Total Pageviews

Saturday, July 20, 2013

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ - తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

//ప// కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ 
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

//చ// వేదములే శిలలై వెలసినది కొండ 
యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ 
శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ

//చ// సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ 
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్విదపసులే తరువులై నిలచిన కొండ 
పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ

//చ// వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ 
పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ 
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ

ముఖ్యపదార్ధం:
కట్టెదుర= కడు+ఎదుర= మిక్కిలి ఎదురుగా
కాణాచి= చిరకాలముగా ఉన్న స్థానము
తెట్టెలాయ మహిమలే= మహిమలు తెట్టులు (చెరువులో బాగా నానిన రాయి పై నాచు తెట్టెలు కట్టినట్టు, మహిమలు బాగా పేరుకుపోయి ఉన్న ప్రదేశము)
యేరు= పారే నీరు (సెలయేరు అంటే శిల పై నుండి పారే యేరు.)
చరించు= తిరుగాడు
జలధులు= ఇక్కడ మేఘాలు అని చెప్పుకోవాలి
నిట్టచరులు=పొడవుగా ప్రవహించు
ఉర్వి తపసులు= భూమి మీద తాపసులు
తరువులు= చెట్లు
కొటారు= సామాను దాచు పెద్ద గది వంటిది, కొట్టాం అనవచ్చు (గాదె వంటిది)
సోబనము= మంగళము
విరివి= విస్తృతి, విశాలత, వెడల్పు (Expanse, width, breadth, extent)

భావం:
అదివో తిరుమల కొండ. మిక్కిలి ఎదురుగా, అతి దగ్గరగా ఉన్న ఇలపై నిలచిన వైకుంఠము. చిరకాలముగా నిలచిన పర్వతరాజము. ఎన్నో మహిమలు మందంగా తెట్టెలు కట్టిన కొండ. 

వేదాలే శిలలుగా ఉన్న కొండ. లెక్ఖలేనన్ని పుణ్యరాశులు ప్రవహిస్తూన్న కొండ. ఈ పర్వత శ్రేణి కొన భాగాలు బ్రహ్మ మొదలైన లోకాలన్నింటినీ తాకుతున్న కొండ. లక్ష్మీదేవి భర్త ఉండేటి శేషాచలం ఈ కొండ. 

దేవతలంతా అనేక మృగ జాతులుగా మారి తిరుగుతూన్నటువంటి కొండ. నీటిని ధరించిన మేఘాలు ఈ కొండ చివరలు తాకుతూ వెళ్తాయి. భూమి మీద గొప్ప తపోసంపన్నులు చెట్లు గా నిలచి ఉన్న కొండ. పైన చెప్పిన శేషాచలానికి ముందున్న ఈ పొడవాటి కొండ అంజనాద్రి.

లెక్ఖలేనన్ని వరముల తనలో ఇముడ్చుకుని గొప్ప వైశాల్యాన్ని పొందినదీ కొండ. లక్ష్మీకాంతుని మంగళప్రదమైన వెలుగులతో ప్రకాశించే కొండ. ఆ కొండ గుహల్లో సంపదలు కురిసి నిండిపోయిన కొండ (ఇహలోకపు సంపదలు కాదు, ఆ కొండ గుహల్లో ఎంతో మంది తపస్సులు చేసుకుంటూ పుణ్యాల సంపదలు సంపాదించగా వాటితో నిండిపోయినదని). విస్తృతమైనది, విశ్వమంతా వ్యాపించినది అదిగో శ్రీవేంకటేశుడు నెలవైన కొండ. పాపములను ఖండించే కొండ. ఈ తిరుమల కొండ.