Total Pageviews

Friday, June 19, 2015

లలితాంగి యౌవనము లావణ్యములప్రోవు - అలరి యిటువలె జేసెనమ్మా [Lalithangi youvanamu lavanyamula provu]

//ప// లలితాంగి యౌవనము లావణ్యములప్రోవు
అలరి యిటువలె జేసెనమ్మా //ప//

//చ// జవ్వాది మిగుల నుష్ణముమీద సంపంగి
పువ్వు గట్టినది గన పొదలె దాపంబు
నివ్వటిలు గొజ్జంగి నీట నొయ్యన కడిగి
దువ్వటపు బయ్యెదను దుడువరమ్మా                       //ప//

//చ// మృగమదము గడు వేడి మెలుతతలపట్టునకు
అగలు గూడగ వేద నగ్గలంబాయ
బిగువైన కస్తూరి బేంట్లొయ్యనగోర
నగలించి తట్టుపునుగంటరమ్మా //ప//

//చ// విరహతాపంబునకు వేరొండు గతిలేదు
పొరసి వేగించినా బోదు
తిరువేంకటాచలాధిపుని మన్నన గాని
అరిదిమోహము దీరదమ్మా //ప//

ముఖ్యపదాల అర్ధం:
లలితాంగి: సున్నితమైన అంగముల కలది
లావణ్యము: సౌందర్యము
ప్రోవు: పోగు, సమూహము
అలరు: ప్రకాశించు
జవ్వాది: పునుగు Civet: a paste like pomatum
నివ్వటిలు: To spread, extend, overflow. వ్యాపించు 
గొజ్జంగి: మొగలి  పువ్వు [ఆడ మొగలి పువ్వు ను గొజ్జంగి అని, మొగ పువ్వుని కేతకీ అంటారుట.] A tree called Pandanus odoralissimus
ఒయ్యన: మృదువుగా
దువ్వటపు: దుప్పటము
బయ్యెద: ఆడువారు వక్షమును కప్పుకొను పైట
మృగమదము: కస్తూరీ మృగపు గంధం
మెలుత: స్త్రీ. యువతి 
కడు వేడి: మిక్కిలి వేడి
అగలు: పగులు, To break or go to pieces
అగ్గలము: మెండు, ఎక్కువగా
తట్టుపునుగు: పునుగుపిల్లినుండి సేకరించిన సుగంధ ద్రవము
వేరొండు: వేరొక ఉపాయము
పొరసు: వేరే విధానాలతో
వేగించు: తెల్లవారినా (ఇక్కడా రాత్రంతా జాగారము చేసినా)
మన్నన: గౌరవము, సమ్మానించడము (ఇక్కడ దగ్గరకు తీసుకోవడం)
అరిది: అపురాపమైన
మోహము: కాంక్ష 

భావము: 
అన్నమయ్య ఈ సంకీర్తనలో, అమ్మవారు శ్రీవారిపై నున్న విరహతాపాన్ని తగ్గించుకోడానికి ఏమేమి చేసిందో - చెలులు ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నట్టుగా ఊహించి రచించారు. 

యౌవ్వనములో ఉన్న ఈ సున్నితాంగి (అలమేల్మంగ) అమిత సౌందర్యరాశి. ఆవిడ ఈ విధంగా చేసిందమ్మా!

శ్రీవారి విరహాన్ని భరించలేక శరీరానికి పునుగు తైలాన్ని రాసుకుంది. ఐనా, వేడి తగ్గక పోవడంతో సంపంగి పూలను చుట్టుకుంది. ఐనా, తాపము తగ్గట్లేదు. పోనీ, మొగలిపూరేకులు నానబెట్టిన నీటిలో ఓ బట్టను నానబెట్టి త్వరగా ఆవిడ మందపాటి పైటను తడి చేయండమ్మా!.  

ఈ అందమైన యువతి కస్తూరీమృగపు సుగంధపు కొవ్వును తలకు పట్టీలా వేసుకుంది. కానీ, ఆమె శరీరపు వేడికి ఈ కస్తూరి వేడి కూడా తోడై, ఆమెలో వేడి మరింత పెరిగిపోయింది. ఆమెలో ఉన్న వేడికి ఆ కస్తూరీ పూత ఎండిపోయి పెల్లలుగా ఐతే, మెల్లగా గోళ్ళతో ఆ పెల్లలను ఒలిచి, ఈ సారి తట్టుపుణుగును ఈమె శరీరంపై అంటడమ్మా!   

శ్రీవారిపై ఉన్న విరహతాపం తీరడానికి ఈమెకు వేరొక మార్గం లేదు. రాత్రంతా జాగారము చేసినా ఈమెకు తాపం తగ్గదు. శ్రీవేంకటేశ్వరుడు ఈమెను కౌగిలిలోకి తీసుకుని, ముద్దుచేస్తే తప్ప ఈమెకు ఆయన మీదున్న అపురూపమైన కాంక్ష తీరదు. అదొక్కటే మార్గం. 

పేజీ : 117, వాల్యూమ్ : 6, నెం. 161