Total Pageviews

Friday, May 23, 2014

కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును - ఇమ్ముల నీ పతి భాగ్య మెంతని చెప్పేదే [Komma nee chakkadanamu kOti sEsunu]

//ప// కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును
ఇమ్ముల నీ పతి భాగ్య మెంతని చెప్పేదే

//చ// సెలవి నవ్విన నవ్వు చెక్కిట బెట్టిన చెయ్యి
చెలి నీ మొగమునకు సింగారమాయ
తిలకించి చూచేచూపు తేనెగారేమోవిమాట
కలికితనాల కెల్లా కందువలై తోచెను

//చ// మొనచన్నులకదలు మొగిఁగమ్మలతళుకు
వనిత నీవయసుకు వన్నె వచ్చెను
పొనుగులేతసిగ్గులు బొమ్మముడిజంకెనలు
తనివోనియాసలకుఁ దగినగురుతులు

//చ// బలుపిరుదులసొంపు పాదపుమట్టెలరొద
అలమేల్మంగ నీరతి కడియాలము
లలి శ్రీవేంకటేశుఁ గలయు నీచేతులగోళ్ళ-
దలకొన్నరాకులు తారుకాణలు

ముఖ్యపదార్ధం:
కొమ్మ: స్త్రీ
కోటి: అనంతము
ఇమ్ముల: చక్కని, బాగుగా
సెలవి: పెదవి మూల
చెక్కిలి: చెక్కు, కపోలము (చీక్)
మోవి: పెదవి
కలికితనము: చక్కని ఆడతనము
కందువ: అందము
మొనచన్నులు: పొడుచుకొచ్చినట్టు నిటారుగా ఉండే వక్షోజాలు
మొగికమ్మల తళుకు: ఉమ్మడి చెవికమ్మల తళుకులు (రెండు చెవి కమ్మలు అని అర్ధం)
వన్నె: అందము
పొనుగు: చిన్నపాటి, తేజము లేని
బొమ్మముడి: కనుబొమ్మలను దగ్గర చేసినప్పుడు నుదుటిపై చర్మము చేయు ఆకృతి
జంకెన: భయపడు, సంకోచించు
తనివి+పోని+ఆశలు: తృప్తి తీరని కోరికలు
అడియాలము: అడుగు+అలము= గుర్తు
లలి: ప్రేమతో, అందముగా, సొగసుతో, ఉత్సాహముతో
రాకులు: గీతలు, గీరుళ్ళు
తారుకాణలు: తార్కాణాలు= నిదర్శనాలు

భావం:
ఈ సంకీర్తనలో అమ్మవారిని చెలికత్తెలు పొగిడే విధానాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

ఓ పడతీ! నీ అందము అనంతము...ఇంత చక్కని అందాన్ని పొందిన నీ భర్త భాగ్యము ఎంతని చెప్పేదే?

ఓ చెలీ! నీ పెదవి మూలలనుంచి వచ్చే నవ్వు, దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు నీ చెక్కులపై పెట్టిన చెయ్యి - నీ ముద్దైన మోమునకు మరింత ముగ్ధత్వాన్ని చేకూరుస్తున్నాయి... కాంతులీనే కన్నులతో నీవు చూసే చూపు, పెదవులనుండి వచ్చే తియ్యనైన మాట - నీ ఆడతనానికంతటికీ  అందాన్ని తెస్తున్నాయి..

ఓ వనితా! ఏ మాత్రం వాలిపోకుండా పొడుచుకుని వచ్చినట్టుండే   నీ వక్షోజాల కదలికలు, చెవులకు పెట్టుకున్న జంట చెవికమ్మల మెరుపులు - నీ యౌవ్వనపు వయసుకి కొత్త అందాన్ని తెస్తున్నాయి. ఇంకా సరిగ్గా వికశించని లేలేత సిగ్గులు, శ్రీవారు తలపులోకి రాగానే సంకోచంతో ఏర్పడే కనుబొమ్మలు ముడి - నీ శరీరానికి తీరని కోరికలకు తగిన గుర్తులు. 

అలమేల్మంగా! నీ బలమైన పిరుదుల అందమైన ఆకృతి, పాదాలకి పెట్టుకున్న మట్టెలు చేసే ధ్వని  - నువ్వు శ్రీవారితో పొందుతున్న రతికి  గుర్తులు. సున్నితమైన శ్రీవేంకటేశ్వరుని కలసినప్పుడు ఆయన శరీరంపై నీ చేతి గోళ్ళు ఏర్పరచిన గుర్తులే - మీ ఇద్దరి అద్భుత రతికి నిదర్శనము. 

(అంత అందమైన స్త్రీని భార్యగా పొందిన శ్రీవారు ఎంత భాగ్యవంతులో అని పొగుడుతూ, ఆయనతో అలమేల్మంగ పొందిన రతి సుఖాల వల్ల వచ్చిన గుర్తులను గుర్తుచేస్తూ చెలులు ఆటపట్టిస్తున్నారన్నమాట)..    

ఈ కీర్తన ఇక్కడ వినండి:
http://annamacharya-lyrics.blogspot.in/2014/03/820komma-ni-chakkamdanamu-koti-sesunu.html