Total Pageviews

Saturday, March 12, 2011

ఏమొకో చిగురుటధరమున - ఎడనెడ కస్తూ రి నిండెను


ఏమొకో చిగురుటధరమున - ఎడనెడ కస్తూ రి నిండెను
భామిని విభునకు రాసిన - పత్రిక కాదు కదా

కలికి చకోరాక్షికి కడ - కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడిదేమో - చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై - నాటిన ఆ కొనచూపులు
నిలువునపెరుకగనంటిన - నెత్తురు కాదుకదా

పడతికి చనుగవ మెరుగులు - పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో ప్రియు - డొత్తి న నఖ శశి రేఖలు
వెడలగ వేసవి కాలపు -వెన్నెల కాదు కదా

ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పుల
ఒద్దిక బాగు లివేమో - ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి - కామిని వదనాంబుజమున
అద్దిన సురతపు చెమటల - అందము కాదుకదా

ముఖ్యపదార్ధం:

ఏమొకో: ఏమిటికో, ఎందుకో (for what reason, I know not why)
చిగురుటధరమున: చిగురు+అధరమున = అధరము అంటే క్రింది పెదవి, చిగురు అంటే, లేత, అందమైన, చివరన (అంచుల్లో): ఇక్కడ మూడు రకాల భావనలు చేసుకోచ్చు. ఒకటి) లేత పెదవి, రెండు) అందమైన స్త్రీ పెదవి, మూడు) క్రింద పెదవి చివర/అంచులో
ఎడనెడ: అచ్చట అచ్చట (అక్కడక్కడ) (Here and there)
కస్తూరి: అత్యంత సువాసన భరితమైన గంధ ద్రవ్యం. శ్రీవారు నుదుటను ధరించే తిలకంలో ఈ సుగంధద్రవ్యాన్ని కలుపుతారు. ఈ ద్రవ్యం కస్తూరి మృగమునుండి సేకరిస్తారని పెద్దలు చెప్పగా విన్నాను. (Musk. The black spot or line on the forehead, formed of musk)
నిండెను?: నిండి ఉంది??
భామిని: స్త్రీ, ఆడుది (A woman)
విభునకు రాసిన: స్వామికి రాసిన
పత్రిక కాదు కదా: ఉత్తరం కాదు కదా!!

కలికి: అందమైన
చకోరాక్షికి: చకోరము అనే పక్షి కన్నుల వంటి కన్నులు కలిగిన ఈమె.  ఈ పక్షులు చంద్రకిరణముల కోసం  ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాయి. (The bartavelle or Greek partridge: a bird much referred to in poems: corresponding to the nightingale, or turtledove. eagerly as the partridge languishes for the rays of the moon.)
కడకన్నులు: కంటి చివరలు (The outer corner of the eye)
కెంపై తోచిన: కెంపు అంటే పద్మరాగము అనే మణి. ఎర్రని మణి 
చెలువంబిప్పుడిదేమో: చెలువము+ఇప్పుడు+ఇదేమో = విధము (Manner, way)
చింతింపరే చెలులు: ఆలోచించండి చెలులూ
నలువున: అందముగా, సామర్ధ్యముతో
ప్రాణేశ్వరుపై: ఆవిడ భర్తపై, స్వామిపై
నాటిన: గుచ్చిన
ఆ కొనచూపులు: కంటి చివరలతో చూసిన చూపులు
నిలువున: నిలచిపోయిన
పెరుకగ : పెరుకు =గట్టిగా పీకు, పెల్లగించు (To tear out, pulling out force fully) 
అంటిన నెత్తురు కాదు కదా: అంటుకున్న రక్తము కాదు కదా! (చూపుల బాణాలు ఒక్కసారి వెనక్కు తీసుకునే సరికి ఆ బాణం స్వామి శరీరానికి గుచ్చుకుని అంటుకున్న రక్తం కాదు కదా! ఆమె కంటి చివరలున్న ఎరుపు?)

పడతికి: స్త్రీకి, అలమేలు మంగకి
చనుగవ: చను కట్టు, చన్నులు, వక్షోజాలు, స్తనాలు, పాలిండ్లు, పయోధరాలు
మెరుగులు: ప్రకాశవంతమైన కాంతులు
పైపై: పైన పైన
పయ్యెద: పయి+ఎద = వక్షోజములను కప్పు వస్త్రము (పైట కొంగు, పమిట కొంగు, పైట చెంగు)  A woman's mantle, formed by throwing the train or end of the cloth over her breast and head.
వెలుపల: వెలి+పల = బయటకి (Outside)
కడు: మిక్కిలి Much, greatly
మించిన: అతిశయించిన
విధమేమో: ఆ విధం ఏమిటో (Kind, way, manner, mode)
కనుగొనరే చెలులు: కనిపెట్టండి చెలులూ
ఉడుగని: ఏ మాత్రమూ తగ్గని, కోరికవల్ల కలిగే వేడితో
వేడుకతో: సంతోషముతో, కుతూహలముతో, కోరికతో
ప్రియుడొత్తిన: స్వామి వత్తిన, అదిమిన, నొక్కిన (Pressing)
నఖ శశి రేఖలు : చంద్రరేఖల వంటి గోటి నొక్కులు (వాడ్యమి, విదియలలో చంద్రుడు ఏవిధముగా సన్నని రేఖలా ఉంటాడో (crescent moon) అలా గోళ్ళతో ఆవిడ స్తనములను నొక్కినప్పుడు స్వామి చేతి గోళ్ళు గుచ్చుకుని అవి శశిరేఖల్లా ఉన్నాయని)  
వెడలగ: వెడల్పుగా, విశాలముగా, విరివిగా
వేసవి కాలపు: మండు వేసవి కాలంలో
వెన్నెల కాదు కదా: చల్లని వెన్నెల కాదు కదా!

ముద్దియ: స్త్రీ A lady, dame, woman. (సంస్కృతంలో ముగ్ధ), మనోహరమైన, ముద్దైన 
చెక్కుల: నున్నని చెంపలు
కెలకుల: చివరల, అంచుల??
ముత్యపు జల్లుల: ముత్యాలు జల్లినట్టుగా
చేర్పుల: దగ్గరగా చేర్చుట, ఒకదాని పక్కన మరొకటిగా ఉండుట (Nearness, closeness, connection)
వొద్దిక లాగులివేమో: వాటి జనన రహస్యమేమో, పోలిక విధములేమో (ఒద్దిక = అనుకూల్యము Concord, union, friendship)
ఊహింపరే చెలులు: ఊహించండి చెలులూ
గద్దరి: గడుసైన (Impertinent, pert)
తిరువేంకటపతి: తిరు వేంకటేశ్వరుడు
 
కామిని : కోరికతో ఉన్న స్త్రీ 
వదనాంబుజమున : పద్మము వలే వికసించిన మొగమున
అద్దిన: అద్దుట
సురతపు: స్త్రీ పురుషుల కలయిక, మంచి రతి క్రియ
చెమటల: స్వేదముల (శరీరము వేడెక్కుటచేత విడవబడే నీరు)

అందము కాదుకదా: ఆ అందమే కదా!!

భావం:

ఈ సంకీర్తన విని ఇందులో ఉన్న అందానికి ముచ్చటపడి, ఆశ్చర్యచకితుడై సాళ్వ నృశింహ రాయలు అటువంటిదే తన మీద, తన భార్యమీద పాడమని కోరగా అన్నమయ్య ""హరి హరీ..నరహరిని స్తుతించు నా నాలుక నరులను స్తుతించదు", ఇంత నీచపు మాట నాతో ఎలా అనగలిగావు అని దిగ్గున లేచిపోగా అతను పదే పదే అడిగి, మదగర్వం చేత అన్నమయ్య నోట వెంబడి అతని నామస్మరణ వచ్చేదాకా చెరశాలలో బంధించి మూరురాయరగండ ముద్రగల సంకెల వేయించి మొగసాలలో బంధించి హింసించాడు. అన్నమయ్య "నీ దాసుల భంగములు నీవు జూతురా" "ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరి నామమే దిక్కు మరిలేదు" వంటి సంకీర్తనలు పాడగా ఆ సంకెళ్ళు తెగిపోయాయి.


రాత్రి స్వామితో రతి సుఖాలను అనుభవించి వచ్చిన అలమేల్మంగను చూసి చెలికత్తెలు ఒకరిలో ఒకరు ప్రశ్నించుకుంటూ, అది ఇది కాదు కదా, ఇది కాదు కదా అంటూ నిజాలను తమలోనే తెలుసుకుంటూ అమ్మవారిని ఆటపట్టిస్తున్నారు. ఇది మన ఇళ్ళలో కూడా సహజమే. కొత్తగా పెళ్ళైన జంటకు మొదటిరాత్రి జరిగిన తర్వాత గదిలోంచి బయటకొచ్చిన జంటను  స్నేహితులు, బంధువులు ఏ విధంగా ఆట పట్టిస్తారో అదే విధంగా అలమేల్మంగను చెలులు ఆట పట్టిస్తున్నారని అన్నమయ్య అద్భుతంగా ఊహించి రాసిన సంకీర్తన.

ఈ అలమేల్మంగ ఎర్రని అధరాలపై అక్కడక్కడ కస్తూరి మరకలు అంటుకున్నాయి. ఎర్రని పత్రంపైన ఈమె నల్లని అక్షరాలతో (కస్తూరి నల్లగా ఉంటుంది) రాసిన లేఖ కాదు కదా! (అంటే స్వామి అమ్మ వారి తో రతిక్రియ చేసి అలసిపోయి ఆవిడ స్తనాలమీద తల పెట్టి నిద్రపోతూంటే...ఆయనతో పొందిన సంతోషాన్ని తలుచుకుంటూ అమ్మ పొంగిపోయి అత్యంత ప్రేమతో ఆయన నుదుటి మీద ఆప్యాయంగా ముద్దుపెట్టుకుంది. అప్పుడు ఆ నుదుటనున్న కస్తూరి ఈమె పెదవులకు అంటుకుంది...అని నా ఊహ..)

చకోరపక్షిలాంటి కళ్ళు కలిగిన ఈ సుందరి కళ్ళ చివరలు మరింత ఎర్రగా ఉన్నాయి. దీనికి కారణమేమిటే చెలులూ?. నిద్రపోరతున్నట్టు నటిస్తూన్న తన ప్రియుని అందాన్ని తదేకంగా తల వంచుకుని సిగ్గుతో కంటి చివరలనుండి చూస్తున్నప్పుడు, స్వామి ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి గభాలున చూపులు వెనక్కుతీసుకుంది. అంతే! ఆవిడ చూపుల బాణాలు ఆతనిలో నాటుకుని ఉండగా ఒక్కసారి వెనక్కు లాగేడప్పటికి, ఆ బాణాలకు అంటుకున్న ఆయన రక్తం ఈవిడ కంటి చివరలను అంటిందేమో నే చెలులూ! కాదంటారా!

ఈ అలమేల్మంగ చన్నుల కాంతులు పైపైకి, పయ్యెద (పైట) దాటి పాకుతున్నవి. అంత కాంతి అసలు అక్కడ ఎందుకొచ్చిందో, ఆ రహస్యాన్ని కనిపెట్టండి చెలులూ!. తనివి తీరని కోరికతో స్వామి ఆమె స్తనములను గట్టిగా ఒత్తేసరికి ఆయన గోళ్ళు స్తనాలపై గుచ్చుకుని, నెలవంకలు లా ఏర్పడి అవి వెలువరిస్తున్న వేసవికాలపు వెన్నెలే కదా ఇది!!!  


ఈ ముద్దుల చెక్కిళ్ళ అంచుల్లో ముత్యాలజల్లులు పేర్చినట్టుంది. ఆ రహస్యమేమిటో ఊహించండే చెలులూ! అది నేర్పరి అయిన శ్రీ వేంకటేశుడు కోరికతో ఉన్న ఈమె పద్మము వలే వికసించిన మొగమున అద్దిన చక్కటి రతిక్రియ వలన పుట్టిన చెమటల అందమే కదా!! 

కొన్ని చోట్ల "కామిని వదనాంబుజమున" అనేచోట....."కౌగిట అధరామృతముల" అని ఉంది. అందువల్ల "కౌగిట అధరామృతమున" అని పూరిస్తే కీర్తన స్వభావం ఎలా ఉంటుందో క్రింద చూడండి. 

(తన వెచ్చని కౌగిలిలో బంధించి, అధరామృతాలను గ్రోలుతూ, వారిద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ  రాత్రి సమయాలలొ ఆడుకునే ఆటలవల్ల, వేడెక్కిన శరీరాలు విడిచిన చెమటల అందమే అలా ముత్యపు బిందువుల్లా ఉన్నట్టు గోచరిస్తున్నాయి. కదూ చెలులూ!! (ఇలా కూడా ఊహించవచ్చు. స్వామి ఈమె ను కౌగిట బంధించి, అధరామృతమును గ్రోలుతున్న వేళ, వేడి వల్ల పుట్టిన ఈతని నుదుటి చెమట ఆమె బుగ్గలకు అంటుకుని అలా ముత్యాలు జల్లినట్టుగా ఉన్నది. ఆ అందమే కదా ఇది?.)

ఈ ఆటపట్టింపు అద్భుతం. అనన్య సామాన్యం. శోభాయమానం. ఇంతకన్న అందముగా యే కవీ చెప్పలేరు అనడం అతిశయోక్తి కాదు. అన్నమయ్య పాదాలకు శత సహస్ర నమస్కారములు.

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://www.esnips.com/doc/68e09cb1-4555-45aa-b371-6bd9d8d2988a/Emuko.mp3