంతరముగా ఉండి, విరక్తి కలగకుండా ఉంటుందని- కవి భావన]

భార్యాభర్తలిద్దరూ రతిక్రీడలో నేర్పరితనము కలిగినవారై, వారి దాంపత్యానికి నిరంతరమూ స్థిరమైన రతి గంధాన్ని అద్దితే, వారి జీవితంలో సరసమైన సంభాషణములు రసాలూరుతూ ఉంటాయి.  [వారి జీవితం కొత్త రుచులతో నిరంతరం ఆహ్లాదకరముగా ఉంటుందని - కవి భావన]
అదిగో! శ్రీవేంకటేశ్వరుడు, ఇంతలోనే నిన్ను కలవడానికి వచ్చేస్తున్నాడు. ఆయనతో సహకరించి, నేను చెప్పిన మదన రహస్యాలని గుర్తుపెట్టుకుని, వినయంతో మెలిగితే నీ ప్రేమ తీరి, పురుషోత్తమునితో గొప్ప సుఖాన్ని అనుభవిస్తావు.