Total Pageviews

Friday, January 31, 2014

అమ్మమ్మ యేమమ్మ- అలమేల్మంగ నాంచారమ్మ తమ్మియింట -నలరుకొమ్మ ఓయమ్మ

ప// అమ్మమ్మ యేమమ్మ- అలమేల్మంగ నాంచారమ్మ 
తమ్మియింట -నలరుకొమ్మ ఓయమ్మ 

చ// నీరిలోన తల్లడించి -నీకే తలవంచి 
నీరికింద పులకించి- నీరమణుండు 
గోరికొన చెమరించీ- కోపమే పచరించీ 
సారెకు నీయలుక ఇట్టె- చాలించవమ్మ //ప//

చ// నీకుగానే చెయ్యిచాచీ- నిండాకోపమురేచీ 
మేకొని నీవిరహాన- మేను వెంచీని 
ఈకడాకడి సతుల - హృదయమే పెరరేచి 
ఆకు మడిచియ్యనైన - ఆనతియ్యవమ్మా //ప//

చ// చక్కదనములె పెంచీ -సకలము గాదలంచి 
నిక్కపు వేంకటేశుడు- నీకే పొంచీని 
మక్కువతో అలమేల్మంగ -నాంచారమ్మ 
అక్కున నాతని నిట్టే -అలరించవమ్మ //ప//

ముఖ్యపదార్ధం:
అలమేల్మంగ= అలర్+మేల్+మంగై= పువ్వుమీద కన్యక
నాంచారు= స్త్రీ, దేవత
తమ్మిఇంట= పద్మము ఇల్లుగా చేసుకుని
అలరు= ప్రకాశించు
కొమ్మ= స్త్రీ, అందమైన యువతి
నీరిలోన= నీటిలో
తల్లడిల్లు= చలనము, చలించు Shaking, tremor 
గోరికొన= గోటి చివర
చెమరించి= స్వేదము చిందించు, చెమటను విసర్జించు
పచరించు= ప్రసరించు, వ్యక్తపరచు
సారెకు= మాటిమాటికీ, తరచుగా
అలుక= కోపము
చాలించు= కట్టిపెట్టు, ఆపు
రేచు= రేగు, రేగించు, రెచ్చగొట్టు
మేకొని= కోరి, అపేక్షించి
మేను వెంచీని= శరీరము పెంచెను
ఈకడాకడ= ఈ చివర, ఆ చివర 
పెరరేచు= ప్రేరేపించి
ఆకుమడుచు= తాంబూలము చుట్టు
ఆనతి= ఆజ్ఞ
పొంచు= వేచియుండు
మక్కువతో= ప్రియముగా, ఇష్టముతో
అక్కు= రొమ్ము, వక్షస్థలము
అలరించు= సంతోషపెట్టు

భావం: 
అన్నమయ్య అమ్మవారిమీద చిరుకోపాన్ని ప్రదర్శిస్తున్నారు. విరహంతో ఉన్న స్వామిని దగ్గరకు తీసుకుని సంతోషపెట్టమంటున్నారు. మాటిమాటికీ అలకలు చాలించమంటున్నారు. నువ్వు అన్ని సార్లు కోపం తెచ్చుకోవడం వల్లే స్వామి ఎన్నో అవతారాలెత్తి నిన్ను శాంతిపరచడంకోసం అనేక బాధలు పడుతున్నారంటున్నారు. శృంగార సంకీర్తనలో స్వామి దశావతారాలనూ వర్ణిస్తున్నారు. ఇంతటి ప్రతిభ అన్నమయ్యకే సొంతం. అందుకే స్వామి ఈ సంకీర్తనలకోసం పరితపించిపోయాడు.

ప. ఓ సుకుమారమైన కన్యకా! పద్మమునే నివాసముగా చేసుకుని ప్రకాశించు అమ్మా! విభునికి ప్రాణ సఖివి.....అమ్మమ్మా మమ్మా ఇది? ఇలా చేయదగునా?

చ. నువ్వు నీటిలో ఉన్నావని నీకోసం తలవంచి నీటిలోన కలియతిరుగుతూ తల్లడిల్లిపోయాడు (మీనావతారం).   నీవు నివాసమున్న పద్మము కింద ఉన్న నీటిలో తిరుగుతూ పులకరించిపోయాడు నీ నారాయణుడు. (కూర్మావతారం).
నీవల్ల కలిగిన విరహం వల్ల ఆయనకి శరీరంతో పాటు గోళ్ళుకూడా చెమటని కురిపిస్తున్నాయి (వరాహావతారం). మాటిమాటికీ నీ అలుకలు చూసి విభునికి కోపం వ్యక్తపరుస్తున్నాడు. (నరశింహావతారం). అమ్మా! నీ కోపాలు ఇక కట్టిపెట్టవమ్మా..

చ. నీకోసం ప్రేమ గా చెయ్యిచాచి శరీరాన్ని పెద్దదిగా చేశాడు (వామనావతారం). నీవు అలుకతో ఆయనకి చేయి ఇవ్వనందుకు కోపగించుకుని రెచ్చిపోయాడు (పరశురామావతారం). నిన్ను కోరి, నీపై విరహంతో ఎంతో బాధని అనుభవించాడు (రామావతారం). అక్కడా ఇక్కడా ఉన్న చెలులందరి హృదయాన్నీ అతని బాధతో బాధిస్తున్నాడు (కృష్ణావతారం). (ఆయన బాధని నీకు తెలియజేయమంటున్నాడు. ఆ చెలులేమో శ్రీవారి బాధను చూడలేక, నీకు చెప్పే ధైర్యంలేక బాధపడిపోతున్నారు) కనీసం వారిని తాంబూలమైనా చుట్టి ఇవ్వమని ఆనతీయవమ్మా!. (తాంబూలం వరకూ వ్యవహారం వచ్చిందంటే సంధికుదిరినట్టే).

చ. నీకోసం ఎంతో చక్కటి గుణాలను పెంపొందించుకున్నాడు (బుద్ధావతారం). అంతా తానే అని తలిచాడు (కల్కి అవతారం). ఇన్ని అవతారాలు కేవలం నువ్వు చూపించిన విరహం వల్ల ఎత్తాడు. అన్నింటినీ మించి ఇప్పుడు నిజమైన శ్రీవేంకటేశ్వరుని అవతారం ఎత్తి నీకోసం వేచి ఉన్నాడు.  అమ్మా, కొంచెం ప్రేమతో అతనిని నీ రొమ్ముపై చేర్చుకుని అతన్ని సంతోషపెట్టమ్మా!......
(అమ్మమ్మా అని అన్నమయ్య చివరలో బతిమాలుతున్నట్టుగా)

 ఈ సంకీర్తనని శ్రావణ్ బ్లాగునందు వినచ్చు.
http://annamacharya-lyrics.blogspot.com.au/2007/01/in-english-pa-ammamma-emamma.html