Total Pageviews

Friday, June 5, 2015

చిత్తజ గురుడ నీకు శ్రీమంగళం నా - చిత్తములో హరి నీకు శ్రీమంగళం [Chittaja guruda neeku sri mangalam]

//ప// చిత్తజ గురుడ నీకు శ్రీమంగళం నా- 
చిత్తములో హరి నీకు శ్రీమంగళం                      //ప//

//చ// బంగారు బొమ్మవంటి పడతి నురముమీద 
సింగారించిన నీకు శ్రీమంగళం 
రంగుమీర పీతాంబరము మొలగట్టుకొని 
చెంగిలించే హరినీకు శ్రీమంగళం                       //ప//

//చ// వింత నీలమువంటి వెలదిని పాదముల 
చెంత బుట్టించిన నీకు శ్రీమంగళం 
కాంతుల కౌస్తుభమణి గట్టుక భక్తులకెల్లా 
చింతామణివైన నీకు శ్రీమంగళం                     //ప//

//చ// అరిది పచ్చల వంటి యంగన శిరసుమీద 
సిరుల దాల్చిన నీకు శ్రీమంగళం
గరిమ శ్రీవేంకటేశ ఘనసంపదలతోడి
సిరివర నీకు నిదె శ్రీమంగళం                        //ప//

ముఖ్యపదాల అర్ధం:
చిత్తజ గురుడు: మనసునందు జనించిన (మన్మధునికి) తండ్రి
మంగళం: శుభకరము
పడతి: స్త్రీ
ఉరము: వక్షస్థలము
సింగారించు: అలంకరించు
రంగుమీర: పైన చెప్పిన బంగారపు రంగుని మించిన 
పీతాంబరము: బంగారు వర్ణము కలిగిన పట్టు వస్త్రము
మొల: కటిభాగము
చెంగలించు: ప్రకాశించు 
వెలది: స్త్రీ 
పాదముల చెంత: పాదాల వద్ద
చింతామణి: కోర్కెలు తీర్చే మణి The wishing stone, a fabulous gem or magic ruby
అరిది: అరుదైన 
పచ్చ: మరకతము (Emerald)
అంగన: ఆడుది
గరిమ: పెద్దదైన
సిరివర: లక్ష్మీదేవి వరించిన వాడు

భావం:
అన్నమయ్య అత్యంత మధురముగా రచించిన శ్రీవేంకటేశ్వరుని మంగళం పాట యిది. శ్రీబాలకృష్ణప్రసాద్ గారి దివ్యగాత్రంలో ప్రాణం పోసుకుంది ఈ పాట. అత్యంత సున్నితంగా పాడారాయన.. 

చిత్తజుడైన మన్మధునికి గురువు (తండ్రికూడా) అయిన నీకు (శ్రీ= నీ భార్య లక్ష్మికీ కూడా) శుభమగుగాక! మా మనసుల్లో తేజోమూర్తివైన ప్రకాశించే హరీ నీకు శ్రీమంగళంబగుగాక!

పచ్చని మేలిమి బంగారు వర్ణంతో మెరిసి పోతూన్న బొమ్మవంటి లక్ష్మీదేవిని వక్షస్థలముపై అలంకరించుకున్న నీకు శ్రీమంగళంబగుగాక!
పచ్చని రంగులు వెదజల్లే బంగారు వర్ణము కలిగిన పట్టు వస్త్రాన్ని మొలకు చుట్టుకుని దేదీప్యమానమై ప్రకాశించే శ్రీహరీ నీకు శ్రీమంగళంబగుగాక!

వింతైన నీలికాంతులు వెదజల్లే స్త్రీ అయిన ఆకాశగంగను పాదముల వద్ద పుట్టించిన నీకు శ్రీమంగళంబగుగాక!
కాంతులు వెదజల్లే కౌస్తుభమణిని మెడలో ధరించి భక్తుల కోర్కెలు దీర్చే చింతామణివైన నీకు శ్రీమంగళంబగుగాక!

అరుదైన మరకతమణి వలే ఆకుపచ్చని దేహకాంతి కలిగిన స్త్రీ (భూదేవి) శిరసుపై (వేంకటాచలముపై) ఉన్న సిరులన్నింటినీ ధరించి నిలిచిన నీకు శ్రీమంగళంబగుగాక!
శ్రీవేంకటేశుడవై ఘనమైన సంపదలతో బరువుగా నిల్చున్న ఓ లక్ష్మీదేవి వరించిన విష్ణుమూర్తీ, నీకు శ్రీమంగళంబగుగాక!

శ్రీపతి పుర నాయకా జయ చింతితాభీష్ట దాయకా [Sripati puranayaka jaya chintitabheestadayaka]

//ప// శ్రీపతి పుర నాయక జయ-
చింతితాభీష్ట దాయకా                                              //ప//

//చ// ఉన్నతోన్నత విగ్రహ - దాసోపరిస్థాననుగ్రహ
సన్నుతామర సుగ్రహ - సామ వేద పరిగ్రహ                  //ప//

//చ// జానకీ ప్రియ కారక  - శివసాధితాఖిలతారక 
మానుషా హిత మారక - మామకాఘనివారక              //ప//

//చ// శ్రీ వేంకట నాథ రూపక - సంచిత రఘు కుల దీపక 
భావ సంతోష ప్రాపక - అభంగ మంజుల చాపక             //ప//

ముఖ్యపదాల అర్ధం:
శ్రీపతి పురము: విష్ణుదేవుని నగరము (వైకుంఠము)
నాయక: నాయకుడు
జయ: జయమగుగాక
చింతిత+ అభీష్ట: కోరుకున్న కోర్కెలు
దాయక: ఇచ్చువాడు
ఉన్నతోన్నత విగ్రహ: అత్యున్నతమైన రూపుడు
దాస: దాసులకు
ఉపరిస్థాన: గొప్పదైన కైవల్యమును
అనుగ్రహ: ప్రసాదించువాడు
సన్నుత+అమర+సుగ్రహ: దేవతల సన్నుతులను గ్రహించువాడు
సామవేద: సామవేదము
పరిగ్రహ: ప్రేమతో స్వీకరించువాడు
జానకీ ప్రియకారక: సీతాదేవికి ఆనందం కలిగించువాడు
శివసాధిత: శివునిచే సాధింపబడిన
అఖిల తారక: గొప్ప తేజోమూర్తి
మానుష+అహిత మారక: మనుజులకు కలిగే చెడును సంహరించేవాడు
మామక+ అఘ నివారక: Mine, నావైన + పాపములను నివారించువాడు
శ్రీవేంకటనాధరూపక: లక్ష్మితోకూడిన వేంకటనాధ రూపమును ధరించిన వాడు
సంచిత: ఆర్జింపబడిన
రఘుకుల దీపక: రఘువంశమునకు వెలుగైనవాడు
సంతోష భావ ప్రాపక: సంతోషభావాలను అనుగ్రహించువాడు
అభంగ: విరిగిపోని
మంజుల చాపక: అందమైన విల్లును కలిగినవాడు

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య రఘునాయకుడే శ్రీవేంకటేశ్వరుడు, ఆయనే వైకుంఠాధిపతి విష్ణుదేవుడంటున్నారు.

ఓ వైకుంఠాధిపతి ఐన విష్ణుదేవుడా! కోరిన కోర్కెలు తీర్చేవాడా! నీకు జయమగుగాక

అత్యున్నతమైన స్వరూపముగలవాడా! సేవించినవారికి ఉన్నత స్థానమైన కైవల్యమును ప్రసాదించువాడా! నిరంతరము దేవతలచే సన్నుతింపబడేవాడా! సామవేద ప్రియుడా! నీకు జయమగు గాక.

సీతాదేవికి ఆనందమును కలిగించెడివాడా! పరమశివుడు సాధించిన నారాయణ మంత్ర స్వరూప తేజోమూర్తీ! మనుజులకు హితము చేకూర్చని వారలను సంహరించెడివాడా! నావి, నావంటి మనుజుల పాపములను నివారించెడివాడా! నీకు జయమగు గాక.

లక్ష్మీదేవిని ఉరమునందు నిల్పిన వేంకటేశ్వర రూపుడా! రఘుకులముకు దీపము వలె కీర్తిని ఆర్జించినవాడా! సంతోషభావాలను అనుగ్రహించువాడా! ఎన్నడూ విరగని విల్లును చేతియందు ధరించిన వాడా! (అంటే, ఓటమి ఎరుగని వాడని అర్ధం). నీకు జయమగుగాక.