Total Pageviews

Sunday, April 17, 2011

సహజవైష్ణవాచారవర్తనుల సహవాసమె మాసంధ్య

సహజవైష్ణవాచారవర్తనుల- 
సహవాసమె మాసంధ్య 

అతిశయమగు శ్రీహరిసంకీర్తన 
సతతంబును మాసంధ్య 
మతి రామానుజమతమే మాకును 
చతురత మెరసిన సంధ్య 

పరమభాగవత పదసేవనయే 
సరవి నెన్న మాసంధ్య 
సిరివరుమహిమలు చెలువొందగ వే-
సరక వినుటె మాసంధ్య 

మంతుకెక్క తిరుమంత్ర పఠనమే 
సంతతమును మాసంధ్య 
కంతుగురుడు వేంకటగిరిరాయని 
సంతర్పణమే మాసంధ్య 

ముఖ్య పదాల అర్ధం:

సహజ వైష్ణవ ఆచార వర్తనుల: స్వత: సిద్ధముగా వైష్ణవాచారాన్ని పాటించే మహాత్ముల
సహవాసమే మా సంధ్య: స్నేహమే (వారితో కలిసి తిరుగుట) మా యొక్క సంధ్యావందనాది కార్యక్రమము


సతతంబును: ఎల్లప్పుడూ 

అతిశయమగు శ్రీహరిసంకీర్తన: గొప్పదైన (Excellence) శ్రీ హరి సంకీర్తనము
మాసంధ్య: మా సంధ్యావందనము 
మతి: బుద్ధికూడిన (Understanding, intellect, consciousness)
రామానుజమతమే: రామానుజులచే వైష్ణవ తత్వ ప్రచారానికై స్థాపించబడిన మతమునందు చేరి హరిని ధ్యానించుటే (Sri Ramanuja Matham was established by Sri Rama Ramanuja Acharya to conduct classes and propagate vedanta and tantra)
మాకును చతురత మెరసిన సంధ్య:
మాకు తెలివైన పద్దతిగా చేయు సంధ్యావందనాది కార్యక్రమము

సరవి నెన్న: క్రమము తప్పకుండా
పరమభాగవత పదసేవనయే: పరమ భాగవతోత్తముల (Religious or pious men: fellow scholars in divinity) (ఆదివణ్ శఠగోపయతి, ఘనవిష్ణువు వంటి భాగవతోత్తముల) పాద సేవనమే మా సంధ్యావందనాది కార్యక్రమము.    
మాసంధ్య: మా సంధ్యావందనము

సిరివరుమహిమలు: సిరివరుడు (లక్ష్మి భర్త= విష్ణువు) మహిమలు
చెలువొందగ: సంతోషమును పొందగా/ అందముగా 
వేసరక వినుటె మాసంధ్య: శ్రమ/విసుగు లేకుండా వినడమే మా సంధ్యా వందనాది కార్యక్రమము


సంతతమును: ఎడతెగక /విడువకుండా 
మంతుకెక్క: ఘనత కెక్కిన/ ప్రసిద్ధికెక్కిన
తిరుమంత్ర పఠనమే: తిరుమంత్రము (ఓం నమో నారాయణాయ/ఓం నమో వేంకటేశాయ) అను మంత్రమును పఠించుటే  
మాసంధ్య: మా సంధ్యావందనాది కార్యక్రమము
కంతుగురుడు వేంకటగిరిరాయని: కంతుడు అంటే మన్మధుడు. మన్మధుని కి తండ్రి ఐన శ్రీ వేంకటపతిని 
సంతర్పణమే మాసంధ్య: సంతృప్తిపరచుటే మా సంధ్యావందనాది కార్యక్రమము.

భావం:
పూర్వం బ్రాహ్మణుల ఇళ్ళలో నిత్యాగ్నిహోత్రాలు, సంధ్యావందనాది కార్యక్రమములు క్రమం తప్పకుండా ఉండేవి. కర్మలు మూడు రకాలు. అవి 1) నిత్య పూజలు అంటే నిత్యాగ్నిహోత్రాలు, సంధ్యావందనాది కార్యక్రమములు, 2) నైమిత్తిక కర్మ అంటే సమయానుకూలము గా జరిగేవి ఉదా: పితృతర్పణం వంటివి, 3) కామ్య కర్మ అంటే ఫలితాన్ని ఆశించి చేసే పనులు. ఉదా: యజ్ఞ, యాగాలు వంటివి. ఈ మూడింటిని క్రమం తప్పకుండా చేసే కొంతమంది బ్రాహ్మణులు అన్నమయ్యను " నీవు ఎప్పుడూ ఏవో పిచ్చి పాటలు పాడుకుంటూ తిరుగుతున్నావు, బ్రాహ్మణుడు చేయవలసిన నిత్యకర్మలు చేయటం లేదు." అని దూషించారేమో..అన్నమయ్య వారికి అత్యంత గొప్పగా సమాధానం చెప్పారు. 

స్వత: సిద్ధముగా వైష్ణవాచారాన్ని పాటించే మహాత్ముల సాన్నిహిత్యము, వారితో కలిసి తిరుగుట, వారి ప్రవచనాలు వినుట అవే మా యొక్క సంధ్యావందనాది కార్యక్రమము. 

ఎల్లప్పుడూ ఈ సృష్టికి మూల పురుషుడైన శ్రీ హరిని నిరంతరం కీర్తించడమే మా సంధ్య. బుద్ధితో వైష్ణవ తత్వ ప్రచారానికై శ్రీ రామానుజాచార్యులు స్థాపించబడిన మతమునందు చేరుటే తెలివైన పద్దతిగా చేయు మా సంధ్యావందనము.

క్రమము తప్పకుండా పరమ భాగవతోత్తముల పాద సేవనము మా సంధ్య. శ్రీ మహా విష్ణువు యొక్క మహిమలు సంతోషముతో శ్రమ లేకుండా, విసుగు లేకుండా వినుటే మా సంధ్య.

ఎప్పటికీ విడువకుండా ఘనతకెక్కిన తిరువేంకటేశ్వరుని మంత్రాన్ని పఠించడమే మా సంధ్య. మన్మధుని తండ్రిఐన శ్రీ వేంకటేశ్వరుని కీర్తన చేస్తూ ఆయన్ని సంతృప్తి పరచడమే మా సంధ్య.

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://www.esnips.com/doc/e4c47a2d-9202-4c97-8507-d550da98b945/Sahaja-Vaishnavaachaara-Varthanula/?widget=flash_player_esnips_gold

Monday, April 11, 2011

పసిడిచీరవాడవు పాలుదచ్చితివిగాన

పసిడిచీరవాడవు పాలుదచ్చితివిగాన
పసిడిబోలినది చేపట్టెను నీకరము


తొలుతనే చందురుని తోడబుట్టుగనక
పొలుపు చందురు మోముపోలికైనది
కళల చింతామణి కందువ చెల్లెలుగాన
తళుకు మానికపు దంతముల బోలినది


మంచి యైరావతముతుతో మగువ సైదోడుగాన
ముంచిన కరిగమనము బోలినది
పంచల బారిజాతపు భావపు సోదరిగాన
యెంచగ చిగురుబోలె నీకెపాదములు


తామెర తోట్టెలలోన తగిలి తానుండుగాన
తామెరకన్నులబోలి తనరినది
యీమేర నిన్నిటా బోలి ఇన్ని లక్షణములతో
నీమేన శ్రీవేంకటేశ నెలవై నిల్చినది

ముఖ్య పదాల అర్ధం:

పసిడిచీరవాడవు: బంగారపు రంగు గల పసుపుపచ్చని పీతాంబరమును ధరించిన వాడవు
పాలుదచ్చితివిగాన: 
పసిడిబోలినది: బంగారపు రంగును బోలిన స్త్రీ 
చేపట్టెను: అందుకొనెను
నీ కరము: నీ చేతిని

తొలుతనే: ముందుగానే
చందురుని: వెన్నెల రేడు చంద్రుని
తోడబుట్టుగనక: చెల్లెలు కాబట్టి
పొలుపు: సొంపైన Beauty, elegance, gracefulness
చందురు మోము పోలికైనది: చంద్రుని వలే గుండ్రటి మొహం కలిగినది
కళల చింతామణి: కాంతులు చిందే అత్యంత అరుదైన చింతామణి కి
కందువ చెల్లెలుగాన: ముద్దుల చెల్లెలు కాబట్టి
తళుకు: మిక్కిలి ప్రకాశము, నున్నని మృదు కాంతి కలిగిన
మానికపు: మాణిక్యముల 
దంతముల బోలినది: పలు వరుసలు పోలినది. (అంటే ఆమె నవ్వితే తెల్లని పలు వలువరస తళుక్కు మనే కాంతులు విరజిమ్ముతోందన్నమాట) 

మంచి యైరావతముతుతో: మాంచి తెల్లని యేనుగుతో
మగువ: స్త్రీ (ఇక్కడ లక్ష్మీ దేవి)
సైదోడుగాన: తోడబుట్టినది కాబట్టి (సయి దోడు = తోడబుట్టినది/ తోడబుట్టిన వాడు, A brother or sister) 
కరిగమనము బోలినది: యేనుగు వంటి నడక కలిగినది
పంచల:  పంచలక్షణములుగల (పంచలక్షణములు -సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము)
బారిజాతపు: పారిజాత పువ్వునకు
భావపు సోదరిగాన: అత్యంత ప్రేమ పాత్రమైన సోదరి కాబట్టి
యెంచగ: పరికించి చూస్తే
చిగురుబోలె నీకెపాదములు: ఈకె = స్త్రీ (లక్ష్మీ దేవి) పాదములు లేత చిగుళ్ళ ను పోలి వున్నాయి.

తామెర తొట్టెలలోన: తామెర పువ్వు రేకుల మధ్యలో 
తగిలి తానుండుగాన: తాను నివసించేటతువంటిది కాబట్టి
తామెరకన్నులబోలి: ఆమె కన్నులు తామెర పూల రేకులను పోలి ఉన్నాయి 
తనరినది: అతిశయించినది, To appear or shine
యీమేర: ఈ విధముగా
నిన్నిటా బోలి: ఇన్ని విధముల పోలికలు కలిగినది
ఇన్ని లక్షణములతో: ఇన్ని గొప్ప లక్షణములతో
నీమేన: నీ శరీరముపై
శ్రీవేంకటేశ నెలవై నిల్చినది: శ్రీ వేంకటేశుడా ఉనికి పట్టై నిలిచినది (నీ ఉనికికి స్థానమై నిలిచినది) (నెలవు =A place, abode, home)

భావం:
ఈ సంకీర్తన పూర్తిగా అర్ధం అవ్వాలంటే ముందు దేవతలు, రాక్షసులు కలిసి మంథర అనే పర్వతానికి వాసుకి అనే పామును కవ్వంగా చుట్టి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన సన్నివేశం, ఆ సముద్రాన్ని చిలికినప్పుడు పుట్టిన వస్తువుల గురించి కొంత అవగాహన ఉండాలి. 
క్షీరసాగర మధనంలో ముందుగా హాలాహలము (కాలకూట విషము), ఉచ్చైశ్శ్రవము (తెల్లని ఏడు తలలు కలిగిన గుర్రము), కౌస్తుభ మణి/చింతామణి (మహావిష్ణువు హృదయ సీమమీద అలరారే మణి),  చల్లని వెన్నెలలు కురిపించే చంద్రుడు, సకల అందాలకు, ఐశ్వర్యానికీ నెలవైన పసిడిబొమ్మ లక్ష్మీదేవి, సుందరాంగులైన అప్సరసలు (రంభ, మేనక, పుంజికస్థల మున్నగు వారు), కామధేనువు లేదా సురభి (కోరినవన్నీ ఇచ్చే ఆవు), కల్పవృక్షము (కోరిన వన్నీ ఇచ్చే చెట్టు), పారిజాతము (అత్యంత సువాసన కలిగిన పువ్వు), ఐరావతము (తెల్లని యేనుగు), ధన్వంతరి (దేవతల వైద్యుడు) మున్నగు వారు ఉద్భవించారు. 

నీవు బంగారం రంగుతో ఉన్న పసుపు పీతాంబరమును కట్టుకున్నావు కాబట్టి పాల సముద్రమునందు పవ్వళించే వాడవు కాబట్టి బంగారు బొమ్మ ఐన పడతి నీ చేతిని చేపట్టింది. 

ఓ సారి ఆవిడ గొప్పదనం చెప్తాను విను. ఆవిడ ముఖం చంద్రుని వలే గుండ్రంగా ఎలా ఉందో చూడు. ఎందుకలా ఉందో తెలుసా! తను చంద్రుడికి తోడబుట్టినది. చంద్రుడికి ముద్దుల చెల్లెలు. అంతేనా! కాంతులు చిందే చింతామణి కి సహోదరి. చూడు, ఆమె నవ్వుతున్నప్పుడు తన పలు వరస మాణిక్యాలనుండి వచ్చే కాంతి వలే తళుకు, తళుకు మంటోందో..

ఆవిడ నడక గంభీరమైన యేనుగు నడచినట్లుంటుంది కదా! అదెందుకో తెలుసా! తను గజరాజైన తెల్లని ఐరావతానికి చెల్లెలు. అందుకు అంత గంభీరమైన నడక వచ్చింది. ఆమె పాదాలను ఎప్పుడైనా పరీక్షగా చూశావా! లేత చిగురుటాకుల్లా, ఎర్రగా, ముట్టుకుంటే కందిపోతాయా, అన్నట్టు లేవూ! అలా ఎందుకున్నాయో తెలుసా! అతి సున్నితమైన పారిజాతం పువ్వుకి అత్యంత ప్రేమపాత్రమైన చెల్లెలు. అందుకే అవి అంత సుతారంగా ఉన్నాయి.

ఇదిగో! ఆమె కళ్ళు తామెర పూ రేకుల్లా అత్యంత మనోహరం గా నీపై ప్రేమ కురిపిస్తున్నాయి కదా! అవి ఎందుకలా ఉన్నాయో తెలుసా! ఆమె పద్మాన్ని  ఆసనంగా చేసుకుని అందులో కూర్చుంటుంది. అంతేనా...ఆమె పద్మప్రియ, పద్మహస్తా, పద్మాక్షి, పద్మసుందరి, పద్మోద్భవి, పద్మముఖి, పద్మనాభ ప్రియ, పద్మమాలాధరి, పద్మిని, పద్మగంధిని.  అందువల్ల తన కన్నులు కూడా తామెర రేకులను పోలి ఉన్నాయి. ఇన్ని గొప్ప గుణాలతో, చక్కటి లక్షణాలతో ఈ సౌందర్యవతి ఐన పడతి నీ శరీరం స్థానముగా చేసుకుని కొలువుదీరి ఉన్నది. 
  
ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/2011/04/743pasidicheeravadavu.html

Sunday, March 27, 2011

దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు

దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే

ముఖ్య పదాల అర్ధం:

దినము ద్వాదశి: నేడు ద్వాదశి (ఫాల్గుణ బహుళ ద్వాదశి)
తీర్థము: ౧) In theological works తీర్థము means salvation, మోక్షము.
    ౨) Water. ఉదకము. Holy or sacred water. పుణ్యోదశము
తీర్థదివసము: మోక్షము పొందిన రోజు
జనకుడ: తండ్రీ
విచ్చేయవే: విజయము చేయు, వేంచేయు, రమ్ము

అనంతగరుడ ముఖ్యులైన: అనంతుని వాహనుడైన గరుడుడు మరియు ముఖ్యులైన
సూరిజనులతో: సూరి= విద్వాంసుడు, A great scholar: a learned man. = ఆయా రంగాలలో నిష్ణాతులైన జనులందరితో
ఘననారదాది భాగవతులతో: ఘన విష్ణువు (అన్నమయ్యకు పంచ సంస్కారాలు చేసి, వైష్ణవ మతాన్ని ఇచ్చిన వ్యక్తి), నారదుడు మరియు ఇతర భాగవతోత్తములు (అంటే ప్రహ్లాదుడు, విభీషణుడు వంటి) వారలతో
దనుజ మర్దనుండైన: రాక్షసులను సంహరించిన
దైవశిఖామణితోడ: దేవాదిదేవుడైనట్టి శ్రీ మహావిష్ణువుతో కలసి
వెనుకొని: వెనక బెట్టుకుని
యారగించ విచ్చేయవే: విందు ఆరగించడానికి విచ్చేయి తండ్రీ

వైకుంఠాన నుండి: వైకుంఠం లో ఉన్న పాలసముద్రంలో పరుండేటువంటి
యాళువారలలోపల నుండి: పన్నెండు మంది ఆళ్వారుల మనసుల్లో ఉండేటువంటి (The Alwars or saints were twelve in number and are considerd to have been incarnations of the attendants, arms, or insignia of Vishnu)
లోకపు నిత్యముక్తులలోన నుండి: నిత్యము ముక్తి లోకంలో విహరిస్తూ ఉండేటువంటి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి: లక్ష్మీదేవితో కలసి ఉన్న శ్రీ వేంకటేశ్వరుని వెంటబెట్టుకుని
యీకడ నారగించ నింటికి విచ్చేయవే: ఇక్కడ (మేము ఏర్పాటు చేసిన) విందును ఆరగించడానికి మన ఇంటికి రా తండ్రీ

సంకీర్తనముతోడ: హరి సంకీర్తనలు పాడుకుంటూ
సనకాదులెల్ల(బాడ: నీతో బాటే సనక, సనందనాది మునులు, సేవకులు అంతా పాడుకుంటూ
పొంకపు: సొగసైన
శ్రీవేంకటాద్రి భూమి నుండి: శ్రీ వేంకటాచల భూమి (తిరుమల క్షేత్రం) నుండి
లంకె: తగిలించి, చేర్చుకుని, To join, unite
శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు: వేంకట పతి, లక్ష్మీ విభుడు ఐన వేంకటేశ్వరుడు, నీవు
నంకెల: అంకెల: ఎక్కువ సంఖ్యలో
మాయీంటి విందు లారగించవే: మా ఇంట ఏర్పాటు చేసిన విందును ఆరగించు తండ్రీ.

భావం:
పెద తిరుమలయ్య తన తండ్రి యెడల అపారమైన భక్తి, ప్రపత్తులను కనబరిచినాడు. తన తండ్రి అన్నమాచర్యుల పుణ్య తిథి, ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు ఆచార్యునికి భక్ష్యభోజ్యాదులనర్పించి శ్రీలక్ష్మీసమేతుడైన శ్రీ వేంకటేశ్వరునితో, వైష్ణవ భక్తాగ్రేసరులతో విందులారగించగా విచ్చేయమని తిరుమలయ్య అర్ధ్రత తో పాడుకున్న పాటే అతని పితృభక్తికి అక్షర తార్కాణం.

నాకు ఈ పాట రాస్తున్నంత సేపూ కళ్ళు నీళ్ళతోనే ఉన్నాయి. అన్నమయ్య కు ఏమీ కాని నేనే ఇంత ఆవేదన చెందితే...నిత్యము హరి నామస్మరణ చేసి, హరికి వేలకొలదీ కీర్తనలు వినిపించి, ఆ హరిని తన తనయునకు కూడా చూపించి, తన తర్వాత దినముకొక్క సంకీర్తన పాడవలసిన కర్తవ్యాన్ని ఆతనికి అందించిన తండ్రి ఇక మీదట తనతో ఉండడని, తన తండ్రి శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడని తెలుసుకున్న పెదతిరుమలయ్య ఎంత ఏడ్చి ఉంటాడు. నాన్నా, నాన్నా అని ఎంత రోదించి ఉంటాడు. తలుచుకుంటుంటే దుఖం పొంగుకొస్తోంది.

నేడు ఫాల్గుణ బహుళ ద్వాదశి. నీవు హరి పదాన్ని చేరిన రోజు. మమ్ములను విడిచిన రోజు. నీకు మా ఇంట విందును ఏర్పాటు చేశాము. ఇంటికి రా తండ్రీ!!

అనంతుని వాహనుడైన గరుడుడు మరియు ముఖ్యులైన మరియు ఆయా రంగాలలో నిష్ణాతులైన జనులందరితో, ఘన విష్ణువు (అన్నమయ్యకు పంచ సంస్కారాలు చేసి, వైష్ణవ మతాన్ని ఇచ్చిన వ్యక్తి), నారదుడు మరియు ఇతర భాగవతోత్తములు (అంటే ప్రహ్లాదుడు, విభీషణుడు వంటి) వారలతో, రాక్షసులను సంహరించిన దేవాదిదేవుడైనట్టి శ్రీ మహావిష్ణువుతో కలసి, మిగతా వారందరినీ వెనక బెట్టుకుని, విందు ఆరగించడానికి విచ్చేయి తండ్రీ.....

వైకుంఠం లో ఉన్న పాలసముద్రంలో పరుండేటువంటి, పన్నెండు మంది ఆళ్వారుల మనసుల్లో ఉండేటువంటి, నిత్యము ముక్తి లోకంలో విహరిస్తూ ఉండేటువంటి, లక్ష్మీదేవితో కలసి ఉన్న శ్రీ వేంకటేశ్వరుని వెంటబెట్టుకుని ఇక్కడ (మేము ఏర్పాటు చేసిన) విందును ఆరగించడానికి మన ఇంటికి రా తండ్రీ....

నీవు , నీతో బాటే సనక, సనందనాది మునులు, సేవకులు అంతా హరి సంకీర్తనలు పాడుకుంటూ, సొగసైన శ్రీ వేంకటాచల భూమి (తిరుమల క్షేత్రం) నుండి అంతా కలిసి, వేంకటగిరి పై నివాసమున్న లక్ష్మీ విభుడు ఐన వేంకటేశ్వరుడు, నీవు ఎక్కువ సంఖ్యలో మా ఇంట ఏర్పాటు చేసిన విందును ఆరగించడానికి విచ్చేయి తండ్రీ...

పెదతిరుమలయ్య పితృభక్తి ఎంత ఉన్నత స్థితిలో ఉందో ఈ సంకీర్తన ద్వారా తెలుస్తుంది.


ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/2006/12/105dinamu-dwaadasi-nedu.html

Saturday, March 19, 2011

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల

మేలుకో శృంగార రాయ మేటి మదన గోపాల
మేలుకోవె నాపాలి మించిన నిధానమా

సందడించే గోపికల జవ్వనవనములోన
కందువదిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండు తుమ్మెద

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా
సతుల పదారువేల జంట కన్నులఁ గలువలు
కితమై పొదిమిన నా యిందు బింబమ

సరుసంగొలనిలోని వారి చన్నుఁగొండలపై
నిరతివాలిన నా నీలమేఘమా
సిరనురమున మోచి శ్రీవేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా

ముఖ్యపదాల అర్ధం:

శృంగార రాయ: అందమైన పురుషుడు
మించిన నిధానము: అతిశయించిన  నిక్షేపము, దాచుకొన్నది, పాతర, పాతిపెట్టుకొన్నది (A treasure, a hoard or fund, a treasury)

సందడించే గోపికల: గోపికల గుంపు, సమ్మర్దము
జవ్వనవనములోన: యౌవ్వనము అనే అడవిలో
కందువదిరిగే: చమత్కారముగా/నేర్పుతో తిరిగే
మదగజమవు: మదించిన యేనుగు వంటి వాడవు
యిందుముఖి: చంద్రుని వంటి మొహము కలిగినది
సత్యభామ హృదయపద్మములోని: సత్యభామ పద్మము వంటి మనస్సులో
గంధము మరిగినట్టి: వాసనను బాగా అలవాటుపడిన (Smell, odour)
గండు తుమ్మెద: నల్లని పెద్ద తుమ్మెద వంటి  వాడా

గతిగూడి: ఆనందాబ్దిగతుడై
రుక్మిణికౌగిట పంజరములో: రుక్మిణిదేవి కౌగిలి అనే పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా: రతి చుంబనాలను కురిపించే అందమైన రామ చిలుక వంటి వాడా
సతుల పదారువేల: పదహారువేల మంది భార్యల
జంట కన్నులఁ గలువలకు : జంట కలువల వంటి కన్నులకు
హితమై పొదిమిన నా యిందు బింబమా: ఇష్టమైన చంద్రబింబము వంటి వాడా

గొలనిలోని వారి: కొలనులో స్నానం చేస్తున్న గోపికల
చన్నుఁగొండలపై: కొండలవంటి ఎత్తైన స్తనముల పైన
నిరతివాలిన
నా నీలమేఘమా: ఎల్లప్పుడూ వాలేటువంటి నీల మేఘము వంటి వాడా 
సిరనురమున: లక్ష్మిని వక్షస్థలము నందు
మోచి: ఉంచి, ధరించి, మోస్తూ
శ్రీవేంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా: శ్రీ వేంకటాద్రిపైన నిలచి అడిగిన వారికి లేదనకుండా పెద్ద పెద్ద వరాలిచ్చే కలతరువు వంటి వాడా....

భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య తిరుకట్ల మదనగోపాల స్వామి ని నిద్రలేపడానికి పాడిన పాట. అన్నమయ్య ఒక కవిలా కేవలం ఒక్క ప్రదేశంలో కూర్చుని కీర్తనలు రాయలేదు. ఆయన దర్శించిన ప్రతీ క్షేత్రంలో కొలువై ఉన్న దేవతలపై సంకీర్తనలు అప్పటికప్పుడే ఆశువుగా పాడేవారు. గోపాంగనలతో శ్రీకృష్ణుని చేష్టలను మెచ్చుకుంటూ, నిద్రలే స్వామీ! అని పాడ్తున్నారు. ఈ పాటనే ప్రతీ రోజూ తిరుమల క్షేత్రంలో అన్నమయ్య వంశీకులు స్వామి సుప్రభాతం ఐన వెంటనే పాడతారు. వేంకటాద్రిపై ఉన్న విభుడు సాక్షాత్తూ ద్వాపర యుగంలో బాలక్రిష్ణుడే. అన్నమయ్య ఎన్నో సంకీర్తనల్లో వేంకటాద్రి బాలక్రిష్ణా అని ముద్దుగా పిలుచుకున్నారు.   

ఓ శృంగార పురుషా, మదన గోపాలా! నిద్ర లే స్వామీ!. నా మదిలో దాచుకున్న
నిక్షేపమా! నన్ను కాపాడే నా దైవమా! కళ్ళు తెరువు స్వామీ!

గోపికల యౌవ్వనము అనే అడవిలో స్వేచ్చగా విహరించే మదగజము వంటి వాడా! చంద్రుని వంటి అందమైన మొగము కలిగిన నీ భార్య సత్యభామ మనస్సు అనే పద్మములో గంధము (ప్రేమను) బాగా మరిగిన నల్లని పెద్ద తుమ్మెద వంటి వాడా! నిద్రనుండి మేలుకో స్వామీ!


ఆనందపరవశుడవై రుక్మిణి కౌగిలి అనే పంజరములో రతి ముద్దులు కురిపించే రామ చిలుకా! పదహారు వేల మంది భార్యల అందమైన జంట కలువల్లాంటి కన్నులకు ఇష్టమైన చంద్ర బింబము వంటి వాడా! (కలువలు చంద్రుణ్ణి చూడగానే వికశిస్తాయి. అలాగే ఈ పదహారువేల మంది గోపికల కలువ కన్నులకు స్వామి చంద్రబింబం అన్నమాట. ఆయన్ను చూడగానే వాళ కళ్ళు వికశిస్తాయి). నిద్రనుండి మేలుకో స్వామీ!


కొలనులో స్నానం చేస్తున్న గోపికల కొండలవంటి ఎత్తైన స్తనముల పైన ఎల్లప్పుడూ వాలేటువంటి నీల మేఘము వంటి వాడా! లక్ష్మిని వక్షస్థలము నందు ఉంచుకుని శ్రీ వేంకటాద్రిపైన నిలచి అడిగిన వారికి లేదనకుండా పెద్ద పెద్ద వరాలిచ్చే కల్పతరువు వంటి వాడా....నిద్రనుండి మేలుకో స్వామీ!

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/50melukosrungararaya.html

Monday, March 14, 2011

నెలత సొబగులివి నీ సొమ్ము కలసి మెలసి యిటు గైకొనవయ్యా

నెలత సొబగులివి నీ సొమ్ము
కలసి మెలసి యిటు గైకొనవయ్యా

వేమరు నవ్వుల వెన్నెల గాసీ
రామ కడకు నిటు రావయ్యా
దోమటిపలుకుల తొరిగీ తేనెలు
ఆమని కాలము అవధరించవయ్యా

వలపుల చెమటల వానలు గురిసి
సొలవక యీకెను జూడవయ్యా
పెలుచు కుచంబుల పిందెలు వొడమెను
అలరిన కానుక లందుకోవయ్యా

గములై మెయి మరుకళలు దొల(కీ
తమితో కౌగిట తగులవయ్యా
జమళి శ్రీవేంకటేశ్వర సతి గూడితివి
అమరె నీకు మేలౌనయ్యా

ముఖ్య పదాల అర్ధం:

నెలత : స్త్రీ
సొబగులు: సౌందర్యము, సొగసు (Beauty, prettiness).
నీ సొమ్ము: నీ అధీన వస్తువు/ సొత్తు/ భూషణము/ ఆభరణము
కలసి మెలసి: అన్నివేళలను దగ్గరగా ఉంటూ, స్నేహం చేస్తూ
యిటు గైకొనవయ్యా: తీసుకోవయ్యా

వేమరు నవ్వుల: అనేక వేల నవ్వులు, మాటి మాటికీ నవ్వులు, తరచుగా నవ్వులు (again and again, over and over, often, constantly
వెన్నెల గాసీ: వెన్నెల కాసి (పై రెండర్ధాలు కలిపితే నవ్వుల వెన్నెల కురిపిస్తూ అని చెప్పుకోచ్చు)
రామ కడకు: రామ అంటే అందమైన స్త్రీ (అలమేలు మంగ) వద్దకు
దోమటిపలుకుల: అందమైన పలుకులు (దోమటి అంటే అన్నము అని నిఘంటువు చెప్తోంది. అన్నమయ్య ఎన్నోసార్లు దోమటి చంద్రుడు అని వేరే కీర్తనల్లో వాడారు. కానట్టి దోమటి అంటే అందమైన అని అనుకుంటున్నా) 
తొరిగీ తేనెలు: తేనెలు కారు/ స్రవించు/ ప్రవహించు/ జారు/ రాలు (To flow, gush, burst, out, run)
ఆమని కాలము: వసంత కాలము (చెట్లు చిగిర్చి పూలు పూయు కాలము)
అవధరించవయ్యా: వినవయ్యా, ఆలకించవయ్యా,

వలపుల: ప్రేమతో, మోహంతో, (Love, affection)
చెమటల: వేడేక్కిన శరీరము విడుచు నీరు
వానలు గురిసి: వానలు కురిసెను
సొలవక: అలసట వల్ల కలిగే ఆయాసము లేని, నిస్త్రాణ పొందని, (no Languishment, no faintness) (చాలా యాక్టివ్ గా ఉంది అని)
యీకెను: ఈమెని, ఈ అలమేలు అంగ ను
జూడవయ్యా: చూడవయ్యా
పెలుచు: గట్టిపడిన, కఠినతను పొందిన Stiffness, Inflexibility. Brittleness
కుచంబుల పిందెలు: స్తనముల యొక్క చివరలు (కుచాగ్రములు) (The nipple. the tip of the breast)
వొడమెను: పొడమెను = పుట్టు, కలుగు (To be produced, to arise)
అలరిన : ప్రకాశించు (To shine, glitter, be splendid)
కానుక లందుకోవయ్యా: కానుకలు అందుకోవయ్యా

గములై: గుంపులై
మెయి: శరీరము (The body)
మరుకళలు: మన్మధుని యొక్క కళలు
దొల(కీ: తొణకెను, తొణకిసలాడెను
తమితో: కోరికతో, మోహం తో
కౌగిట తగులవయ్యా: కౌగిటను చేరవయ్యా
జమళి: జంట (Double, paired, coupled)
శ్రీవేంకటేశ్వర: వేంకటపతీ
సతి గూడితివి: నీ భార్యను కలసితివి (రతి క్రియలో)
అమరు: ఒప్పు, తగు, తగియుండు (To be fit or proper, be agreeable)
నీకు మేలౌనయ్యా: నీకు అంతా శుభమౌతుంది స్వామీ.

భావం:

ఈ సంకీర్తనలో అన్నమయ్య స్వామితో మాట్లాడుతున్నాడు. ఏ విధంగా అమ్మను కలవాలో సూచనలు చేస్తున్నాడు. అంత మధుర భక్తిలోకి వెళ్ళిపోయాక/లేదా ఎక్కువగా ఎవరినైనా ఇష్టపడుతూ, నిరంతరం వారినే తలుచుకుంటూ ఉంటే....వాళ్ళ మీద మనకు ఓ అధికారం వచ్చేస్తుంది. ఇక్కడ అన్నమయ్య ఆట, మాట, పాట, అన్నీ స్వామి కోసమే.. అందుకే అన్నమయ్య పాటకు వేంకటేశ్వరుడు పరవశించిపోయాడు. అన్నమయ్య ప్రతీ మాటనూ తూ.చ. తప్పకుండా పాటించి ఉంటాడు.  

స్వామీ! ఈ సౌందర్యవతి అందాలు నీ సొమ్ము. వాటి మీద పూర్తి హక్కు నీకుంది. ఆమె నీ భార్య కదా! మెల్లగా ఆవిడతో స్నేహం చేసి ఆ అందాలన్నీ అందుకుని ఆనందించు.   

తరచుగా నవ్వుల వెన్నెలలు కురిపిస్తూ (అంటే చల్లని నవ్వులు అన్నమాట. ఆ నవ్వుల్లో అంతరార్ధం ఆవిడ అర్ధం చేసుకోవాలి కదా!!) నీ అందాల భార్య వద్దకు రా.. వసంతకాలంలో పూలు స్రవించే తేనెల్లాంటి తీయని అందమైన మాటలు తేనెలు నీ నోట్లోంచి జాలువార్చు. నా మాట విను స్వామీ!!

మీ ఇద్దరి మోహపు కలయిక వల్ల మీ శరీరాలు బాగా వేడెక్కి, చెమటలు వానల్లా కురుస్తున్నాయి. ఇంత జరిగినా ఆమె ఇంకా అలసిపోలేదు చూడు. నీవు కలిగించిన కోరికకి ఆవిడ స్తనాలు గట్టిగా తయారయ్యాయి. ఆమె కుచాగ్రాలు బయటకు పొడుచుకొస్తున్నాయి. ఇంతటి ఆనంద సమయంలో
ప్రకాశించే ఆవిడ కానుకలు అందుకో...సరేనా!!

నీ అందాల బొమ్మ శరీరంలో మన్మధుని కళలు (కోరికలకు సంబంధించిన భావాలు) గుంపులు గుంపులు గా తొణికిపోతున్నాయి. (సగం నీరు నిండిన   కుండతో నడుస్తున్నప్పుడు నీళ్ళు ఎలా తొణుకుతాయో అలా ఆమె శరీరంలో కోరికలు తారాస్థాయికి చేరాయని చెప్పాలనుకున్నారేమో!!) నీవూ అంతే కోరికతో మా అమ్మవారిని కౌగిలించుకో. మీ ఇద్దరి జంట భలే కుదిరింది. శ్రీ వేంకటేశ్వరా నీవు అలమేల్మంగ తో కలిశావు. నీకు అంతా శుభము కలుగు గాక.
ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/2008/03/446nelata-sobagulivi-ni-sommu.html

Saturday, March 12, 2011

ఏమొకో చిగురుటధరమున - ఎడనెడ కస్తూ రి నిండెను


ఏమొకో చిగురుటధరమున - ఎడనెడ కస్తూ రి నిండెను
భామిని విభునకు రాసిన - పత్రిక కాదు కదా

కలికి చకోరాక్షికి కడ - కన్నులు కెంపై తోచిన
చెలువంబిప్పుడిదేమో - చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరుపై - నాటిన ఆ కొనచూపులు
నిలువునపెరుకగనంటిన - నెత్తురు కాదుకదా

పడతికి చనుగవ మెరుగులు - పైపై పయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో - కనుగొనరే చెలులు
ఉడుగని వేడుకతో ప్రియు - డొత్తి న నఖ శశి రేఖలు
వెడలగ వేసవి కాలపు -వెన్నెల కాదు కదా

ముద్దియ చెక్కుల కెలకుల - ముత్యపు జల్లుల చేర్పుల
ఒద్దిక బాగు లివేమో - ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి - కామిని వదనాంబుజమున
అద్దిన సురతపు చెమటల - అందము కాదుకదా

ముఖ్యపదార్ధం:

ఏమొకో: ఏమిటికో, ఎందుకో (for what reason, I know not why)
చిగురుటధరమున: చిగురు+అధరమున = అధరము అంటే క్రింది పెదవి, చిగురు అంటే, లేత, అందమైన, చివరన (అంచుల్లో): ఇక్కడ మూడు రకాల భావనలు చేసుకోచ్చు. ఒకటి) లేత పెదవి, రెండు) అందమైన స్త్రీ పెదవి, మూడు) క్రింద పెదవి చివర/అంచులో
ఎడనెడ: అచ్చట అచ్చట (అక్కడక్కడ) (Here and there)
కస్తూరి: అత్యంత సువాసన భరితమైన గంధ ద్రవ్యం. శ్రీవారు నుదుటను ధరించే తిలకంలో ఈ సుగంధద్రవ్యాన్ని కలుపుతారు. ఈ ద్రవ్యం కస్తూరి మృగమునుండి సేకరిస్తారని పెద్దలు చెప్పగా విన్నాను. (Musk. The black spot or line on the forehead, formed of musk)
నిండెను?: నిండి ఉంది??
భామిని: స్త్రీ, ఆడుది (A woman)
విభునకు రాసిన: స్వామికి రాసిన
పత్రిక కాదు కదా: ఉత్తరం కాదు కదా!!

కలికి: అందమైన
చకోరాక్షికి: చకోరము అనే పక్షి కన్నుల వంటి కన్నులు కలిగిన ఈమె.  ఈ పక్షులు చంద్రకిరణముల కోసం  ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటాయి. (The bartavelle or Greek partridge: a bird much referred to in poems: corresponding to the nightingale, or turtledove. eagerly as the partridge languishes for the rays of the moon.)
కడకన్నులు: కంటి చివరలు (The outer corner of the eye)
కెంపై తోచిన: కెంపు అంటే పద్మరాగము అనే మణి. ఎర్రని మణి 
చెలువంబిప్పుడిదేమో: చెలువము+ఇప్పుడు+ఇదేమో = విధము (Manner, way)
చింతింపరే చెలులు: ఆలోచించండి చెలులూ
నలువున: అందముగా, సామర్ధ్యముతో
ప్రాణేశ్వరుపై: ఆవిడ భర్తపై, స్వామిపై
నాటిన: గుచ్చిన
ఆ కొనచూపులు: కంటి చివరలతో చూసిన చూపులు
నిలువున: నిలచిపోయిన
పెరుకగ : పెరుకు =గట్టిగా పీకు, పెల్లగించు (To tear out, pulling out force fully) 
అంటిన నెత్తురు కాదు కదా: అంటుకున్న రక్తము కాదు కదా! (చూపుల బాణాలు ఒక్కసారి వెనక్కు తీసుకునే సరికి ఆ బాణం స్వామి శరీరానికి గుచ్చుకుని అంటుకున్న రక్తం కాదు కదా! ఆమె కంటి చివరలున్న ఎరుపు?)

పడతికి: స్త్రీకి, అలమేలు మంగకి
చనుగవ: చను కట్టు, చన్నులు, వక్షోజాలు, స్తనాలు, పాలిండ్లు, పయోధరాలు
మెరుగులు: ప్రకాశవంతమైన కాంతులు
పైపై: పైన పైన
పయ్యెద: పయి+ఎద = వక్షోజములను కప్పు వస్త్రము (పైట కొంగు, పమిట కొంగు, పైట చెంగు)  A woman's mantle, formed by throwing the train or end of the cloth over her breast and head.
వెలుపల: వెలి+పల = బయటకి (Outside)
కడు: మిక్కిలి Much, greatly
మించిన: అతిశయించిన
విధమేమో: ఆ విధం ఏమిటో (Kind, way, manner, mode)
కనుగొనరే చెలులు: కనిపెట్టండి చెలులూ
ఉడుగని: ఏ మాత్రమూ తగ్గని, కోరికవల్ల కలిగే వేడితో
వేడుకతో: సంతోషముతో, కుతూహలముతో, కోరికతో
ప్రియుడొత్తిన: స్వామి వత్తిన, అదిమిన, నొక్కిన (Pressing)
నఖ శశి రేఖలు : చంద్రరేఖల వంటి గోటి నొక్కులు (వాడ్యమి, విదియలలో చంద్రుడు ఏవిధముగా సన్నని రేఖలా ఉంటాడో (crescent moon) అలా గోళ్ళతో ఆవిడ స్తనములను నొక్కినప్పుడు స్వామి చేతి గోళ్ళు గుచ్చుకుని అవి శశిరేఖల్లా ఉన్నాయని)  
వెడలగ: వెడల్పుగా, విశాలముగా, విరివిగా
వేసవి కాలపు: మండు వేసవి కాలంలో
వెన్నెల కాదు కదా: చల్లని వెన్నెల కాదు కదా!

ముద్దియ: స్త్రీ A lady, dame, woman. (సంస్కృతంలో ముగ్ధ), మనోహరమైన, ముద్దైన 
చెక్కుల: నున్నని చెంపలు
కెలకుల: చివరల, అంచుల??
ముత్యపు జల్లుల: ముత్యాలు జల్లినట్టుగా
చేర్పుల: దగ్గరగా చేర్చుట, ఒకదాని పక్కన మరొకటిగా ఉండుట (Nearness, closeness, connection)
వొద్దిక లాగులివేమో: వాటి జనన రహస్యమేమో, పోలిక విధములేమో (ఒద్దిక = అనుకూల్యము Concord, union, friendship)
ఊహింపరే చెలులు: ఊహించండి చెలులూ
గద్దరి: గడుసైన (Impertinent, pert)
తిరువేంకటపతి: తిరు వేంకటేశ్వరుడు
 
కామిని : కోరికతో ఉన్న స్త్రీ 
వదనాంబుజమున : పద్మము వలే వికసించిన మొగమున
అద్దిన: అద్దుట
సురతపు: స్త్రీ పురుషుల కలయిక, మంచి రతి క్రియ
చెమటల: స్వేదముల (శరీరము వేడెక్కుటచేత విడవబడే నీరు)

అందము కాదుకదా: ఆ అందమే కదా!!

భావం:

ఈ సంకీర్తన విని ఇందులో ఉన్న అందానికి ముచ్చటపడి, ఆశ్చర్యచకితుడై సాళ్వ నృశింహ రాయలు అటువంటిదే తన మీద, తన భార్యమీద పాడమని కోరగా అన్నమయ్య ""హరి హరీ..నరహరిని స్తుతించు నా నాలుక నరులను స్తుతించదు", ఇంత నీచపు మాట నాతో ఎలా అనగలిగావు అని దిగ్గున లేచిపోగా అతను పదే పదే అడిగి, మదగర్వం చేత అన్నమయ్య నోట వెంబడి అతని నామస్మరణ వచ్చేదాకా చెరశాలలో బంధించి మూరురాయరగండ ముద్రగల సంకెల వేయించి మొగసాలలో బంధించి హింసించాడు. అన్నమయ్య "నీ దాసుల భంగములు నీవు జూతురా" "ఆకటి వేళల అలపైన వేళలను తేకువ హరి నామమే దిక్కు మరిలేదు" వంటి సంకీర్తనలు పాడగా ఆ సంకెళ్ళు తెగిపోయాయి.


రాత్రి స్వామితో రతి సుఖాలను అనుభవించి వచ్చిన అలమేల్మంగను చూసి చెలికత్తెలు ఒకరిలో ఒకరు ప్రశ్నించుకుంటూ, అది ఇది కాదు కదా, ఇది కాదు కదా అంటూ నిజాలను తమలోనే తెలుసుకుంటూ అమ్మవారిని ఆటపట్టిస్తున్నారు. ఇది మన ఇళ్ళలో కూడా సహజమే. కొత్తగా పెళ్ళైన జంటకు మొదటిరాత్రి జరిగిన తర్వాత గదిలోంచి బయటకొచ్చిన జంటను  స్నేహితులు, బంధువులు ఏ విధంగా ఆట పట్టిస్తారో అదే విధంగా అలమేల్మంగను చెలులు ఆట పట్టిస్తున్నారని అన్నమయ్య అద్భుతంగా ఊహించి రాసిన సంకీర్తన.

ఈ అలమేల్మంగ ఎర్రని అధరాలపై అక్కడక్కడ కస్తూరి మరకలు అంటుకున్నాయి. ఎర్రని పత్రంపైన ఈమె నల్లని అక్షరాలతో (కస్తూరి నల్లగా ఉంటుంది) రాసిన లేఖ కాదు కదా! (అంటే స్వామి అమ్మ వారి తో రతిక్రియ చేసి అలసిపోయి ఆవిడ స్తనాలమీద తల పెట్టి నిద్రపోతూంటే...ఆయనతో పొందిన సంతోషాన్ని తలుచుకుంటూ అమ్మ పొంగిపోయి అత్యంత ప్రేమతో ఆయన నుదుటి మీద ఆప్యాయంగా ముద్దుపెట్టుకుంది. అప్పుడు ఆ నుదుటనున్న కస్తూరి ఈమె పెదవులకు అంటుకుంది...అని నా ఊహ..)

చకోరపక్షిలాంటి కళ్ళు కలిగిన ఈ సుందరి కళ్ళ చివరలు మరింత ఎర్రగా ఉన్నాయి. దీనికి కారణమేమిటే చెలులూ?. నిద్రపోరతున్నట్టు నటిస్తూన్న తన ప్రియుని అందాన్ని తదేకంగా తల వంచుకుని సిగ్గుతో కంటి చివరలనుండి చూస్తున్నప్పుడు, స్వామి ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి గభాలున చూపులు వెనక్కుతీసుకుంది. అంతే! ఆవిడ చూపుల బాణాలు ఆతనిలో నాటుకుని ఉండగా ఒక్కసారి వెనక్కు లాగేడప్పటికి, ఆ బాణాలకు అంటుకున్న ఆయన రక్తం ఈవిడ కంటి చివరలను అంటిందేమో నే చెలులూ! కాదంటారా!

ఈ అలమేల్మంగ చన్నుల కాంతులు పైపైకి, పయ్యెద (పైట) దాటి పాకుతున్నవి. అంత కాంతి అసలు అక్కడ ఎందుకొచ్చిందో, ఆ రహస్యాన్ని కనిపెట్టండి చెలులూ!. తనివి తీరని కోరికతో స్వామి ఆమె స్తనములను గట్టిగా ఒత్తేసరికి ఆయన గోళ్ళు స్తనాలపై గుచ్చుకుని, నెలవంకలు లా ఏర్పడి అవి వెలువరిస్తున్న వేసవికాలపు వెన్నెలే కదా ఇది!!!  


ఈ ముద్దుల చెక్కిళ్ళ అంచుల్లో ముత్యాలజల్లులు పేర్చినట్టుంది. ఆ రహస్యమేమిటో ఊహించండే చెలులూ! అది నేర్పరి అయిన శ్రీ వేంకటేశుడు కోరికతో ఉన్న ఈమె పద్మము వలే వికసించిన మొగమున అద్దిన చక్కటి రతిక్రియ వలన పుట్టిన చెమటల అందమే కదా!! 

కొన్ని చోట్ల "కామిని వదనాంబుజమున" అనేచోట....."కౌగిట అధరామృతముల" అని ఉంది. అందువల్ల "కౌగిట అధరామృతమున" అని పూరిస్తే కీర్తన స్వభావం ఎలా ఉంటుందో క్రింద చూడండి. 

(తన వెచ్చని కౌగిలిలో బంధించి, అధరామృతాలను గ్రోలుతూ, వారిద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ  రాత్రి సమయాలలొ ఆడుకునే ఆటలవల్ల, వేడెక్కిన శరీరాలు విడిచిన చెమటల అందమే అలా ముత్యపు బిందువుల్లా ఉన్నట్టు గోచరిస్తున్నాయి. కదూ చెలులూ!! (ఇలా కూడా ఊహించవచ్చు. స్వామి ఈమె ను కౌగిట బంధించి, అధరామృతమును గ్రోలుతున్న వేళ, వేడి వల్ల పుట్టిన ఈతని నుదుటి చెమట ఆమె బుగ్గలకు అంటుకుని అలా ముత్యాలు జల్లినట్టుగా ఉన్నది. ఆ అందమే కదా ఇది?.)

ఈ ఆటపట్టింపు అద్భుతం. అనన్య సామాన్యం. శోభాయమానం. ఇంతకన్న అందముగా యే కవీ చెప్పలేరు అనడం అతిశయోక్తి కాదు. అన్నమయ్య పాదాలకు శత సహస్ర నమస్కారములు.

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://www.esnips.com/doc/68e09cb1-4555-45aa-b371-6bd9d8d2988a/Emuko.mp3

Wednesday, March 9, 2011

వచ్చెను అలమేలుమంగ ఈ పచ్చల కడియాల పణతి చెలంగ

వచ్చెను అలమేలుమంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ

బంగారు చేదివిటీలు పూని
శృంగారవతులు వేవేలురాగా
రంగైన వింజారమరలు వీవ
మాంగల్యలీల సొంపగు జవరాలు

పలుకుల తేనియ లొలుక చెంత
చిలుకలు కలకల పలుక రవల
గిలుకు పావలు ముద్దుగులుక మేటి
కలికి చూపుల మొనలు తళుకని చిలక

రంభాది సతులెల్ల చేరి యెదుట
గంభీర గతులను మీర నటనా
రంభములను మేలుకోరి కొలువ
అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి

ముఖ్య పదార్ధం:

పచ్చల : లేత ఆకుపచ్చ (Leaf colour. Green, yellowish green, yellow colour) (పచ్చలు అనేవి ఆకుపచ్చ రంగులో మెరుస్తూండే మణులు. ఆ మణులు పొదగబడిన కడియాలు అని కూడా అర్ధం.)
కడియాల: చేతికి ధరించే ఆభరణము (A bracelet or anklet. కడియపుటట్టు)
పణతి: పడతి (అందమైన యువతి, స్త్రీ) ( D sometimes changes into ణ Na, thus: అడగు, అణగు; పడతి, పణతి; ఆడంగులు, ఆణంగులు)
చెలగు: ప్రకాశించు

బంగారు చేదివిటీలు: బంగారు  (చేదివియ అంటే = దివిటీ, A hand lamp, a light borne in the hand) లు
పూని: చేత పట్టుకుని
శృంగారవతులు: శృంగారము చిందించు యువతులు (fine or beautiful ladies)
వేవేలురాగా: అనేక వేల మంది వెంట రాగా
రంగైన : మంచి రంగుతో కూడిన

వింజారమరలు: వెల్ల+చామర =తెల్లని చామరము (A white whisk or chowri, Bos-grunnicns the tail of which is made into whisks).
వీవ: వీచగా, విసరగా
మాంగల్యలీల: మంగళత్వాన్ని ప్రసాదిస్తూ విలాసవతియై
సొంపగు : సొగసు, అందము (Elegance, grace)
జవరాలు: యౌవ్వనవతి ఐన స్త్రీ, ప్రేయసి

పలుకులు: మాటలు
తేనియ లొలుక: తేనెలు కురిసినట్టుగా
చెంత చిలుకలు: సమీపము లోని చిలుకలు
కిలకిల పలుక: కిల కిల రావాలు చేయగా
రవల: కూత, రచ్చ, ధ్వని
గిలుకు: కాలి పట్టీల కు ఉన్న మువ్వలు కదులుతుండగా వచ్చేటి శబ్దము?? (To sound, jingle, as bracelets, or bells, on the ankles)
పావలు: పావుకోళ్ళు (చందనం కర్రతో చేసిన చెప్పులు)
ముద్దుగులుక: ముద్దులొలికే
మేటి కలికి చూపుల మొనలు: చాలా అందమైన చూపుల చివరలు (కంటి చివరలతో చూచుట అని చెప్పుకోచ్చు)
తళుకని చిలక: మిక్కిలి ప్రకాశము, నున్ననిమృదుకాంతి ఐన చిలుక

రంభాది: రంభ మొదలగు
సతులెల్ల చేరి: చెలులు అందరూ చేరుకుని (సతి: A woman in general, స్త్రీ, పతివ్రత)
గంభీర గతులను మీర: గతులు అంటే ప్రదేశములు. ఇక్కడ సందర్భాన్ని బట్టి ఎవరి ప్రదేశాలలో వారు ఆక్రమించుకును స్వామికి ఎదురుగా నిలబడ్డారు అనుకోవచ్చు (yeduta gambheera gatulanu meera, soundస్ as if it was a spot where the dancer had to choreograph some jathis (footwork patterns in different talas)
మేలుకోరి నటనా రంభములను కొలువ: ఉన్నతమైన నాట్యపు భంగిమలతో నాట్యమును ఆరంభించి కొలిచెను
అంభోజాక్షుడౌ: పద్మము వంటి కన్నులు కలవాడైన
వేంకటేశు ఒయ్యారి: వేంకటేశ్వరుని ప్రేయసి (ఒయ్యారి = సౌందర్య గర్వము కలిగిన స్త్రీ (Blooming, graceful, shapely, pretty - lady))

భావం:
ఈ సంకీర్తన అలమేల్మంగ శ్రీ వారి కొలువులో, శ్రీవారి ఎదుట తన చెలులందరితో నాట్య ప్రదర్శన చేయడానికి వస్తున్నట్లు ఊహించి రాసిన కీర్తన. ఇందులో ఒక కూచిపూడి నాట్యగత్తె యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కూడా వర్ణించారు. ఈ సంకీర్తన నాట్యం పై అవగాహన ఉన్నవారు విశ్లేషిస్తే మరింత అందంగా ఉంటుంది. నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.

అలమేలుమంగ వచ్చింది. బంగారపు రంగులో మెరిసిపోతున్న తన చేతులకు లేత ఆకుపచ్చని కడియాలు ధరించి ప్రకాశిస్తోంది.

అనేక వేల మంది అత్యంత శృంగారం చిందించు పడతులు కాగడాలు పట్టుకుని తన వెంట రాగా, కొంతమంది ఆమెకు అటూ ఇటూ నిలబడి తెల్లని రంగు చామరలు (ఓ జంతువు/పక్షి జుట్టు ను కుచ్చు గా చేసి అటూ ఇటూ నిలబడి వీచుతూ ఉంటారు) వీస్తూండగా, మంగళత్వాన్ని/ శుభాన్ని పలుకుతూ విలాసవతియైన, సౌందర్యవతి వేంకటేశుని ప్రియురాలు అలమేల్మంగ వచ్చినది.

ఆమె పలుకులు తేనెలు కురిసినట్టుగా, చుట్టూ ఉన్న చిలుకలు (మిగిలిన చెలులు) కిలకిల మని ధ్వని చేస్తుండగా (వారి మాటలు చిలకపలుకుల్లా ఉన్నాయన్నమాట), కాలి మడమకు కట్టుకున్న గజ్జెల చప్పుళ్ళతో (లయబద్ధంగా నడుస్తూ), చందనం కర్రతో చేసిన పావుకోళ్ళు ధరించి, అందమైన కంటి చివరలతో చూస్తూ (సిగ్గుపడుతూ తల దించుకుని క్రీగంట చూపులు చూస్తూ (అక్కడ స్వామి ఉన్నారు కదా! ఆయన కళ్ళలోకి చూస్తే ఇంకేమైనా ఉందా! అసలే శృంగార పురుషుడు)) నున్నని మృదు కాంతులు చిందుతూన్న చిలక వోలే వచ్చినది.

రంభ మొదలగు నాట్యగత్తెలందరూ ఎవరి ప్రదేశాన్ని వారు ఎంచుకుని (కూచిపూడి నృత్యంలో యే విధంగా ఐతే నర్తకీమణులు తమ తమ స్థానాల్లో నిలబడతారో అదేవిధంగా) నాట్యానికి ముందుగా తమ కాలి గజ్జెలు, కొప్పులు సరిచేసుకోవడం, జతి, లయ (ఇవన్నీ నటనా రంభములు) అన్నీ సరిచూసుకుని, ఉన్నతమైన భంగిమలతో పద్మము వంటి కన్నులు కలవాడైన వేంకటేశ్వరుని తన ప్రేయసి అలమేల్మంగ కొలువనారంభించెను.

(మూడవ చరణం అర్ధం చేసుకోడానికి కొంత కష్టపడవలసి వచ్చినది. మీకేమైనా వేరే అభిప్రాయాలుంటే తెలియజేసిన యెడల మార్చెదను)

ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి
http://annamacharya-lyrics.blogspot.com/2008/05/490vachchenu-alamelumamga.html

Tuesday, March 8, 2011

మెఱుగుఁజెక్కుల అలమేలుమంగా తరితోడిరతులను దైవారవమ్మా

మెఱుగుఁజెక్కుల అలమేలుమంగా
తరితోడిరతులను దైవారవమ్మా

చనవులు నీకిచ్చి చక్కనివదనమెత్తి
పెనగీ నాతడు నిన్ను ప్రేమతోడను
కనువిచ్చి చూడవమ్మ కందువల నవ్వవమ్మ
మనసిచ్చి ఆతనితో మాటలాడవమ్మ

పొందులు నీతో నెరపి పూచి నీపై చేతులు వేసి
చిందీ నీపై నతడు చిరు చెమట
విందులమోవియ్యవమ్మ వేడుకలు చూపవమ్మా
అందుకొని ఆకుమడిచి యాతనికీయవమ్మ

గక్కునను కాగిలించి కరుణనీపైనించి
ఇక్కువ గూడె శ్రీవేంకటేశుడు నిన్ను
వక్కణ లడుగవమ్మ వన్నెలెల్ల జూపవమ్మ
నిక్కుచు నురము మీద నిండుకొనవమ్మా

ముఖ్య పదాల అర్ధం:

మెఱుగుఁజెక్కుల: మెరెసేటి చెంపలు గల
తరితోడి: Time, occasion. సమయము అనుసరించి, సమయానుకూలముగా
రతులను: రతి క్రీడలను, సంభోగ క్రీడలను
దైవారవమ్మా: దైవారు అంటే వెలుగు, ప్రకాశించు = ప్రకాశించవమ్మా

చనవులు నీకిచ్చి: చనువు నీకు ఇచ్చి, (స్వామి తనతో నీకిష్టమొచ్చిన రీతిలో సరసమాడే అవకాశం పెత్తనం, ఆ చనువు నీకు ఇచ్చాడు అని చెప్పాలనుకుంటున్నారు)
చక్కనివదనమెత్తి: చక్కని నీ మొగమును పైకెత్తి
పెనగీ నాతడు: పెనగి+ఆతడు =To be twisted, మెలిగొను. To surround, చుట్టుకొను. To join, unite, కలయు (గట్టిగా కౌగిలించుకున్నాడు)
కనువిచ్చి చూడవమ్మ : మెల్లగా నీ కనులు విచ్చి (అంటే అంతవరకు ఆవిడ సిగ్గుతో కనులు మూసుకుని ఉన్నదని అర్ధం) చూడమ్మా
కందువలా నవ్వవమ్మ: చమత్కారముగా నవ్వవమ్మా
మనసిచ్చి ఆతనితో మాటలాడవమ్మ: మనసు పెట్టి
ఆతనితో మాట్లాడమ్మా

పొందులు నీతో నెరపి: నీతో స్నేహము (పొందుకాడు అంటే స్నేహితుడు) చేసి
పూచి : పూచు అంటే అకస్మికముగా తెల్లబట్టలలో బడే నల్లచుక్కలు (spotty clothes, which shew odd marks although washed)
చిందీ నీపై: నీపైన చిందెను
చిరు చెమట: రతిక్రియలో పాల్గొనుట వలన  ఆతని శరీరముపై పుట్టిన చెమట

విందులమోవియ్యవమ్మ: ఆతను అలా అలసిపోయి ఉన్నప్పుడు నీ సంతోషములు చిందే పెదవులను ఆతనికి విందుగా ఇయ్యవమ్మా
వేడుకలు చూపవమ్మా: వేడుక = కుతూహలము, సంతోషము, వినోదము; సంబరము, ఇచ్ఛ, అభిలాష = నీ సంతోషము అతనికి తెలియజేయవమ్మా
అందుకొని ఆకుమడిచి: ప్రక్కనే ఉన్న తములపు ఆకును మడిచి
యాతనికీయవమ్మ: అతని నోటికి అందించవమ్మా

గక్కునను: శీఘ్రముగా, తొందరగా, వెంటనే
కాగిలించి: కౌగిలించుకుని
కరుణనీపైనించి: నీ మీద దయ/ప్రేమ నుంచి
ఇక్కువ గూడె శ్రీవేంకటేశుడు నిన్ను: నిన్ను తన నివాస స్థానము నందు కూడెను. ఇంకోలా కూడా అర్ధం ఉంది. అది: వేంకటేశ్వరుడు నీ జీవస్థానము ( a secret part) నందు కలిసెను. ఏది సందర్భానికి తగినదో పెద్దలు నిర్ణయించాలి.
వక్కణ లడుగవమ్మ: వ్యాఖ్యానములు (comments) అడుగవమ్మా
వన్నెలెల్ల జూపవమ్మ: అందము, అలంకారము, శృంగారము లు అన్నీ చూపవమ్మా
నిక్కుచు: కులుకుచూ
నురము మీద: ఆతని వక్షస్థలము మీద
నిండుకొనవమ్మా: ఆక్రమించుకొనవమ్మా, చక్కగా కూర్చుని విరాజిల్లుమమ్మా

భావం:
అన్నమయ్య అలమేలు మంగతో చెప్తున్నారు.
ఓ మెరిసేటి చెంపలు గల అలమేలుమంగా, సమయానుకూలముగా స్వామితో రతిసుఖాలు అనుభవించి సంతోషించు.

స్వామి తనతో నీకిష్టమొచ్చిన రీతిలో సరసమాడే అవకాశం, పెత్తనం, ఆ చనువు నీకు ఇచ్చాడు. నీ పక్కనే కూర్చుని, సిగ్గుతో ముడుచుకుపోయిన నీ చక్కని మొగమును పైకెత్తి, నిన్ను గట్టిగా హత్తుకున్నాడు. నీ సిగ్గును కొంచెం పక్కన పెట్టి నీ మూసిఉంచిన కన్నులను వికశింపజేసి స్వామిని చూడవమ్మా. మరీ అలా ముడుచుకుని కూర్చోకుండా కొంచెం చమత్కారముగా నవ్వవమ్మా. స్వేచ్చగా మనసు పెట్టి అతనితో మాట్లాడు తల్లీ.

నీతో స్నేహము చేసి రతిక్రియలో పాల్గొనుట వలన  ఆతని శరీరముపై పుట్టిన చెమటని నీపై నవ్వుతూ/ప్రేమతో చల్లినాడు. అలసిపోయి నీ పక్కనే పరుండి, నీపై చేతిని ఉంచాడు. ఆ చెమట చుక్కలు తెల్లని బట్టలపై నల్లని మచ్చల్లా, బంగారం వర్ణంతో మిసమిసలాడే నీ మేని పై దొర్లుతున్నాయి. అతను ఎంతో అలసిపోయి ఉన్నాడు. ఆయన తో కలయిల వల్ల నీవు పొందిన సుఖమునకు గుర్తుగా సంతోషముతో వెలగిపోతున్న నీ మొగములో ఉన్న అమృతము చిందే నీ లేత పెదవులను స్వామికి విందుగా ఇవ్వమ్మా. నీవు అతనితో పొందిన ఆనందాన్ని అతనికి తెలియజేయవమ్మా. ఆ పక్కనే పళ్ళెంలో ఉన్న తములపాకులు తీసి సున్నం, వక్కలు, జాజికాయ, జాపత్రి, సుగంధద్రవ్యాలు కలిపి చక్కటి తాంబూలాన్ని అతని నోటికి అందించవమ్మా. (చక్కటి తాంబూలం శృంగారాభిలాషని పెంచుతుందని మన పూర్వీకులు చెబుతారు. అందుకే భోజనానంతరం ఎలాగూ శరీరానికి మదం ఎక్కుతుంది, కోరికలు ఉదయిస్తాయి. ఈ తాంబూలం వల్ల మరింత ఎక్కువ  శృంగారాభిలాష కలుగుతుంది. అందుకే బ్రహ్మచారులకు అంటే పెళ్ళికాని యువతీ యువకులకు తాంబూలసేవనం నిషిద్ధం).  

అలా తాంబూలాన్ని అందించాలని నువ్వు కొంచెం ముందుకు జరగగానే స్వామి నిన్ను గట్టిగా తన కౌగిలిలో బంధించాడు. నీ మీద దయతో, ప్రేమతో నిన్ను తన నివాసము నందు నీతో కలసి ఉన్నాడు. నీకేమైనా విషయాల గురించి వ్యాఖ్యానాలు కావాలంటే సందేహాలుంటే అడుగు (ఆ సమయంలో ఇంకే విషయాలుంటాయి?. ఇక్కడ శృంగారానికి సంబంధించిన విషయాల గురించి స్వామి ని అడుగు అని చెప్పాలనుకున్నారేమో). నీ విలాసాన్ని, శృంగారేచ్చను అతనికి చూపించు తల్లీ. మీ శృంగార క్రీడ ముగిసిన తరువాత కులుకుతూ మా స్వామి వక్షస్థలం ఎక్కి చక్కగా కూర్చుని ప్రకాశించవమ్మా. ఈ లోకాన్ని పాలించవమ్మా.    


ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/2010/01/668merugu-jekkula-alamelumamga.html

Sunday, March 6, 2011

అనిశము దలచరో అహోబలం అనంత ఫలదం అహోబలం

అనిశము దలచరో అహోబలం
అనంత ఫలదం అహోబలం

హరి నిజనిలయం అహోబలం
హరవిరించి నుత అహోబలం
అరుణ మణిశిఖరమహోబలం
అరిదైత్యహరణ మహోబలం

అతిశయ శుభదం అహోబలం
అతుల మనోహర మహోబలం
హత దురితచయం అహోబలం
యతి మత సిద్ధం అహోబలం

అగు శ్రీ వేంకట మహోబలం
అగమ్య మసురుల కహోబలం
అగపడు పుణ్యుల కహోబలం
అగకుల రాజం అహోబలం

ముఖ్యపదార్ధం:

అనిశము: ఎల్లప్పుడూ, Incessantly, constantly
దలచరో = తలచరో : తలుచుకోండి, ధ్యానించండి
అహోబలం: అహోబల క్షేత్రం. (ఇప్పుడూ అహోబిలం గా వ్యవహరిస్తున్నారు. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లాలో, తూర్పుకనుమలలో ఉన్నది. నవనారశింహులు కొలువుదీరిన అత్యంత పురాతన ప్రదేశం.) 
అనంత ఫలదం: అనంత ఫలాన్ని ఇచ్చు క్షేత్రం

హరి నిజనిలయం: హరి నిజమైన నివాసముండెడి ప్రదేశం ఈ అహోబలం
హరవిరించి నుత: శివుడు, బ్రహ్మలు కీర్తించు ప్రదేశం ఈ అహోబలం
అరుణ మణిశిఖరం: ఎర్రని మణి వలే/ సూర్యుని వలే శోభించు శిఖరము గల ప్రదేశం అహోబలం
అరిదైత్యహరణం: శతృవులను, రాక్షసులను సంహరించిన ప్రదేశం ఈ అహోబలం

అతిశయ శుభదం: మించిన శుభములని ఇచ్చునది ఈ అహోబలం
అతుల మనోహరం: అనమానము Unequalled, unparallelled, matchless అత్యంత సుందరమైనది/ అసమానమైన సౌందర్యము కలిగిన ప్రదేశము ఈ అహోబిలం 

హత దురితచయం: దురితము అంటే పాపము. చయము అంటే సమూహము An assemblage, a multitude, a heap or collection. పాపపు సమూహాలను నశింపజేసేది ఈ అహోబలం.
యతి మత సిద్ధం: యతి = సన్యాసి, జితేంద్రియుడు, యతి మతం =  అన్ని బంధాలు వదులుకుని నిత్యము శ్రీ హరి ధ్యానంలో ఉంటూ మోక్షమునకు చేరుకునే జితేంద్రియుల మతము (వైష్ణవము) సిద్దించు ప్రదేశం ఈ అహోబలం..

అగు శ్రీ వేంకటము : వేం =పాపములను, కటము: ఖండించునది. ఈ అహోబిలం 

(అన్నమయ్య ఆయన సంకీర్తనలటినీ వేంకట ముద్రాంకితము గా రచించారు. ముద్ర అంటే చివరి చరణములో ఎవరికైతే ఈ కీర్తన అంకితమిస్తున్నారో, లేదా ఎవరినుద్దేశించి రాస్తున్నారో వారి పేరును ప్రస్తావించడం. అన్నమయ్య కీర్తనలు వేంకటముద్ర. త్యాగరాజ స్వామి త్యాగరాజ నుత ముద్రతో కీర్తనలు రాశారు. అంటే త్యాగరాజు చే నుతింపబడేవాడు (రాముడు)..
అగమ్య మసురులకు : రాక్షసులు పోవశక్యము కానిది (Inaccessible, impenetrable, impassable) ఈ అహోబలం
అగపడు పుణ్యులకు : పుణ్యులు దొరకే/కనబడు (To appear, seem. To be found) చోటు ఈ అహోబలం
అగకుల రాజం: అగము అంటే పర్వతము. పర్వత రాజము ఈ అహోబలం

శేషాకృతి (పాము రూపం)లో విస్తరించి ఉన్న శ్రీపర్వతశ్రేణిలో తలవైపు వేంకటాచలం, తోక వైపు శ్రీశైలం ఉంటే మధ్యలో అహోబిల క్షేత్రం ఉన్నాయిట. అహోబిలం పరమ పవిత్రమైన క్షేత్రం. అన్నమయ్య అహోబిల మఠస్థాపనాచార్యుడైన ఆదివణ్ శఠగోపయతి వద్ద ఆధ్యాత్మిక, వేదాంత రహస్యాలు నేర్చుకున్నారు ట. ఆదివణ్ శఠగోపయతి సాక్షాత్తూ శ్రీ నారశింహుని అవతారం. ఈ అహోబిల క్షేత్రంలో నవ నారశింహులు కొలువై ఉన్నారు.

ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://www.esnips.com/doc/1c7a204d-bcc4-406d-8fb6-8a2fcc2cabff/Anis-hamu-Thala-charo.mp3/?widget=flash_tape

Wednesday, March 2, 2011

జగడపు జనవుల జాజర సగినల మంచపు జాజర

జగడపు జనవుల జాజర
సగినల మంచపు జాజర

మొల్లలు దురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన బుప్పొడి జాగర బతిపై
చల్లే రతివలు జాజర

భారపు కుచముల పైపైగడు సిం-
గారము నెరపెటి గంధవొడి
చేరువ పతిపై చిందగ బడతులు
సారెకు జల్లేరు జాజర

బింకపు గూటమి పెనగేటి చమటల
పంకపు పూతలపరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమదంబుల జాజర

ముఖ్య పదాల అర్ధం:

జగడము: కలహము, గొడవ
చనవుల: చనువు తో (బాగా పరిచయం ఉన్న ఇద్దరి మధ్య ఉండేది , ఒకరిపై ఒకరికి అధికారం ఉన్న)
జాజర: జాతర? (రంగురంగుల సుగంధ ద్రవ్యాలను ఒకరిపై ఒకరు చల్లుకుని ఆటలాడుకునే విధానము)
సగినల = సకిన : An artificial bird, the figure of a bird. కృత్రిమపక్షి, కిర్రుబిళ్ల. A doll, బొమ్మ. A chirping noise, కీచుకీచుమనుధ్వని
సగినల మంచము: గిలకలపట్టెమంచము. కోళ్లు బొమ్మలుగా చేసిన మంచము (A bedding formed on a frame of wood, having orifices covered with perforated brass buttons that make a whistling or squeaking sound)

మొల్లలు: మల్లెలు, కుందలత, A kind of jasmine
తురుముల  : జడ కొప్పు
బరువున: మొల్ల పువ్వులచే జడ కొప్పులను కప్పి ఉంచుట వల్ల వచ్చే బరువు
మొల్లపు: సాంద్రముగా (Thick), దట్టముగా
సరసపు: రసయుక్తమైన, పరిహాసమైన, మనోహరమైన (jest)
మురిపెమున:  సొగసైన (Graceful)
చల్లన : చల్లని
పుప్పొడి: పూ+పొడి : The dust, pollen of farina of a flower. పుష్పపరాగము (పువ్వుల్లో ఉండే పసుపు రంగులో ఉండే పొడి)
జారగ: జారుట అని అర్ధం, మరియు ప్రేమికుడైన అని కూడ అర్ధం ఉంది.

(జారధవుడు : A lover)
పతి పై: విభుని పై, భర్త పై
చల్లేరు అతివలు: పడతులు, స్త్రీలు పుప్పొడి చల్లేరు.

భారపు కుచముల పైపై: స్త్రీల బరువైన స్తనాల (కుచముల) పైన ఉన్నటువంటి
కడు : మిక్కిలి
సింగారము: అందాన్ని
నెరపెటి : నెరకొను?? నిండుగా (To fill)
గంధవొడి = గంధపు+పొడి = సువాసన భరితమైన గంధం పొడి  
చేరువ పతిపై: విభుని కి దగ్గరగా
చిందగ బడతులు: స్త్రీలు, చెలులు చిందగా
సారెకు: మాటిమాటికీ ( Frequently, often, repeatedly, again and again)
జల్లేరు జాజర= చల్లేరు జాజర : రంగులను చల్లేరు

బింకపు = బింకము: బిగువు, (Tightness, stiffness)
గూటమి = కూటమి : సాంగత్యము, కూడిక, కలయిక (Union, meeting)
పెనగేటి : పెనగు =మెలిపడుట (ఒకరి శరీరాన్ని ఒకరు గట్టిగా చుట్టుకోవడం)
చమటల: చమట (శరీరాల కలయిక వల్ల పుట్టే వేడివల్ల వచ్చే చెమట)
పంకపు పూతల : గంధపు బురద వల్ల ఏర్పడే పూత ( ఇద్దరి శరీరాలపై ఉన్న గంధం పొడి చెమటతో కలిసి గంధం బురదలా అయ్యి పూత గా ఏర్పడిందని)
పరిమళము: సువాసన (చెమట, గంధం కలయిక వల్ల వచ్చే సువాసన)
వేంకటపతిపై: శ్రీ వేంకటేశునిపై
వెలదులు: స్త్రీలు, చెలులు, నాయికలు
నించేరు: నింపేరు, నింపినారు 
సంకుమదంబుల: చెమటకలసిన జవ్వాదులను, సుగంధద్రవ్యాలను

భావం:
ఒకరిపై ఒకరికి ఉన్న అధికారం వల్ల ప్రేమతో వచ్చే చిలిపి కలహాలతో చెలులు స్వామిమీద రంగులు పోస్తున్నారు. కిర్రు కిర్రు మని చప్పుళ్ళు చేసే కృత్రిమ చెక్క బొమ్మలు  ఉన్న మంచముపై స్వామి, చెలులు మంచము మీద కూర్చుని రంగులు పోసుకుంటున్నారు.

చెలులు కొప్పునిండా విస్తారమ్ముగా మొల్ల పూల దండలు పెట్టుకున్నారు. ఆ బరువైన కొప్పులతో మురిసిపోతూ సరసపు ఆటలు మొదలుపెట్టారు. అందమైన చెలులు చల్లని పుప్పొడి మరియు సుగంధభరితమైన రంగులను శ్రీ వేంకటేశ్వరుని మీద చల్లుతున్నారు. 

చెలుల బరువైన స్తనాలమీద పడిన గంధపు పొడి మిక్కిలి అందాన్ని ప్రదర్శిస్తోంది. వేంకటేశునికి దగ్గరగా వచ్చి, చెలులంతా తమ స్తనాలపై మెరుస్తూన్న గంధపుపొడిని జాజర  లో కలిపి స్వామి మీద చల్లుతున్నారు.

చెలి, స్వామీ బిగువైన కలయిక (కౌగిలి)లో ఒకరినొకరు మైమరచి గట్టిగా చుట్టుకుంటుంటే ఇద్దరి శరీరాల కలయిక వల్ల పుట్టే వేడి వల్ల, చెమట ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందుగా పూసుకున్న గంధం ఈ చెమట తడితో కలిసి గంధపు బురద గా మారి అద్వితీయమైన వాసన వస్తోంది. (ఇక్కడ ఒక విషయం. మన శరీరాలైతే దుర్గంధపూరితమైన చెమటను విసర్జిస్తాయి కానీ, పద్మినీ జాతి స్త్రీల శరీరం గంధపు వాసలను విరజిమ్ముతుంటుంది. ఇక స్వామి గురించి వేరే చెప్పుకోక్ఖర్లేదు). ఆ మనోహర చెమట చెమట వాసనలు కలిగిన జవ్వాజులను, సుగంధద్రవ్యాలను స్వామివారి మీద చెలులు చల్లుతున్నారు. ఆ విధముగా జాజర ఆటలు ఆడుతున్నారు.



Monday, February 28, 2011

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి

శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి


కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి

ముఖ్యపదాల అర్ధాలు:

సతులాల: పడతులారా, మంచి గుణములున్న స్త్రీలారా
చూడరమ్మ: చూడండి
సోబాన: మంగళప్రదముగా
పాడరమ్మ: పాడండి
కూడుకున్నది పతి: భర్తతో కూడుకుని ఉన్నది (భర్తతో కలసి ఉన్నది)
చూడికుడుత నాంచారి: గోదాదేవి (తమిళంలో లక్ష్మీ దేవి రూపమైన గోదాదేవిని చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట). ఈ చూడికుడుత్త నాచ్చియార్ ను కృష్ణదేవరాయలు సంస్కృతీకరించి "ఆముక్తమాల్యద" అనే కావ్యాన్ని రచించారుట.

శ్రీమహాలక్ష్మియట : ఆమె శ్రీమహాలక్ష్మి, సకల సంపదలకు పుట్టిల్లు
సింగారాలకే మరుదు: సింగారాలకు + ఏమి+అరుదు = సింగారాలకు (సంపదలకు) ఏం లోటు?
కాముని తల్లియట: మన్మధునికి తల్లి
చక్కదనాలకే మరుదు: అందాలకేం లోటు?
సోముని తోబుట్టువట: చంద్రునికి చెల్లెలు
సొంపుకళలకేమరుదు: అందమైన కళలకు ఏం లోటు?
కోమలాంగి: కోమలమైన అంగములు కలది
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

కలశాబ్ధి కూతురట: సముద్రుడి కూతురు
గంభీరలకే మరుదు: గంభీరానికి ఏం లోటు (సముద్రమంత గాంభీర్యంగా ఉంటుందన్నమాట)
తలప: తలచగా
లోక మాతయట: ఈ లోకానికే తల్లి
దయ మరి ఏమరుదు: దయకు ఏం లోటు?
జలజనివాసినియట: పద్మము నందు నివసించునది
చల్లదనమేమరుదు: చల్లదనానికేం లోటు?
కొలదిమీర: పరిమితమైన లేనంతగా
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

అమరవందితయట: అమరులచే వందనములు స్వీకరింపబెడెడిది (దేవతలచే స్తుతింపబడెడిది)
అట్టీ మహిమ ఏమరుదు: మహిమలకెం లోటు
అమృతము చుట్టమట: అమృతానికి చుట్టము
ఆనందాలకేమరుదు: ఆనందాలకేం లోటు?
తమితో: కోరికతో
శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె: వేంకటేశుడు తావె వచ్చి పెళ్ళిచేసుకున్నాడు
కొమెర వయస్సు: యౌవ్వనవతి
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

భావం:
అన్నమయ్య ఈ సంకీర్తనలో అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.

ఓ పడతులారా! గోదాదేవి శ్రీనివాసునితో కలసి ఉంది. చూడండి. శుభప్రదమైన మంగళ గీతికలు పాడండి.
ఆవిడ లక్ష్మి. సకల సంపదలకు పుట్టిల్లు. ఆవిడకు సింగారాలకేం తక్కువ?. ఈ లక్ష్మి రుక్మిణీదేవిగా అవతరించినప్పుడు, మన్మధుడు ప్రద్యుమ్నుడు అను పేరుతో ఆవిడ గర్భాన ఉదయించాడు. అంతటి అందగాడైన మన్మధుడికి తల్లి ఆవిడ. ఆమెకు అందచందాలకు లోటేమిటి? పాల సముద్ర మధనంలో ముందుగా చంద్రుడు, తరువాత లక్ష్మి పుట్టారు. అటువంటి పదహారు కళలున్న చంద్రుడికి సాక్షాత్తూ చెల్లెలు ఈమె. ఈమెకు కళలకు లోటేమిటి? ఈ గోదాదేవి అత్యంత సున్నితమైనది. కోమలాంగి.  

ఈమె పాలసముద్రుడి కూతురు. గంభీరాలకు లోటేమిటి? (సముద్రం గాంభీర్యానికి చిహ్నం కదా!). ఈవిడ ఈ లోకానికే తల్లి. ఈ తల్లి దయకు లోటేమిటి? ఈమె పద్మంలో నివశిస్తుంది. పద్మం ఎల్లపుడూ చల్లని నీటిలో ఉంటుంది. అటువంటి పద్మంలో ఉందే ఈవిడకు చల్లదనానికి లోటేముంది?. అపరిమితమైన గుణ సంపద కలిగినది ఈ గోదాదేవి.

నిరంతరం దేవతలచే స్తుతింపబడేది. అటువంటి ఈమె మహిమలకి ఏం లోటు?. (ఈమె మహిమలు ఏమని చెప్పగలం?). ఈమె సకల ఆనందాలకూ నిలయమైన, మృత్యువును దరిచేరనివ్వని అమృతానికి చుట్టం. (అమృతం కూడా పాల సముద్రం నుండి పుట్టిందికదా! అందుకని ఈవిడకి చుట్టం అన్నమాట). అటువంటి ఈమెకు ఆనందాలకు లోటేమిటి?. యౌవ్వనవతి ఐన గోదాదేవిని కోరికతో శ్రీ వేంకటేశుడు తనంతట తాను వచ్చి పెండ్లాడాడు. 
ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://www.esnips.com/doc/478fd782-3e07-4afb-a4f5-cfeb0606493f/Chudaramma-Satulaara-BKP

Sunday, February 27, 2011

అయమేవ అయమేవ ఆదిపురుషో

అయమేవ అయమేవ ఆదిపురుషో
జయకరం తమహం శరణం భజామి

అయమేవ ఖలుపురా అవనీధరస్తుసో-
ప్యయమేవ వటదళాగ్రాధీశయన:
అయమేవ దశవిధైరవతార రూపశ్చ
నయమార్గ భువిరక్షణం కరోతి

అయమేవ సతతం శ్రియహ్పతి ర్దేవేషు
అయమేవ దుష్టదైత్యాంత కస్తు
అయమేవ సకల భూతాంతరేష్వాక్రమ్య
ప్రియభక్తపోషణం ప్రీత్యాదనోతి

అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజితే
అయమేవ వరదోప్యాచకానాం
అయమేవ వేదవేదాంతైశ్చ సూచితో
అయమేవ వైకుంఠాధీశ్వరస్తు


ముఖ్యపదాల అర్ధం:

అయమేవ: అయం=ఈతడు, ఏవ= యే, : ఈతడే
ఆదిపురుషో: ఆదిపురుష: = ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు)
జయకరం: జయములు కలిగించువానిని
తమహం: తం= నిన్ను +అహం= నేను
శరణం: రక్షణ కోసం
భజామి: సేవింపుచున్నాను

అయమేవ ఖలు: ఈతడే కదా (ఖలు = కదా)
పురా: పూర్వము
అవనీధరస్తుసోప్యయమేవ: = అవనీధరస్తు+స:+అపి+అయమేవ = భూమిని ధరించినవాడు అయ్యెను + అతడు + కూడా+ ఈతడే
వటదళాగ్రాధీశయన: = వటదళ+అగ్ర+అధిశయన: = పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు.   
అయమేవ: ఈతడే
దశవిధై: : పది రకాల
అవతార రూపశ్చ = అవతార రూప: + చ : అవతార రూపుడు + మరియు
నయమార్గ: న్యాయ మార్గము నందు
భువిరక్షణం: భూలోక రక్షణను
కరోతి: చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
సతతం: ఎల్లప్పుడూ
శ్రియహ్పతి = శ్రియ: + పతి : లక్ష్మి యొక్క భర్త
దేవేషు: దేవతలయందు
అయమేవ: ఈతడే
దుష్టదైత్యాంతకస్తు: దుష్ట రాక్షసుల అంతకుడు అయ్యెను/అగుగాక (అస్తు = గాక!) 
అయమేవ: ఈతడే
సకల భూతాంతరేష్వాక్రమ్య = సకల+ భూత + అంతరేషు +ఆక్రమ్య : సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉన్నవాడు)
ప్రియభక్తపోషణం: ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని
ప్రీత్యాతనోతి: ప్రేమతో చేయుచున్నాడు.

అయమేవ: ఈతడే
శ్రీవేంకటాద్రౌ: శ్రీ వేంకటగిరి యందు
విరాజితే: విరాజిల్లుతూ, శోభిల్లుతూ
అయమేవ: ఈతడే
వరదోప్యాచకానాం = వరద: + అపి + యాచకానం :  వరదుడు (వరములిచ్చెడి వాడు) + కూడా + యాచకులకు (అడిగినవారికి)
అయమేవ: ఈతడే
వేదవేదాంతైశ్చ = వేద, వేదాంతై: + చ =వేదములచేత మరియు వేదాంతుల చేత
సూచిత: = సూచించబడినట్టి
అయమేవ: ఈతడే
వైకుంఠాధీశ్వరస్తు: వైకుంఠమునకు అధీశుడు అయి ఉన్నాడు. /అగుగాక

భావం:

ఈతడే ఆదిపురుషుడు (సృష్టికి పూర్వం ఉన్నవాడు), సకల జయములు, శుభములు కలిగించు ఈతనిని నేను రక్షణ కోసం సేవించుచున్నాను.
ఈతడే కదా పూర్వము భూమిని ధరించినవాడు,  పెద్దదైన మర్రి ఆకు మీగ శయనించిన వాడు అతడు కూడా ఈతడే. (ఈ భూమి/సృష్టి మొత్తం నాశనం ఐనప్పుడు, మహా విష్ణువు మరల సృష్టిచేయడానికి ముందు ఒక చిన్న బాలుడు రూపంలో మర్రి ఆకును పడవ గా చేసుకుని దానిపై పవళించినాడు ట. అన్నమయ్య రాసిన సంకీర్తన "తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు" చదివితే మరింత అర్ధం అవుతుంది). ఈతడే  పది రకాల అవతార రూపుడు మరియు న్యాయ మార్గము నందు  భూలోక రక్షణను చేయుచున్నాడు. ఈతడే లక్ష్మికి భర్త. ఎల్లప్పుడూ దేవతల అందరిలోనూ దుష్ట రాక్షసులను అంతం చేసే ఆతడు ఈ తడొక్కడే. ఈతడే సకల భూతముల (జీవముల) లోపల ఆక్రమించుకుని (ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపుడై ఉండి) ప్రియ భక్తుల పోషణ కార్యక్రమాన్ని
ప్రేమతో చేయుచున్నాడు. (ఈ వాక్యం మరింత అర్ధం అవ్వాలంటే అన్నమయ్య కీర్తన "భూమిలోన పుట్టి సర్వ భూత ప్రాణులకెల్ల జీవసాన మోసేటి దేవుడ నేను" వినండి). ఈతడే శ్రీ వేంకటగిరి యందు శోభిల్లుతూ అడిగిన వారికి వరములిచ్చేవాడు. ఈ వేంకటేశ్వరుడే వేదముల చేత, వేదాంతులచేత సూచించ బడినట్టి ఆ శ్రీమన్నారాయణుడు/ వైకుంఠాధీశుడు అయి ఉన్నాడు.


ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://annamacharya-lyrics.blogspot.com/search?q=ayameva

నిత్యానంద ధరణీధర ధరారమణ

నిత్యానంద ధరణీధర ధరారమణ
కాత్యాయనీస్తోత్ర కామ కమలాక్ష

అరవిందనాభ జగదాధార భవదూర
పురుషోత్తమ నమో భువనేశ
కరుణాసమగ్ర రాక్షసలోక సంహార-
కరణ కమలాధీశ కరిరాజవరద

భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద
సాగరనిజావాస సకలాధిప
నాగారిగమన నానావర్ణనిజదేహ
భాగీరథీజనక పరమ పరమాత్మ

పావన పరాత్పర శుభప్రద పరాతీత
కైవల్యకాంత శృంగారరమణ
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో
దేవతారాధ్య సుస్థిరకృపాభరణ

ముఖ్యపదాల అర్ధం:

నిత్యానంద: ఎల్లప్పుడూ ఆనందము గలవాడు (Everlasting, eternal happiness)
ధరణీధర: భూమిని ధరించినవాడు (హరి వరాహావతారమెత్తి భూమిని రక్షించినప్పటి మాట గుర్తుచేయాలనుకున్నారేమో అన్నమయ్య)
ధరారమణ: ధర అంటే భూమి, రమణుడు అంటే అందగాడు, భర్త : భూమికి భర్త
కాత్యాయనీస్తోత్ర: పార్వతీదేవి చే స్తుతింపబడేవాడు
కామ కమలాక్ష: కన్నులు కమలాలవలె ఉన్నవాడు. (ఆ కన్నులు ప్రేమను కురిపించునవి)

అరవిందనాభ: బొడ్డు యందు తామెర/పద్మము కలవాడు
జగదాధార: జగత్ అంతటికీ ఆధారభూతుడు
భవదూర: బంధములు దూరము చేయువాడు
పురుషోత్తమ: పురుషులలో ఉత్తముడు
నమో భువనేశ: భూమికి పతి ఐన నీకు నమస్సులు
సమగ్ర రాక్షసలోక సంహార కరణ: మొత్తము రాక్షసలోకాన్ని సంహారము చేసినవాడు
కరిరాజవరద: కరి=యేనుగు, గజరాజుని రక్షించినవాడు

భోగీంద్రశయన: భోగీంద్రము అంటే పాము. శేషశయన కి పర్యాపదం వాడారు అన్నమయ్య
పరిపూర్ణ: పరిపూర్ణుడూ. అణు,రేణు పరిపూర్ణము గా ఉన్నవాడు
పూర్ణానంద: వెలితిలేని ఆనందము కలిగినవాడు
సాగరనిజావాస: క్షీరసాగర వాసుడు
సకలాధిప: అన్నిటికీ అధిపతి
నాగారిగమన: నాగ+అరి+గమన = పాముకు శతృవు, గరుత్మంతుడు. గరుడగమన అని అర్ధం. అన్నమయ్య పర్యాయపదంగా నాగారిగమన అని వాడారు.
నానావర్ణనిజదేహ: అనేక రంగులు విరజిమ్ము శరీరము గలవాడు
భాగీరథీజనక: గంగా దేవిని తన పాదముల యందు పుట్టించిన వాడు
పరమ పరమాత్మ: పరమాత్మ స్వరూపుడు

పావన: పరమ పావనుడు
పరాత్పర: శ్రేష్ఠులకు శ్రేష్ఠుడు (The Supreme Being, the Almighty)
శుభప్రద: శుభాన్ని అందించువాడు
కాంత శృంగారరమణ: శృంగార పురుషుడు, కాంతాపతి
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో: దయాగుణము నిధిగా గలవాడు ఐన శ్రీవేంకటేశునికి నమస్సులు ,
దేవతారాధ్య: దేవతలచే ఆరాధింపబడేవాడా
కృపాభరణ: కృప, దయను ఆభరణముగా గలవాడు.
సుస్థిర: తిరుమల శిఖరాలపై స్థిరముగా ఉన్నవాడు.


ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://www.esnips.com/doc/55fdd315-9b1b-42be-8499-723da60fa8cf/Nithyananda

చిత్తజగురుడ వో శ్రీనరసింహా

చిత్తజగురుడ వో శ్రీనరసింహా
బత్తిసేసేరు మునులు పరికించవయ్యా

సకలదేవతలును జయవెట్టుచున్నారు
చకితులై దానవులు సమసిరదె
అకలంకయగు లక్ష్మియటు నీ తొడపై నెక్కె
ప్రకటమైన నీ కోపము మానవయ్యా

తుంబురునారదాదులు దొరకొని పాడేరు
అంబుజాసనుడభయమడిగీనదె
అంబరవీధి నాడేరు యచ్చరలందరుగూడి
శంబరరిపుజనక శాంతము చూపవయ్యా

హత్తి కొలిచేరదె యక్షులును గంధర్వులు
చిత్తగించు పొగడేరు సిద్ధసాధ్యులు
సత్తుగా నీ దాసులము శరణు చొచ్చితి మిదె
యిత్తల శ్రీవేంకటేశ యేలుకొనవయ్యా

ముఖ్య పదాల అర్ధాలు:

చిత్తజగురుడ: చిత్తజుడు అంటే మన్మధుడు, చిత్తజ గురుడు అంటే: మన్మధునికి గురువు/తండ్రి = శ్రీ మహావిష్ణువు
శ్రీనరసింహా: లక్ష్మీ నరశింహా
బత్తిసేసేరు మునులు: భక్తి (తెలుగులో భక్తి కి వికృతి బత్తి, పామరులు వాడే పదము) చేస్తున్నారు మునులు
 పరికించవయ్యా: చూడవయ్యా

సకలదేవతలును: దేవతలంతా
జయవెట్టుచున్నారు:  జయ+పెట్టుచున్నారు= జయ జయ ధ్వానాలు చేస్తూ దీవిస్తున్నారు
చకితులై: భయకంపితులై (Fearful, timid, bashful)
దానవులు: రాక్షసులు
సమసిరదె: సమసిరి+అదె= నశించిరి, చచ్చిరి
అకలంకయగు: అకలంక+అగు = మచ్చలేని, నిర్మలమైన, నిష్కళంకమైన (Stainless, spotless) అంటే అందమైన యువతి
లక్ష్మియటు నీ తొడపై నెక్కె: లక్ష్మి, అటు = లక్ష్మి నీ తొడపై కి ఎక్కి కూర్చుంది
ప్రకటమైన నీ కోపము మానవయ్యా : స్ఫుటమైన, జనులకు భయము కలిగించే నీ కోపము మానవయ్యా

తుంబురునారదాదులు: తుంబురులు, నారదులు మొదలగు వారు
దొరకొని పాడేరు : (దొరకు+కొని) = మొదలుపెట్టి పాడేరు (అవకాశము లభించిన వెంటనే సంతోషముగా పాడేరు)
అంబుజాసనుడభయమడిగీనదె: అంబుజాసనుడు+అభయము+అడిగెను+ఇదె =అంబు అంటే నీరు. అంబుజము అంటే పద్మము. పద్మంలో కూర్చునే వాడు బ్రహ్మ. బ్రహ్మగారు అభయం అడిగెను.
అంబరవీధి నాడేరు: అంబరము అంటే ఆకాశము. ఆకాశవీధిన ఆడేరు
యచ్చరలందరుగూడి: అప్సరలందరూ కూడి (అప్సర కి వికృతి అచ్చర)
శంబరరిపుజనక: శంబర అంటే శివుడు, రిపు అంటే శత్రువు. శంబరరిపు అంటే మన్మధుడు. (శివుడు మన్మధుని కాల్చి బూడిద చేశాడు కదా!). ఆ మన్మధునికి తండ్రి విఢ్ణువు. ఆయన మనసులోంచి పుట్టిన వాడు.
శాంతము చూపవయ్యా: శాంతము చూపించవయ్యా

యక్షులును గంధర్వులు హత్తి కొలిచేరదె: హత్తి అంటే యేనుగు అని అర్ధం ఉంది. ఇక్కడ సందర్భాన్ని బట్టి అందరూ కలిసి ( To attach, join)
యక్షులూ, గంధర్వులూ కూడా ముందునుంచీ పాడే వారితో గొంతు కలిపారు అని చెప్పుకోవచ్చు.
చిత్తగించు: విను (listen)
పొగడేరు సిద్ధసాధ్యులు: సిద్ధిని పొందిన మహానుభావులు పొగుడుతున్నారు.
సత్తుగా నీ దాసులము : సత్యముగా (Being, existence) నీ దాసులుగా ఉన్నవారము
శరణు చొచ్చితి మిదె: శరణు కోరుతున్నవారము
యిత్తల శ్రీవేంకటేశ: విస్తారమైన, గొప్పవాడైన శ్రీ వేంకటేశ్వరా
 యేలుకొనవయ్యా: మమ్ము పాలించవయ్యా

భావం:
ఈ కీర్తన మహా విష్ణువు నృశింహావతారంలో వచ్చి రాక్షసులను సంహరించిన తర్వాత ఎంతసేపటికీ కోపము తగ్గక ఉండే భీకరమైన నృశింహాకృతిని చూసి ముల్లోకములు భయకంపితులైన వేళ ఆయనను చల్లబరుస్తూ అన్నమయ్య తాను అక్కడ ఉండి నారశింహుని కోపాన్ని తగ్గించడనికి ప్రయత్నిస్తున్నట్టు ఊహించుకుని రాసిన సంకీర్తన గా తోస్తూంది.

శ్రీలక్ష్మీనరశింహా! మునులందరూ నిన్ను భక్తిగా వేడుకుంటున్నారు చూడవయ్యా.  
దేవతలంతా జయ జయ ధ్వానాలు చేస్తూ దీవిస్తున్నారు. రాక్షసులంతా భయకంపిస్తులై చచ్చిపోయారు. అందమైన లక్ష్మీదేవి నీ అంకసీమ  అలంకరించింది(తొడపైకి ఎక్కి కూర్చుంది). జనులకు భయము కలిగించే నీ కోపము మానవయ్యా!.
 తుంబురులు, నారదులు మొదలగు వారు అవకాశము లభించిన వెంటనే సంతోషముగా పాడుతూ నిన్ను, నీ మహిమలను  కీర్తిస్తున్నారు. నీ తనయుడు బ్రహ్మ అభయం కోరుతున్నారు. అప్సరలందరూ కూడి ఆకాశవీధిన నాట్యాలు చేస్తున్నారు. మన్మధుని జనకా శాంతము చూపించవయ్యా!.
యక్షులూ, గంధర్వులూ కూడా తుంబుర నారదాదుల కీర్తనలకు గొంతు కలుపుతున్నారు. అందరూ కలిసి నిన్ను కీర్తిస్తున్నారు.  సిద్ధిని పొందిన మహానుభావులు పొగుడుతున్నారు. విను. నీ దాసులము. శరణు కోరుతున్నాము. విస్తారరూపుడాఇన శ్రీ వేంకటేశ్వరా! మమ్ము  పాలించు స్వామీ.

ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి. 
http://www.esnips.com/doc/236031f8-3a9d-425e-8bde-965ae30b8964/chittajagurudaosrinarasimha

Saturday, February 26, 2011

మనుజుడై పుట్టి మనుజుని సేవించి

మనుజుడై పుట్టి మనుజుని సేవించి
అనుదినమును దుఃఖమందనేలా

జుట్టెడుగడుపుకై చొరనిచోట్లు చొచ్చి
పట్టెడుగూటికై బతిమాలి
పుట్టినచోటికే పొరలి మనసు పెట్టి
వట్టిలంపటము వదలనేరడుగాన

అందరిలో బుట్టి అందరిలో బెరిగి
అందరి రూపము లటుదానై
అందమైన శ్రీవేంకటాద్రీశు సేవించి
అందరానిపదమందెనటుగాన

ముఖ్యపదాల అర్ధం:
మనుజుడు : మనిషి
జుట్టెడు కడుపుకై: చిన్న పొట్ట
చొరని చోట్లు: దూరకూడని ప్రదేశాలు (చొరబడలేని ప్రదేశాలు)
పట్టెడు కూటికై: పట్టెడు తిండికోసం
పుట్టిన చోటికే: ప్రతీ జీవి పుట్టే చోటు (స్త్రీ యోని)
పొరలి: కోరుట, ఇచ్చించు, అభిలషించు
వట్టి : ఏమియూలేను, ప్రయోజనము లేని
లంపటము : బాధ, తొందర, ఆయాసము
వదలనేరడు: వదలలేడు, వదల జాలడు

అందరిలో : ప్రతీ జీవిలో (లోపల, బయట, మధ్యలో (ఈ జగత్తులో ఉన్నటువంటి జీవులన్నింటిలో))
అందరి రూపములు: ప్రతి జీవి రూపము
అటుదానై: అన్నీ తానై
అందమైన: అందగాడైన
శ్రీవేంకటాద్రీశు సేవించి: శ్రీ వేంకటేశ్వరుని సేవించి, కొలిచి, పూజించి
అందరాని పదము: అంత తొందరగా అందరూ అందుకోలేని పదవి (మోక్ష పదము)
అందెను+అటు+గాన: అందుకోవచ్చు/గలరు

భావం:
మనిషిగా పుట్టి మనిషిని సేవిస్తూ ప్రతిదినమూ దుఖం పొందడం ఎందుకు?

ఈ చిన్న కడుపు నింపడానికి చొరబడలేని చోట్లు దూరి, పట్టెడన్నం కోసం పడరాని పాట్లు పడి, ఎంతో మందిని బతిమాలుతూ, తన భార్య వలన కలిగే కామ సుఖానికి (పుట్టిన చోటికే పొరలి మనసు వెట్టి) వెంపర్లాడుతూ ఈ అనవసరమైన / ప్రయోజనం లేని బాధలు వదులుకోలేడు లేడు కదా!.   

అందరిలో ఉన్న, అందరిలో పెరుగుతున్న, అందరి రూపములు తానే అయి ఉన్న అందమైన శ్రీ వేంకటాద్రీశుని సేవించి, అంత సులభంగా అందుకోలేని మోక్షపదాన్ని అందుకోవచ్చు కదా!!

Friday, February 25, 2011

నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ

నిన్ను గూడిన విభుని నిలువెల్ల సొంపాయ
నిన్నియును నొనగూడె నింతలోపలనె

సొలపు నీ కడగంటి చూపు హృదయము గాడి
లలినితడు శ్రీవత్సలాంఛనుండాయ
వెలది నిను బెడ బాసి విరహంపు మెయికాక
వలన నీతడు నీల వర్ణుడై నాడు

అదన నీ చనుగుబ్బలను చక్రముల చేత
పదిల పరపుచు చక్రపాణియైనాడు
సుదతి నీ దేహమున సొబగు కుంకుమపుత-
లెదిగి పీతాంబరంబీతనికి నాయ

ఆలింగనాపేక్ష ననయంబు నినుగూడ
లోలుడటుగాన నాలుగు చేతులాయ
శ్రీలలిత మూర్తియగు శ్రీవేంకటేశ్వరుడు
పాలించె నిను నీకె బరితోషమాయ

ముఖ్యపదాల అర్ధం:
నిన్ను గూడిన: నిన్ను కూడిన =నీతో కలసి
నిలువెల్ల: మొత్తం శరీరము (head to foot)
సొంపాయ = సొంపు అయ్యెను: అందము,సొగసు గా అయినాడు (Grace, Elegance)
నిన్నియును = ఇన్నియును
నొనగూడె = ఒనగూడె: సమకూరె
నింతలోపలనె: ఇంతలోనే

సొలపు: నిస్త్రాణ, పారవశ్యము (languishing, swooning, faintness)
నీ కడగంటి చూపు: నీ కనుచివర చూపు (To glance, view sidelong, to look askance)
హృదయము గాడి: మనస్సుకు తగిలి
లలినితడు = లలి + ఇతడు =లలి అంటే ప్రేమతో, క్రమముతో, వికాసము, ఉత్సాహము తో ఇతడు
శ్రీవత్సలాంఛనుండాయ: శ్రీవత్స+ లాంఛనుడు + ఆయె = శ్రీవత్సము అంటే విష్ణువక్షస్థలమందలి మచ్చ (A particular mark, said to be curl of hair, on the breast of Vishnu)
వెలది: స్త్రీ
నిను బెడ బాసి =నిను వెడ వాసి : నిను వదిలి నివసించి
విరహంపు =విరహము
మెయికాక : భరించలేక, తాళలేక (మొయి అంటే నల్లని మేఘము అని కూడా అర్ధం)
నీతడు నీల వర్ణుడై నాడు : ఈతడు (వేంకటేశుడు)నల్లటి రంగును పొందినాడు.

అదన: అధికమైన
నీ చనుగుబ్బలను: నీ చను గుబ్బలు + అను: నీ వక్షోజములు (స్తనములు, పాలిండ్లు) అను (చను అంటే వక్షోజం. గుబ్బ అంటే గుండ్రని)
చక్రముల చేత : చక్రముల చేత (అంటే ఆమె స్తనములు చక్రాల్లా పదునుదేరి గుండ్రంగా ఉన్నాయని చెప్పాలనుకున్నారేమో)
పదిల పరపుచు: భద్రముగా (To secure or take care of)
చక్రపాణియైనాడు: చక్రము పాణి (చేతి) యందు కలవాడు
సుదతి: స్త్రీ (అలమేలు మంగ ఇక్కడ)
నీ దేహమున కుంకుమపుత సొబగు: నీ శరీరమున పూసినటు వంటి కుంకుమపూత వలన వచ్చెడి సొగసు
లెదిగి పీతాంబరంబీతనికి నాయ: ఎదిగి + పీతాంబరం + ఇతనికి+ ఆయ = ఇతనికి పట్టు వస్త్రమైనది

ననయంబు = అనయము : ఎప్పుడూ, నిరంతరము
నినుగూడ : నిను కలసి
ఆలింగనాపేక్ష లోలుడటుగాన:  ఆలింగన + ఆపేక్ష + లోలుడు +అటు +గాన= కౌగిలి కోసం మిక్కిలి ఆశ, కోరిక కలిగినవాడు కాబట్టి
నాలుగు చేతులాయ: నాలుగు చేతులాయె
శ్రీలలిత మూర్తియగు శ్రీవేంకటేశ్వరుడు : మనోజ్ఞమైన, సుందరమైన (Beautiful, graceful, charming, lovely) రూపం కలిగిన శ్రీ వేంకటేశుడు
పాలించె నిను: నిన్ను పాలిస్తున్నాడు
నీకె = ఈకె: స్త్రీ
బరితోషమాయ = పరితోషమాయ: మిక్కిలి సంతోషము అయ్యెను (To rejoice greatly)

భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య అద్భుత భావుకతకు నిదర్శనం. శ్రీ విష్ణువు అనగానే శ్రీ వత్సాంకితుడు, చతుర్భుజుడు, పీతాంబరధారి, నీలవర్ణుడు, చక్రపాణి అని మనకి తెలుసు. కానీ ఆయనకి ఈ లక్షణాలు ఎందుకు వచ్చాయ్?.. వీటన్నిటికీ కారణం అలమేలు మంగ అని అన్నమయ్య అంటున్నారు. అంతే కదా! భర్త గొప్పవాడయ్యేది భార్య సహకారం వల్లే కదా!

అలమేలు మంగ తో అన్నమయ్య అంటున్నారు. నిన్ను కలసినప్పుడు విభునికి కాలి గోళ్ళ లగాయితు, తల వెంట్రుకలవరకూ ఎన్నో కొత్త అందాలు సమకూరుతున్నాయి. మరింత అందంగా కన్పిస్తున్నాడు. నువ్వు మీ ఆయనను సిగ్గుతో తలదించుకుని, పారవశ్యంతో కనుల చివరనుండి చూసినప్పుడు, ఆ కనుల చూపుల నుండి వచ్చిన మన్మధ బాణాలు అతని హృదయాన్ని గుచ్చుకుని, ఆ వక్షస్థలం మీద ఒక మచ్చలా తయారైంది. అప్పటి నుండి అతడు శ్రీవత్సలాంఛనుడు (శ్రీవత్సము అంటే విష్ణువక్షస్థలమందలి మచ్చ) అయినాడు. నిన్ను వదిలి ఉండలేక, విరహతాపాన్ని (ఇక్కడ వేంకటేశ్వరుడు భూమి మీదకు రావడానికి కారణమైన వ్రుత్తాంతాన్ని తెలుసుకోవాలి. భృగుమహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నినప్పుడు, లక్ష్మీదేవి స్వామిని, విడిచి భూలోకానికి వచ్చినప్పుడు ఆమె విరహాన్ని) భరించలేక ఈయన నల్లగా మారిపోయాడు. అంతే కదా! బంగారం రంగులో మిస మిస లాడుతూ, మెరిసిపోతూ అమ్మవారు ఆయన సమక్షంలో ఉంటే, కాంతి ఆమెకు తగిలి పరావర్తనం చెంది, ఈయనపై పడి కొంచెం మెరుస్తూంటాడు. ఆవిడ ఎప్పుడైతే దూరమైందో నల్లని రంగుగా అయిపోయాడు ట.

అతని ఆధీనములో ఉన్న చక్రాల్లాంటి గుండ్రటి నీ అధికమైన స్తనములను జాగ్రత్త పరుస్తూ అతను చక్రపాణి అయినాడు. నీ శరీరమున పూసినటువంటి కుంకుమపూత (కుంకుమ పూత ఎర్రగా ఉంటుంది) వలన వచ్చెడి సొగసు ఇతనికి పట్టు వస్త్రమైనది. ఆ విధముగా పీతాంబరధారి (ఎర్రని పట్టు పంచె కట్టుకున్నవాడు) అయినాడు.

నిరంతరం నిన్ను కలిసి నీ కౌగిలో ఉండాలనుకునే ఆపేక్ష/కోరిక అధికముగా ఉండుటచేత ఆయనకు రెండు చేతులు సరిపోక నాలుగు చేతులు కావలసి వచ్చాయి. అందుకే చతుర్భుజుడైనాడు. మనోజ్ఞమైన/సుందరమైన మూర్తి శ్రీ వేంకటేశుడు ఈ విధంగా నిన్ను పాలిస్తున్నాడు. అమ్మా! ఎంతో సంతోషము అవుతోంది.


ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగు నందు వినండి.  
http://www.esnips.com/doc/7fb42f54-f6a7-4d02-90a2-b472917ae0e5/ninnugudinavibhuni_BKP_ChadrajyotiRagam