Total Pageviews

Wednesday, July 24, 2013

వీణ వాయించెనే అలమేలు మంగమ్మ - వేణుగాన విలోలుడైన వేంకటేశునొద్ద [Veena vayinchene alamelu mangamma]

//ప// వీణ వాయించెనే అలమేలు మంగమ్మ
వేణుగాన విలోలుడైన వేంకటేశునొద్ద

//చ// కురులు మెల్లన జారగ సన్న
జాజివిరులు జల్లన రాలగ
కరకంకణంబులు ఘల్లని మ్రోయగ
మరువైన వజ్రాల మెరుగుతులాడగ

//చ// సందిటిదండలు కదలగాను
ఆణిముత్యాల సరులు ఉయ్యాలలూగగాను
అందమై పాలిండ్లను అలదిన కుంకుమ
గంధము చెమటచే కరగి ఘుమఘుమమనగా

// ఘననయనములు మెరయగా
వింతరాగమును ముద్దులు కులుకగా
ఘననిభవేణి జంత్రగాత్రము మెరయగ
వినెడి శ్రీవేంకటేశుల వీనుల విందుగా


ముఖ్యపదార్ధం:
విలోలుడు= విపరీతమైన ఆసక్తి కలిగిన వాడు
కురులు= వెంట్రుకలు
మరువైన= చాటుగా ఉన్న, బయటకు కనిపించని ప్రదేశం
మెరుగుతులు= మెరపులు
సందిటి దండలు= చేతుల దండలు
ముత్యాల సరులు= ముత్యాల దండలు
పాలిండ్లు= స్త్రీ స్తనములు
కుంకుమ గంధము= ఎర్రని గంధము
నిభము= సహనము, సమానము
జంత్రము= An instrument, a machine. జంత్రవాద్యము
గాత్రము= గొంతుతో పలికించే నాదము
వీనులు= చెవులు


భావం:
అమ్మవారు శ్రీవేంకటేశుని ముందు కూర్చుని వీణ వాయిస్తోంది ట. అప్పుడు ఆమె కదలికల్లో వచ్చే మార్పులను చాలా అందంగా వర్ణిస్తున్నారు అన్నమయ్య. (ఈ సంకీర్తన అన్నమయ్యదేనా? అని నిర్ధారించుకోవలసి ఉంది, ఎందుకంటే భావం గొప్పదైనా ఆయన ఉపయోగించే పదగాంభీర్యం నాకు కనిపించలేదు)

వేణు నాద ప్రియుడైన శ్రీవేంకటేశుని వద్ద అలమేలుమంగమ్మ వీణ వాయిస్తోంది.

ఆమె వీణ వాయిస్తున్నప్పుడు పొడవటి నల్లని జుట్టు ముందుకు జారిపోతున్నాయి. ఆ కొప్పులో అలంకరించుకున్న సన్నజాజి పువ్వులు జలజలా రాలిపోతున్నాయి. చేతులకు ధరించిన బంగారు ఆభరణాలు ఘల్లు ఘల్లు మని మ్రోగుతున్నాయి. ఆభరణాల్లో పేర్చిన వజ్రాలు మిల మిలా మెరుస్తున్నాయి.

వీణపై సుతారమైన చేతివేళ్ళు అలవోకగా అతూ, ఇటూ కదిలిపోతున్నాయి. ఆమె కదలికలకి మెడలో ధరించిన ముత్యాల దండలు అటూ, ఇటూ ఉయ్యాలలు ఊగుతున్నాయి.  ఆమె అందమైన స్తనములపై  పూసుకున్న ఎర్రని సుగంధలేపనం చెమట వల్ల కరిగిపోయి ఆ ప్రదేశంతా అంతా ఘుమఘుమలాడుతోంది.

సంతోషముతో ఆమె కన్నులు మెరిసిపోతున్నాయి. ఎన్నో కొత్తరాగాలు ముద్దుగా వీణమీద పలికిస్తోంది. వినయవంతురాలై వీణతో పాటూ చక్కటి గొంతుతో శ్రావ్యమైన పాట పాడుతూ వింటున్న శ్రీవేంకటేశ్వరుని చెవులకు ఇంపుగా సంకీర్తనా నివేదన చేస్తోంది.