Total Pageviews

Monday, July 11, 2011

కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు

//ప//కొమ్మ నీ పలుకులకు కుశలమస్తు
సమ్మదపు వయసు కైశ్వర్యమస్తు

//చ//బెడగు కళలను చాల పెంపొందించుచున్న నీ
యుడురాజు మోముకభ్యుదయమస్తు
కడివోని నీరజపు కళికలను గేరు, నీ
నెడడ కుచములకు నభివృధ్ధిరస్తు 

//చ//వొగరు మిగులగ తేనె లొలుకు నున్నటి నీ
చిగురు మోవికిని ఫల సిద్ధిరస్తు 
సొగసు చక్రములతో సొలయు నీ పిరుదులకు 
అగణిత మనోరథావ్యాప్తిరస్తు

//చ//తనరు తుమ్మెదగములఁ దరము నీ కురులకును 
అనుపమంబైన దీర్ఘాయురస్తు 
నను ద్వారకాకృష్ణుడనుచుఁ గూడిన నీకు
అనుదినము నిత్య కల్యాణమస్తు

ముఖ్య పదాల అర్ధం:
కొమ్మ: స్త్రీ, అందమైన యువతి
నీ పలుకులకు: నీవు పలికే మాటలకు
కుశలమస్తు: క్షేమము అగుగాక
సమ్మదపు: ప్రమోదము, ఆనందము, సంతోషము (Joy, pleasure, happiness) అగు
వయసు కైశ్వర్యమస్తు = వయసుకు+ ఐశ్వర్యమస్తు: ప్రాయము గొప్ప సంపద అగుగాక

బెడగు కళలను: కులుకు, సొగసు, అందము, విలాసవంతమైన కళలు(Fineness, prettiness, handsomeness, prime, grace, comeliness, elegance)
చాల పెంపొందించుచున్న: చాలా ఎక్కువగా పెంపొందించుకున్న 
నీ యుడురాజు మోముకభ్యుదయమస్తు: నీ చంద్రబింబము వంటి మొగమునకు మంగళము, శుభము కలుగు గాక
కడివోని: చెడని, పాడైపోని (To be spoiled చెడిపోవు. కడివోని excellent, unspoiled)
నీరజపు: నీటిలో పుట్టినది (తామెర/కలువ)
కళికలను గేరు: కాంతులను పోలినట్టు/తామెర తంపరలై పెరిగినట్టు
నీ నెడడ కుచములకు నభివృధ్ధిరస్తు: నీ వక్షస్థలము నందున్న కుచములు అభివృద్ధి చెందుగాక

వొగరు మిగులగ: కొంచెం వగరు మిగిలిన
తేనె లొలుకు: తేనెలు ఒలికేటి 
నున్నటి నీ చిగురు మోవికిని: నున్నటి నీ చిగురు పెదవులకు 
ఫల సిద్ధిరస్తు: ఫలము సిద్ధించుగాక 
సొగసు చక్రములతో: అందమైన చక్రాలవలే
సొలయు: నిస్త్రాణము చెందిన, పారవశ్యము చెందిన 
నీ పిరుదులకు: నీ జఘనములకు (a pair of hips)  
అగణిత: అపరిమితమైన, మహత్తైన, విస్తారమైన. (Inestimable, countless, innumerable, endless, great)
మనోరథావ్యాప్తిరస్తు: మనోరధాన్ననుసరించి వ్యాపించుగాక

తనరు: ఒప్పు, అతిశయించు, విజృంభించు (To appear or shine. to extend; to be great or large)
తుమ్మెదగములఁ దరము: తుమ్మెద రెక్కల వలే నల్లని వర్ణమును పోలిన 
నీ కురులకును: నీ పొడవాటి జడ/వెంట్రుకలకు 
అనుపమంబైన: అసదృశ్యమైన, ఈడుకాని. అనుపమితము (Incomparable, unrivalled, unparalleled. uncompared, matchless.)
దీర్ఘాయురస్తు: దీర్ఘ మైన ఆయుర్దాయము కలుగుగాక 
నను ద్వారకాకృష్ణుడనుచుఁ గూడిన: నను (శ్రీ వేంకటేశుని) ద్వారకను పరిపాలించిన కృష్ణుడనుచు దగ్గరకు వచ్చిన 
నీకు అనుదినము నిత్య కల్యాణమస్తు: నీకు ప్రతి దినము మంగళప్రదమౌదు గాక.

భావం:
ఈ కీర్తన అన్నమయ్య రాసిందేనా అన్న చిన్న అనుమానం కలిగినప్పటికీ, ఆ వర్ణన చూసిన తర్వాత అన్నమయ్యదేనేమో అనిపించించింది. ఎందుకంటే..ఈ కీర్తన వేంకట ముద్రాంకితం గా రచింపబడలేదు. 

ఓ అందమైన యువతీ! నీవు పలికే మాటలకు క్షేమము అగుగాక. ప్రమోదము కలిగించే నీ వయసు నీకు గొప్ప సంపద అగుగాక.
అందమైన కళలు చాలా ఎక్కువగా పెంపొందించుకున్న నీ చంద్రబింబము వంటి మొగమునకు మంగళము అగుగాక.
చెడిపోని కలువల కాంతుల వలే/నీటిలో కలువలు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయో అంత ఎక్కువగా నీ హృదయ సీమ ను అలరారు నీ అధ్బుత పయోదరములు/ స్తనములు/ కుచములు అభివృద్ధి చెందు గాక! (స్వామి తో రతి క్రీడ నిరంతరము కలిగియుండుట వలన ఆమె వక్షస్థలం పొంగి ఉంటుందని భావన) 
కొంచెం వగరు మిగిలిన తేనెలు ఒలికేటి నున్నటి నీ ఎర్రని చిగురు పెదవులకు ఫలము సిద్ధించుగాక. (స్వామి ఆ పెదవుల తేనెలను గ్రోలితే వాటికి ఫలితము దక్కినట్లే అని భావన)  
అందమైన చక్రాలవలే ఉన్ననీ పిరుదులకు (గుండ్రని చక్రాల వలే ఉన్నాయని భావన) అపరిమితమైన మనోరధా వ్యాప్తి సిద్ధించు గాక.
నల్లని తుమ్మెద రెక్కలను పోలిన నీ కురులకు అసదృశ్యము కాని దీర్ఘాయువు కలుగు గాక (అంటే ఎప్పటికీ అవి నల్లగానే ఉండవలెనను భావన. ఆమె కు వృద్ధాప్యం లేదని చెప్పుట ఉద్దేశ్యము)
నన్ను (శ్రీ వేంకటేశుని) ద్వారకను పరిపాలించిన కృష్ణుడనుచు దగ్గరకు వచ్చిన నీకు ప్రతి దినము మంగళప్రదమౌదు గాక.
ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://www.esnips.com/doc/66e94007-dccf-4eeb-af27-3589177fc77e/046-Komma-Nee---Anandbhairavi