Total Pageviews

Friday, October 2, 2015

రాధామాధవరతిచరితమితి- బోధావహం శ్రుతిభూషణం [Radhamadhava rati charitamiti]

//ప// రాధామాధవరతిచరితమితి-
బోధావహం శ్రుతిభూషణం || 

//చ// గహనే ద్వావపి గత్వా గత్వా రహసి రతిం ప్రేరయతి సతి | 
విహరతస్తదా విలసంతౌ విహతగృహాశౌ వివశౌ తౌ || 

//చ// లజ్జాశబల విలాసలీలయా కజ్జలనయన వికారేణ | 
హృజ్జావ్యవహృత(హిత) హృదయా రతి స్సజ్జా సంభ్రమచపలా జాతా || 

//చ// పురతో యాంతం పురుషం వకుళైః కురంటకైర్వా కుటజైర్వా | 
పరమం ప్రహరతి పశ్చాల్లగ్నా- గిరం వినాపి వికిరతి ముదమ్ || 

//చ// హరి సురభూరుహ మారోహతీవ స్వ చరణేన కటిం సంవేష్ట్య | 
పరిరంభణ సంపాదితపులకై స్సరుచిర్జాతా సుమలతికేవ || 

//చ// విధుముఖదర్శన విగళితలజ్జా- త్వధరబింబఫలమాస్వాద్య 
మధురోపాయనమార్గేణ కుచౌ నిధివద్దత్వా నిత్యసుఖమితా || 

//చ// సురుచిరకేతక సుమదళ నఖరై- ర్వర చిబుకం సా పరివర్త్య 
తరుణిమ సింధౌ తదీయదృగ్జల- చరయుగళం సంసక్తం చకార || 

//చ// వచన విలాసైర్వశీకృత్య తం నిచులకుంజ మానితదేశే | 
ప్రచురసైకతే పల్లవశయనే- రచిత రతికళా రాగేణాస || 

//చ// అభినవకల్యాణాంచితరూపా- వభినివేశ సంయతచిత్తౌ | 
బభూవతు స్తత్పరౌ వేంకట విభునా సా తద్విధినా స తయా || 

//చ// సచ లజ్జావీక్షణో భవతి తం కచభర గంధం ఘ్రాపయతి | 
నచలతిచేన్మానవతీ తథాపి కుచసంగాదనుకూలయతి || 

//చ// అవనతశిరసాప్యతి సుభగం వివిధాలాపైర్వివశయతి | 
ప్రవిమల కరరుహరచన విలాసై ర్భువనపతిం తం భూషయతి || 

//చ// లతాగృహమేళనం నవసై కతవైభవ సౌఖ్యం దృష్ట్వా | 
తతస్తతశ్చరస్తౌ కేళీ- వ్రతచర్యాం తాం వాంఛంతౌ || 

//చ// వనకుసుమ విశదవరవాసనయా- ఘనసారరజోగంధైశ్చ | 
జనయతి పవనే సపది వికారం- వనితా పురుషౌ జనితాశౌ || 

//చ// ఏవం విచరన్ హేలా విముఖ- శ్రీవేంకటగిరి దేవోయమ్ | 
పావనరాధాపరిరంభసుఖ- శ్రీ వైభవసుస్థిరో భవతి ||

ముఖ్యపదాల అర్ధం:
రతిచరితమ్: సంభోగ చరిత్ర
బోధావహం: బోధన చేయదగినది (చెప్పదగినది)
శ్రుతిభూషణం: చెవులకి అలంకారమైనది (వినుటకు ఆనందాన్ని కలిగించేది)

గహనే: అడవి యందు, గుహ యందు
ద్వావపి: ఇద్దరూ కూడా
గత్వా, గత్వా: వెళ్ళి, వెళ్ళి
రహసి: రహస్యముగా
సతి: రాధ
రతిం ప్రేరయతి: మదనుణ్ణి ప్రేరేపిస్తున్నది
విహరతః: విహరిస్తూ
తదా: అప్పుడు
విలసంతౌ: ప్రకాశమానమైన ఇద్దరూ
విహతగృహాశౌ: ఇళ్ళను వదిలిపెట్టి
తౌ: వారిరువురూ
వివశౌ: వివశులై పరవశంతో ఉన్నారు.

లజ్జాశబల: ఎక్కువ సిగ్గుతో కూడిన రాధ
విలాసలీలయా: మాధవుని శృంగార చేష్టల చేత
కజ్జలనయన: నల్లని కాటుక వంటి కన్నుల
వికారేణ: వికారము చేత (అంటే, ఆమె నల్లని కన్నులు శృంగారవాంఛల చేత, మాధనువుని పై సిగ్గువలన ఎర్రబడ్దాయని కవి భావన) 
హృజ్జావ్యవహృత: హృత్+జ+అవ్యవహిత= హృదయమునందు పుట్టిన మన్మధుడు సమీపించిన 
హృదయా: మనస్సు చేత
రతి స్సజ్జా: రతికి సిద్ధమై
సంభ్రమ: తొందరపడుతూ
చపల: నిలువలేకుండుట
జాతా: అయినది

పురతో యాంతం పురుషం: ముందు నడుస్తున్న మాధవుని
వకుళైః:  పొగడచెట్టు పూల చేత
కురంటకై:= పచ్చ పెద్దగోటంట పువ్వులు చేత (Yellow amarnath)
కుటజైర్వా: కొండమల్లె పూవుల చేత ( A tree called Echites antidysenterica. అంకుడుచెట్టు) 
పశ్చాల్లగ్నా: వెనుకగా వస్తూ
పరమం ప్రహరతి: బాగుగా కొడుతున్నది (ప్రహరము: Striking)
గిరం వినాపి: మాటలు లేకుండగనే
వికిరతి: అనుభవించుచున్నది 
ముదమ్: సంతోషాన్ని

హరి: విష్ణువు, కృష్ణుడు
సురభూరుహ: దేవలోకంలో మొలచిన మొక్క-పారిజాతం 
ఆరోహతీవ: ఎక్కేదానివలే
స్వ చరణేన: తన పాదములచే
కటిం: నడుమును
సంవేష్ట్య: చుట్టివేసి  having wrapped around
పరిరంభణ సంపాదిత: ఆలింగనాల వల్ల వచ్చిన
పులకై:= పులకలచేత
సరుచి:+జాతా: అత్యంత ఆనందము పొందినది (great delight in)
సుమలతికేవ: పువ్వులతీగవలే

విధుముఖదర్శన: చంద్రముఖము వంటి కృష్ణుని దర్శనముతో
విగళితలజ్జాత్: సిగ్గును వదిలిపెట్టినదై
అధరబింబఫలమ్+ఆస్వాద్య: గుండ్రని ముఖములో ఎర్రని పండువలే ఉన్న క్రింది పెదవిని ఆస్వాదించి  
మధుర+ఉపాయనమార్గేణ: తియ్యని ఎదురు బహుమతులు ఇచ్చే మార్గంలో 
కుచౌ నిధివద్దత్వా: స్తన నిధులను సమర్పించి 
నిత్యసుఖమితా: నిరంతర సుఖాన్ని పొందుతున్నది 

సురుచిరకేతక: అందమైన మొగలిపువ్వుల
సుమదళ నఖరైః= పువ్వు రేకుల వంటి గోళ్ళచేత 
వర చిబుకం: వరుని గెడ్డమును
సా: ఆమె
పరివర్త్య: చుట్టూ తిప్పి 
తరుణిమ సింధౌ: ఆడతనమనే సముద్రములో
తదీయ: అతనియొక్క
దృక్+జలచరయుగళం= కన్నులనే చేపల జంటను
సం+సక్తం: బాగుగా తిరిగేట్టు
చకార: చేసెను

వచన విలాసై:=విలాసమైన మాటలతో 
వశీకృత్య: వశము చేసికొని
తం: అతనిని (కృష్ణుని)
నిచుల: ఎర్రగన్నేరుThe red Oleander tree. 
కుంజ: పొదరిల్లు A thicket, a bower, or arbour. 
మానితదేశే: గౌరవింపబడిన ప్రదేశములో
ప్రచురసైకతే: పెద్దవైన ఇసుక తిన్నెలయందు
పల్లవశయనే: చిగురు పడకల మీద
రతికళా: సంభోగ కళల
రాగేణ: రాగములచే 
సా+రచిత: ఆమె ఆయని తనువుపై రచన చేసినది

అభినవకల్యాణ: కొత్తగా పెళ్ళైనట్టుగా
అంచితరూప+అభిన(ని?)వేశ= అందమైన రూపాలు కలిగి, గొప్ప శ్రద్ధ, పట్టుదల కలిగినవారై Ardour, zeal, enthusiasm, earnestness 
సంయతచిత్తౌ: మనస్సును నిగ్రహించుకుంటూ
వేంకట విభునా: వేంకట విభుని యందు 
తయా: ఆమె చేత
స: అతడు
తద్విధినా: ఆ రతివిధానాలలో 
తత్పరౌ బభూవతు: రతిక్రీడా తత్పరతను పొందియున్నారు.

సచ= అతడు కూడా 
లజ్జావీక్షణః= సిగ్గుతోకూడిన చూపులవాడు
భవతి= అగుచున్నాడు/అయ్యాడు
తం= అతని చేత
కచభర గంధం= జుట్టుకు స్వత:సిద్ధముగా ఉన్న వాసనను
ఘ్రాపయతి= ఆఘ్రాణింపచేస్తున్నది
అచలతిచేత్: కదలకపోతూంటే 
తత్+మానవతీ= ఆ సిగ్గు కలిగిన ఆడది
తథాపి= అప్పుడు
కుచసంగాత్= ఆమె స్తనాలు ఆయనకు తగిలేలా
అనుకూలయతి= అనుకూలముగా ఉంచినది 

అవనతశిరసాపి=వంచుకున్న శిరస్సైనప్పటికీ
అతి సుభగం=అత్యంత సంతోషాన్ని పొందుతూ
వివిధ+ఆలాపైః=అనేక రకములైన అరుపులకు
వశయతి= వశురాలైయున్నది
ప్రవిమల కరరుహరచన=తెల్లని చేతుల్లోంచి పుట్టిన రచనల
విలాసైః=విలాసములచే
భువనపతిం=ఈ భువనానికి పతియైన 
తం=శ్రీకృష్ణుని
భూషయతి=ఆభరణమైనది

లతాగృహమేళనం=లతలచే చుట్టబడిన ఇళ్ళ సమూహాలను
సైకతవైభవ =  ఇసుక తిన్నెల వైభవాలను
నవ సౌఖ్యం = కొత్త సమాగమ విధానాలను
దృష్ట్వా=చూచి
తతః= అటుపిమ్మట
తతశ్చర= అక్కడ చరించే
తౌ= వారు (ఆ జంటలు)
కేళీ వ్రతచర్యాం=రతికేళీ వ్రతాన్ని 
తాం= వారు
వాంఛంతౌ=కోరుకుంటున్నారు

వనకుసుమ= అడవి పూల
విశదవరవాసనయా=విస్తృతమైన వాసనలచేత
ఘనసారరజః+గంధైశ్చ=కర్పూరపు రజము మరియు గంధముల చేత
జనయతి=జనించబడిన
పవనే=గాలియందు, గాలివలన
వనితా=స్త్రీలకు
పురుషౌ=పురుషులకు
సపది వికారం=శృంగారభరిత భావాలు
జనితాశౌ= జనియించుచున్నవి

ఏవం=ఈ విధముగా
విచరన్=విహరించుచూ
హేలా విముఖ= ఇటువంటి ఆనందాలకు విముఖుడై 
శ్రీవేంకటగిరి దేవః= వేంకటేశ్వరుడైన 
అయమ్=ఈతడు 
పావనరాధాపరిరంభసుఖ=పావని ఐన రాధాదేవి ఇచ్చిన సుఖములను చుట్టుకుని 
శ్రీ వైభవ=లక్ష్మీ వైభవముతో
సుస్థిరః భవతి=బాగుగా స్థిరమై ఉన్నాడు.

భావం:  అన్నమాచార్యుల భావనా సముద్రంలో ఉవ్వెత్తున ఎగసిన ఒక అల ఈ సంస్కృత శృంగార సంకీర్తన. ఈ సంకీర్తనలో రాధాదేవి, శ్రీకృష్ణుని శృంగారక్రీడని కళ్ళకు కట్టినట్టు వివరించారు. నాకు భగవంతుడిచ్చిన కొద్దిపాటి తెలుగు, సంస్కృత జ్ఞానంతో ప్రతిపదార్ధం, భావం మొత్తం సంకీర్తనకి వివరించే ప్రయత్నం చేశాను......ఈ అమృతం -తాగగలిగినవారికి తా గగలిగినంత, ఈ ఆనందం- అనుభవించగలిగినవారికి అనుభవించగలిగేటంత..

//ప// ఇది రాధామాధవుల రతిచరిత్ర. చెప్పదగినది, వినడానికి చెవులకు ఆనందాన్ని కలిగించేది.

//చ//  రాధామాధవులిద్దరూ కూడా ఇళ్ళను వదిలిపెట్టి, విహరిస్తూ, వెళ్ళి వెళ్ళి  ఒక రహస్య ప్రదేశానికి చేరుకుని, వశం తప్పి రతిక్రీడకి సిద్ధం అవుతున్నారు.

//చ//మాధవుని శృంగార చేష్టల చేత, రాధ నల్లని కాటుక వంటి కన్నులు సిగ్గుతో ఎర్రబడినవి. మన్మధుడు బలంగా ఆవహించిన మనస్సుతో రాధ రతికి సిద్ధమై, తొందరపడుతూ, నిలువలేకుండా అయినది. 

//చ// రాధ, తన ముందు నడుస్తున్న మాధవుని పొగడచెట్టు పూల చేత, పచ్చ పెద్దగోటంట పువ్వులు చేత, కొండమల్లె పూవుల చేత, వెనుకగా వస్తూ బాగుగా కొడుతున్నది. (ప్రియునిలో రతి ఆసక్తిని పెంచే పని కాబోలు)  శ్రీవారు తిరిగి వెనుకకు చూడగనే, సిగ్గు చూపులు చూస్తూ, మాటలు లేకుండగనే లోలోపల సంతోషాన్ని అనుభవించుచున్నది. 

//చ// పారిజాత చెట్టుని ఎక్కేదానివలే కృష్ణుని నడుముపైకెక్కి రెండు పాదములచే నడుమును చుట్టువేసినది. పువ్వులతీగ చెట్టును చుట్టేసినట్టు, ఆలింగనాల వల్ల వచ్చిన పులకలచేత రాధ అత్యంత ఆనందము పొందినది. 

//చ// చంద్రముఖము వంటి కృష్ణుని దర్శనముతో సిగ్గును వదిలిపెట్టినదై, గుండ్రని ముఖములో ఎర్రని పండువలే ప్రకాశిస్తూన్న శ్రీవారి క్రింది పెదవిని ముద్దాడి, ఆస్వాదించి, తియ్యని ఎదురు బహుమతులు ఇచ్చే మార్గంలో, ఆమె నిండుకుండల్లాంటి స్తన నిధులను ఆయనకు చుంబన, చూషణలకు సమర్పించి, నిరంతర సుఖాన్ని పొందుతున్నది.

//చ// రాధ తనయొక్క అందమైన మొగలిపువ్వుల రేకుల వంటి గోళ్ళచేత కృష్ణుని గెడ్డమును తిప్పుతూ ఆమె శరీరంలో అణువణువూ చూపించి, ఆమె ఆడతనమనే అందాల సముద్రములో అతని కన్నులు అనే చేపల జంటను బాగుగా తిరిగేట్టు చేసింది. [శ్రీవారికి తన దేహాన్నంతా చూపించిందని- కవి భావన]

//చ// విలాసమైన శృంగార మాటలతో శ్రీకృష్ణుని వశము చేసికొని, ఎర్రగన్నేరు పొదలు అలుముకున్న అందమైన ప్రదేశములో, పెద్దవైన యమునా నదీ తీరప్రాంత ఇసుక తిన్నెలయందు, లేత చిగురుటాకులు పరచిన పడకల మీద, సంభోగ కళల రాగములచే ఆయన తనువుపై రచన చేసినది. [రతి తీవ్రమైన సమయంలో ఏర్పరచే గోళ్ళ గిచ్చుళ్ళు, పంటి గిచ్చుళ్ళు తో శ్రీవారి శరీరంపై గాట్లు పెట్టిందని-కవి భావన]

//చ// కొత్తగా పెళ్ళైన జంటలా అందమైన రూపాలు కలిగి, రతి యజ్ఞంలో గొప్ప శ్రద్ధ, పట్టుదల కలిగినవారై, మనస్సును నిగ్రహించుకుంటూ, రాధ వేంకటేశ్వరుని యందు, ఆతడు రాధయందు అనేక రతివిధానాలలో రతిక్రీడాలో పూర్తిగా నిమగ్నులైయున్నారు. 

//చ// ఆమె శృంగారచేష్టలకి, మాటలకి అతడు కూడా సిగ్గుతోకూడిన చూపులవాడు అయ్యాడు. ఆయన సిగ్గుని పోగొట్టడానికి రాధ అతని చేత ఆమె జుట్టుకు స్వత:సిద్ధముగా ఉన్న గంధం వాసనను ఆఘ్రాణింపచేస్తున్నది. [స్త్రీ కేశములు కామ ప్రేరేపితములు. కేశవునిలో మరింత కామాసక్తిని పెంచడానికి రాధ తన కేశములను వాసన చూపించిందని- కవి భావన]. కానీ, అంతకీ అతను రతికి ముందుకు రాకపోవడంతో, సిగ్గు పడుతూనే ఆమె తన స్తనాలను ఆయనకు తగిలేలా అనుకూలముగా ఉంచినది.

//చ//  సిగ్గుతో తలవంచుకున్నప్పటికీ, అత్యంత సంతోషాన్ని పొందుతూ, సుఖం వల్ల వచ్చే అనేక రకములైన అరుపులను అరుస్తూ, ఆయనకు వశురాలైయున్నది. తెల్లని చేతుల్లోంచి పుట్టిన రచనల విలాసములచే ఈ భువనానికి పతియైన శ్రీకృష్ణునికి ఆభరణమైనది [ఆమె రెండు చేతులో శ్రీవారి మెడను చుట్టేశాయని- కవిభావన].

//చ// లతలచే చుట్టబడిన ఇళ్ళ సమూహాలను (గన్నేరు పూలపొద లు), తెల్లని ఇసుక తిన్నెల వైభవాలను, రాధామాధవుల కొత్త సమాగమ విధానాలను చూచి, అక్కడ చరించే మిగిలిన జంటలు రతికేళీ వ్రతాన్ని తామూ చేయాలని కోరుకుంటున్నారు.

//చ// అడవి పూల విస్తృతమైన సువాసనలచేత, కర్పూరపు పొడి మరియు గంధముల చేత జనించబడిన గాలివలన, స్త్రీలకు పురుషులకు శృంగారభరిత భావాలు జనియించుచున్నవి.

//చ// ఈ విధముగా ద్వాపరయుగాన రాధాదేవితో విహరించుచూ, కలియుగంలో ఇటువంటి ఆనందాలకు విముఖుడై వేంకటేశ్వరుడైన ఈతడు, పావని ఐన రాధాదేవి ఇచ్చిన సుఖములను చుట్టుకుని, లక్ష్మీ వైభవముతో, వేంకటాచలముపై బాగుగా స్థిరమై ఉన్నాడు.