Total Pageviews

Friday, July 16, 2021

జీవుడించుకంత చేత సముద్రమంత (Jeevudinchukanta cheta samudramamta)

 //ప// జీవుడించుకంత చేత సముద్రమంత

చేవెక్కి పలుమారు చిగిరించీ మాయ


//చ// కోపములైతేను కోటానుగోట్లు

దీపనములైతేను దినకొత్తలు

చాపలబుద్ధులు సమయని రాసులు

రాపాడీ గడవగరాదు వోమాయ


//చ// కోరికలైతేను కొండలపొడవులు

తీరనిమోహాలు తెందేపలు

వూరేటిచెలమలు వుడివోనిపంటలు

యీరీతినే యెలయించీని మాయ


//చ// మునుకొన్న మదములు మోపులకొలదులు

పెనగినలోభాలు పెనువాములు

నినుపై శ్రీవేంకటేశ నీదాసులనంటదు

యెనసి పరులనైతే యీదించీ మాయ


ముఖ్యపదాల అర్ధం:


ఇంచుక: చిన్న, కొంచెము, A little, even the least

చేవ: బలము, ధైర్యము

దీపనము: ఆకలి

చాపలము: చపలత్వము Fickleness

సమయు: సమసిపోవు (చావు)

రాపాడు: రాపు + ఆడు = రాయు, To rub

తెందేపలు: తెప్పలు+తెప్పలు = తెందెప్పలు (లేదా) తెందేపలు

చెలమలు: నీటి గుంట

వుడివోనిపంటలు= చేతికందని పంటలు??

మోపులకొలదులు: మోపుల కొద్దీ

పెనగు: పెనవేసిన తాళ్ళవంటి

పెనువాము: పెద్ద పాము


భావం:

అన్నమయ్య ఈ సంకీర్తనలో తత్వాన్ని బోధిస్తున్నారు.


జీవుడు చూస్తే చాలా చిన్నవాడు. కానీ వాడి చేతలు మాత్రం సముద్రమంత.  బాగా బలపడి (బలుపెక్కి), ఈ హరి మాయలో చిక్కుకుంటాడు.


కోపాలైతే అనంతములు. ఆకలైతే ఎప్పుడూ కొత్తే. చపలత్వముతో నిండిన బుద్ధుల రాసులు చావవు. ఎంత రుద్దినా అంతంచేయలేని మాయ అది. 


 కోరికలైతే కొండలంత పొడవుగా ఉంటాయి. కుప్పలు, తెప్పలుగా తీరని మోహము. నీటి చెలమల్లాంటి ఆశలు (ఎప్పుడూ పుడుతూనే ఉంటాయి) సరిగా పెరగని పంటల్లాంటివి. ఈ మాయ ఈ విధంగా చేయబడినది.


పెద్ద కుప్పలవంటి మదములు, తాళ్ళతో పేనినట్టుగా ఉండే పెద్ద పాముల్లాంటి లోభాలు. 

కానీ, ఈ మాయలన్నీ శ్రీ వేంకటేశ్వరుని శరణు వేడిన వారికి అంటవు. 


No comments:

Post a Comment