Total Pageviews

Sunday, December 29, 2024

పొద్దిఁకనెన్నఁడు వొడచునొ పోయిన చెలి రాదా(డా??)యను

 శృంగార సంకీర్తన

రేకు: 25-1

సంపుటము: 5-138

రాగము: సామంతం


//ప// పొద్దిఁకనెన్నఁడు వొడచునొ పోయిన చెలి రాదా(డా??)యను

నిద్దుర గంటికిఁ దోఁపదు నిమిషం బొకయేఁడు ॥పల్లవి॥


//చ// కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు

నున్నని యొయ్యారంబులు నొచ్చినచూపులును

విన్నఁదనంబుల మఱపులు వేడుకమీరిన యలపులు

సన్నపుఁజెమటలుఁ దలఁచిన ఝల్లనె నామనసు ॥పొద్దిఁక॥


//చ// ఆఁగినరెప్పల నీరును నగ్గలమగు పన్నీటను

దోంగియుఁ దోఁగనిభావము దోఁచిన పయ్యెదయు

కాఁగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు

వేఁగిన చెలితాపమునకు వెన్నెల మండెడివి ॥పొద్దిఁక॥


//చ// దేవశిఖామణి తిరుమలదేవునిఁ దలఁచినఁ బాయక

భావించిన యీ కామిని భావములోపలను

ఆవిభుఁడే తానుండిఁక నాతఁడె తానెఱఁగఁగవలె

నీ వెలఁదికిఁ గల విరహంబేమని చెప్పుదము ॥పొద్దిఁక॥


ముఖ్య పదార్ధం:

పొద్దు: ప్రొద్దు యొక్క రూపాంతరము = సూర్యుని రాక

గబ్బితనం: కొంటెతనం

విన్నదనము: దైన్యము

మఱపు: వశపరచుకొను

అలపు: శ్రమ

సన్నపు: పలుచని

అగ్గలము: అధికము

తోగియు తోగని: తెలిపీ తెలుపని

తోచిన, పయ్యెద: కనిపించు/ప్రత్యక్షమగు, పమిట కొంగు

కాగు: తపించు

సెకలు: వేడి

సొరబు/సొరపు: కృశించు/వాడిపోవు

పాయక: విడువకుండా

వెలది: స్త్రీ

 

భావం: [యథాతథము]

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, భక్తి కవిత్వం యొక్క అజరామర సింహాసనంపై అధిష్టితులైన మహానుభావుడు. ఆయన రచనల్లో భక్తి, శృంగార, ఆధ్యాత్మిక తాత్వికతల నిండుదనమూ, సహజ సౌందర్యమూ వ్యక్తమవుతాయి.

ఈ సంకీర్తనలో, అమ్మవారు శ్రీవారికోసం రాత్రంతా వేచిచూస్తున్నారు ట. ఆమెకు శ్రీవారితో గడిపిన ఆనంద క్షణాలు గుర్తొచ్చి విరహవేదనను అనుభవిస్తూన్నారు. ఆవిడ విరహవేదనను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. శ్రీవారే అర్ధం చేసుకుని ఆమెను కరుణించాలంటున్నారు.  

ఇది కేవలం శృంగార పాట మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం, మనసును స్పృశించే మధురానుభూతి! ఈ కీర్తనలో శృంగారం భక్తిరసంతో మిళితమై ఉంది. ఇది భౌతిక ప్రేమను ప్రతిబింబించేంత మాత్రమే కాక, ఆధ్యాత్మిక విరహానుభూతిని ప్రతిబింబిస్తుంది. ఒక భక్తుడు (ప్రేయసి) తన స్వామి (ప్రియుడు) దర్శనమంటే ఎంత ఆత్రంగా ఎదురు చూస్తున్నాడో ఈ కీర్తనలో ప్రతిఫలమవుతోంది.

//ప// పొద్దు ఇక ఎప్పుడు పొడుస్తుందో...ఎక్కడికో వెళ్ళిన ప్రియుడు ఇంకా రాలేదు. కంటికి నిద్దుర రావట్లేదు. ఒక్కో నిముషం ఒక్కో సంవత్సరంలా గడుస్తోంది. 

When will the dawn finally break? The beloved, who has gone somewhere, hasn’t returned yet. Sleep evades my eyes. Every minute feels like a year.

(ఇక్కడ "చెలి" అని ఉంది. అంటే కేవలం హితమైన వారు (ఆడైనా/మగైనా) అనే అర్ధం చేసుకోవాలి. లేకపోతే ఈ సంకీర్తన అర్ధం కాదు. చెలి అనే పదానికి ’య" చేరిస్తే.. స్త్రీ లింగం, "కాడు" చేరిస్తే .. పుంలింగం గా అర్ధం చేసుకోవచ్చు. కేవలం చెలి తో ఆపేశారు కాబట్టి, ఒక స్త్రీ విరహాన్ని ఈ సంకీర్తనలో వివరిస్తున్నారు కాబట్టి,  ఇక్కడ చెలి అంటే హితుడైన స్వామి. అలాగే, చెలి రాదాయను అని కాకుండా చెలి రాడాయను అని చదువుకోవాలి.)   

//చ// స్వామితో ..... ఆమె కన్నులతో నవ్వే నవ్వులు, కొంటెతనపు మాటలు, నునుపైన/అందమైన ఆమె వయ్యారాలు, కోపపు చూపులు, దైన్యంగా వశపరచుకోవడాలు, ఆనందంతో కూడిన శ్రమలు, ఆ శ్రమ పడడం వల్ల ఉదయించే సన్నము ముత్యపు బిందువుల్లాంటి చెమటలు......ఇవన్నీ తలుచుకోవడం వల్ల నా మనసు ఝల్లుమంటోంది. 

Memories with the Lord… the playful smiles exchanged with her eyes, mischievous words, her delicate and graceful demeanor, her angry glances, her gentle submission, the joyful labors she undertook, and the pearls of sweat that arose from those efforts, resembling tiny pearls… All these recollections make my heart swell with emotion.

//చ// మూసిన ఆమె కంటి నుండి కారే సన్నని నీరు(సుఖానుభూతి వల్ల అయ్యుండచ్చు), ఎక్కువగా పూసిన పన్నీరు, క్రిందకి జారి పడి, వక్షోజాలను కప్పిఉంచే పమిటకొంగు తడిసిపోయి, పక్కకి తొలగి, తెలిపీ తెలుపని ఆమె భావాలు....వియోగ దు:ఖం వల్ల దహించుకుపోతున్న శరీరపు వేడి సెగలు, ఆ వేడికి వాడిపోయిన కప్పిఉంచిన పువ్వులు, .... అలా వేగిన ప్రేయసి మదన తాపానికి చల్లని వెన్నెల కూడా మంటపుట్టినంతగా ఉంది.    

Soft tears flow from her closed eyes (perhaps due to joy), and the abundant sandalwood paste slips down and soaks the saree’s edge that covers her chest, sliding aside, revealing her deep and uncertain emotions… The heat radiating from her body is consumed by the anguish of separation, and the flowers adorning her hair wither under that warmth… In such a state, even the cool moonlight feels burning to the love-struck maiden enduring her pain of separation.

//చ// దేవదేవుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని విడువకుండా తలచి, ఆయన్నే భావించిన, యీ కామిని మనసులో ఆయనే ఉండి, ఇక ఆయనే ఈమెను తెలుసుకోవాలి గానీ, ఈ స్త్రీ కి కలిగిన విరహం మనమేమి చెప్పగలము?

Constantly meditating upon Lord Venkateswara of Tirumala, never letting him leave her thoughts, this maiden’s heart is entirely consumed by him. She perceives him as her sole essence and being. Who else but the Lord himself can truly understand her longing and the depth of her separation? What can we, mere mortals, possibly say about the pain of her divine yearning?


ఆధ్యాత్మిక భావం: [Spiritual Essence]

భక్తుడు తన స్వామిని తలుచుకుంటూ, ఆయన దూరమై ఉన్నట్లు భావించి, ఆ విరహం వల్ల నిద్రపట్టకుండా ఒక్కో క్షణం యుగంలా అనిపిస్తోందని చెబుతున్నారు. ఇక్కడ "పొద్దు" అంటే కొత్త వెలుగును (స్వామి దర్శనాన్ని) సూచిస్తుంది.

A devotee, meditating on the Lord, perceives his absence and describes how the resulting separation prevents sleep, making each moment feel like an eternity. Here, "dawn" symbolizes the arrival of new light (the Lord’s vision).

మొదటి చరణం భక్తుని స్వామితో గతంలో గడిపిన తీపి అనుభూతుల్ని సూచిస్తుంది. స్వామి యొక్క సౌందర్యం, ఆయన మాటలలోని అనురాగం, ఆయన స్పర్శ వంటి దివ్యమైన అనుభవాలు భక్తుని మనసుకు ఝల్లుమనే ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. ఇది స్వామి సాన్నిధ్యాన్ని తలుచుకుంటూ తీయనైన బాధను వ్యక్తం చేస్తోంది. 

The first stanza reflects the devotee reminiscing about sweet past moments with the Lord. The divine experiences of the Lord’s beauty, the affection in his words, and his touch bring immense joy, portraying a bittersweet pain in his absence.

రెండవ చరణంలో విరహభక్తి మరింత లోతుగా ప్రతిఫలిస్తోంది. భక్తుడు స్వామిని తలచుకుంటూ కన్నీటి ధారలో తడిసి, వియోగ తాపం నుంచి ఆయన రాక కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నాడు. భక్తుడు తన అనుభూతుల్ని వ్యక్తపరచడంలో ప్రకృతిని కూడా పరోక్షంగా ఉపయోగిస్తున్నాడు, చెప్పకనే స్వామి యొక్క దివ్య స్పర్శ కోసం ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాడు.

In the second stanza, the devotee’s anguish deepens. Remembering the Lord, the devotee sheds tears of longing and waits eagerly for his return. The devotee uses nature as a metaphor, indirectly expressing their yearning for the Lord’s divine touch.

మూడవ చరణంలో భక్తుడు శ్రీవేంకటేశ్వరుని స్మరణతో జీవిస్తున్న తన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు. భక్తుని అభిప్రాయంలో, స్వామి తప్ప మరెవరూ తన తపస్సు, విరహ వేదనను అర్థం చేసుకోలేరు.

The third stanza emphasizes the devotee’s life sustained solely through constant remembrance of Lord Venkateswara. In the devotee’s view, only the Lord can truly comprehend the depth of their meditation, anguish, and longing.

Saturday, December 7, 2024

లంజకాఁడవౌదువురా లంజకాఁడవౌదువు నీ లాగులెల్లఁ గానవచ్చె

             శృంగార సంకీర్తన, రేకు: 14-5, సంపుటము: 5-84, రాగము: ఆహిరి

//ప// లంజకాఁడవౌదువురా

లంజకాఁడవౌదువు నీ లాగులెల్లఁ గానవచ్చె

ముంజేతఁ బెట్టిన సొమ్ములకద్దమేలరా ॥పల్లవి॥


//చ// కొంకక యెవ్వతో కాని కోరి నీబుజము మీఁద

కంకణాల చేయి వేసి కౌఁగిలించఁ బోలును

వంకలైన వొత్తులెల్ల వడిఁ గానవచ్చె నింక

బొంక నేమిటికిరా నీ బూమెలెల్లఁ గంటిమి ॥లంజ॥


//చ// ఒద్దిక నెవ్వతో గాని వోరి నీవురము మీఁద

నిద్దిరించఁ గంటమాల నీలములొత్తినది

తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో

బద్దనేఁటికిరా నేఁ బచ్చి సేయఁ జాలను ॥లంజ॥


//చ// వేడుక నెవ్వతో తిరువేంకటేశ్వర నిన్ను

కూడిన నీమేనితావి కొల్ల వట్టుకొన్నది

తోడనె నాకౌఁగిటిలో దొరకొంటి వింక నిన్ను-

నాడ నేమిటికిరా నా యలపెల్లఁ దీరెను ॥లంజ॥


ముఖ్యపదార్ధం:

లంజకాఁడు: విటుడు A whoremonger

లాగులెల్లఁ: పనులన్నీ

ముంజేతఁ: ముందు + చెయ్యి

కొంకక: భయపడకుండా/సంకోచొంచకుండా (Fear. Timidity, shyness లేకుండా)

యెవ్వతో కాని కోరి నీబుజము మీఁద

కంకణాల చేయి వేసి కౌఁగిలించఁ బోలును

వంకలైన: వంపులైన

వొత్తులెల్ల: భుజకీర్తులు

గానవచ్చె: కనిపించె

బొంకు:  అబద్ధము. అసత్యము

బూమెలెల్లఁ: గంటిమి: మాయలు/వంచనలన్నీ చూశాము


ఒద్దిక నెవ్వతో: పొందికైన/అనుకూలవతియైన ఎవతో గాని

నీ వురము మీఁద: నీ వక్షస్థలము మీద

నిద్దిరించఁ: పడుకొనగా

కంటమాల నీలము: మెడ హారములోని కౌస్తుభమణి 

తిద్దిన జాణవు: నేర్పరి యైన జాణకాడవు

బద్దనేఁటికిరా: అబద్ధాలెందుకురా/వేరు చేయడం ఎందుకురా

నేఁ బచ్చి సేయఁ జాలను: నేను నీ సాంగత్యాన్ని విడువలేను


వేడుక నెవ్వతో: ఎంతో సంతోషంతో ఎవతో

నిన్ను కూడిన: నీతో కలసిన

నీమేనితావి: నీ శరీరపు పరిమళము

కొల్ల వట్టుకొన్నది: చాలా పట్టుకుంది

తోడనే: వెంటనే

దొరకొంటి: లభించు, దొరకు

యలపెల్లఁ దీరెను: బడలిక అంతా తీరిపోయింది.


భావం:

అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని కేవలం శిలలో మలచిన రూపంలో నే కాక, అనేక స్వరూపాలలో దర్శించారు. ఈ సంకీర్తనలో చెలులు శ్రీవారి కోసం ఎదురు చూస్తూ, ఆయన కనబడగానే, కోపంతో మాటలంటూ, "సరేలే, నువ్వు నేర్పరియన జాణకాడవు. చేసిన వన్నీ చేసి మాతో ఈ వేషాలెందుకు, ఎంతచేసినా నిన్ను విడిచి ఉండలేమని, వారి తన్మయ భక్తిని చాటుతున్నట్టు", ఉంటుంది. ఎన్నో అద్భుత ప్రయోగాలు ఈ భావనా శిల్పంలో ఉన్నాయి. చదివి, భావించి...తరించండి. 


ప// లంజకాడ వౌతావురా, నువ్వు లంజకాడవు. నీవు చేసిన పనులన్నీ నీ వేషాలని తెలియజేస్తున్నాయి. ఐనా, ముందు చేతికి ధరించిన కంకణాన్ని చూసుకోడానికి అద్దమెందుకు...[అంటే...నువ్విలాంటివాడివని తెలిసికూడా ఇంకా ఆనవాళ్ళు ఎందుకు?, అని]


 చ// సిగ్గులేనిదెవతో కానీ నీ భుజము మీద తన కంకణాల చేతిని వేసి కౌగిలించ బోయింది కాబోలు. నీ భుజాలపై వొంపులు తిరిగి ఉండే భుజకీర్తులు కింద పడి పోయి కనిపిస్తున్నాయి. ఇంకా ఈ అబద్ధాలెందుకురా, నీ వంచనలన్నీ చూస్తున్నాము.   


చ// పొందికైనది ఎవతో నీ వక్షస్థలముపై పడుకుని ఉంటుంది. అదిగో, నీ కంఠ హారములోని కౌస్తుభ మణి లోపలకి పోయింది. బాగా నేర్పరియైన జాణకాడవు కాబట్టి, ఎవరెవరితోనో తిరిగి తిరిగి మాతో ఈ అబద్ధాలు, ఆటలెందుకురా.. నేను నీ సాంగత్యాన్ని విడువలేను. 


చ// తిరువేంకటేశ్వరా! వేరే ఎవతో ఎంతో సంతోషంతో నీతో సంగమించి నీ శరీరపు చెమట గంధాన్ని చాలా పట్టుకుంది. వెంటనే నిన్ను నాకౌఁగిటిలో దొరక పుచ్చుకున్నాను. ఇంక నిన్ను వదిలిపెట్టను. నా అలసట అంతా తీరిపోయింది.


Tuesday, October 8, 2024

నేను ఒక పుస్తకం రాశానండి. వ్యాపారం కోసం కాదు. జన హితం కోసం. మీ సహాయ సహకారాలు ఆశిస్తున్నాను.

 



Here is the link where the book can be purchased. From me, it will be available for 425 rupees + postal charges. Email me at: mangalampallikiran@gmail.com / Whatsapp 7550171061

https://www.amazon.in/dp/B0DHD79HZ8/ref=sr_1_2?crid=2TRP4V18BABMJ&dib=eyJ2IjoiMSJ9.HDUZURjyDUg75ANlQIc-c7Nrpde4HzorVg7QhOe7ezjPZMzXphpkbMh0ZiALixTz46oW0hkutoUI5dRJ2QIcngiwBTHJYq86qpLSp222x_xD7uJ4jP3RxvmUDcky77KeR4TmIZIwuluN3dUyyoggA6SiuYOaZjgsqt38VvBHkkoRq-vXA71d-gjeUFqySmnqavKoYe5KCBRZ0CRGKGt_2HG8qf6KiYo85-sKQYPDtyM.Oh64zeAQXlyIMJ1z6u9pxFTy0JrhWpiU8B-yix7aScE&dib_tag=se&keywords=curious+teens+and&qid=1726675003&sprefix=%2Caps%2C232&sr=8-2 

https://www.flipkart.com/curious-teens-responsible-parents-navigating-lifes-challenges-together-open-honest-mature-discussion-between-parent-teenager/p/itm73a88ea421941?pid=9798895560204&lid=LSTBOK9798895560204YMBWVQ&marketplace=FLIPKART&cmpid=content_book_8965229628_gmc

Thursday, September 19, 2024

అన్నియును నతని కృత్యములే యెన్నియైనా నవు నతఁడేమి సేసినను

 అధ్యాత్మ సంకీర్తన, రేకు: 3-7, సంపుటము: 1-20, రాగము: శ్రీరాగం


//ప// అన్నియును నతని కృత్యములే          

యెన్నియైనా నవు నతఁడేమి సేసినను ॥అన్ని॥


//చ// అణురేణుపరిపూర్ణుఁ డవలిమోమైతేను

అణువౌను కమలభవాండమైన

ఫణిశయనుని కృపాపరిపూర్ణమైతే

తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే ॥అన్ని॥


//చ// పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతేను

ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను

హరిమీఁది చింత పాయక నిజంబైతే

నిరతిఁ బట్టినవెల్లా నిధానములే ॥అన్ని॥


//చ// మదనగురుని సేవ మదికి వెగటైతేను

పదివేలు పుణ్యములు పాపంబులే

పదిలమై వేంకటపతి భక్తి గలిగితే

తుదిపదంబునకెల్ల దోడవువు నపుడే ॥అన్ని॥


ముఖ్యపదార్ధం:

అన్నియును – అన్ని

నతని – అతని

కృత్యములే – కర్మలే

యెన్నియైనా నవు– ఎన్నైనా అవుతాయి/ఏమైనా  అవుతాయి

నతఁడేమి – అతడు ఏమి

సేసినను – చేసినా


అణు – అణువు

రేణు – ధూళి కణం

పరిపూర్ణుఁ – సంపూర్ణంగా

డవలిమోమైతేను – అవతలి వాడైతే

అణువౌను – అణువు అవుతుంది

కమలభవాండమైన – కమలంలో పుట్టిన సృష్టి (బ్రహ్మాండం) కూడా

ఫణిశయనుని – పాము పైన నిద్రిస్తున్న వాడు (విష్ణువు)

కృపాపరిపూర్ణమైతే – కృపతో సంపూర్ణమైనప్పుడు

తృణమైన – గడ్డి మొక్క కూడా

మేరువౌ – మేరువు (పర్వతం) లా

స్థిరముగా – స్థిరంగా అవుతుంది.


పురుషోత్తముని – పురుషోత్తముడి (శ్రేష్ఠమైన మనిషి, శ్రీమహావిష్ణువు)

భక్తి – భక్తి

పొరపొచ్చమైతేను – పొరపాటవు అయితే/తేడాలొస్తే

ఎరవులౌ – తక్కువ అవుతాయి

ఎన్నైనను నిజసిరులు – నిజమైన సంపదలు ఎన్నైనా 

హరిమీఁది – హరివైపు

చింత – ఆలోచన

పాయక – విడవకుండా

నిజంబైతే – నిజమైనప్పుడు

నిరతిఁ – నిరంతర

బట్టినవెల్లా – పట్టినవన్నీ

నిధానములే – నిధులే


మదనగురుని – కామదేవుడి గురువు (మన్మధుడి తండ్రి, విష్ణువు)

సేవ – సేవ

మదికి – మనస్సుకు

వెగటైతేను – చిరాకు వేస్తే

పదివేలు – పదివేలు

పుణ్యములు – పుణ్యములు

పాపంబులే – పాపాలే

పదిలమై – భద్రంగా

వేంకటపతి – వేంకటేశ్వరుడు

భక్తి – భక్తి

గలిగితే – కలిగితే

తుదిపదంబున కెల్ల– మోక్షపదము చేరేవరకు  

తోడవువు నపుడే – తోడు వస్తుంది


భావం:

అన్నీ శ్రీ వేంకటేశ్వరుడి కర్మలు మాత్రమే. అతడు ఏమీ చేసినా, ఎన్నైనా అవుతాయి. 


అణు రేణు పరిపూర్ణుడైన స్వామి అటుపక్కనుంటే, బ్రహ్మాండం కూడా అణువంత అయిపోతుంది. 

శ్రీ మహావిష్ణువు కృప సంపూర్ణంగా ఉంటే, గడ్డి పరక కూడా మేరు పర్వతం అంత స్థిత్రం గా ఉంటుంది.


పురుషోత్తముడైన వేంకటేశ్వరుడిపై భక్తి లో పొరపాట్లు జరిగితే ఎన్ని నిజమైన సంపదలు ఉన్నా, అవన్నీ తక్కువగానే కనిపిస్తాయి.

హరి (విష్ణువు) పై ధ్యానం విడువకుండాలిగితే, పట్టినవన్నీ నిజమైన నిధులుగా మారతాయి.


మన్మధుని తండ్రైన విష్ణువు సేవ, మనస్సుకి చిరాకు తెస్తే, పదివేల పుణ్యాలు కూడా పాపాల్లా అయిపోతాయి. 

భద్రంగా వేంకటేశ్వరుడిపై భక్తి ఉంటే, ఆ భక్తి మనకు మోక్షం అందించే చివరి సహాయం చేస్తుంది.


Meaning in English:

All actions are only the deeds of Lord Venkateswara. Whatever He does, it will happen, no matter how big or small.


If the Lord, who is complete even in the tiniest particle, is by your side, even the entire universe becomes as small as an atom.

When the grace of Lord Vishnu is complete, even a blade of grass can stand as firm as the great Meru mountain.


If there are mistakes in the devotion towards Lord Venkateswara, no matter how much real wealth one possesses, it will seem insignificant.

If one's meditation on Lord Hari (Vishnu) is unwavering, everything they hold will turn into true treasures.


If serving Lord Vishnu, the father of Manmatha, becomes tiresome for the mind, even ten thousand merits will appear like sins.

If there is firm devotion to Lord Venkateswara, that devotion will be the final aid in granting us salvation.


Wednesday, September 18, 2024

ఏవం శ్రుతిమత మిదమేవ త- ద్భావయితు మతఃపరం నాస్తి

 అధ్యాత్మ సంకీర్తన, రేకు: 1-4, సంపుటము: 1-4, సంస్కృతకీర్తన, రాగము: సామంతం


//ప// ఏవం శ్రుతిమత మిదమేవ త-

ద్భావయితు మతఃపరం నాస్తి ॥ఏవం॥


//చ// అతులజన్మభోగాసక్తానాం

హితవైభవసుఖ మిదమేవ

సతతం శ్రీహరిసంకీర్తనం త-

ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి ॥ఏవం॥


//చ// బహుళమరణపరిభవచిత్తానా-

మిహపరసాధన మిదమేవ

అహిశయనమనోహరసేవా త-

ద్విహరణం వినా విధిరపి నాస్తి ॥ఏవం॥


//చ// సంసారదురితజాడ్యపరాణాం

హింసావిరహిత మిదమేవ

కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-

శంసైవా[1] పశ్చాదిహ నాస్తి ॥ఏవం॥


పదార్ధం:

ఏవం – ఈ విధంగా

శ్రుతిమత – వేదముల ద్వారా నిర్ధారితమైన

మిదమేవ – ఇదే

తత్-భావయితు – దానిని ధ్యానించుట

మతః – దీని నుండి

పరం – ఇతర, వేరే

నాస్తి – లేదు


అతుల – అతీత, তুলనార్హమైన

జన్మ – పుట్టుక

భోగ – అనుభవాలు, ఆహ్లాదాలు

ఆసక్తానాం – ఆసక్తి కలిగి ఉన్నవారు

హిత – మంచి, శ్రేయస్కరమైన

వైభవ – ఐశ్వర్యం

సుఖ – ఆనందం, సంతోషం

మిదమేవ – ఇదే

సతతం – ఎప్పుడూ, నిరంతరం

శ్రీహరి – విష్ణువు లేదా హరి

సంకీర్తనం – స్తుతి, కీర్తన

తత్ – దాని

వ్యతిరిక్త – వేరే, వేరొకటి

సుఖం – సంతోషం

వక్తుం – చెప్పడం

నాస్తి – లేదు


బహుళ – అనేక, ఎక్కువ

మరణ – మరణం

పరిభవ – క్షోభ, అవమానం

చిత్తానాం – మనసు, హృదయం

ఇహ – ఈ లోకంలో

పర – పునర్జన్మ

సాధన – సాధన, మార్గం

మిదమేవ – ఇదే

అహి – పాము, సర్పం (శేషుడు)

శయన – విశ్రాంతి

మనోహర – ఆకర్షణీయమైన

సేవా – సేవ, పూజ

తత్ – దాని

విహరణం – సంచారం, ప్రవేశం

వినా – లేకుండా

విధి – విధి, నియతి

అపి – కూడా

నాస్తి – లేదు


సంసార – కుటుంబం, జీవితం, లోకం

దురిత – కష్టాలు, బాధలు

జాడ్య – మాంద్యం, నిస్సత్తువ

పరాణాం – ఇతరుల

హింసా – హింస, దోషం

విరహిత – లేకుండా

మిదమేవ – ఇదే

కంసాంతక – కంసుడిని సంహరించిన

వేంకటగిరిపతే – వేంకటేశ్వరుడు

ప్రశంసా – స్తుతి, ప్రశంస

ఇహ – ఈ లోకంలో

నాస్తి – లేదు


పద్యార్థం (Meaning of the Sankeerthana)


పల్లవి: ఈ శ్రుతులు (వేదాలు) చెప్పే విషయమే అత్యంత ముఖ్యమైనది. దానిని సాధించడానికి వేరే మార్గం లేదు.


చరణం 1: అతులమైన జన్మలలో (అనేక జన్మలు) అనుభవించే భోగాలకు ఆసక్తి ఉన్నవారి కోసం మంచి పథకం ఇదే. శాశ్వత సుఖం శ్రీవిష్ణువు స్మరణలోనే ఉంటుంది. వేరే సుఖం అంటూ ఏదీ చెప్పలేము.


చరణం 2: బహుళ మరణాల (అనేక పునర్జన్మలు) కష్టాల నుండి బయటపడే మార్గం ఇదే. శ్రీహరివైభవం (విష్ణువును) స్మరించడం కంటే వేరే ఉపాయం లేదు. ఆయన మనోహర సేవే శాశ్వతమైనది.


చరణం 3: సంసారంలో ఉన్న కష్టాలు, దుర్గుణాలు (మానసిక మాంద్యం) నుండి బయటపడటానికి కూడా ఇదే మార్గం. హింస లేకుండా ఉండే మార్గం ఇదే. కంసాన్ని సంహరించిన వేంకటేశ్వరుని గాత్రంలో ఉన్న గొప్పతనం చెప్పడానికి వేరే మార్గం లేదు.


సారాంశం (Summary): ఈ పద్యం భగవంతుని స్మరణ యొక్క ప్రాముఖ్యతను తెలిపింది. శ్రీవేంకటేశ్వరుని స్మరణలోనే శాశ్వత సుఖం, కష్టాల నుండి విముక్తి అని, వేరే మార్గాలు లేవని వివరించింది.


Meaning of the Sankeerthana:


Pallavi: In this way, what is prescribed by the scriptures, There is nothing beyond this to meditate upon. This is the supreme truth.


Charanam 1: For those attached to the incomparable pleasures of birth, This is the path to eternal prosperity and happiness. It is the continuous chanting of Lord Hari’s name, There is no other joy apart from this.


Charanam 2: For those with minds troubled by repeated deaths and humiliation, This is the only solution, both here and in the afterlife. The service of Lord Vishnu, reclining on the serpent Adisesha, Without this, even destiny itself cannot do anything.


Charanam 3: For those whose minds are dulled by the sufferings of worldly existence, This path, free from violence, is the only remedy. The praise of Lord Venkateswara, who destroyed Kamsa, There is nothing else that can surpass this.


Summary: This Keerthana emphasizes the importance of devotion to Lord Vishnu (Sri Hari), suggesting that continuous chanting of His name and service to Him brings happiness and salvation. It stresses that all worldly pleasures, fears, and sufferings are transcended by this path, and that there is no greater path than surrendering to the Lord's grace.

Tuesday, September 17, 2024

నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య - నమో నమో శంకర నగజానుత

అధ్యాత్మ సంకీర్తన - రేకు 381 - సంపుటము 4 కీర్తన 471 

పల్లవి:

నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య

నమో నమో శంకర నగజానుత


చరణం 1:

విహితధర్మపాలక వీరదశరథరామ

గహనవాసినీ తాటకామర్దన-

అహల్యా శాపమోచన అసురకులభంజన

సహజ విశ్వామిత్ర సవనరక్షకా


చరణం 2:

హరకోదండహర సీతాంగనావల్లభ

ఖరదూషణారి వాలిగర్వాపహా

తరణితనూజాది తరుచరపాలక

శరధిలంఘనకృత సౌమిత్రిసమేతా


చరణం 3:

బిరుద రావణ శిరోభేదక విభీషణ

వరద సాకేత పురవాస రాఘవ

నిరుపమ శ్రీవేంకటనిలయ నిజ సకల

పురవర విహార పుండరీకాక్షా


ముఖ్యపదార్ధం:

నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య : రఘువంశానికి నాయకుడైన రామా, దేవతలకు కూడా వందనీయుడైన నీకు నమస్కారం.

నమో నమో శంకర నగజానుత : శంకర, పార్వతీ దేవి చేత పూజించబడే రామా, నీకు నమస్కారం.


చరణం 1:

విహితధర్మపాలక వీరదశరథరామ: ధర్మాన్ని రక్షించే ధీరుడవైన, దశరథుని కుమారుడా, నీకు నమస్కారం.

గహనవాసినీ తాటకామర్దన: అరణ్యవాసంలో తాటక రాక్షసిని సంహరించిన రామా, నీ మహిమను కీర్తిస్తాము.

అహల్యా శాపమోచన అసురకులభంజన: అహల్యకు శాప విమోచనం కలిగించినవాడా, రాక్షస కులాలను సంహరించే స్వామీ, నీకు నమస్కారం.

సహజ విశ్వామిత్ర సవనరక్షకా: సహజంగా విశ్వామిత్రుని యాగాలను రక్షించిన రామా, నీకు వందనాలు.


చరణం 2:

హరకోదండహర సీతాంగనావల్లభ: శివధనుస్సును విరచి సీతాదేవిని వరించినవాడా, నీకు వందనాలు.

ఖరదూషణారి వాలిగర్వాపహా: ఖర-దూషణులకు శతృవై సంహరించినవాడు, వాలిని సంహరించి అతని గర్వాన్ని పోగొట్టినవాడు.

తరణితనూజాది తరుచరపాలక: సూర్య కుమారుడైన హనుమంతుని సహా వానర సేనకు నాయకుడైన రామా, నీకు నమస్కారం.

శరధిలంఘనకృత సౌమిత్రిసమేతా: సౌమిత్రి లక్ష్మణునితో కలిసి సముద్రాన్ని దాటినవాడా, నీకు వందనాలు.


చరణం 3:

బిరుద రావణ శిరోభేదక విభీషణ: రావణుడి తలలను ఛేదించి విజయతిలకం పొందిన వాడా, విభీషణునికి రాజ్యాన్ని ఇచ్చినవాడా.

వరద సాకేత పురవాస రాఘవ: సాకేతపురిలో నివసించే రాఘవా, వరాలు ప్రసాదించే స్వామీ, నీకు వందనాలు.

నిరుపమ శ్రీవేంకటనిలయ నిజ సకల-: అద్భుతమైన శ్రీ వేంకటాద్రి పర్వత నివాసీ, నీకు నమస్కారం.

-పురవర విహార పుండరీకాక్షా:సర్వ లోకాలలో విహరించేవాడా, కమలనయనుడా, నీకు వందనాలు.


Summary in English:

This hymn is a beautiful praise of Lord Rama, the beloved son of King Dasharatha, protector of righteousness, and destroyer of evil forces. The song acknowledges his deeds, such as the defeat of the demoness Tataka, the redemption of Ahalya, and the triumph over Ravana. It describes Rama’s companionship with Sita and Lakshmana, his leadership of the Vanarasena, and his close relationship with Hanuman. Each verse glorifies Rama’s divine attributes, portraying him as the ideal leader and warrior, whose presence is revered not just by humans but by all celestial beings.


Wednesday, June 21, 2023

ఎక్కువకులజుడైన హీనకులజుడైన - నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||

 ప|| ఎక్కువకులజుడైన హీనకులజుడైన | 

నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||


చ|| వేదములు చదివియు విముఖుడై హరిభక్తి | 

యాదరించలేని సోమయాజికంటె |

యేదియునులేని కులహీనుడైనను విష్ణు | 

పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||


చ|| పరమమగు వేదాంత పఠన దొరికియు సదా |

హరిభక్తిలేని సన్యాసికంటె |

సరవి మాలిన యంత్యజాతి కులజుడైన |

నరసి విష్ణు వెదుకునాతడే ఘనుడు ||


చ|| వినియు జదివియును శ్రీవిభుని దాసుడుగాక | 

తనువు వేపుచునుండు తపసికంటె |

ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్న- | 

మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||


ముఖ్యపదార్ధం:

నిక్కము: నిజము

కులజుడు: కులమునందు పుట్టిన వాడు

విముఖుడు: ఇష్టత లేనివాడు

కులహీనుడు: క్రింది కులస్థుడు (జాత్యహంకారం ఎక్కువ ఉన్న రోజుల్లో మాట)

సోమయాజి: A sacrificer, యజ్ఞము చేసినవాడు [యజ్ఞములో సోమరసముత్రాగువాడు]

పఠన: చదువుట

సరవిమాలిన: వరుసలో చివరన ఉండుట (లేదా లెక్ఖల్లో లేని)

అంత్యజాతి: చివరి కులము

శ్రీవిభుడు: లక్ష్మీదేవి భర్త

తనువు: శరీరము

ఘనుడు: A great man. గొప్పవాడు


భావం:

అన్నమయ్య శ్రీవేంకటేశ్వరునికి పరమ భక్తుడేగాక, తన సంకీర్తనలతో ఆనాటి సాంఘిక అనమానతలను తీవ్రంగా ప్రతిఘటించాడు.

ఉన్నత కులంలో పుట్టి, సకల దుర్వ్యసనాల బారిన పడి కర్మ చండాలుడైన వాడికంటే కులహీనుడైనా, సకల సద్గుణ సంపన్నుడై, విష్ణు పాదములు సేవించువాడే ఘనుడు అని తీర్మానం చేశారు. ఈ విధంగా అన్నమయ్య ను గొప్ప సంఘ సంస్కర్త అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. 


//ప// ఎక్కువ కులంలో పుట్టినా, తక్కువ కులం లో పుట్టినా ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో, వాడే గొప్పవాడు. [కర్మచేత గాని, జన్మచేత ఎవ్వడూ గొప్పవాడు కాడని అర్ధం]


//చ// వేదాలన్నీ చదివి, యజ్ఞాలు చేసి, అరిషడ్వర్గాల బారిన పడి, హరి భక్తిలేని బ్రాహ్మణుడి కంటే.....ఏ చదువులూ లేకుండా, అబ్రాహ్మణ కులంలో పుట్టినా, పరమ భక్తి, శ్రద్ధలతో విష్ణు పాదములు ఎవడైతే  సేవిస్తాడో...వాడే గొప్పవాడు...


//చ// గొప్పవైన వేదవేదాంతములు చదువుకునే అవకాశం దొరికి కూడా, ఎప్పుడూ కనీసం హరిభక్తిలేని సన్యాసి కంటే... వరుసలో చివరన ఉండే కులములో పుట్టి, నిరంతరము విష్ణువును వెదకే వాడే గొప్పవాడు.  


//చ// శాస్త్రాలు, పురాణాలు ఎన్నో విని, చదివి కూడా విష్ణు దాసుడు కాకుండా, తపస్సు పేరుమీద శరీరాన్ని మాడ్చుకునే తాపసి కంటే... అన్నిటికన్నా ఘనమైన శ్రీవేంకటేశ్వరుని ప్రసాద మాధుర్యాన్ని భక్తితో అనుభవిస్తూ, శ్రీవారికి దగ్గరగా ఉండి, ఆయన సేవను చేసుకునే  వాడే ఘనుడు.   

ఈ సంకీర్తన మాతృ స్వరూపిణి,  శ్రీవేంకటేశ్వరుని పరమ భక్తురాలు, జీవితాన్ని మొత్తం అన్నమయ్య సంకీర్తన ప్రచారానికై వినియోగిస్తూన్న శ్రీమతి పద్మశ్రీ డా. శోభారాజు గారి గానంలో వినండి. [https://youtu.be/PnC3REthVs0]   


Thursday, August 11, 2022

ఒకపరి కొకపరి వొయ్యారమై - మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె (Okapari okapari)

 ఒకపరి కొకపరి వొయ్యారమై

మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె         // పల్లవి //


జగదేకపతిమేనఁ జల్లిన కర్పూరధూళి

జిగిగొని నలువంకఁ జిందఁగాను

మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గాన

పొగరువెన్నెల దిగఁబోసిన ట్లుండె                 // ఒక //


పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసిన తట్టుపుణుఁగు

కరఁగి యిరుదెసలఁ గారఁగాను

కరిగమనవిభుఁడు గనుక మోహమదము

తొరిగి సామజసిరి దొలఁకిన ట్లుండె               // ఒక //


మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను

తఱచయిన సొమ్ములు ధరియించఁగా

మెఱుఁగుఁబోడి యలమేలుమంగయుఁ దాను

మెఱుపుమేఘము గూడి మెఱసిన ట్లుండె   // ఒక //


ముఖ్యపదార్ధం:


ఒకపరి = విధము, once. Manner

ఒయ్యారము or ఒయారము: అందము, Bloom, grace

మొకము: ముఖము

కళలు: భాగము, sub-division. 

మొలచు: అంకురము, మొలక To sprout

మేని: శరీరము

ధూళి: రజను

జిగి: కాంతి, చల్లని వెలుగు, Brilliancy 

నలువంక: నాలుగు దిక్కుల వైపు

మొగి: పూను, An attempt

ఉరము: వక్షస్థలము

పొగరువెన్నెల: తీక్ష్ణమైన కాంతి Pride, గర్వము

దిగబోయు: దిగువకు వ్యాపించుట, Spreading downwards

పొరి: అత్యంతము, మిక్కిలి, Strong, great

చెక్కు: అద్దము

తట్టుపుణుఁగు: పునుగుపిల్లి తైలము

దెసలు: వైపుల

కరిగమన: యేనుగు వలె నడచు

మదము: మత్తు, పారవశ్యము

సామజము: యేనుగు

తఱచ: దట్టమైన, thick


భావం:

ఈ సంకీర్తన అన్నమాచార్యుల కుమారుడైన పెదతిరుమలయ్య గారి రచన. పెదతిరుమలయ్య, ఆయన తనయుడు చిన్నన్న కూడా అన్నమయ్య అంతటి గొప్ప సంకీర్తనాచార్యులు, పరమ వేంకటేశ్వర భక్తులు. పెదతిరుమయ్య తిరుమల అభివృద్ధికి ఎంతో చేశారు. 


//ప// స్వామి రూపము..అందంగా, మరింత అందంగా, చూసిన ప్రతీసారీ ముఖంలో ఒక్కోసారి ఒక్కో కళ చప్పున మొలిచినట్టుగా ఉంది. 


//చ// జగదేకపతియైన స్వామి శరీరంపై చల్లిన తెల్లని కర్పూర రజను మరింత కాంతివంతంగా మారి నాలుగు పక్కలకీ చిందుతుంటే....ఆయన వక్షస్థలము చంద్రముఖిని (శ్రీదేవిని) పూని చిక్కని, తీక్ష్ణమైన వెన్నెలను కిందకి వెదజల్లుతున్నట్టుంది. 


//చ// మిక్కిలిగా మెరుస్తూన్న నున్నని అద్దాలవలే ఉన్న బుగ్గలపై పూసిన పునుగు తైలము కరిగి రెండువైపులా కారుతుంటే....మదించిన యేనుగు నుంచి వచ్చే స్రావాలు (సామజసిరి) తొలికినట్టు (యేనుగు వంటి నడక కలిగినవాడు కాబట్టి ) ఆయన మోహమదం (శ్రీదేవిపై) కారుతున్నట్టుంది. 


//చ// అందాల, ఆనందనిలయుడైన నల్లని వేంకటేశ్వరుడు దట్టంగా బంగారు ఆభరణాలు ధరించి ఉంటే.... అందాల భరిణయైన అలమేలుమంగ, తాను "మెరుపు - మేఘము” కలిసి మెరుస్తూన్నట్టుంది.      


Thursday, March 31, 2022

ఆణికాడవట యంతటికి - జాణవు తెలియము సరిగొనవయ్యా [Anikadavata Antatiki]

 //ప// ఆణికాడవట యంతటికి

జాణవు తెలియము సరిగొనవయ్యా //


//చ// ముంగిట చెమటల ముత్యపు పూసలు

అంగన లోలో నమ్మీనదె

ఇంగితంపువెల లెరుగుదువటవో

యంగడి బేహారి యవి గొనవయ్యా//


//చ// మొల్లమి మాచెలిమోవిమాణికము

అల్లవెలకు నీ కమ్మీనదె

తొల్లి నీవు సూదులవాట్లచే

కొల్ల లడిగితట కొనవయ్యా//


//చ// నిడుదల చూపుల నీలంబులు నీ-

వడిగినంతకే యమ్మీనదే

పడతిదె శ్రీవేంకటపతి నీ వదె

యెడయని కాగిట నిటు గొనవయ్యా//


ముఖ్యపదార్ధం:


ఆణికాడు: మర్మజ్ఞుడు A confidant, or confidential friend

జాణ: నేర్పరి, A wit, a genius

ముంగిట: ముదర, మధ్యప్రదేశము

అంగన: స్త్రీ A woman

ఇంగితము: ఉద్దేశ్యము తెలిసికొను

అంగడి: అంగటి ( A shop)

బేహారి: వస్తువులు కొని విక్రయించువాడు (క్రయవిక్రయికుడు) one who buys and sells

మొల్లము: Thickness, సాంద్రత (Density)

నిడుద: Length, నిడుపు, దీర్ఘము


భావం:

ఈ సంకీర్తనలో అన్నమయ్య అమ్మవారి చెలికత్తె గా మారి.... స్వామిని, అమ్మవారు అమ్మే వస్తువులను (ఆమె అందచందాలను, ఆమె హావభావాలను) కొనమంటున్నారు. 


స్వామీ! నీవు మాయలు తెలిసినవాడవు. మహా నేర్పరివి అని మాకు తెలుసు. సరిగ్గా కొనుక్కో.


అమ్మవారి ఎదపై చెమటలు ముత్యాలపూసల్లా ఏర్పడ్డాయి. ఆంగన కదా! సిగ్గువలన బయటకు చెప్పుకోలేక ఆ ముత్యాల పూసలని లోలోపలే అమ్ముతోంది. నీకన్నీ తెలుసుకదా! మహా జాణవు నువ్వు.. ఆ చెమటలు అక్కడ ఎందుకు వచ్చాయో, వాటి వెనక ఉద్దేశ్యం, వాటి వెల.. నీ వంటి జాణడుకి బాగా తెలుసు. ఓ తెలివైన వ్యాపారీ! అవి కొనవయ్యా!.


[బేహారి అనే పదానికి అన్నమయ్య ఉద్దేశం ఏమిటో, ఈ సంకీర్తన చూడండి. 

"వాడల వాడల వెంట వాఁడివో వాఁడివో - నీడనుండి చీరలమ్మే నేఁతఁబేహారి!  

పంచభూతములనెడి పలువన్నె నూలు - చంచలపుగంజి వోసి చరిసేసి, 

కొంచెపు కండెల నూలి గుణముల నేసి - మంచిమంచి చీరలమ్మే మారు బేహారి]

(ఆధ్యాత్మికంగా ఐతే, జీవుల పాపపుణ్యాలు, జనన మరణాలు, కర్మశేషాలను లెక్కకట్టి....జీవులతో క్రయవిక్రయాలు చేసేవాడని.....) 


మాంచి మందంగా ఉండే మా చెలి పెదవి మాణిక్యము (అంటే ఎర్రని పగడం అన్నమాట) చాలా తక్కువ ధరకి నీకు అమ్మేసింది. ఇదివరకు నువ్వు మన్మధబాణాలు వదిలి చాలా చాలా ఆడిగావుట.. కాబట్టి ఇప్పుడు కొను..


మా చెలి చల్లని, దీర్ఘమైన చూపులు అనబడే నీలపు మాణిక్యములు నీవు ఎంతకి బేరమాడితే అంతకే అమ్మేసింది, అవునా!. 

స్వామీ! నా చెలి పరువములో ఉన్న సున్నితమైన స్త్రీ.. నీవు శ్రీవేంకటపతివి. ఆమె భర్తవి. ఆమెకు ఎప్పటికీ విడిపోని కౌగిలిని ఇచ్చి కొనుక్కోవయ్యా!...


Thursday, July 29, 2021

ఏలే యేలే మరదలా చాలు చాలు చాలును [Ele Ele Maradala chalu chalu chalunu]

 //ప// ఏలే యేలే మరదలా  చాలు చాలు చాలును

చాలు నీతోడి సరసంబు బావ


//చ// గాటపు గుబ్బలు కదలగ కులికేవు

మాటల తేటల మరదలా

చీటికి మాటికి జెనకేవే

వట్టి బూటకాలు మానిపోవే బావ


//చ// అందిందె నన్ను అదలించి వేసేవు

మందమేలపు మరదలా

సందుకో తిరిగేవు సటకారివో బావ

పొందుగాదిక పోవే బావ


//చ// చొక్కపు గిలిగింత చూపుల నన్ను

మక్కువ సేసిన మరదలా

గక్కున నను వేంకటపతి కూడితి

దక్కించుకొంటి తగులైతి బావ


ముఖ్యపదార్ధం:


గాటపు:  బిగుతైన, బరువైన

గుబ్బలు: స్తనములు

కులుకు: శృంగారముగా కదులు To move gracefully

సరసము: పరిహాసము crack jokes

చెనకు: తాకు. అంటు, స్పృశించు To touch

బూటకము: మాయ, వంచన, A trick, guile, prank

అదలించు: బెదిరించు, గద్దించు, To frighten, menace

మందమేలపు: బలమైన  

సందు: స్నేహంగా

సటకారితనము: సతాయించు? అవకాశవాదము?

పొందు: ప్రాప్తించు, దొరకు To gain, obtain, get, acquire

చొక్కము: స్వచ్చమైన

గిలిగింత: Tickling, giggling

మక్కువ: ప్రేమ Affection, love; desire

గక్కున: Quickly. శీఘ్రముగా.

కూడు: చేరు, కలయు To unite

తగులము: సంబంధము, ఆసక్తి Connection


భావం:


ఈ సంకీర్తన బావా- మరదళ్ళ మధ్య సంభాషణ రూపంలో వ్రాయబడినది. అంతర్లీనంగా ఆలోచిస్తే, జీవాత్మ ఐహిక బంధాలను వదలి పరమాత్మని చేరుకునే విధానాన్ని వివరించినట్టుంది. 


ఎందుకే, ఎందుకే మరదలా?.. చాలు, చాలు...చాలు నీ తోటి సరసాలు బావా..


బిగువైన పాలిండ్లతో శృంగారంగా కదులుతూ, అందంగా మాట్లాడే మరదలా...

చీటికీ మాటికీ ముట్టుకుంటావు. నీ నాటకాలు, వంచనలు ఇంక చాలు బావా.


దగ్గరగా ఉన్న నన్ను బెదిరించి తోసేస్తావు, బలమైన మరదలా..

స్నేహంగా తిరుగుతూ అవకాశం కోసం చూస్తున్నావు. ఇక మనకి పొందు (సఖ్యత) కుదరదు. పో బావా..


స్వచ్చమైన, గిలిగింత చూపులతో నాలో ప్రేమను/కామాసక్తిని కలిగించిన ఓ మరదలా..

నేను, శ్రీఘ్రముగా వేంకటపతిని కలిశాను. ఆయనతో సంబంధాన్ని దక్కించుకున్నాను.. నన్ను వదులు బావా...


Friday, July 16, 2021

జీవుడించుకంత చేత సముద్రమంత (Jeevudinchukanta cheta samudramamta)

 //ప// జీవుడించుకంత చేత సముద్రమంత

చేవెక్కి పలుమారు చిగిరించీ మాయ


//చ// కోపములైతేను కోటానుగోట్లు

దీపనములైతేను దినకొత్తలు

చాపలబుద్ధులు సమయని రాసులు

రాపాడీ గడవగరాదు వోమాయ


//చ// కోరికలైతేను కొండలపొడవులు

తీరనిమోహాలు తెందేపలు

వూరేటిచెలమలు వుడివోనిపంటలు

యీరీతినే యెలయించీని మాయ


//చ// మునుకొన్న మదములు మోపులకొలదులు

పెనగినలోభాలు పెనువాములు

నినుపై శ్రీవేంకటేశ నీదాసులనంటదు

యెనసి పరులనైతే యీదించీ మాయ


ముఖ్యపదాల అర్ధం:


ఇంచుక: చిన్న, కొంచెము, A little, even the least

చేవ: బలము, ధైర్యము

దీపనము: ఆకలి

చాపలము: చపలత్వము Fickleness

సమయు: సమసిపోవు (చావు)

రాపాడు: రాపు + ఆడు = రాయు, To rub

తెందేపలు: తెప్పలు+తెప్పలు = తెందెప్పలు (లేదా) తెందేపలు

చెలమలు: నీటి గుంట

వుడివోనిపంటలు= చేతికందని పంటలు??

మోపులకొలదులు: మోపుల కొద్దీ

పెనగు: పెనవేసిన తాళ్ళవంటి

పెనువాము: పెద్ద పాము


భావం:

అన్నమయ్య ఈ సంకీర్తనలో తత్వాన్ని బోధిస్తున్నారు.


జీవుడు చూస్తే చాలా చిన్నవాడు. కానీ వాడి చేతలు మాత్రం సముద్రమంత.  బాగా బలపడి (బలుపెక్కి), ఈ హరి మాయలో చిక్కుకుంటాడు.


కోపాలైతే అనంతములు. ఆకలైతే ఎప్పుడూ కొత్తే. చపలత్వముతో నిండిన బుద్ధుల రాసులు చావవు. ఎంత రుద్దినా అంతంచేయలేని మాయ అది. 


 కోరికలైతే కొండలంత పొడవుగా ఉంటాయి. కుప్పలు, తెప్పలుగా తీరని మోహము. నీటి చెలమల్లాంటి ఆశలు (ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి) సరిగా పెరగని పంటల్లాంటివి. ఈ మాయ ఈ విధంగా చేయబడినది.


పెద్ద కుప్పలవంటి మదములు, తాళ్ళతో పేనినట్టుగా ఉండే పెద్ద పాముల్లాంటి లోభాలు. 

కానీ, ఈ మాయలన్నీ శ్రీ వేంకటేశ్వరుని శరణు వేడిన వారికి అంటవు. 


Tuesday, July 13, 2021

బాపురే యెంతటి జాణ బాలకృష్ణుడు చూడ [Baapure Yentati Jaana Balakrishnudu cooda]

 //ప// బాపురే యెంతటి జాణ బాలకృష్ణుడు చూడ

బాపని వలె నున్నాడు బలరామకృష్ణుడు


//చ// వొంటి గోపికలచన్ను లుట్లపై కుండలంటా

అంటుచు చేతులు చాచీ నదే కృష్ణుడు

వెంటనే అధరములు వెస మోవిపండ్లంటా

గొంటరియై అడిగీని గోవిందకృష్ణుడు


//చ// సతుల పెద్దకొప్పులు చక్కిలాలగంప లంటా

బతిమాలి వేడీ నప్పటి గృష్ణుడు

చతురత బిరుదులు చక్కెరదీబలంటా

తతిగొని యంటీని దామోదరకృష్ణుడు


//చ// అంగనవొడికట్లు అరటిపండ్లంటా

సంగతి గౌగలించీ వేసాలకృష్ణుడు

అంగడి నింతులెల్లాను అలమేలుమంగ యంటా

చెంగలించి కూడీని శ్రీవేంకటకృష్ణుడు


ముఖ్యపదాల అర్ధం:

బాపురే: అయ్య బోబోయ్

జాణ: నేర్పరి

బాపడు: బ్రాహ్మణుడు

చన్నులు: స్తనములు

ఉట్లు: కుండలు వేలాడదీసే ఉట్టి

అధరములు: పెదవులు

వెస: తొందరగా

మోవి: పెదవులు

కొంటరి: కొంటెగా

చతురత: సమయస్ఫూర్తి

చక్కెరదీబలు: పంచదార దిబ్బలు

తతి: ఆసక్తితో

ఒడికట్టు: వడ్డాణము, A girdle, as part of female dress

చెంగలించు: అతిశయించుచు


భావం:


ఈ సంకీర్తన అన్నమయ్య కుమారుడైన పెదతిరుమలయ్య విరచితమ్.


ఓరి నాయనో! ఈ బాలకృష్ణుడు ఎంతటి నేర్పరి. చూడడానికి ఈ బలరామకృష్ణుడు బ్రాహ్మణుడిలా (పండితుడిలా) ఉన్నాడు.


ఈ కృష్ణుడు, గోపికల స్తనాలను ఉట్లపై ఉంచిన కుండలు అంటూ, చేతులు చాచి అంటుతున్నాడు.

వెంటనే గోపికల పెదవులను మోవిపండ్లు అంటూ.. కొంటెగా అడుగుతున్నాడు. 


ఆడువారి పెద్ద కొప్పులను చక్కిలాల గంపలు అంటూ...చక్కిలాలు ఇవ్వండి అని వేడుకుంటున్నాడు ఈ కృష్ణుడు.

ఎంతో తెలివిగా.. ఈ పంచదార దిబ్బలు అంటూ... వారి గుండ్రని పిరుదులను ఎంతో ఆసక్తిగా తాకుతున్నాడీ కృష్ణుడు...


ఈ దొంగవేషాల కృష్ణుడు..ఆడువారు నడుముకు కట్టుకునే వడ్ఢాణాన్ని... అరటిపండ్లు అంటూ గట్టిగా కౌగిలించుకుంటున్నాడు.

ద్వాపరయుగంలో ఎంతమందితో, ఎలా ఉన్నా, ఈ కలియుగంలో ఆ ఇంతులందరూ అలమేలుమంగలోనే ఉన్నారంటూ...ఆమెను ప్రేమతో కూడి వేంకటాచలముపై ఉన్నాడు, ఈ వేంకట కృష్ణుడు.


Tuesday, April 21, 2020

తందనాన అహి - తందనాన పురె తందనాన భళా తందనాన [Tandanana ahi tandanana pure]

తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా తందనాన

//ప// బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె

//చ// కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ

//చ// నిండారు రాజు నిద్రించు నిద్రయు నొకటె
అండనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలుడుండేటి సరిభూమి యొకటే

//చ// అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు

//చ// కొరలి శిష్టాన్నములు గొను నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే

//చ// కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద పొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె

ముఖ్యపదార్ధం:
ఆహి, పురె, భళా: ఇప్పటి కాలంలో "ఆహా", ఒరే, భలే గా చెప్పుకోవచ్చు [Expression of excitement, appreciation]
తందాన: వంత పాడే శబ్దము. 
కందువ: మోసపూరితమైన, మాయ, Cunning, false, fictitious
జంతుకులము: మనుష్యులతో సహా సకల జీవరాశులు 
నిండారు: పూర్ణత్వము నిండిన, చక్రవర్తి, నిండైన
మెట్టు: నడచు
అనుగు: ప్రియమైన (beloved, desired)
ధనాఢ్యుడు: ధనవంతుడు 
ఒనర:  కలుగు, సంభవించు, పొసగు 
కొరలు: కలుగు, ఉండు
పరగ:  ప్రసరించు
కడకి: చివరకి 
పుడమి: భూమి
శునకము: కుక్క 
పొలయు: ప్రకాశించు 
కడు: గొప్ప 
సరిగావ: సమానముగా రక్షించుటకు
జడియు: భయపెట్టు

భావం:
తందనాన అహి, తందనాన పురె, తందనాన భళా....బ్రహ్మౌ ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే. ద్వితీయము లేదు. 

మాయా/మోసపూరితమైన భావమైన "అధికులు, హీనులు" లేరిక్కడ. అందరి ఆత్మలతోనూ శ్రీహరే ఉన్నాడు.
ఇందులో రెండుకాళ్ళతో, నాలుగు కాళ్ళతో నడిచే జంతువులంతా ఒక్కటే. అందరి ఆత్మలతోనూ శ్రీహరే ఉన్నాడు.

పరిపూర్ణుడైన రాజు, పక్కనే ఉన్న బంటు... నిద్రించే నిద్ర ఒక్కటే. 
వేదశాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణుడు, చండాలుడు... నడిచే భూమి ఒక్కటే.

ప్రియమైన దేవతలకు, పశు, పక్ష్యాదులకు, కీటకాలకు... లైంగిక సుఖం ఒక్కటే. 
ధనము కలవానికి, నిరుపేదకు... పగలు, రాత్రీ ఒక్కటే

మంచి మృష్టాన్నమును, కుళ్ళిన మాంసము మొదలైనవి...తినేటి నాలుక ఒకటే.
చెడు వాసనలపైన, చక్కటి పరిమళ ద్రవ్యములపైన... వీచే వాయువు ఒక్కటే.

భూమిపై యేనుగు మీద, చివరకు కుక్క మీద... ప్రకాశించే ఎండ ఒక్కటే.
మిక్కిలి పుణ్యము చేసినవారిని, పాపకర్మములు చేసి భయపడు వారిని సమానంగా రక్షించుటకు శ్రీవేంకటేశ్వరు నామము ఒక్కటే.

Sunday, November 10, 2019

సువ్వి సువ్వి సువ్వాలమ్మా - నవ్వుచు దేవకి నందను గనియె [Suvvi Suvvi Suvvalamma]

//ప//  సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె॥

//చ// శశి వొడచె అలసంబులు గడచె
దిశల (దివి?) దేవతల దిగుళ్ళు విడచె॥

//చ// కావిరి విరిసె కంసుడు గినిసె
వావిరి (వావిలి??) పువ్వుల వానలు గురిసె॥

//చ// గతి సేసె అటు గాడిద గూసె
కుతిలకుడిచి జనకుడు నోరు మూసె॥

//చ// గగురు పొడిచె లోకము విధి విడిచె
మొగులు గురియగ యమునపై నడచె॥

//చ// కలిజారె వేంకటపతి మీరె
అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె॥

ముఖ్యపదార్ధం: 
సువ్వి: గింజలు దంచేడప్పుడు చేసే (దంచుటయందగు) ధ్వన్యనుకరణము (The noise made by women while pounding rice/lentils)
గనియె: కనుట, చూచుట
శశి: చంద్రుడు
వొడచె: కనబడు, ప్రత్యక్షమగు, తోచు
అలసంబులు: అలసటలు/కష్టములు/శ్రమ
గడచె: పోయినవి
దిగుళ్ళు: భయములు
కావిరి విరిసె: నల్లటి పొగ (చీకటి) అలముట
గినిసె: కినుక పొందె: కోపము పొందె
వావిరి పువ్వుల: వావిలి?? (Justicia magnifica flower) కేఫాలిక, నిర్గుండి. నల్లవావిలి పూలు  
గతి సేసె: త్రోవ లో వెళ్తుండగా
గాడిద గూసె: గాడిద ఓండ్ర పెట్టగా
కుతిలకుడిచి: భయపడి, గుటకలు మింగి
జనకుడు: వసుదేవుడు
గగురు పొడిచె:  రోమాంచము కలిగె 
మొగులు: మేఘములు
కలిజారె: ద్వాపరయుగం నుంచి కలియుగంలోకి వచ్చుట
అలుకలు: కోపములు

భావం:
దేవకీదేవి నవ్వుచూ కొడుకుని కన్నది, అని... బియ్యం దంచుచూ ఆడువారు సువ్వి సువ్వి అనే శబ్దాన్ని చేస్తున్నారు.

(అష్టమినాడు) చంద్రుడు ఉదయించాడు. కష్టాలన్నీ తీరిపోయాయి. దేవతలందరూ విచారం విడిచారు.

నల్లని పొగవంటి చీకటి కమ్ముకుంది. కంసుడు కోపగించుకున్నాడు. వావిలిపూల వానలు కురిశాయి.  

వసుదేవుడు రేపల్లెకు వెళ్ళే మార్గంలో గాడిద కూసింది. భయపడి దాని నోరు మూశాడు. 

రోమాలు నిక్కపొడిచాయి. లోకం గతి తప్పినట్లైంది. మేఘాలు వర్షిస్తూండగా యమున నదిపై నడిచాడు. 

కాలం ద్వాపరయుగం దాటి కలియుగంలోకి జారింది. వేంకటేశ్వరుడుగా వచ్చాడు. ఇక అలమేల్మంగకూ, నాంచారుకూ కోపాలు తీరాయి.. 



Friday, May 11, 2018

ఇన్నియు నుండగ దమకేమి గడమ - వున్నవాడు సిరి పురుషోత్తమరాజు [Inniyu nundaga damakemi gadama]

//ప// ఇన్నియు నుండగ దమకేమి గడమ
వున్నవాడు సిరి పురుషోత్తమరాజు //ఇన్నియు//

//చ// వీలుచు నీ రావటించి వేదమరాజు
కూలికి గుండ్లు మోచీ గూర్మరాజు
పోలిమి నేలలు దవ్వీ బొలమురాజు
నాలి బడుచాట లాడి నరసింగరాజు //ఇన్నియు//

//చ// చేకొని చేతులు చాచీ జిక్కరాజు
రాకపోక దపసాయె రామరాజు
రాకట్నములే గట్టీ రాఘవరాజు
రేకల బసుల గాచీ కృష్ణరాజు //ఇన్నియు//

// మగువల కిచ్చలాడీ మాకరాజు
జగమెల్లాదిరిగీని జక్కరాజు
నగుబాటుదీర శ్రీవేంకటనగముపయి
వెగటై లోకము లేలే వెంగళరాజు //ఇన్నియు//

ముఖ్యపదాల అర్ధం:
కడమ: కొరత
నీరావటించు= నీరు+ఆవటించు: నీట మునిగిన/నీరు నిండిన
గుండ్లు: కణుపులు/కొండలు
పోలిమి: కోరలు?
బడుచాట= పడుచు+ఆట= యౌవ్వనపు ఆటలు
చేకొని: కఠినమైన
చిక్క: చిన్న కావి (చిన్న కొమ్మ)
రాకట్నము: రాజ కట్నము
రేకల: రే (పల్లెనందు)
ఇచ్చలు: ఆసక్తి, కోరికతో కూడన సంభాషణలు/పనులు
అగుబాటు: అలసట
వెగటు: విముఖుడై

భావం: 
ఈ సంకీర్తన అన్నమయ్య తనయుడు పెదతిరుమలయ్య విరచితమ్.

పురుషోత్తమరాజు గారికి ఎన్నో ఘనమైన బిరుదులున్నాయి. ఇంకేం కొరత?. సాక్షాత్తూ సిరిని కూడా కలిగినవాడు.

నీట మునిగిన వేదాలను బయటకు తెచ్చిన వేదమరాజు (మత్య్సావతారం)
శ్రమపడి కొండని మోసిన కూర్మరాజు (కూర్మావతారం)
కోరలతో నేలను తవ్విన పొలమురాజు (వరాహావరాతం. హిరణ్యాక్ష సంహారానికి సంబంధించినది)
చెంచుకన్యతో యౌవ్వనపు ఆటలాడిన నరసింహరాజు (నరశింహావతారం)

కఠినమైన ఉద్దేశ్యంతో చేతులు చాచిన జిక్కరాజు (వామనావతారం. చేతిలో చిన్న దండెము పట్టుకుంటాడు కాబట్టి జిక్క అన్న పదం ఉపయోగించారు)
రాజులపై దండెత్తి చివరకు రాముని దర్శనము తర్వాత తపస్సుకు వెళ్ళిన పరశురామరాజు
రాజరికాన్ని విడిచిపెట్టి, అడవులకేగిన రాఘవరాజు (శ్రీరామావతారం)
రేపల్లెనందు పశువులను కాచిన కృష్ణరాజు

పడుచులతో ఇచ్చకములాడి పనులు సాధించిన మాకరాజు (బుద్ధుడు)
జగము అంతటా తిరుగుతూ రక్షణ చేసే చక్కరాజు (కల్కి)
పై అవతారాల్లో చేసిన పనులకు అలసటపొంది, శృంగార విముఖుడై, వేంతటాచలముపై నిలబడి లోకరక్షణ చేస్తున్నాడీ వెంగళరాజు  

Saturday, June 17, 2017

కలదింతె మాట కంతుని యాట - తెలుసుకో నీలోనిదియె పూటపూట [Kaladinte mata kantuni yaata]

//ప// కలదింతె మాట కంతుని యాట
తెలుసుకో నీలోనిదియె పూటపూట //ప//

//చ// అలమేలుమంగా హరియంతరంగా
కలితనాట్యరంగ కరుణాపంగ
చెలువుడు వీడె చేకొను నేడె
వలరాజుతూపులివి వాడిమీది వాడి //ప//

//చ// అలినీలవేణి యంబుజపాణి
వెలయంగ జగదేకవిభునిరాణి
కలయు నీ పతి వచ్చె గక్కన నిన్నిదె మెచ్చె
పలికీని చిలుకలు పచ్చి మీదబచ్చి //ప//

//చ// సితచంద్రవదనా సింగారసదనా
చతురదాడి మబీజచయరదనా
యితవైన శ్రీ వేంకటేశుడు నిన్నిదె కూడె
తతి దలపోతలు తలకూడె గూడె //ప//

ముఖ్యపదాల అర్ధం:
కంతుడు= మన్మధుడు
అపాంగము: చూపు
చెలువుడు: సుందరుడు, ప్రియుడు
వలరాజు: మన్మధుడు
తూపులు: బాణాలు
వాడి: పదును
అలినీలవేణి: నల్లని కురులు కలది
అంబుజపాణి: చేతియందు కలువ/తామెర ఉన్నది
విభుడు: భర్త
సితచంద్రుడు: పూర్ణచంద్రుడు
సింగారము: శృంగారము
సదనము: ఇల్లు
చతుర: తెలివైన
దాడిమబీజ: దానిమ్మగింజ
చయము: సమూహము
తతి: సమూహము
తలపోత: ఆలోచన

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య - అమ్మవారి ఆలోచనలు శ్రీవారి పైనే ఉంటూ ఆమెను ఎందుకు వేదనను గురిచేస్తున్నాయో, వాటికి కారణం ఎవరో తెలియజేస్తూ అమ్మను లలితమైన పదాలతో కీర్తిస్తూ వ్రాశారు.   

అమ్మా! వేరొక మాట లేదు. ఉన్నదొక్కటే. అదే, నీ మనస్సులోంచి పుట్టిన మన్మధుడి ఆట. ఇది నీవు ప్రతీసారీ తలచుకో.  

ఓ అలమేలు మంగా ! నీవు హరి మనస్సునందు నివశించుదానవు. నాట్యమునందు నేర్పరివి. దయాపూరిత చూపులు కలిగినదానవు. సుందరుడైన నీ ప్రియుడు ఈరోజు నిన్ను కలుసుకుంటాడు. ఆతడి చూపులు మన్మధబాణాలు. చాలా పదునుగా ఉంటాయి. 

నీవు నల్లని కురులు కలదానవు. చేతియందు పద్మమును కలిగినదానవు. సాక్షాత్తూ ఈ జగత్తుకు భర్తయైన వానికి భార్యవు. నీ ప్రియుడు నిన్ను కలవడానికి వచ్చి నిన్ను మెచ్చుకుంటుండగా, పక్కనున్న చిలుకలు నీ స్నేహానికి పచ్చి చెప్తున్నాయి.

నీవు పూర్ణచంద్రుని వంటి ముఖము గలదానవు. శృంగారానికి నిలయవు. చాలా తెలివైనదానవు. దానిమ్మగింజల సమూహము వంటి పలువరుస గలిగినదానవు.  హితుడైన శ్రీవేంకటేశ్వరుడు నిన్ను కలిసాడు. ఆయన గురించిన ఆలోచనల సమూహాలు నీకు పదే పదే నీకు జ్ఞప్తికి వస్తున్నాయి. 

Saturday, June 3, 2017

నమో నారాయణాయ - సమధికానందాయ సర్వేశ్వరాయ [ Namo Narayanaya samadhikanandaya]

//ప// నమో నారాయణాయ  
సమధికానందాయ సర్వేశ్వరాయ           //నమో//

//చ// ధరణీసతీ ఘనస్తన శైలపరిరంభ-
పరిమళ శ్రమజల ప్రమదాయ 
సరసిజ నివాసినీ సరసప్రణామయుత 
చరణాయతే నమో సకలాత్మకాయ        //నమో//

//చ// సత్యభామా ముఖకాంచన పత్రవల్లికా-
నిత్యరచన క్రియా నిపుణాయ 
కాత్యాయినీ స్తోత్రకామాయతే నమో 
ప్రత్యక్షనిజ పరబ్రహ్మ రూపాయ           //నమో//

దేవతాధిపమకుట దివ్యరత్నాంశు సం-
భావితామల పాదపంకజాయ
కైవల్యకామినీ కాంతాయ తే నమో 
శ్రీవేంకటాచల శ్రీనివాసాయ               //నమో//

ముఖ్యపదాల అర్ధం:
నార+అయనుడు = నీటి మీద శయనించు వాడు
సమ్+అధిక ఆనందము= బాగైన మిక్కిలి సంతోషము
సర్వ+ఈశ్వరుడు= అన్నింటికీ అధిపుడు
ధరణీ= భూమి
సతి= భార్య
ఘనస్తనశైల= గొప్పదైన వక్షోజాల కొండలు
పరిరంభ= చుట్టుకుని
పరిమళ శ్రమజలము= సుగంధభరితమైన చెమట
ప్రమదాయ: సంతోషించెడి వాడు
సరసిజ= పద్మము
తే= నీకు
చరణాయ= పాదములకు
కాంచన పత్ర = బంగారపు ఆకు
వల్లిక= లత
కాత్యాయినీ= పార్వతీ దేవి
దేవత+అధిప+మకుట= ఇంద్రుని కిరీటము
సంభావితము: బాగుగా ప్రకాశించునట్లు
పంకజము: బురదనుంచి పుట్టునది = కమలము
కైవల్యకామినీ = క్వైవల్యము కోరు వారలకు
కాంతాయ= భర్త వంటివాడవు

భావం: 
ఓ నారాయణా! బాగైన మిక్కిలి సంతోషాన్నిచ్చు వాడా, సర్వేశ్వరుడా, నీకు నమస్సులు.

నీ భార్యయైన భూదేవి ఘనమైన చన్ను కొండలను గట్టిగా చుట్టుకుని పరిమళభరితమైన చెమటను వదులుతూ సంతోషము పొందుచున్నవాడా!
పద్మనివాసినియైన లక్ష్మీదేవి సంతోషముతో నమస్కరించు పాదములను కలిగినవాడా, సృష్టి సకలము ఆత్మయందు కలిగిన వాడా, నీకు నమస్సులు

సత్యభామా దేవి బంగారు వన్నె ముఖముపై చెమట తీగెలను నిత్యం రచించుటలో నేర్పరితనము కలవాడా, పార్వతీదేవిచే స్తుతింపబడేవాడా, కోర్కెలుతీర్చేవాడా, పరబ్రహ్మస్వరూపుడా, నీకు నమస్సులు.

ఇంద్రుని కిరీటమునందు పొదగబడిన దివ్యరత్నాల వెలుగు వలన  ఎర్రని తామెరల వలే ప్రకాశించు పాదములు కలిగిన వాడా, కైవల్యముకోరు భక్తులకు భర్త వంటి వాడా, వేంకటాచలముపై నివశించే రమాపతీ నీకు నమస్సులు.   

Tuesday, January 5, 2016

మఱవకువే చెలియ మదన రహస్య మిది - యెఱగుకొంటే మేలు ఇందులోనే ఉన్నది [Maravakuve cheliya madana rahasyamidi]

//ప// మఱవకువే చెలియ మదన రహస్య మిది
 యెఱగుకొంటే మేలు ఇందులోనే ఉన్నది

//చ// సేయరాని వినయము సేసితే దంపతులకు
 పాయని చుట్టరికమై పైకొనును
 యేయెడా మొగమాటము లెప్పుడు గలిగితేను
 మోయరానిమోపులై మునుకొను మోహము

//చ// యేపొద్దు మంచితనాన నెనసితే జాణలకు
 దాపురాలై వేడుకలు తతిగొనును
 కాపురపు సరవులే కడుగడు కరపితే
 ఆపరాని తమకము లలవడివుండును

//చ// తిరమైన రతులద్దితే నేరుపరులకు
 సరససల్లాపములు చవులు మించు
 యిరవై శ్రీవేంకటేశుడింతలోనె నిన్నుగూడె
 వరుసతో మెలగితే వలపు లీడేరును

ముఖ్యపదాల అర్ధం:
యెఱుగు: తెలుసుకొను
మునుకొను: ముందు ఉంచుకొను (ముందుగానే)
యేయెడ: ఎటు వైపైనా
పాయని: విడువని
దాపురము: ప్రాప్తి
తతి: సమూహము
సరవి: వరుస, క్రమము
కడు కడు: ఎక్కువ, ఎక్కువగా
కరపు: చేసితే
తిరమైన: స్థిరమైన
నేరుపరి: నేర్పరి
చవులు: రుచులు
యిరవు: స్థిరమైన
కూడె: కలిసె
ఈడేరును: తీరును

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య వయసులోను, దాంపత్యములోనూ పెద్దదైన చెలికత్తె గా మారి, అలమేల్మంగకు దాంపత్యరహస్యాన్ని బోధిస్తున్నారు. 

ఓ చెలియా! మరచిపోకు. ఇప్పుడు నే చెప్పేది మదన రహస్యము. తెలుసుకుంటే చక్కటి మేలు జరుగుతుంది.

దంపతులు ఒకరినొకరు ఎంత ఎక్కువగా గౌరవించుకుంటే వారి మధ్య బంధం విడిపోకుండా అంత ఎక్కువ స్థాయికి తీసుకెళ్తుంది. [నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే దంపతులమధ్య బంధం ఎలా ఉంటుందో మనకి తెలుసు]
దంపతులిద్దరి మధ్య ఎప్పటికీ కొంచెం సిగ్గు అనేది ఉంటే, వారిద్దరికీ ఒకరిపైన ఒకరికి మోహం మోయలేనంత బరువుగా తయారవుతుంది. [అంటే, మొహమాటంలేకుండా మాటలు, చేతలు జారిపోతూంటే, వారిద్దరి మధ్య అనేక అభిప్రాయ బేధాలొచ్చి దంపతుల అన్యోన్యత తగ్గుతుందని- కవి భావన].

యే సాయంత్రమైతే స్త్రీ తన భర్తతో మంచితనంగా మసలుకుంటుందో, ఆ స్త్రీలకు ఆ రాత్రి భర్తతో శృంగార వేడుకలు లెక్ఖలేనంతగా ఉంటాయి. [భర్త ఇంటికి రాగానే, యే స్త్రీ ఐతే చక్కగా మాట్లాడి, ఆయన కంటికి యింపుగా కన్పిస్తుందో, ఆ స్త్రీకి ఆమె భర్తవల్ల ఆ సాయంత్రం గొప్ప ఆనందం కలుగుతుందని- కవి భావన] 
భార్యాభర్తలకు ప్రతీ రాత్రీ చక్కటి శృంగార రాత్రిగా మారి, అలాంటివి అనేక రాత్రులు వరుసగా గడిపితే, వారిద్దరిమధ్య  మోహావేశము ఆపలేనంతగా ఉంటుంది. [వారిరువురి మధ్య బంధం గట్టిపడి, ఒకరిపై ఒకరికి మోహము నిరంతరముగా ఉండి, విరక్తి కలగకుండా ఉంటుందని- కవి భావన]

భార్యాభర్తలిద్దరూ రతిక్రీడలో నేర్పరితనము కలిగినవారై, వారి దాంపత్యానికి నిరంతరమూ స్థిరమైన రతి గంధాన్ని అద్దితే, వారి జీవితంలో సరసమైన సంభాషణములు రసాలూరుతూ ఉంటాయి.  [వారి జీవితం కొత్త రుచులతో నిరంతరం ఆహ్లాదకరముగా ఉంటుందని - కవి భావన]
అదిగో! శ్రీవేంకటేశ్వరుడు, ఇంతలోనే నిన్ను కలవడానికి వచ్చేస్తున్నాడు. ఆయనతో సహకరించి, నేను చెప్పిన మదన రహస్యాలని గుర్తుపెట్టుకుని, వినయంతో మెలిగితే నీ ప్రేమ తీరి, పురుషోత్తమునితో గొప్ప సుఖాన్ని అనుభవిస్తావు.