Total Pageviews

Wednesday, July 24, 2013

వీణ వాయించెనే అలమేలు మంగమ్మ - వేణుగాన విలోలుడైన వేంకటేశునొద్ద

//ప// వీణ వాయించెనే అలమేలు మంగమ్మ
వేణుగాన విలోలుడైన వేంకటేశునొద్ద

//చ// కురులు మెల్లన జారగ సన్న
జాజివిరులు జల్లన రాలగ
కరకంకణంబులు ఘల్లని మ్రోయగ
మరువైన వజ్రాల మెరుగుతులాడగ

//చ// సందిటిదండలు కదలగాను
ఆణిముత్యాల సరులు ఉయ్యాలలూగగాను
అందమై పాలిండ్లను అలదిన కుంకుమ
గంధము చెమటచే కరగి ఘుమఘుమమనగా

// ఘననయనములు మెరయగా
వింతరాగమును ముద్దులు కులుకగా
ఘననిభవేణి జంత్రగాత్రము మెరయగ
వినెడి శ్రీవేంకటేశుల వీనుల విందుగా


ముఖ్యపదార్ధం:
విలోలుడు= విపరీతమైన ఆసక్తి కలిగిన వాడు
కురులు= వెంట్రుకలు
మరువైన= చాటుగా ఉన్న, బయటకు కనిపించని ప్రదేశం
మెరుగుతులు= మెరపులు
సందిటి దండలు= చేతుల దండలు
ముత్యాల సరులు= ముత్యాల దండలు
పాలిండ్లు= స్త్రీ స్తనములు
కుంకుమ గంధము= ఎర్రని గంధము
నిభము= సహనము, సమానము
జంత్రము= An instrument, a machine. జంత్రవాద్యము
గాత్రము= గొంతుతో పలికించే నాదము
వీనులు= చెవులు


భావం:
అమ్మవారు శ్రీవేంకటేశుని ముందు కూర్చుని వీణ వాయిస్తోంది ట. అప్పుడు ఆమె కదలికల్లో వచ్చే మార్పులను చాలా అందంగా వర్ణిస్తున్నారు అన్నమయ్య. (ఈ సంకీర్తన అన్నమయ్యదేనా? అని నిర్ధారించుకోవలసి ఉంది, ఎందుకంటే భావం గొప్పదైనా ఆయన ఉపయోగించే పదగాంభీర్యం నాకు కనిపించలేదు)

వేణు నాద ప్రియుడైన శ్రీవేంకటేశుని వద్ద అలమేలుమంగమ్మ వీణ వాయిస్తోంది.

ఆమె వీణ వాయిస్తున్నప్పుడు పొడవటి నల్లని జుట్టు ముందుకు జారిపోతున్నాయి. ఆ కొప్పులో అలంకరించుకున్న సన్నజాజి పువ్వులు జలజలా రాలిపోతున్నాయి. చేతులకు ధరించిన బంగారు ఆభరణాలు ఘల్లు ఘల్లు మని మ్రోగుతున్నాయి. ఆభరణాల్లో పేర్చిన వజ్రాలు మిల మిలా మెరుస్తున్నాయి.

వీణపై సుతారమైన చేతివేళ్ళు అలవోకగా అతూ, ఇటూ కదిలిపోతున్నాయి. ఆమె కదలికలకి మెడలో ధరించిన ముత్యాల దండలు అటూ, ఇటూ ఉయ్యాలలు ఊగుతున్నాయి.  ఆమె అందమైన స్తనములపై  పూసుకున్న ఎర్రని సుగంధలేపనం చెమట వల్ల కరిగిపోయి ఆ ప్రదేశంతా అంతా ఘుమఘుమలాడుతోంది.

సంతోషముతో ఆమె కన్నులు మెరిసిపోతున్నాయి. ఎన్నో కొత్తరాగాలు ముద్దుగా వీణమీద పలికిస్తోంది. వినయవంతురాలై వీణతో పాటూ చక్కటి గొంతుతో శ్రావ్యమైన పాట పాడుతూ వింటున్న శ్రీవేంకటేశ్వరుని చెవులకు ఇంపుగా సంకీర్తనా నివేదన చేస్తోంది. 

Tuesday, July 23, 2013

చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు - ఇలనింత పచ్చిదేరీ ఇదివో నీ భావము

//ప//చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు
ఇలనింత పచ్చిదేరీ ఇదివో నీ భావము

//చ// చెక్కులవెంటా గారె చెమట తుడుచుకోవే
చక్కవెట్టుకొనవే నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కు దీయవే
ఇక్కువల నీ కోరికె లీడేరెనిపుడు

//చ// పెదవి మీద కెంపులబట్లు రాలుచుకోవే
చెదరిన ముంగురులు చేత దువ్వవే
వదలిన పయ్యెద చివ్వన బిగించుకొనవే
పది(బదిగా నీనోము ఫలియించె నిపుడు

//చ// తిలకము కరగెను దిద్దుకోవే నొసలను
కలసిన గురుతులు గప్పుకొనవే
యెలమి శ్రీవేంకటేశు( డేలె నలమేలుమంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు

ముఖ్యపదార్ధం:
సిగ్గరి=సిగ్గు కలిగిన స్త్రీ 
పచ్చిదీరె= బయటపడు
చెక్కు= The cheek. కపోలము 
అక్కు= రొమ్ము The breast or chest
పెనగొన్న=ఒకదానిపై ఒకటి పెనవేసుకొను
ఇక్కువ= జీవస్థానము, రహస్య అంగములు
కెంపులబట్లు=కెంబట్టు= కెంపు+పట్టు= ఎర్రని దారంలాంటి తీగ (Red silk) 
ముంగురులు= ముందు + కురులు = ముందుకు రాలే జుట్టు
పయ్యెద= స్త్రీలు వక్షస్థలము కప్పుకొను వస్త్రము
చివ్వని=చివ్వు+అని= ఒక్కసారిగా, గబుక్కున
పది(బదిగా=పదింబదిగ= పదులు, చాలా several or many
గురుతులు= చిహ్నాలు
యెలమి= సంతోషముతో

భావం:
అమ్మవారు మొదటిరాత్రి స్వామిని కలిసి గదిలోంచి అలానే బయటకి వచ్చింది. పక్కనున్న చెలికత్తెలు ఆమెను చూసి ఇలా అంటున్నారు.

అమ్మా! నీవు కొత్త పెళ్ళికూతురివి. నీకు అసలే సిగ్గు ఎక్కువ.  నిన్ను ఇలా చూస్తే నీవు స్వామితో అనుభవించిన సుఖాలేమిటో బహిర్గతం అవుతున్నాయి. కొంచెం సరిచేసుకో..

నీ నుదుటన కారే ఆ చెమటని తుడుచుకోవే. జారిపోయిన నీ కొప్పుని మళ్ళీ చక్కబెట్టుకోవే. నీ రొమ్ము మీద పెనవేసుకుపోయిన హారాలను చిక్కుతీయవే. ఇవన్నీ చూస్తుంటే నీ సుఖస్థానాలకి కోరికలు తీరినట్లనిపిస్తోంది. 

ఆ పెదవి మీద ఎర్రని దారాలు రాల్చుకోవే (స్వామి పెదవులని గ్రోలినప్పుడు వారిద్దరి లాలాజలం అలా తీగలుగా కట్టిందని ఊహ కాబోలు). ఆ చెదిరిన జుట్టు ముందుకు రాలుతోంది, అది సరి చేసుకోవే. నీ పయ్యెద (రవిక) వదులుగా అయిపోయింది, గభాలున బిగించుకోవే. నీ పతితో చేసిన యౌవ్వనపు నోము నీకు మిక్కిలిగా ఫలించిందని తెలుస్తోంది.

నీవు నుదుటన ధరించిన తిలకము మీ ఇద్దరి కలయికలోని వేడికి కరిగిపోయి నొసటలకి అంటుకుంది, అది దిద్దుకోవే. నీవు శ్రీవారితో కలిసిన సంభోగపు గుర్తులు (పెదవుల ముద్రలు, పంటి గాట్లు, గోళ్ళ గిచ్చుళ్ళు వంటివి) బయటకి కనబడకుండా కప్పుకోవే. సంతోషముతో శ్రీవేంకటేశ్వరుడు చేరదీసిన అలమేలుమంగవమ్మా నువ్వు. నీవు తలచిన తలపులన్నీ నిరవేరాయిప్పుడు. 

Monday, July 22, 2013

పొలతి జవ్వనమున (బూవక పూచె - యెలమి నిందుకు మనమేమి సేసేదే

//ప// పొలతి జవ్వనమున (బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే

//చ// సతిచింతాలతలలో సంపెంగపూవులు పూచె
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోతను అడవిజాజులు పూచె
హితవు తెలియదింకను ఏమిసేసేదే

//చ// తొయ్యలిచెమటనీట దొంతితామెరలు పూచె
కొయ్యచూపు కోపముల కుంకుమ పూచె
కయ్యపు వలపుల (జీకటి మాకులు పూచె
నియ్యేడ చెలియభావ మేమి చేసేదె

//చ// మగువరతుల లోన మంకెన పువ్వులు పూచె
మొగికొనగోళ్ళనే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశు పొందుల కప్రము పూచె
ఇగురు(బోండ్ల మింక నేమి సేసేదే

ముఖ్యపదార్ధం:
 పొలతి= స్త్రీ
జవ్వనమున=యౌవ్వనమున
యెలమి= సంతోషముతో
సతిచింతాలతలలో= ఆమె ఆలోచనా అల్లికలలో
మతి= తలపు, కోరిక 
విరహపు మేన= ఎడబాటు, వియోగపు శరీరాన 
అతనునితలపోతను= తనువులేని ఆయన ఆలోచనలో
హితవు= మంచి
తొయ్యలి= స్త్రీ, ఆడు హంస
కొయ్యచూపు= కోసేలా ఉండే చూపు
కయ్యపు= జగడపు
చీకటి మాకులు= చీకటి చెట్లు (night queen)
మగువరతుల= స్త్రీ కోరికలోన
మొగికొనగోళ్ళనే= కొన గోళ్ళ సమూహము
కప్రము= కప్పురము
ఇగురుబోడి= యౌవ్వనవతిఐన స్త్రీ

భావం:
చెలులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. స్వామి గురించిన ఆలోచనల్లో, ఆయనతో రతి జరిపే సమయంలో, ఆయనపై కోపం వచ్చినప్పుడు..వాళ్ళ శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో, అవి పువ్వులతో పోల్చి చెప్పుకుంటున్నారు. స్వామి విరహంతో బాధను అనుభవిస్తూనే, ఆడవాళ్ళగా పుట్టాం, ఇక ఏమి చేయగలమే, అందాన్ని ఆయనకి అర్పించడం తప్ప...అనుకుంటున్నారు.   

పడతి యౌవ్వనము సంతోషంతో పూయకనే పూచింది. ఇప్పుడు మనమేమి చేసేదే?

మగని గురించిన దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు పచ్చని సంపంగె పువ్వులు పూచినట్టుంది. కోరిక కలిగినప్పుడు శరీరంలో మల్లెలు పూచినట్టుంది. విశ్వాంతరాత్ముని తలపోతలో ఆమె శరీరంలో అడవి జాజిపువ్వులు పూచాయి. ఇది మంచిదేనా? నేనేమి చేసేదే?.

చెలి చెమట నీటిలో తామెరల దొంతరలు పూచాయి (తామెరలు చాలా నీరున్న ప్రదేశాలలోనే పూస్తాయి. అంటే, స్వామి మీద విరహంతో ఒళ్ళు వేడెక్కి ఆమెకి చెమట వానల్లా కురుస్తోందన్నమాట.) పతి పైన కోపపు చూపులలో ఎర్రని కుంకుమలు పూస్తున్నాయి. (అంటే కోపంలో కన్నులు ఎర్రబారాయన్నమాట) జగడాల ప్రేమల్లో చీకటి చెట్లు (night queen) పూచాయి. భావము ఈ విధముగా ఉంది, నేనేమి చేసేదే?

పతితో రతులు చేసేడప్పుడు శరీరంలో మంకెన పువ్వులు పూసినట్టుంది. (రతి సమయంలో ఆమె శరీరం కోరికతో ఎర్రగా మారిందన్నమాట) ఆమె కాలి, చేతి వేళ్ళ కొనగోళ్ళకి పదునైన మొగలి పూవులు పూసాయి.(గాఢాలింగనాల్లో స్వామి వీపుపై, భుజములపై సతి చేసే నఖక్షతాలు, గీరడాలు చూసి ఆమె చేతి వేళ్ళ గోళ్ళు పదునైన మొగలిరేకుల్లా ఉన్నాయని కవి భావన).. శ్రీవేంకటేశ్వరుని పొందులో ఉన్నప్పుడు పొగరు కప్పురము పూస్తుంది. (నల్లని స్వామి పై చెలి చెమట అంటుకుని ఆ తెల్లని బిందువులు కప్పురపు పొడిలా ప్రకాశిస్తోందని కవి భావన) ఆడవాళ్ళం మనము ఏమి సేసేదే?  

Saturday, July 20, 2013

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ - తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

//ప// కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ 
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

//చ// వేదములే శిలలై వెలసినది కొండ 
యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ 
శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ

//చ// సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ 
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ 
పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ

//చ// వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ 
పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ 
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ

ముఖ్యపదార్ధం:
కట్టెదుర= కడు+ఎదుర= మిక్కిలి ఎదురుగా
కాణాచి= చిరకాలముగా ఉన్న స్థానము
తెట్టెలాయ మహిమలే= మహిమలు తెట్టులు (చెరువులో బాగా నానిన రాయి పై నాచు తెట్టెలు కట్టినట్టు, మహిమలు బాగా పేరుకుపోయి ఉన్న ప్రదేశము)
యేరు= పారే నీరు (సెలయేరు అంటే శిల పై నుండి పారే యేరు.)
చరించు= తిరుగాడు
జలధులు= ఇక్కడ మేఘాలు అని చెప్పుకోవాలి
నిట్టచరులు=పొడవుగా ప్రవహించు
ఉర్వి తపసులు= భూమి మీద తాపసులు
తరువులు= చెట్లు
కొటారు= సామాను దాచు పెద్ద గది వంటిది, కొట్టాం అనవచ్చు (గాదె వంటిది)
సోబనము= మంగళము
విరివి= విస్తృతి, విశాలత, వెడల్పు (Expanse, width, breadth, extent)

భావం:
అదివో తిరుమల కొండ. మిక్కిలి ఎదురుగా, అతి దగ్గరగా ఉన్న ఇలపై నిలచిన వైకుంఠము. చిరకాలముగా నిలచిన పర్వతరాజము. ఎన్నో మహిమలు మందంగా తెట్టెలు కట్టిన కొండ. 

వేదాలే శిలలుగా ఉన్న కొండ. లెక్ఖలేనన్ని పుణ్యరాశులు ప్రవహిస్తూన్న కొండ. ఈ పర్వత శ్రేణి కొన భాగాలు బ్రహ్మ మొదలైన లోకాలన్నింటినీ తాకుతున్న కొండ. లక్ష్మీదేవి భర్త ఉండేటి శేషాచలం ఈ కొండ. 

దేవతలంతా అనేక మృగ జాతులుగా మారి తిరుగుతూన్నటువంటి కొండ. నీటిని ధరించిన మేఘాలు ఈ కొండ చివరలు తాకుతూ వెళ్తాయి. భూమి మీద గొప్ప తపోసంపన్నులు చెట్లు గా నిలచి ఉన్న కొండ. పైన చెప్పిన శేషాచలానికి ముందున్న ఈ పొడవాటి కొండ అంజనాద్రి.

లెక్ఖలేనన్ని వరముల తనలో ఇముడ్చుకుని గొప్ప వైశాల్యాన్ని పొందినదీ కొండ. లక్ష్మీకాంతుని మంగళప్రదమైన వెలుగులతో ప్రకాశించే కొండ. ఆ కొండ గుహల్లో సంపదలు కురిసి నిండిపోయిన కొండ (ఇహలోకపు సంపదలు కాదు, ఆ కొండ గుహల్లో ఎంతో మంది తపస్సులు చేసుకుంటూ పుణ్యాల సంపదలు సంపాదించగా వాటితో నిండిపోయినదని). విస్తృతమైనది, విశ్వమంతా వ్యాపించినది అదిగో శ్రీవేంకటేశుడు నెలవైన కొండ. పాపములను ఖండించే కొండ. ఈ తిరుమల కొండ.      

Thursday, July 18, 2013

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప - నగరాజ ధరుడ శ్రీనారాయణ

//ప// నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ

//చ// దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
నోపకకదా నన్ను నొడబరపుచు
పైపైనె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా

//చ// చీకాకు పడిన నా చిత్త శాంతము సేయ
లేకకా నీవు బహులీలనన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా

//చ// వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీ నారాయణా


ముఖ్యపదార్ధం:
నిగమము= వేదము
నిగమాంత= వేదాంతము= ఉపనిషత్తులు The theological part of the Vedas, i.e., the Upanishads, ఉపనిషత్తులు
వర్ణిత= వర్ణించబడిన
మనోహర రూప= మనస్సులను హరించే అందమైన రూపము గలవడా
నగరాజ ధరుడు= నగము అంటే కొండ (which is immovable). గోవర్ధనము అనే పెద్ద కొండను ధరించినవాడా
నారాయణ=నార+అయనుడు= నీటిమీద నివసించే వాడు (విష్ణువు)
దీపించు= వెలుగుతున్న, కాంతివంతమైన
వైరాగ్య దివ్య సౌఖ్యము= వైరాగ్యము అనే దివ్య సుఖము
ఈయక నోపకకదా= ఇవ్వడానికి ఒప్పక కదా
నొడబరచు= తప్పులు ఎంచు
చిత్త శాంతము= మనశ్శాంతి
బహులీల= అనేక లీల
కాకుసేయు= కలత చేయు
నిర్బంధములు= తప్పించుకోలేని బమ్ధములు, ఇష్టములేకున్నా ఇతరుల ఒత్తిడి మీద చేసే పనులు
భవసాగరములు= పాపము సముద్రాలు
అడపడు= అడ్డుపడు
దివిజేంద్రవంద్య= దివిజ+ఇంద్ర+వంద్య= దేవరలచేత, దేవతలకి రాజైన ఇంద్రుని చేత కొలవబదేవడా
చోర= దొంగ


భావం:
అన్నమయ్య శ్రీవారిని ఈ బంధాలపై వ్యామోహాన్ని తెంచమని, శాశ్వతమైన వైరాగ్య సుఖాన్ని ఇప్పించమని కోరుతున్నారు. ఇహ భోగాల్లో చిక్కుకున్న ఆయన పలుకులు స్వామిని చేరుతున్నాయా? అని అడుగుతున్నారు.

పాల సముద్రంలో శయనించే స్వామీ! వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ మహత్తరంగా వర్ణించబడిన విధంగా మనస్సులను హరించే కోటి మన్మధుల సౌందర్య రూపము గలవాడా, గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి ధరించిన శ్రీమన్నారాయణా.

నాయందు తప్పులు ఎంచి, నాకు జ్ఞానకాంతితో వెలుగుతున్న దివ్యమైన వైరాగ్య సుఖాన్ని ఇవ్వడానికి వెనకడుతున్నావు. ఈ పైపై సంసార బంధాల్లో (సంసారము, భార్య, పిల్లలు, బంధువులు వంటి ఆశలు) నన్ను కట్టిపాడేశావు. నా వేడుకోలు పలుకులు నిన్ను చేరుతున్నాయా? చేరినా అవి చెల్లుతాయా?

కామ, క్రోధాది అరిషడ్వర్గాలతో నా మనస్సు చీకాకుకి గురి అవుతున్నప్పుడు నీ దివ్యలీలలతో నా మనసుకి శాంతము చేకూర్చకుండా నీ ఆటలతో నన్ను మరింత కలత చెందించి వినోదిస్తున్నావు. నన్ను కూడా అందరిలాగానే చూస్తున్నావా? నిన్నే నమ్ముకున్న నాకు, నిన్ను గుర్తించక అనేక పాపకర్మలు చేస్తున్న మిగతావారికీ తేడా లేదా?

నాకు ఇష్టంలేని పనులను నిర్బంధించి చేయించాలని చూడకుండా ఈ పాప సముద్రాలని ఈదలేకపోతున్న నాకు అడ్డుపడి నన్ను బయటపడేసి ఉద్దరించు స్వామీ! ఓ వెన్నదొంగా, దేవతల చేత, దేవేంద్రుని చేత నిత్యము కొలవబడే వాడా, శ్రీమన్నారాయణా...

Wednesday, July 17, 2013

పులకల మొలకల పున్నమ తోడనె కూడె అలివేణి నీ పతితో ఆడవే వసంతము

//ప// పులకల మొలకల పున్నమ తోడనె కూడె
అలివేణి నీ పతితో ఆడవే వసంతము 

//చ// మాటలు తీగెలు వారె మక్కువలు చిగిరించె
మూటల కొద్దీ నవ్వులు మొగ్గలెత్తెను 
వాటపు జవ్వనానకు వసంత కాలము వచ్చె
ఆటదానవు పతితో ఆడవే వసంతము

//చ// చెమట రసములూరె సిగ్గులు పూవక పూచె
తిమురు తరి తీపుల తేనెలుబ్బెను 
క్రమమున తమకము గద్దియ మదనుండెక్కె
అమరనీ పతి తోడ ఆడవే వసంతము 

//చ// కడుగోరితాకులు కాయము కాయలు గాచె 
బడినే కెమ్మోవి పండు వండెను
ఎడలేక శ్రీ వేంకటేశుడిట్టె నిన్ను గూడె
అడరి నీ పతితోనె ఆడవే వసంతము

ముఖ్యపదార్ధం:
పులకల మొలకలు= ఆనందాతిశయంలో శరీరంలో మొలిచే పులకరింతలు
పున్నమ తోడనె= నిండు చంద్రుని వెన్నెలతో కలిసి
అలివేణి=నల్లని తుమ్మెదల వంటి బారైన జడ కలిగిన స్త్రీ
వసంతము= రంగులు చల్లుకునే ఆట (పసుపు, సున్నపు కలిపిన ఎర్రని నీళ్ళు చల్లుకునే ఆట)
మాటలు తీగెలు వారె= పలుకులు తియ్యని తీగ పాకంలా ఉన్నవి
మక్కువలు చిగిరించె= ప్రేమలు చిగురిస్తున్నాయి Affection, love; desire, lust; wish
వాటపు= అందమైన, అనుకూలమైన
జవ్వనానకు= యవ్వనానికి
వసంత కాలము= వసంత శోభ (యౌవ్వనము చిగురించే సమయం వచ్చిందని కవి భావన)
ఆటదానవు= చక్కటి నాట్యగత్తెవు 
తిమురు: త్వరపడి, గర్వించు
తరి తీపుల: ప్రీతి, అడియాస, సంతుష్టి
తేనెలుబ్బెను= తేనెలు ఉబుకుచున్నవి  
క్రమమున= మెల్ల మెల్లగా
తమకము గద్దియ= విరహపు సింహాసనము మీదకు
మదనుండెక్కె= మన్మధుడు ఎక్కినాడు
కడుగోరితాకులు= మిక్కిలి గోరింటాకులు
కాయము: శరీరము 
కెమ్మోవి: కెంపుల వంటి ఎర్రని పెదవి
ఎడలేక= దూరంగా ఉండలేక
అడరి= చేయు

భావం:
అమ్మ యౌవ్వనం అనే వసంత కాలంలోకి అడుగుపెడుతోంది. యౌవ్వనం ఎవరికైనా చాలా మధురమైన కాలం కదా! అది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ వసంతకాలం వంటిది. అమ్మవారికి వచ్చిన ఈ యౌవ్వనాన్ని శ్రీవారితో కలిసి ఆడి సంతోషించమంటున్నారు అన్నమయ్య.. ఈ కీర్తనలో వసంతము అనే మాట చూసి చాలా మంది అన్నమయ్య అమ్మవారిని రంగులు చల్లుకునే ఆట ఆడమని చెప్తున్నారనుకుంటారు, కానీ, ఇది పూర్తి శృంగార కీర్తన. ఇక్కడ అమ్మవారి యౌవ్వనమే వసంతము. కీర్తనంతా అమ్మవారికి యవ్వనకాలంలో శరీరంలో కలిగే మార్పుల గురించే ఉంటుంది..

పున్నమ చంద్రుని తెల్లని వెన్నెల వంటి మోము కలిగిన  పడతీ! నీ శరీరంలో స్వామిని చూడగానే పులకరింతలు మొలుస్తున్నాయి.. తుమ్మెద రెక్కల వంటి నల్లని పొడవైన  జడ కలిగిన ముగ్ధా! నీ ప్రియ మగనితో కలిసి యౌవ్వన వసంతపు ఆటలు ఆడు.

నీ మాటలు లేత పాకం తీగలు కట్టినట్టుగా తియ్యగా అవుతోంది. నీలో మెల్లగా  ప్రేమలు/కోరికలు చిగురిస్తున్నాయి. నీ పెదవి మూలలనుండి వచ్చే మూటలకొద్దీ నవ్వులు మొగ్గల్లా మారుతున్నాయి.. (పెదవులు విడదీసి నవ్వితే పువ్వు వికశించినట్టు, మొగ్గలు అని అన్నారంటే, పెదవులు విచ్చుకోకుండా సిగ్గుతో, స్వామి కేసి కన్నెత్తి చూడలేక, ఏదో కావాలని తెలియజేసే నవ్వు అన్నమాట). చక్కటి నీ అనుకూలమైన యౌవ్వనానికి వసంతకాలం వచ్చింది. (వసంత కాలంలో చెట్లు చిగిర్చినట్టే...యవ్వనపు వయసులో శరీరంలో పులకలు, కొత్త అందాలు, కొత్త శోభలు, కొత్త కళలు వచ్చాయన్నమాట). మంచి ఆటగత్తెవు నీవు. నీ పతితో యౌవ్వనపు వసంతాల ఆటలు ఆడవే.....

తమకంతో వేడెక్కిన నీ శరీరంలో చెమట గంధాలు ఊరుతున్నాయి. నీలో సిగ్గులు సగం విచ్చుకున్న పువ్వుల్లా పూచాయి. తొందరగా సంతుష్టిని  పొందాలని నీలో ప్రేమల తేనెలు ఉబుకుతున్నాయి. మెల్ల మెల్లగా నీలోని విరహం అనే  సింహాసనము మీదకు మన్మధుడు ప్రవేశిస్తున్నాడు. నీ భర్తతో కలసి యౌవ్వనపు వసంతాల టలు ఆడవే..

విరహంతో ఎర్రబడిన నీ శరీరము ఎర్రని గోరింటాకు చెట్టు లెక్ఖలేనన్ని కాయలు కాసిందా! అన్నట్టుంది.. అందులో కొన్ని పండిన కాయలు కెంపుల్లా ఎర్రని నీ పెదవి పండు లా ఉన్నాయి. నీ విరహాన్ని భరించలేక శ్రీవేంకటేశ్వరుడు నిన్ను దగ్గరకు తీసుకున్నాడు. నీ పతికి కావలసినట్టుగా ఉండి నీ యౌవ్వనాన్ని పండించుకోవే....

Friday, July 12, 2013

సంగడికి రాగదవే సరిచూచేను - యింగిత మెరుగుకుంటే నిద్దరికిగూడెను

//ప// సంగడికి రాగదవే సరిచూచేను
యింగిత మెరుగుకుంటే నిద్దరికిగూడెను

//చ// తుంమిదలు వ్రాయబోతే తొయ్యలి నీ తురుమాయ
నెమ్మిజందురు వ్రాసితే నీమోమాయనే
వుమ్మడి సంపెంగ వ్రాయనున్నతి నీ నాసికమాయ
కమ్మగలువలు వ్రాయగన్నులాను

//చ// గక్కన శంఖము వ్రాయ గన్నెరో నీగళమాయ
జక్కవల వ్రాయగా నీ చన్నులాయను
అక్కరదామరలు వ్రాయగ నీకరములాయ
నిక్కి సింహము వ్రాయగా నీ నడుమాయను

//చ// పులిసము వ్రాయగాను పొలతి నీ పిరుదాయ
తెలియ నరటుల వ్రాసితే దొడలాయ
కలసితివి శ్రీవేంకటేశ్వరుడను దాను
బలుచిగురులు వ్రాయ బాదాలాయను

ముఖ్యపదార్ధం:
సంగడి= స్నేహము
ఇంగితము= గుర్తులు, జ్ఞానము
తొయ్యలి= స్త్రీ
నెమ్మి చందురు= గుండ్రని చంద్రుడు
గళము= కంఠము
జక్కవలు= జక్కవ పక్షి (The poetical swan, always described as being in pairs, to which poets liken fair breasts)
పులినము= చక్రము??

భావం:
శ్రీ వేంకటేశ్వరుడు తన ప్రేయసితో ఇలా అడుగుతున్నారట. 

నాతో స్నేహం చెయ్యవే నీ లక్షణాలను సరిచూస్తాను. వాటి గురించి తెలుసుకుంటే మన ఇద్దరికీ జంట కుదురుతుంది. 

నల్లని నీ కొప్పు తుమ్మిదలు రెక్కలతో రాసాయా అన్నట్టుగా నల్లగా ఉన్నాయి. నీ ముద్దైన ముఖము గుండ్రని చంద్రుడు రాసాడా అన్నట్టు గుండ్రంగా ఉం ది. నీ ముక్కు సంపెంగె మొగ్గ రాసిందా అన్నట్టు కోటేరు ముక్కులా నిటారుగా ఉంది. నీ కన్నులు నల్లని కలువలు రాసాయా అన్నట్టు గా నిగనిగలాడుతూ నల్లగా ప్రశాంతంగా ఉన్నాయి . 

ఓ యౌవ్వనవతీ! నీ కంఠం చక్కని శంఖము రాసిందా అన్నట్టు మూడు గీతలతో చెక్కినట్టుంది. నీ జంట చన్నులు జక్కవ పక్షులు రాసాయా అన్నట్టు గుండ్రంగా ఉబ్బి ఉన్నాయి. నీ చేతులు ఎర్రని తామెరలు రాసాయా అన్నంత ఎర్రగా ఉన్నాయి. సన్నని నీ నడుము ఉన్నతమైన సింహము రాసిందా అన్నంత సన్నగా ఉంది. 

నీ పిరుదులు చక్రాలతో రాసినట్టుగా గుండ్రంగా ఉనాయి. నీ పిరుదులు లావైన అరటి బోదెలతో రాసినట్టుగా బలంగా, నున్నగా ఉన్నాయి. నీ పాదాలు ఎర్రని లేత చిగురులతో రాసినట్టుగా ఎర్రగా ఉన్నాయి. ఇటువంటి నీవు శ్రీవేంకటేశుడనే నాతో కలిశావు. మనిద్దరికీ జంట బాగా కుదురుతుంది. 

Thursday, July 11, 2013

ఎంతమోహమో నీకీఇంతిమీదను - వింతవింత వేడుకల విర్రవీగేవు

//ప// ఎంతమోహమో నీకీఇంతిమీదను
వింతవింత వేడుకల విర్రవీగేవు

//చ// తరుణిగుబ్బలు నీకుదలగడబిళ్ళలుగా
నొరగుకున్నాడవు వుబ్బున నీవు
దొరవై పయ్యెద కొంగు దోమతెర బాగుగ
సరుగ మాటుసేసుక జాణవై వున్నాడవు

//చ// భామిని తొడలు నీకు పట్టేమంచములాగున
నాముకుని పవ్వళించేవప్పటి నీవు
గోముతోడ పట్టుచీర కుచ్చెల పరపుగాగ
కామించి యిట్టె కోడెకాడవై ఉన్నాడవు

//చ// వనిత కాగిలి నీకు వాసన చప్పరముగ-
నునికి నేసుకున్నాడ వొద్దికై నీవు
యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను
అనిశము సింగరరాయడవై వున్నాడవు

ముఖ్యపదార్ధం:
ఇంతి= స్త్రీ
గుబ్బలు= కుచములు, స్తనములు
ఒరగు= పవ్వళించు, జారలపడు
వుబ్బున= సంతోషముగా
పయ్యెద= పమిట, స్త్రీల వక్షస్థలమును కప్పి ఉంచు వస్త్రము
సరుగ=పెరుగు, వర్ధిల్లు
మాటుసేసుక= దాగి ఉండుట, పొంచి ఉండుట
జాణ= నేర్పరి, తెలివైన వాడు
ఆముకొని= హెచ్చుకుని, పెద్దగా మారి
గోము=సౌకుమార్యము, సుకుమారము శ్రమయెరుగనితనము
కోడెకాడు=పడుచువాడు
చప్పరము=పల్లకీ, చట్రము, a covered seat in which a god is carried on  auspicious days in temples
అనిశము= ఎల్లప్పుడును

భావం:
ఈ సంకీర్తనలో శ్రీవారు తన భార్య అందాలు చూసుకుని ఎంత విర్రవీగుతున్నాడో, ఎన్ని విధాలుగా వేడుకలు పొందుతున్నాడో అన్నమయ్య వివరిస్తున్నారు.

నీ భార్యమీద ఎంత మోహమో నీకు, ఆవిడ అందాలు చూసుకుని వింతవింత భంగిమలతో విర్రవీగుతున్నావు. 

మీ ఆవిడ మెత్తని స్తనములు నీకు దూదితో చేసిన తలగడబిళ్ళలు- వాటిమీద సంతోషముగా నీ తలను ఆనించి పడుకున్నావు. ఆమె పమిట కొంగుని దోమతెరలా చేసుకుని ఆ పయ్యెద లోపల ముఖాన్ని దాచుకున్న జాణకాడవు.

ఆమె బలమైన తొడలు నీకు పట్టె మంచములుగా, వాటికి ఆనుకుని పడుకునేవు. ఆమె నున్నని పొట్టపై సుకుమారంగా దోపుకున్న అతిమెత్తని పట్టుచీర కుచ్చిళ్ళు పరుపుగా తలచి యౌవ్వనవంతుడవై కోరికతో రగులుతున్నావు.

నీ భార్య కౌగిలిని నీకు ఒక పెద్ద చట్రముగా చేసుకుని అందులో యిమిడిపోయావు. శ్రీవేంకటేశ్వరా! అలమేల్మంగను చేపట్టి ఎల్లప్పుడూ శృంగారమూర్తివై సింగరరాయ నరసింహుడవై ఉన్నావు. 
(ఈ సంకీర్తన సింగరాయకొండ లక్ష్మీనారశింహుని పై రాసినది గా తోస్తూంది)

Monday, July 8, 2013

నెలత చక్కదనమే నిండు బంగారము నీకు - గలిగె గనక లక్ష్మీకాంతుడవైతి

//ప// నెలత చక్కదనమే నిండు బంగారము నీకు
గలిగె గనక లక్ష్మీకాంతుడవైతి

//చ// పడతినెమ్మోమునకు బంగారుకళలు దేరీ
వెడలేనెలవినవ్వే వెండిగనులు
అడియాలమగుమోవి నదె పగడపుదీగె
నిడువాలుదురుమే నీలముల రాశి

//చ// తరుణిపాదపుగోళ్ళు తళుకులవజ్రములు
పరగుజేతిగోళ్ళే పద్మరాగాలు
అరిదికన్నులతేట లాణిముత్తెపుసరులు
సరిబచ్చలకొండలు చనుమొనలు

//చ// చెలితేనెమాటలు జిగిబుష్యరాగాలు
వలపుతెరసిగ్గులు వైఢూర్యాలు
తొలకుననురాగాలే గొడ్డగోమేధికములు
కలసితీకెను శ్రీవేంకటేశ కౌగిటను

ముఖ్యపదార్ధం:
నెలత: స్త్రీ
భండారము= ఖజానా, ధనగృహము
నెమ్మోము: నెర+మోము= పూర్ణ చంద్రుని వంటి మొహము
సెలవి: పెదవి మూల
అడియాలము= అడుగు+అలము= చిహ్నము, గురుతుపట్టు
తురుము= కొప్పు
పరగు=ప్రకాశించు
అరిది= అపురూపమైన
సరులు= దండలు
జిగి= కాంతి, వెలుగు
ఈకె= ఈ+అక్క= ఈ ఆడది

భావం:
ఈ అందమైన యువతి చక్కదనమే నవ రత్నాలున్ననిండు ఖజానా నీకు. అందువల్లనే నువ్వు లక్ష్మీకాంతుడవైనావు. (అమ్మ నీ వక్షస్థలము పై అమరింది కాబట్టే నువ్వు ధనవంతుడయ్యావు..ఆమె చక్కదనమే నీకు వెలకట్టలేనంత ధనము)

నీ భార్య అందమైన పూర్ణచంద్రుని వంటి మొహమునకు బంగారు కళలు ఉన్నాయి. ఆమె పెదవి చిన్నగా చేసి నవ్వే చల్లని వెన్నెలనవ్వులే తెల్లని వెండి గనులు. ఆమె లేత చిరుగు వంటి ఎర్రని పెదవి పగడపు తీగెలు. ఒత్తైన నల్లని వాలు జడే (కొప్పు) ఇంద్రనీలముల రాశి.

ఆమె వాడైన పాదపు గోళ్ళే తళుకులీనే వజ్రాలు. మిలమిల మెరుస్తూన్న ఆ చేతి గోళ్ళే పద్మరాగాలు.  అపురూపమైన ఆ తేట కన్నులు ఆణిముత్యాల దండలు. ఆమె ఎత్తైన కుచ సంపద చక్కటి పచ్చల కొండలు.

చెలి మాట్లాడే తేనె మాటలు మెరుస్తూన్న పుష్యరాగాలు. ఆమె సిగ్గు తెరలు వైఢూర్యాలు. ఆమె నీపై చూపే ప్రేమలే పెద్ద గోమేధికాలు. ఇన్ని నవరత్నాల కొండలను పుష్కలంగా ధరించిన అమ్మ శ్రీవేంకటేశుని కౌగిటను కలిసింది. అందుకే శ్రీవేంకటేశుడు లక్ష్మీకాంతుడయ్యాడు. 

Sunday, July 7, 2013

శ్రీవేంకటేశ్వరుని సింగారము వర్ణించితే - యేవిధాన దలచినా యెన్నిటికి తగునో

//ప// శ్రీవేంకటేశ్వరుని సింగారము వర్ణించితే
యేవిధాన దలచినా యెన్నిటికి తగునో

//చ// కరిరాజుగాచిన చక్రము వట్టిన హస్తము
కరితుండమని చెప్పగానమరును
వరములిచ్చేయట్టి వరద హస్తము కల్ప-
తరుశాఖ యని పోల్పదగు నీకును

//జలధిబుట్టినపాంచజన్య హస్తము నీకు
జలధితరగయని చాటవచ్చును
బలుకాళింగునితోకపట్టిన కటిహస్తము
పొలుపై ఫణీంద్రుడని పొగడగదగును

//నలినహస్తంబులనడుమనున్ననీయుర-
మలమేలుమంగకిరవనదగును
బలు శ్రీవేంకటగిరిపై నెలకొన్న నిన్ను-
నలరి శ్రీవేంకటేశుడనదగును

ముఖ్యపదార్ధం:
తుండము= తొండము, ఉదరము, ముఖము
తరుశాఖ= చెట్టు కొమ్మ
జలధి తరగ= సముద్రపు అల
పొలుపు= సొంపు Beauty, elegance, gracefulness
అలరు= ప్రకాశించు

భావం:
శ్రీవేంకటేశ్వరుడు శంఖచక్రాలు, కటి వరద హస్తాలతో ప్రకాశిస్తున్నాడు. ఆయన సింగారము వర్ణించితే ఎన్ని విధాలుగా తలిచినా ఎన్నిటితో పోల్చదగునో...

గజేంద్రుణ్ణి రక్షించిన చక్రము పట్టిన ఆ హస్తము సాక్షాత్తూ యేనుగు తొండమని చెప్తే సరిగ్గా అమరుతుంది. (యేనుగు బలం అంతా తొండంలోనే ఉంది. ఎందరో రాక్షసులను చంపిన బలవంతమైన చెయ్యి యేనుగు తొండం అంత బలమైనది.) వరములిచ్చే వరద హస్తము సాక్షాత్తూ కోరినవన్నీ ఇచ్చే కల్పవృక్షము యొక్క చెట్టు కొమ్మ తో పోల్చవచ్చు. (కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు కాబట్టి కల్పవృక్షము తో పోల్చచ్చు)

సముద్రంలోంచి లక్ష్మీదేవి తో పాటూ పుట్టిన పాంచజన్యము అనే శంఖం పట్టుకున్న నీ చేతిని తెల్లని సముద్రపు అలగా చాటవచ్చు. (సముద్రం చేసే భీకర ఘోష యే విధంగా ఐతే మనకి భయం కలిగిస్తుందో అలానే పాంచజన్యం పూరించినంతనే రాక్షసులకి భయం పుడుతుంది). బాలకృష్ణుడై బలవంతుడైన కాళింగుని తోకపట్టుకున్న నీ కటి హస్తము అందమైన వన్నెలున్న ఫణిరాజు అని పొగడచ్చు.

పద్మము (నాభినందు బ్రహ్మగారు ఉదయించిన పద్మము), నాలుగు చేతుల మధ్యనున్న నీ విశాల వక్షస్థలము నీ ప్రియ భార్యమైన అలమేలుమంగకు నివాసము అనవచ్చును. బలవంతుడవై తిరువేంకటగిరిపైన కొలువైన నిన్ను వేంకటేశ్వరుడు అనవచ్చును.