Total Pageviews

Thursday, June 27, 2013

ఇందులో నేనెవ్వడినో యేయేమి సేసితినో - ముందు వెనుక లెరుగ మురహర కావవే

//ప// ఇందులో నేనెవ్వడినో యేయేమి సేసితినో
ముందు వెనుక లెరుగ మురహర కావవే

//చ// పరదూషకునకు పరమ నాస్తికునకు
కరుణలేనివానికి గతిలేదని యందురు
సరవిగ్రూరునకు సంశయ చిత్తునకు
దురితవర్తనునకు దుర్గతియె యందురు

//చ// అతినిష్ఠూర భాషికి నన్యకాంతాలోలునకు
యితరాసూయపరునకు పరమే లేదనెదరు
పతితుండైనవానికి బ్రాహ్మణనిందకునకును
తతి నాచారికిని దైవము లేడని అందురు

// అనృతవాదికిని అర్ధచోరకునకు
ఘనహింసకునకు లోకము లేదని యందురు
విని నే నిందులకుగా వెరచి నీకు శరణంటిని
వెనక వేసుకుని శ్రీవేంకటేశ యేలవే

భావం: 
ఈ సంకీర్తన పెద తిరుమలాచార్యులు రచించిన కీర్తన. 
ఈ క్రింది చెప్పే దోషాలలో తను ఏం చేశారో తెలియదు కానీ మురహరా నన్ను వెనకేసుకుని వచ్చి రక్షింపమని అడుగుతున్నారు.

ఇతరులను దూషించేవాడికి, దైవాన్ని నమ్మని వాడికి, దయ లేని వాడికి ఉత్తమ గతులు లేదని పెద్దలు చెప్తారు.
పాపకార్యాలు చేసే పరమ కౄరునకు, గురువు గారి వాక్కులను, వేద వాక్కులను సందేహంచు వానికి, పాపజీవనుడైన వానికి దుర్గతులు కలుగుతాయని పెద్దలు అంటారు.

చాలా కఠినంగా మాట్లాడి ఇతరుల మనసులు బాధపెట్టేవాడికి, ఇతరుల భార్యల పొందు కోరుతూ ఇష్టానుసారం ప్రవర్తించేవాడికి, యితరుల ఉన్నతిని చూసి అసూయ పడేవాడికి పరము లేరని అందురు.
పాపకార్యాలు చేసేవాడికి, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ నితంతర భగవంతుని సేవలో ఉన్న బ్రాహ్మణులను నిందించేవాడికి, ఆచార, సాంప్రదాయాలను పాటించనివాడికి దేవుడనే వాడే ఉండడని అందురు. 

అబద్ధాలను వాదించేవాడికి, డబ్బు దోచుకునే దొంగకి, అహంకారికి ఉత్తమలోక ప్రాప్తిలేదని పెద్దలు అందురు. 
ఇవన్నీ విని నేను నిన్ను శరణు కోరుతున్నాను. నీ భక్తుడనని వెనకేసుకొచ్చి నన్ను రక్షించి మోక్షాన్ని ఇప్పించు వేంకటేశ్వరా!!