Total Pageviews

Saturday, May 9, 2015

మూసిన ముత్యాల కేలె మొఱగులు - ఆసల చిత్తాన కేలే అలవోకలు

//ప// మూసిన ముత్యాల కేలె మొఱగులు 
ఆసల చిత్తాన కేలే అలవోకలు                                               

//చ// కందులేని మోముకేలే కస్తూరి 
చిందు నీకొప్పున కేలే చేమంతులు
మందయానమున కేలే మట్టెల మోత 
గందమేలే పైపై కమ్మని నీమేనికి  

//చ// భారపు గుబ్బల కేలే పయ్యద నీ 
బీరపు చూపుల కేలే పెడమోము
జీరల బుజాల కేలే చెమటలు నీ 
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు                 

//చ// ముద్దుల మాటల కేలే ముదములు నీ 
యద్దపు జెక్కుల కేలే అరవిరులు
వొద్దిక మాటల కేలే వూర్పులు నీకు 
నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి          

ముఖ్యపదాల అర్ధం:
ఆస: ఆశ
చిత్తము: మనస్సు
అలవోక: వేడుక, లీల
కందులేని: నల్లని మచ్చలు లేని
మోము: మొగము
చిందు: కదులు
మందయానము: మందమైన నడక
మేని: శరీరము
గుబ్బలు: వక్షములు
పయ్యెద: పైట
పెడమోము: ముఖము తిప్పుకొను The face turned away
ముదము: సంతోషము
అరవిరులు: సగం నిడిచిన పువ్వులు

భావం:
ముత్యపు చిప్పలో దాగి ఉండే ముత్యాలకి మెరగులెందుకు? ఆశపడే మనస్సుకి ఇంకా చపలత్వం కూడా దేనికి? ఈ పైపై మెరుగులు నీకు అవసరంలేదమ్మా! నీవు శ్రీవేంకటేశుని అర్ధాంగివి... 

పరిపూర్ణమైన నీ ముఖానికి కస్తూరీ తిలకం పెట్టి కొత్తగా అందం తేవాలా? 
అటూ, ఇటూ ఊగే నీ కొప్పులో అసలు పువ్వులుంటాయా? మరి ఆ మాత్రానికి చామంతులెందుకు?
స్వామి ముందుకు వచ్చేడప్పటికి సిగ్గుతో మెల్లగా నడుస్తావు. అంత మాత్రానికి కాలికి మట్టెలు పెట్టుకోవడం దేనికి?
సహజంగా సువాసనలు వెదజల్లే నీ శరీరానికి ఆ గంధపు పూతలెందుకు?

అసలే బరువైన పయోధరాలు నీవి. పైన ఆ పైట బరువు కూడా ఎందుకు?. 
స్వామివారి కళ్ళలోకి చూడలేక ఆ ముఖం తిప్పుకోవడం దేనికి?
ఆ భుజాల పైకి చీర కొంగును కప్పేస్తే చెమటలు పట్టకుండా ఉంటాయా?
గోరింటాకు పెట్టుకుని ఎర్రగా, ముద్దుగా ఉన్న ఆ పదునైన గోళ్ళకి ఇంకా అలంకారాలెందుకు?

నీ మాటలే ముద్దులొలుకుతుంటాయి. ఇంకా వాటికి నవ్వు ఎందుకు పులమడం?
నీ చెక్కిళ్ళు అద్దాల్లా నున్నగా ఉంటాయి, వాటికి ఆ పూరేకులు అదమడం ఎందుకు?
నీవు శ్రీవేంకటేశుని అర్ధాంగివి. ఆయన నీపై ఎప్పుడూ ఆశని కలిగి ఉంటాడు. నువ్వు వెళ్ళేది మన్మధునికి తండ్రి దగ్గరకి.. ఆయన కౌగిలిలో ఉంటే అసలు నీకు ఊపిరైనా ఆడుతుందా? ఈ పైపై మెరుగులు నీకెందుకమ్మా? 

Monday, May 4, 2015

ధరణినెందరెన్ని తపములు చేసినాను - హరికృప గలవాడే అన్నిటా బూజ్యుడు

//ప// ధరణినెందరెన్ని - తపములు చేసినాను
హరికృప గలవాడే - అన్నిటా బూజ్యుడు

//చ// మితిలేని విత్తులెన్ని - మేదినిపై జల్లినాను
తతితో విత్తినవే - తగ బండును
ఇతర కాంతలు మరి - యెందరు గలిగాను
పతి మన్నించినదే - పట్టపు దేవులు

// పాలుపడి నరులెన్ని - పాట్లుబడి కొలిచినా
నేలిక చేపట్టిన వాడే - యెక్కుడు బంటు
మూలనెంత ధనమున్నా - ముంచి దాన ధర్మములు
తాలిమితో నిచ్చినదే - దాపురమై నిలుచును

// ఎన్నికకు గొడుకులు - యెందరు గలిగినాను
ఇన్నిటా ధర్మపరుడే - యీడేరును
ఉన్నతి జదువులెన్ని - వుండినా శ్రీవేంకటేశు
సన్నుతించిన మంత్రమే - సతమై ఫలించును

ముఖ్యపదాల అర్ధం:
ధరణి: భూమి
మితిలేని: లెక్ఖలేని
విత్తులు: విత్తనాలు 
మేదిని: భూమిపై 
తతితో: సమయానుకూలంగా
పట్టపు దేవులు: పట్టపు దేవి
పాలుపడి: పాలేరుగా ఉండి
యేలిక: రాజు
యెక్కుడు: ఆధిక్యము, విశేషమైన వాడు
తాలిమితో: ధైర్యంతో, శ్రద్ధతో, దయతలచి 
దాపురమై: (దాపురించు)ప్రాప్తి 
ఎన్నికకు: లెక్కించడానికి
ఈడేరును: నెరవేర్చును
ఉన్నతి జదువులు: గొప్ప చదువులు 
సతమై: శాశ్వతమై 

భావం: 
భూమి మీద ఎవరు ఎన్ని తపస్సులు చేసినా శ్రీహరి కృప కలిగినవాడే అందరిచేతా, అన్నిలోకాల్లోనూ పూజింపబడతాడు.

కాలాన్ని అనుసరించి విత్తనాలు భూమిలో నాటకుండా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్ని విత్తనాలు నాటినా లాభమేముంది. కాలాన్ననుసరించి నాటిన విత్తనమే మొలకెత్తి, మంచి పంటను ఇస్తుంది. 
చేరదీసిన స్త్రీలు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏముంది? యే స్త్రీని ఐతే భర్త ఎక్కువగా చేరదీస్తాడో, ఆమే పట్టపురాణి అవుతుంది.  

ఎన్నో ప్రయాసలు పడి పాలేర్లుగా ఎంతమంది మనుష్యులు ఉంటే లాభమేముంది? కానీ, మహారాజు నమ్మినవాడే ముఖ్యమైన వాడు అవుతాడు. 
మూల ఉన్న గదుల్లో ఎంత ధనముంటే మాత్రం ఉపయోగం ఏముంది? శ్రద్ధగా దాన, ధర్మాదులు చేస్తేనే ఆ పుణ్యం జన్మాంతరాల్లో సహాయపడుతుంది. 

ఓ తండ్రికి లెక్కించడానికి ఎంతమంది కొడుకులుంటే మాత్రం ఉపయోగమేముంటుంది? ధర్మప్రవర్తన కలిగిన కొడుకు వల్లే తండ్రికి ఉత్తమగతులు కలిగి, ఆశ తీరుతుంది. 
ఎన్ని గొప్ప చదువులు చదువుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది? శ్రీవేంకటేశ్వరుని మంత్రము ఒక్కటే శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తుంది.  

Sunday, May 3, 2015

ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల - భూతములలోన దా బొదలువాడితడు

//ప// ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల- 
భూతములలోన దా బొదలువాడితడు 

//చ// గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద 
చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు 
తాపసోత్తముల చింతాసౌధములలోన 
దీపించు సుజ్ఞానదీప మితడు 

//చ// జలధికన్యాపాంగ లలితేక్షణములతో 
కలసి వెలుగుచున్న కజ్జలంబితడు 
జలజాసనుని వదనజలధి మధ్యమునందు 
అలర వెలువడిన పరమామృతంబితడు 

//చ// పరివోని సురతసంపదల నింపులచేత 
వరవధూతతికి పరవశమైన యితడు 
తిరువేంకటాచలాధిపుడు దానె యుండి 
పరిపాలనముసేయు భారకుండితడు 

ముఖ్యపదార్ధం:
ఈతడఖిలంబునకు: ఈ సకల విశ్వమునకు
ఈశ్వరుడై: భర్త ఐనవాడు/ ప్రాణాధారమైన వాడు 
సకల భూతములలోన: అన్ని ప్రాణులలోన
తాబొదలువాడితడు: తానై ప్రకాశించు వాడు ఇతడు  

గోపాంగనల: గోపికా స్త్రీల 
మెరుగు గుబ్బచన్నులు: మెరిసేటి ఎత్తైన స్తనములందు [గుబ్బ అన్న పదం కాలక్రమేణా కుప్ప గా మారిందని అనిపిస్తోంది. ఎత్తైనవి అని చెప్పే అప్పటి వాడుక పదం]  
చూపట్టు: కనపడు
కమ్మగస్తురిపూత యితడు: కమ్మని సువాసనల కస్తూరీ లేపనపు పూత యితడు 
తాపసోత్తముల: ఉత్తమ తాపసుల
చింతాసౌధములలోన: ఆలోచనా నగరములో 
దీపించు సుజ్ఞానదీప మితడు: ప్రకాశించే చక్కని సుజ్ఞానదీపం వంటివాడు యితడు

జలధికన్య: లక్ష్మీదేవి
అపాంగ లలితేక్షణములతో: సున్నితమైన కడకంటి చూపులతో 
కలసి వెలుగుచున్న కజ్జలంబితడు: కలిసి ప్రకాశిస్తున్న కాటుక యితడు 
జలజాసనుడు: తామెర పువ్వు ఆసనముగా కలవాడు (బ్రహ్మ) 
వదన: ముఖము
జలధి: సముద్రము
అలర: ప్రకాశించుచూ
వెలువడిన: బయటపడిన 
పరమామృతంబితడు: పరమ అమృతము యీతడు

పరివోని: క్షీణించని
సురతసంపదలు: చక్కని రతిక్రీడాసక్తి సంపదగా కలుగుట
వరవధూతతికి: వరించిన వధూమణికి  
భారకుండితడు: బరువు మోసేవాడు

భావం: అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని కీర్తించడానికి ఎన్నుకోని ఉపమానం లేదు.. అటువంటి అమూల్యమైన భావనల్లో ఈ సంకీర్తన ఒకటి.

ఈతడే (తిరువేంకటాధిపుడు) ఈ సమస్త విశ్వమునకు భర్తయై అన్ని భూతములలోనూ తానే ప్రకాశిస్తూ ఈ సృష్టిని పోషిస్తున్నవాడు.

పదారువేల మంది గోపికా స్త్రీల మెరిసేటి, ఎత్తైన పయోధరాలపై బయటకి కనిపించే కమ్మని సువాసనాభరితమైన కస్తూరీలేపనపు పూత యితడు. [గోపాంగనాలోలుడని చెప్పడానికి కవి ఎన్నుకున్న ఉపమానం]
ఉత్తమోత్తమమైన తాపసుల నిరంతర ఆలోచనా మేడల్లో మంచి జ్ఞాన జ్యోతియై ప్రకాశించే జ్ఞానదీపమితడు. [సుజ్ఞానస్వరూపుడని కవి ఎన్నుకున్న ఉపమానం]... 
[ముందటిపాదంలో గోపాంగనాలోలుడు అనేది కామదృష్టితో చూడకూడదని మూడవపాదంలో సుజ్ఞాని అని తెలియజేశారు కవి]

లక్ష్మీదేవి సున్నితమైన కడగంటి చూపులతో కలిసి ఆమె పెట్టుకున్న కాటుకలా నల్లగా ప్రకాశించే స్వామి యితడు.
బ్రహ్మగారి ముఖసముద్రపు మధ్యలోంచి ప్రకాశిస్తూ బయటకు వచ్చిన పరమామృతము యితడు. [బ్రహ్మగారి ముఖములు నాలుగూ నాలుగు వేదములుగా చెప్పబడ్డాయి. అటువంటి వేద సముద్రంలో పుట్టిన వేదస్వరూపుడు వేంకటాద్రినిలయుడని కవి భావన]

ఎన్నడూ క్షీణించని చక్కతి రతిక్రీడాసక్తిని సంపదగా కలిగిన భార్యకు [అలమేల్మంగకి] నిరంతరం వశమైన వాడు ఈతడు. ఆ ఈతడే తిరువేంకటాచము మీదనున్న వేంకటాద్రినాధుడు. ఆతడే వేంకటాచము మీదుండి ఈ సమస్త విశ్వాన్ని పరిపాలన చేసే భారాన్ని మోస్తున్నవాడు.