Total Pageviews

Friday, May 11, 2018

ఇన్నియు నుండగ దమకేమి గడమ - వున్నవాడు సిరి పురుషోత్తమరాజు [Inniyu nundaga damakemi gadama]

//ప// ఇన్నియు నుండగ దమకేమి గడమ
వున్నవాడు సిరి పురుషోత్తమరాజు //ఇన్నియు//

//చ// వీలుచు నీ రావటించి వేదమరాజు
కూలికి గుండ్లు మోచీ గూర్మరాజు
పోలిమి నేలలు దవ్వీ బొలమురాజు
నాలి బడుచాట లాడి నరసింగరాజు //ఇన్నియు//

//చ// చేకొని చేతులు చాచీ జిక్కరాజు
రాకపోక దపసాయె రామరాజు
రాకట్నములే గట్టీ రాఘవరాజు
రేకల బసుల గాచీ కృష్ణరాజు //ఇన్నియు//

// మగువల కిచ్చలాడీ మాకరాజు
జగమెల్లాదిరిగీని జక్కరాజు
నగుబాటుదీర శ్రీవేంకటనగముపయి
వెగటై లోకము లేలే వెంగళరాజు //ఇన్నియు//

ముఖ్యపదాల అర్ధం:
కడమ: కొరత
నీరావటించు= నీరు+ఆవటించు: నీట మునిగిన/నీరు నిండిన
గుండ్లు: కణుపులు/కొండలు
పోలిమి: కోరలు?
బడుచాట= పడుచు+ఆట= యౌవ్వనపు ఆటలు
చేకొని: కఠినమైన
చిక్క: చిన్న కావి (చిన్న కొమ్మ)
రాకట్నము: రాజ కట్నము
రేకల: రే (పల్లెనందు)
ఇచ్చలు: ఆసక్తి, కోరికతో కూడన సంభాషణలు/పనులు
అగుబాటు: అలసట
వెగటు: విముఖుడై

భావం: 
ఈ సంకీర్తన అన్నమయ్య తనయుడు పెదతిరుమలయ్య విరచితమ్.

పురుషోత్తమరాజు గారికి ఎన్నో ఘనమైన బిరుదులున్నాయి. ఇంకేం కొరత?. సాక్షాత్తూ సిరిని కూడా కలిగినవాడు.

నీట మునిగిన వేదాలను బయటకు తెచ్చిన వేదమరాజు (మత్య్సావతారం)
శ్రమపడి కొండని మోసిన కూర్మరాజు (కూర్మావతారం)
కోరలతో నేలను తవ్విన పొలమురాజు (వరాహావరాతం. హిరణ్యాక్ష సంహారానికి సంబంధించినది)
చెంచుకన్యతో యౌవ్వనపు ఆటలాడిన నరసింహరాజు (నరశింహావతారం)

కఠినమైన ఉద్దేశ్యంతో చేతులు చాచిన జిక్కరాజు (వామనావతారం. చేతిలో చిన్న దండెము పట్టుకుంటాడు కాబట్టి జిక్క అన్న పదం ఉపయోగించారు)
రాజులపై దండెత్తి చివరకు రాముని దర్శనము తర్వాత తపస్సుకు వెళ్ళిన పరశురామరాజు
రాజరికాన్ని విడిచిపెట్టి, అడవులకేగిన రాఘవరాజు (శ్రీరామావతారం)
రేపల్లెనందు పశువులను కాచిన కృష్ణరాజు

పడుచులతో ఇచ్చకములాడి పనులు సాధించిన మాకరాజు (బుద్ధుడు)
జగము అంతటా తిరుగుతూ రక్షణ చేసే చక్కరాజు (కల్కి)
పై అవతారాల్లో చేసిన పనులకు అలసటపొంది, శృంగార విముఖుడై, వేంతటాచలముపై నిలబడి లోకరక్షణ చేస్తున్నాడీ వెంగళరాజు