Total Pageviews

Wednesday, July 17, 2013

పులకల మొలకల పున్నమ తోడనె కూడె అలివేణి నీ పతితో ఆడవే వసంతము

//ప// పులకల మొలకల పున్నమ తోడనె కూడె
అలివేణి నీ పతితో ఆడవే వసంతము 

//చ// మాటలు తీగెలు వారె మక్కువలు చిగిరించె
మూటల కొద్దీ నవ్వులు మొగ్గలెత్తెను 
వాటపు జవ్వనానకు వసంత కాలము వచ్చె
ఆటదానవు పతితో ఆడవే వసంతము

//చ// చెమట రసములూరె సిగ్గులు పూవక పూచె
తిమురు తరి తీపుల తేనెలుబ్బెను 
క్రమమున తమకము గద్దియ మదనుండెక్కె
అమరనీ పతి తోడ ఆడవే వసంతము 

//చ// కడుగోరితాకులు కాయము కాయలు గాచె 
బడినే కెమ్మోవి పండు వండెను
ఎడలేక శ్రీ వేంకటేశుడిట్టె నిన్ను గూడె
అడరి నీ పతితోనె ఆడవే వసంతము

ముఖ్యపదార్ధం:
పులకల మొలకలు= ఆనందాతిశయంలో శరీరంలో మొలిచే పులకరింతలు
పున్నమ తోడనె= నిండు చంద్రుని వెన్నెలతో కలిసి
అలివేణి=నల్లని తుమ్మెదల వంటి బారైన జడ కలిగిన స్త్రీ
వసంతము= రంగులు చల్లుకునే ఆట (పసుపు, సున్నపు కలిపిన ఎర్రని నీళ్ళు చల్లుకునే ఆట)
మాటలు తీగెలు వారె= పలుకులు తియ్యని తీగ పాకంలా ఉన్నవి
మక్కువలు చిగిరించె= ప్రేమలు చిగురిస్తున్నాయి Affection, love; desire, lust; wish
వాటపు= అందమైన, అనుకూలమైన
జవ్వనానకు= యవ్వనానికి
వసంత కాలము= వసంత శోభ (యౌవ్వనము చిగురించే సమయం వచ్చిందని కవి భావన)
ఆటదానవు= చక్కటి నాట్యగత్తెవు 
తిమురు: త్వరపడి, గర్వించు
తరి తీపుల: ప్రీతి, అడియాస, సంతుష్టి
తేనెలుబ్బెను= తేనెలు ఉబుకుచున్నవి  
క్రమమున= మెల్ల మెల్లగా
తమకము గద్దియ= విరహపు సింహాసనము మీదకు
మదనుండెక్కె= మన్మధుడు ఎక్కినాడు
కడుగోరితాకులు= మిక్కిలి గోరింటాకులు
కాయము: శరీరము 
కెమ్మోవి: కెంపుల వంటి ఎర్రని పెదవి
ఎడలేక= దూరంగా ఉండలేక
అడరి= చేయు

భావం:
అమ్మ యౌవ్వనం అనే వసంత కాలంలోకి అడుగుపెడుతోంది. యౌవ్వనం ఎవరికైనా చాలా మధురమైన కాలం కదా! అది ప్రతీ ఒక్కరి జీవితంలోనూ వసంతకాలం వంటిది. అమ్మవారికి వచ్చిన ఈ యౌవ్వనాన్ని శ్రీవారితో కలిసి ఆడి సంతోషించమంటున్నారు అన్నమయ్య.. ఈ కీర్తనలో వసంతము అనే మాట చూసి చాలా మంది అన్నమయ్య అమ్మవారిని రంగులు చల్లుకునే ఆట ఆడమని చెప్తున్నారనుకుంటారు, కానీ, ఇది పూర్తి శృంగార కీర్తన. ఇక్కడ అమ్మవారి యౌవ్వనమే వసంతము. కీర్తనంతా అమ్మవారికి యవ్వనకాలంలో శరీరంలో కలిగే మార్పుల గురించే ఉంటుంది..

పున్నమ చంద్రుని తెల్లని వెన్నెల వంటి మోము కలిగిన  పడతీ! నీ శరీరంలో స్వామిని చూడగానే పులకరింతలు మొలుస్తున్నాయి.. తుమ్మెద రెక్కల వంటి నల్లని పొడవైన  జడ కలిగిన ముగ్ధా! నీ ప్రియ మగనితో కలిసి యౌవ్వన వసంతపు ఆటలు ఆడు.

నీ మాటలు లేత పాకం తీగలు కట్టినట్టుగా తియ్యగా అవుతోంది. నీలో మెల్లగా  ప్రేమలు/కోరికలు చిగురిస్తున్నాయి. నీ పెదవి మూలలనుండి వచ్చే మూటలకొద్దీ నవ్వులు మొగ్గల్లా మారుతున్నాయి.. (పెదవులు విడదీసి నవ్వితే పువ్వు వికశించినట్టు, మొగ్గలు అని అన్నారంటే, పెదవులు విచ్చుకోకుండా సిగ్గుతో, స్వామి కేసి కన్నెత్తి చూడలేక, ఏదో కావాలని తెలియజేసే నవ్వు అన్నమాట). చక్కటి నీ అనుకూలమైన యౌవ్వనానికి వసంతకాలం వచ్చింది. (వసంత కాలంలో చెట్లు చిగిర్చినట్టే...యవ్వనపు వయసులో శరీరంలో పులకలు, కొత్త అందాలు, కొత్త శోభలు, కొత్త కళలు వచ్చాయన్నమాట). మంచి ఆటగత్తెవు నీవు. నీ పతితో యౌవ్వనపు వసంతాల ఆటలు ఆడవే.....

తమకంతో వేడెక్కిన నీ శరీరంలో చెమట గంధాలు ఊరుతున్నాయి. నీలో సిగ్గులు సగం విచ్చుకున్న పువ్వుల్లా పూచాయి. తొందరగా సంతుష్టిని  పొందాలని నీలో ప్రేమల తేనెలు ఉబుకుతున్నాయి. మెల్ల మెల్లగా నీలోని విరహం అనే  సింహాసనము మీదకు మన్మధుడు ప్రవేశిస్తున్నాడు. నీ భర్తతో కలసి యౌవ్వనపు వసంతాల టలు ఆడవే..

విరహంతో ఎర్రబడిన నీ శరీరము ఎర్రని గోరింటాకు చెట్టు లెక్ఖలేనన్ని కాయలు కాసిందా! అన్నట్టుంది.. అందులో కొన్ని పండిన కాయలు కెంపుల్లా ఎర్రని నీ పెదవి పండు లా ఉన్నాయి. నీ విరహాన్ని భరించలేక శ్రీవేంకటేశ్వరుడు నిన్ను దగ్గరకు తీసుకున్నాడు. నీ పతికి కావలసినట్టుగా ఉండి నీ యౌవ్వనాన్ని పండించుకోవే....