Total Pageviews

Thursday, December 26, 2013

భావయామి గోపాలబాలం మన స్సేవితం - తత్పదం చింతయేయం సదా [Bhavayami gopala baalam manassevitam]

//ప// భావయామి గోపాలబాలం మన 
స్సేవితం తత్పదం చింతయేయం సదా   //ప//

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా 
పటల నినదేన విభ్రాజమానం 
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం 
చటుల నటనా సముజ్జ్వల విలాసం //ప//

నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది 
సుర నికర భావనా శోభిత పదం 
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం 
పరమపురుషం గోపాలబాలం //ప//

ప్రతిపదార్ధం:
భావయామి: భావించుచున్నాను
గోపాల బాలం: బాలుడైన గోపాలుని (కృష్ణుని)
మనస్సేవితం: మనసునందు నిరంతరము సేవింపబడేవానిని
తత్+పదం: ఆతని పదములను (పదం అంటే పాట అని కూడా అర్ధం)
చింతయ:+అయం= ఈతని గురించే ఆలోచిస్తున్నాను
సదా: ఎల్లప్పుడూ

కటి: మొల
ఘటిత: కట్టబడిన, కూర్చబడిన
మేఖలా: మొలమాల, వడ్ఢాణము A zone or girdle
ఖచిత: చెక్కబడిన Inlaid, set 
మణి: నవరత్నాల రాళ్ళు A gem, a precious stone
ఘంటికా: గజ్జెలు (చిన్న చిన్న గంటలు)  
పటల: పటలము= ఇంటికప్పు A roof; thatch 
నినదేన: ధ్వని. మ్రోత A sound, note. 
విభ్రాజమానం: ప్రకాశించుచున్న వానిని 
కుటిల పద ఘటిత: వంపు తిరిగిన పాదములకు కట్టబడిన గంటలతో  
సంకుల: వ్యాపించిన Spread, Crowded
శింజీతేన: భూషణములమ్రోత, Ringing, tinkling.
తం: అతనిని 
చటుల: తిరుగుతూ, చలించు. చంచలము Tremulous. 
నటనా: నర్తించు
సముజ్జ్వల: అగ్ని సమానంగా భాసిల్లుచున్న
విలాసం: ప్రకాశమానమైనవానిని Shining, splendid

నిరత: నిరంతరము
కర: చేతియందు
కలిత:  కూడుకొనిన, పొందబడిన, Having, bearing
నవనీతం: వెన్న
బ్రహ్మాది సుర : బ్రహ్మదేవుడు మొదలగు దేవతల
నికర భావనా: నిజమైన భావనలయందు
శోభిత పదం: ప్రకాశమానమైన పదములు కలిగిన వానిని 
తిరువేంకటాచల స్థితం: తిరు వేంకటాచలము మీద నివాసము ఏర్పరచుకున్నవానిని
అనుపమం: పోల్చదగిన ఉపమానము లేనివానిని
హరిం: హరిని 
పరమపురుషం: పరమపురుషుని
గోపాలబాలం: గోవులను పాలించు బాలుని  

భావం: ఈ సంకీర్తన అన్నమాచార్యుల భావనా సముద్రంలో ఉప్పొంగిన ఒక అల. సంస్కృతభాషలో బాలకృష్ణుని అందాన్ని, ఆయన పనులను భావయామి అని చెప్తున్నారు..

బాలకృష్ణుని పాదాలను నిరంతరం మనస్సులోనే భావిస్తున్నాను. ఆయన పదములను నిరంతరం ఆలోచిస్తున్నాను.

చెక్కబడిన నవరత్నాల రాళ్ళు పొదిగిన, చిన్ని చిన్ని గంటలు కూర్చబడిన మొలత్రాడు ధరించి పాదాలను వంచుతూ నర్తిస్తూ, శరీరంపై ఉన్న భూషణములు కూడా శబ్దాలు చేస్తూండగా అటూ, ఇటూ తిరుగుతూ ఇంటిపైకప్పు దద్ధరిల్లేలా గలగల శబ్ధం చేస్తూ అగ్ని సమానంగా ప్రకాశిస్తున్న బాలగోపాలుని మనస్సులో భావిస్తున్నాను.  

నిరంతరం చేతియందు వెన్నెను పట్టుకున్న వానిని, బ్రహ్మ మొదలగు దేవతల నిరంతర భావనలలో సేవింపబడువానిని, ప్రకాశమానమైన పాదములు కలిగిన వానిని, వేంకటాచలముపై నివాసము ఏర్పరచుకున వాడైన హరిని, పరమపురుషుని, పోల్చడానికి యే ఉపమానాలూ లేనివాడిని, గోవులను పాలించు బాలుని  మనస్సుయందు నిరంతరం భావించుచున్నాను. 

ఈ సంకీర్తనని బాలకృష్ణప్రసాద్ గారి దివ్యగాత్రంలో శ్రావణ్కుమార్ బ్లాగునందు వినండి. http://annamacharya-lyrics.blogspot.com.au/search?q=bhavayami