Total Pageviews

Thursday, December 25, 2014

లలితలావణ్య విలాసముతోడ నెలఁత ధన్యత గలిగె నేఁటితోడ [Lalita lavanya vilasamu toda]

//ప// లలితలావణ్య విలాసముతోడ
నెలఁత ధన్యత గలిగె నేఁటితోడ             // పల్లవి //

//చ// కుప్పలుగా మైనసలుకొన్న కస్తూరితోడ
తొప్పఁదోగేటి చెమటతోడ
అప్పుడటు శశిరేఖలైన చనుఁగవతోడ
దప్పిదేరేటి మోముఁదమ్మితోడ          // లలిత //

//చ// కులుకుఁ గబరీభరము కుంతలంబులతోడ
తొలఁగఁ దోయని ప్రేమతోడ
మొలకనవ్వులు దొలఁకు ముద్దుఁజూపులతోడ
పులకలు పొడవైన పొలుపుతోడ      // లలిత //

//చ// తిరువేంకటాధిపుని మన్ననతోడ
సరిలేని దివ్యవాసనలతోడ
పరికించరాని అరవిరిభావముతోడ
సిరి దొలఁ కెడి చిన్నిసిగ్గుతోడ          // లలిత //

ముఖ్యపదాల అర్ధం:
లలిత: సున్నితమైన, అందమైన
లావణ్య:  సౌందర్యమైన
విలాసముతోడ: ప్రకాశము తోటి
నెలఁత: స్త్రీ
మైనసలుకొన్న; మైనపు ముద్దల్లా
తొప్పఁదోగు: తోగు+తోగు = తడిసిపోవు
శశిరేఖ: చంద్ర రేఖలు 
చనుఁగవ: పయోధరములు
దప్పిదేరేటి; దాహం తీరేటి
మోముఁదమ్మితోడ: కలువ వంటి ముఖము తోడ
కులుకుఁ: శృంగారముగా కదులు
కబరీభరము= కబిరీ భారము a fine head of hair = కొప్పు  
కుంతలంబులతోడ: వెంట్రుకలతో
తొలఁగఁ దోయని: తీసివేయలేనంత  
మొలకనవ్వులు: చిన్నపాటి నవ్వులు
పులకలు: గగురుపొడుచు A bristling, a glow, a tingling or glowing of the skin
పొడవైన పొలుపు: నిలువెల్లా సొంపు తోటి
తిరువేంకటాధిపుని: వేంకటేశ్వరిని
మన్నన: గౌరవము
సరిలేని: సాతిలేని
పరికించరాని: కన్నులచేత చూడబడని
అరవిరి: సగం విడిచిన 
సిరి: సంపద 

భావం: 
శ్రీవేంకటేశ్వరునితో రాత్రంతా గడిపి వచ్చిన అమ్మవారి శరీరం చూసి, చెలికత్తెలు "ఇవాళ్టితో ధన్యత పొందింది ఈవిడ", అని తమలో తాము కారణలు అన్వేషిస్తూ అమ్మవారిని ఆటపట్టిస్తున్నారు. 

ప. సున్నితంగా, అందంగా ప్రకాశిస్తూన్న ఈ పడతి శరీరం ఇవాళ్టితో ధన్యత పొందింది.
   
చ. మైనపు ముద్దల్లా - కస్తూరీ గంధం కుప్పలుగా ఆమె శరీరంపై పోతపోసినట్టుంది. (శ్రీవారు కస్తూరీ లేపనాన్ని ఆమె శరీరం మీద బాగా దట్టించారన్నమాట)
ఆమె శరీరం చెమట నీటిలో తడిసిపోయి ఉంది. (అది కౌగిళ్ళ వేడివల్ల అని కవి భావన)
ఆమె కుచకుంభాలు చంద్ర రేఖలతో నిండి ఉన్నాయి. (శ్రీవారు ఆవిడ వక్షోజాలను గట్టిగా వత్తినప్పుడు, ఆయన గోళ్లు అర్ధచంద్రాకారంలోగుచ్చుకుని, చంద్రవంకల్లా వేసవికాలపు వెన్నెలలు కురిపిస్తున్నాయని, కవి భావన. ఏమొకో చిగురుటధరముల పాటను గుర్తు తెచ్చుకోవాలిక్కడ)
ఆమె ముఖము నీటిని నింపుకున్న పద్మంలా, దాహం తీరినట్టుగా ఉంది. (శ్రీవారితో రసక్రీడలో ఆమె అనంతమైన సంతోషాన్ని పొందిందని కవి భావన)

చ. శృంగారముగా కదిలే ఆమె జడకొప్పు జుట్టులా వేలాడుతోంది. (అంటే, గదిలోకి వెళ్ళేడప్పుడు, ఆమె చక్కగా కొప్పు పెట్టుకుని వెళ్ళింది. కానీ, శ్రీవారి చేసిన శృంగార చేష్టలకి బయటకి వచ్చేడప్పడికి, కొప్పు వదులై, జుట్టు జారిపోయి వేలాడుతోందని, అర్ధం. వారిరువురి శృంగారక్రీడని వర్ణించడానికి కవి ఎన్నుకున్న ఉపమానం ఇది)
ఆమె ముఖంలో శ్రీవారిపై ప్రేమ రెట్టింపుగా ఉంది. (భర్త ఇచ్చిన సంతోషం వల్ల ఆయనపై కలిగే అనంతమైన ప్రేమ అది, అని కవి భావన)
శ్రీవారిపై సిగ్గుతో, ఆయన చేసిన పనులు గుర్తొచ్చి, ఆమె పెదవులపై నవ్వులు చిన్నగా మొలుస్తున్నట్టుంది.  ఆమె చూపులు ఇంకా శ్రీవారిపై ముద్దులు కురిపిస్తున్నట్టున్నాయి. ఆమె నిలువెత్తు శరీరం ఇంకా గగురుపాటు నుండి తేరుకోకుండా మహా సొంపుగా ఉంది. (గరుర్పాటు వచ్చినప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం చర్మం కొంచెం బిర్రుగా ఉండడం చూసి ఈ మాటలంటున్నారు)

చ. ఈమె శ్రీవేంకటేశ్వరుని కౌగిలిలో సమ్మానింపబడి, ముద్దు చేయబడింది. ఈమె దేహం నుండి వచ్చే సువాసనలకి వేరే ఏ సుగంధాలూ సాటి రావు. (అయ్యవారూ, అమ్మవార్ల చెమట కూడా కలిసిన కస్తూరి వల్ల వచ్చే వాసన అన్ని పరిమళాలకంటే గొప్పగా ఉందని కవి భావన)
ఆ ముఖంలో మనం కంటితో చూడలేని చిలిపి భావాలతో లక్ష్మీదేవి సిగ్గులని ఒలకబోస్తోంది. 
ఈ లక్షణాలన్నీ కలిగిన ఈమె శరీరం ఇవాల్టితో ధన్యత పొందింది. 

చీ చీ నరుల దేఁటి జీవనము కాచుకొని హరి నీవే కరుణింతు గాకా [ Chi chi naruladeti jeevanamu]

//ప// చీ చీ నరుల దేఁటి జీవనము
కాచుకొని హరి నీవే కరుణింతు గాకా      // చీ చీ//

//చ// అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁ గాక
వడి నితరులఁ గొలువంగ వచ్చునా
వుడివోని పక్షియై వుండనైనా వచ్చుఁ గాక
విడువ కెవ్వరినైనా వేడవచ్చునా      //చీ చీ //

//చ// పసురమై వెరలేని పాటువడవచ్చుఁ గాక
కసటు వొరులఁ బొగడఁగావచ్చునా
వుసురు మానై పుట్టివుండనైనావచ్చు గాక
దెసల నెక్కడనైనా దిరుగవచ్చునా   //చీ చీ //

//చ// యెమ్మెల పుణ్యాలు సేసి యిల నేలవచ్చుఁగాక
కమ్మి హరిదాసుఁడు గావచ్చునా
నెమ్మది శ్రీవేంకటేశ నీచిత్తమేకాక
దొమ్ములకర్మము లివి తోయవచ్చునా  //చీ చీ //

ముఖ్యపదాల అర్ధం:
కాచు= రక్షించు
వుడివోని పక్షి= ఆకలి తీరని పక్షి 
పసురము= పశువు
కసటు= పాపము
ఒరులు= ఇతరులు
ఉసురు= జీవము, బలమైన
దెసల= వైపు (ఇరు దెసల= రెండు వైపుల)
యెమ్మెల=లెక్ఖలేనన్ని 
ఇల= భూమి
కమ్మి= బాగైన, గొప్పైన
దొమ్ముల=పోగై ఉన్న
చిత్తము= మది, సంతోషము  

భావం:
పూర్వం రాజాశ్రయం కోసం పండితులు అనేక పాట్లు పడుతూ వారు రాసిన కావ్యాలను, సంకీర్తనలను రాజులకు వినిపిస్తూ, వారి దయపై బ్రతికేవారు. అన్నమయ్య ఎన్నడూ రాజులను పొగడలేదు, వారి ఇచ్చే సంపద కోసం ఆశపడలేదు. ఆయన సంకీర్తనలన్ని వేంకటేశ్వరుని పైనే. ఈ సంకీర్తనలో విద్యను అమ్ముకునే వారిని ఉద్దేశించి అన్నమయ్య ఇలా అంటున్నారు.
  
//ప// చీ చీ..ఈ జనులది ఏం బ్రతుకు?. ఓ హరీ! వారిని నీవే కనిపెట్టుకుని ఉండి కరుణింతు గాక.

//చ// అడవిలో తిరిగే లేడియైనా కావచ్చు గాక. కానీ, మనిషిగా పుట్టి పరులను పూజించవచ్చునా? (లేడి అన్ని కౄరమృగాలకూ లోకువ. అది చంపవద్దని ఏ మృగాన్నీ కోరుకోదు. కేవలం తప్పించుకోడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. కానీ, మనిషి బలవంతునికి దాసోహం అంటాడు. ఇటువంటి మనిషి కన్నా ఆ జంతువే మేలంటున్నారన్నమయ్య) 
ఆకలి తీరని పక్షిగానైనా ఉండచ్చు గాక, కానీ, తిండి గింజలకోసం ఇతరులని అంత ప్రాధేయపడవచ్చునా? (పక్షి తనంతట తాను ఆహారం సంపాదించుకుంటుంది. తిండి దొరక్కపోతే పస్తులుంటుంది కానీ, ఇతర పక్షులను తిండి గింజలకోసం ప్రాధేయపడదు. కానీ, మనిషి తిండి కోసం అడుక్కుంటాడు. ఇటువ్ంటొ మనుష్యుల కన్నా పక్షులే మిన్న అంటున్నారన్నమయ్య)

//చ// పశువై కష్టమైన చాకిరీ చేయచ్చు కానీ, పాపపు జనులను పొగడవచ్చునా? (యజమాని కొరడాలతో కొట్టినా పశువు ఎదురు తిరగకుండా చాకిరీ చేస్తుంది. కానీ, మనిషి పాపిష్టి వాళ్ళు కష్టపెట్టకుండా వాళ్ళని పొగుడుతూ పబ్బం గడుపుకుంటాడని అంటున్నారన్నమయ్య)
బలమైన చెట్టు మాను గా ఐనా పుట్టి ఉండవచ్చు గాక, కానీ, అన్ని దిక్కులూ అలా తిరుగవచ్చునా? (చెట్టు మాను అది పుట్టిన చోటే ఉండి పెరుగుతుంది. కానీ, మనిషి బ్రతకడానికి చీ చీ అనిపించుకుంటూ అన్ని దిక్కులూ తిరుగుతూ ఆనేక గుమ్మాలు ఎక్కుతూ, దిగుతూ ఉన్నాడు.)

//చ// లెక్ఖలేనన్ని పుణ్యాలు చేసి ఈ భూమిని పాలించవచ్చు గాక, కానీ గొప్ప హరిదాసుడు మాత్రం కాలేడు. శ్రీవేంకటేశ్వరా! ఇవన్నీ నీవు మాతో ఆడే ఆనందపు ఆటలు. పెద్ద రాశిగా ఉన్న పూర్వ జన్మల కర్మలు అనుభవిస్తున్నాం గానీ, కాదని తోసివేయగలమా! 

Tuesday, December 2, 2014

ఎక్కువ తక్కువ లేవో - యెరుగ మిద్దరిలోన ఒక్కటై నీవురముపై - వున్నదిదె చెలియ [Ekkuva takkuva levo yerugamiddarilona]

//ప// ఎక్కువ తక్కువ లేవో - యెరుగ మిద్దరిలోన
ఒక్కటై నీవురముపై - వున్నదిదె చెలియ

//చ// ఆకడ జలధి ద్రచ్చి - అమృత మిచ్చితివీవు
ఆకెకైతే మోవిజిందీ - నమృతము
సైకపు పసైడి చీర - సరిగట్టితివి నీవు
మేకొని యీమెకైతే - మీనెల్లా పసిడే..

//చ// నిగిడి కౌస్తుభపుమా - ణికము గట్టితి నీవు
మగువకైతే నోరెల్లా - మాణికములే
బెగడి ఆకసమెల్లా - పెద్దసేసి కొలచితివి
బిగిసే యీచెలికైతే - బిడికెడు నడుమే..

//చ// పలుమారు జలధిలో - బవళించితివినీవు
కలికి గుణములోనే - ఘనజలధి
యెలమి శ్రీవేంకటేశ - యుప్పుడు గూడితిగాని
జలజాక్షియైతే నిన్ను - నన్నలనే గలిసే..

ముఖ్యపదాల అర్ధం:
ఉరము= వక్షస్థలము
జలధి= సముద్రము
మోవి= పెదవి
సైకము= సన్నని, అందమైన
మేని= శరీరము
పసిడి= బంగారము
నిగిడి= వ్యాపించు, మెరయు
మగువ= స్త్రీ
జలజాక్షి= కలువ కన్నులు కలది

భావం:
అయ్యవారూ, అమ్మవారూ ఒక్కటయ్యారు కాబట్టి, ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అని ఇక నిర్ణయించవలసిన పనిలేదని అన్నమయ్య ఉపమానాలతో పోల్చి చెప్తున్నారు.

//ప// మీ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఆవిడ నీ వక్షస్థలముపై నివాసమేర్పరచుకుని కూర్చుంది. ఇక ఎవరు ఎక్కవు, ఎవరు తక్కువ అని తెలుసుకోవలసిన అవసరం లేదు. 

//చ1// నువ్వేమో అప్పుడు (అమృతం కోసం మంధర పర్వతాన్ని చిలికేడప్పుడు) కూర్మావతారం గా వచ్చి పర్వతాన్ని పైకెత్తి పర్వతంతో సాగరాన్ని మధింపజేసి అమృతాన్ని తెచ్చావు. మీ ఆవిడకైతే ఆ పెదవి అంచులలోనే ఉంది అమృతం. నువ్వేమో బంగారు పట్టు పీతాంబరాన్ని అందంగా కట్టుకున్నావు. మరి మీ ఆవిడకి  శరీరపు రంగే బంగారం.. ఇక, మీ ఇద్దరిలో ఎక్కువ, తక్కువలు ఎలా నిర్ణయించాలి??

//చ2//నువ్వేమో మెరుపులు మెరిపిస్తున్న కౌస్తుభమణిని ధరించి ఉన్నావు. మీ ఆవిడకి అలాంటి మణులు నోటినిండా ఉన్నాయి (ఆవిడ పలువరసలు అంత అందంగా మెరిసిపోతున్నాయని కవి భావన). నువ్వేమో వామనావతారంలో ఉన్నప్పుడు శరీరాన్ని పెద్ద చేసి ఆకాశాన్నంతా కొలిచేశావు. మరి మీ ఆవిడ ఏకంగా ఆకాశమంతటినీ పిడికెడు నడుములో బిగించేసింది. ఇక, మీ ఇద్దరిలో ఎక్కువ, తక్కువలు ఎలా నిర్ణయించాలి??

//చ3// నువ్వేమో చాలాసార్లు సముద్రంలో పడుకున్నావు. కానీ, మీ ఆవిడ గుణాల్లో మహాసముద్రమంత గొప్పగుణాలు కలిగి ఉంది. శ్రీవేంకటేశ్వరా! నువ్వు ఇప్పుడేమైనా మీ ఆవిడతో (అలమేల్మంగతో) సమానమైన లక్షణాలు పొంది ఉన్నావేమో, కానీ, మీ ఆవిడ ఈ లక్షణాలతో ఎప్పుడో సమానమైపోయింది నీకు... ఇక, మీ ఇద్దరిలో ఎక్కువ, తక్కువలు ఎలా నిర్ణయించాలి?? 

Friday, November 28, 2014

సదయ మానససరోజాత మాదృశ వశం - వద ముదాహం త్వయా వంచనీయా కిం? [Sadaya manasa sarojata madruva vasam]

//ప// సదయ మానససరోజాత మాదృశ వశం
వద ముదాహం త్వయా వంచనీయా కిం?

//చ// జలధికన్యా పాంగ చారు విద్యుల్లతా
వలయ వాగురి కాంత వనకురంగ
లలితభవ దీక్షా విలాస మనసిజబాణ
కులిశపాతై రహం క్షోభణీయా కిం?

//చ// ధరణీవధూ పయోధర కనకమేదినీ
ధరశిఖర కేళితత్పర మయూర
పరమ భవదీయ శోభనవదన చంద్రాంశు
తరణికిరణై రహం తాపనీయా కిం?

//చ// చతురవేంకటనాధ సంభావయసి సం
ప్రతి యధా తత్ప్రకారం విహాయ
అతిచిర మనాగత్య హంత సంతాపకర
కితవకృత్యై రహం ఖేదనీయా కిం?

ముఖ్యపదార్ధం:
సదయ= దయతో కూడిన
మానససరోజాతం= మనస్సు అనే సరస్సునందు పుట్టినవాని
త్వయా= నీచేత
వంచనీయా= మోసగింపదగినది
కిం?= ఏమిటి?
అదృశవశం: కనిపించకుండా వశపరచుకొను
వద= చెప్పు
ముదాహం: సంతోషపడుతున్న నన్ను
జలధికన్యా+అపాంగ= లక్ష్మీ దేవి కంటి చూపుల
చారు= అందమైన
విద్యుల్లతా= మెరుపు తీగలు
వలయ= చుట్టబడిన
వాగురి= ఉరి, వల
కాంత= స్త్రీ
వనకురంగ= వనకురము అంటే జింక? వాటికి రాజు అని సంభోధిస్తున్నారేమో!!
లలిత= సున్నితమైన
భవత్+ఈక్షా విలాస మనసిజ బాణ= నీ కొంటె చూపుల మదన బాణాలు 
కులిశపాతై = వజ్రాయుధపు దెబ్బ
క్షోభణీయా కిం?= బాధపెట్టతగిన దాననా ఏమిటి?
ధరణీవధూ పయోధర: భూదేవి వక్షస్థలము
కనకమేదినీ ధర శిఖర= బంగారు కొండలు
కేళితత్పర= నేర్పరియైన ఆటగాడు/ఆటగత్తె
మయూర= నెమలి
భవదీయ= నీ యొక్క 
పరమశోభనవదన= మంగళకరమైన ముఖము
చంద్రాంశు= చంద్రుని
తరణి = సూర్యుడు
కిరణై: =కిరణముల
రహం: నేను
తాపనీయా= తాపము (కాల్చబడు) దానినా 
కిం?= ఏమిటి?
చతురవేంకటనాధ= హాస్యకాడైన వేంకటేశ్వరుడు
సంభావయసి = గౌరవింపదగిన వాడు
సంప్రతి= సరి చూచుకొను
యధా= ఎట్లైతే
తత్ప్రకారం= ఆ ప్రకారముగా
విహాయ= విడిచిపెట్టి
అతిచిరం= అస్థిరమైన (కపటమైన)
అనాగత్య= అనవశ్యమైన
హంత= ఘాతకముమ్ కౄరత్వము
సంతాపకర= బాధను కల్గించునది 
కితవ= కితవము= మోసగింపు, మాయగాడు
అకృత్యై= చేయకూడనిది 
అహం= నేను
ఖేదనీయా= బాధపెట్టదగిన దాననా
కిం?= ఏమిటి?

భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య సున్నితమైన మనస్తత్వాన్ని తెలియజేస్తోంది. ఈ సంకీర్తనలో అన్నమయ్య నాయిక. శ్రీవారిని తన మనస్సుని గాయపర్చవద్దని కోరుతోంది. శ్రీవారిని ఎంత గొప్ప సంబోధనలతో కీర్తించారో చూడండి.

దయాసముద్రం నుంచి పుట్టిన తామెరలాంటి నా సున్నితమైన మనస్సును మాయచేసి వశం చేసుకుంటావు. నవ్వులాటకైనా నువ్వు నన్ను మోసం చెయ్యచ్చా? ఏం మాట్లాడవు?

పాలసముద్రపు కూతురైన లక్ష్మీదేవి అందమైన కంటిచూపులనే మెరుపుల వలలో చిక్కుకున్న జింకవంటివాడా! విలాసవంతమైన, సున్నితమైన - ఆ మన్మధుని బాణాల్లాంటి చూపులనే వజ్రాయుధాల దెబ్బలతో బాధపెట్టదదినదాననా నేను?

భూదేవి వక్షస్థలములనే ఎత్తైన బంగారు కొండలపై ఆటలాడు ఓ నేర్పరి నెమలీ! మంగళకరమైన నీ చంద్రుని ముఖము నుండి వచ్చు చల్లని వెన్నెలతో - నాపాలిట సూర్యుని కిరణాల్లా, వేడితో నన్ను కాల్చివేయవచ్చునా?

ఓ హాస్యకాడవైన వేంకటపతీ! నీవు నాచేత గౌరవింపదగినవాడవు. నీ కపట నాటకాలు, దొంగ ప్రేమలు ఇక చాలు. అటువంటి ప్రవర్తన ఇకనైనా మార్చుకో. నీవు చేసే అటువంటి ఘాతకలు పనులచే నేను బాధింపదగినదాననా? ఏం మాట్లాడవు? 

ఈ సంకీర్తన ఇక్కడ వినండి. 
http://annamacharya-lyrics.blogspot.in/2014/11/830-sadaya-maanasasarojaata.html

Sunday, October 12, 2014

మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ వాడుదేరి వుస్సురందురా [Medalekki ninujuchi kUdenani yasatoda]

//ప// మేడలెక్కి నిన్నుఁ జూచి - కూడేననే యాసతోడ
వాడుదేరి వుస్సురందురా - వెంకటేశ యాడనుంటివిందాఁకానురా.. 

//చ// పిక్కటిల్లు చన్నులపై - చొక్కపు నీవుంగరము
గక్కన నేనద్దుకొందురా - వెంకటేశ లక్కవలె ముద్రలంటెరా..

//చ// దప్పిగొంటివని నీకుఁ - గప్పురముపారమిచ్చి
ముప్పిరి నీ విరహానను - వెంకటేశ నిప్పనుచు భ్రమసితిరా..

//చ// నిండఁ బూచిన మానిపై - గండుఁగోవిల గూయగా
నిండిన నీయెలుఁగంటాను - వెంకటేశ అండకు నిన్ను రమ్మంటిరా..

//చ// వుదయచందురుఁ జూచి - అదె నీపంజని సవి
యెదురుకోనే వచ్చితిరా - వెంకటేశ బెదరి మారుమోమైతిరా.. 

//చ// మిన్నక కేళాకూళిలో - వున్న తమ్మివిరులు నీ
కన్నులంటాఁ జేరఁ బోఁగాను - వెంకటేశ పన్ని మరునమ్ములాయరా.. 

//చ// ఆనిన తుమ్మిదలు నీ - మేనికాంతిఁ బోలునని
పూనిచేతఁ బట్టఁ బోఁగాను - వెంకటేశ సూనాస్త్రుని వేగులాయరా.. 

//చ// కందువ మై చమరించి - గందవొడి చల్లుకొని
పొంద నిన్నుఁ దలఁచితిరా - వెంకటేశ అంది చొక్కు మందులాయరా.. 

//చ// బొండుమల్లెపానుపుపై - నుండి నిన్నుఁ బాడి పాడి
నిండుజాగరములుంటిరా - వెంకటేశ యెండలాయ వెన్నెలలు రా..

//చ// నిద్దిరించి నీవు నాకు - వొద్దనుండఁ గలగంటి
చద్దివేఁడి వలపాయరా - వెంకటేశ సుద్దులింకా నేమి సేసేవో.. 

//చ// మల్లెపూవు కొనదాకి - ఝల్ల నను బులకించి
వుల్లము నీకొప్పించితిరా -వెంకటేశ కల్లగాదు మమ్ముఁ గావరా.. 

//చ// జోడుగూడి నీవు నేను - నాడుకొన్న మాటలెల్లా
గోడలేని చిత్తరువులై - వెంకటేశ యాడా నామతిఁ బాయవురా..

//చ// అద్దము నీడలు చూచి - ముద్దుమోవి గంటుండఁగా
కొద్దిలేని కాఁకతోడను - వెంకటేశ పొద్దువోక తమకింతురా..

//చ// పావురమురెక్కఁ జీటి - నీవొద్దికిఁ గంటియంపి
దేవరకే మొక్కుకొందురా - వెంకటేశ నీవిందు రావలెనంటాను..

//చ// బంగారు పీఁటపైనుండి - ముంగిటికి నీవురాఁగా
తొంగిచూచి నిలుచుండగా - వెంకటేశ యెంగిలిమోవేలడిగేవు..

//చ// దంతపుఁ బావాలు మెట్టి - పంతాన నేను రాఁగాను
యింతలో బలిమిఁ బట్టేవు - వెంకటేశ అంత నీకుఁ బ్రియమైతినా.. 

//చ// పట్టుచీరకొంగు జారి - గుట్టుతో నేనుండఁగాను
వట్టినవ్వులేల నవ్వేవు - వెంకటేశ దిట్టవు నీయంతవారమా.. 

//చ// కొప్పువట్టి తీసి నీవు - చెప్పరాని సేఁత సేసి
తప్పక నేఁ జూచినంతలో- వెంకటేశ చిప్పిలేల చెమరించేవు..

//చ// బొమ్మల జంకించి నిన్ను - తమ్మిపూవున వేసితే
కమ్మియేల తిట్టుదిట్టేవు - వెంకటేశ నిమ్మపంట వేతునటరా..

//చ// నెత్తమాడేనంటా రతి - పొత్తుల పందేలు వేసి
వొత్తి నీవే వోడే వేలరా - వెంకటేశ కొత్తలైన జాణవౌదువు..

//చ// వున్నతి శ్రీ వెంకటేశ - మన్నించి కూడితివిదే
నన్ను నెంత మెచ్చు మెచ్చేవు - వెంకటేశ కన్నుల పండువలాయరా..

//చ// చిలుకలు మనలోన - కలసిన యట్టివేళ
పలుకు రతిరహస్యాలు - వెంకటేశ తలఁచినేఁ దలవూతురా..

//చ// నీకు వలచిన వలపు - లాకలొత్తె నామతిని
వాకున నేఁ జెప్పఁ జాలరా - వెంకటేశ లోకమెల్లానెరిఁగినదే..

//చ//పాయము నీకొక్కనికే - చాయగా మీఁదెత్తితిని
యీయెడఁ గై వాలకుండాను - వెంకటేశ మా యింటనే పాయకుండరా..

//చ// ముమ్మాటికి నీ బాసలే - నమ్మివున్నదాన నేను
కుమ్మరించరా నీకరుణ - వెంకటేశ చిమ్ముఁ జీఁకటెల్లఁ బాయను..

ముఖ్య పదాల అర్ధం:
కూడు: కలయు
వుస్సురు: బాధ
పిక్కటిల్లు: బాగా పెద్దవైన
గక్కన: వెంటనే
చొక్కము: స్వచ్చమైన
దప్పి: దాహము
కప్పురముపారము: కర్పూరము తో చేసిన నైవేద్యపదార్ధం/కానుక
ముప్పిరి: Three folds. మూడుపిరులు, మూడురెట్లు
గండుగోవిల: మగ కోకిల
యెలుగు: శబ్దము, అరచు
అండ: తోడు, సహాయము
వుదయచందురు: ఉదయిస్తూన్న చంద్రుడు
పంజు: దివిటీ (A pole of a palanquin)
సవి: తలచి
మారుమోము: చిన్నబుచ్చుకొను
మిన్నక: ఊరకే
కేళాకూళి: మడుగు, ఆటలాదుకునే సరస్సు A bath or well with steps
తమ్మివిరులు: వికశించిన పద్మములు
మరునమ్ము: మరుని అమ్ములు= మన్మధుని బాణలు
సూనాస్ర్తుడు: వేటగాడు
వేగులాయెరా: ఎదురుచూపులాయెరా
కందువ: ప్రదేశము
చమరించు: చెమర్చు= చెమట
గందవొడి: గంధపు పొడి
చొక్కుమందు: పరవశపు మందు Love powder; an aphrodisiac drug
చద్దివేడి: చలిజ్వరము
సుద్దులు: కొంటె పనులు, నీతులు
వుల్లము: మనస్సు
కల్ల: అబద్ధము
చిత్తరువులు: బొమ్మలు, పటాలు
కాకతోడ: వేడి, జ్వరముతో
తమకము: విరహము, మోహించు
దంతపు బావాలు: బుంగమూతి
చిప్పిలి: పైకి ఉబుకు, ఉద్గమించు To gush, flow
నెత్తము: పాచికలాట
రతిపందేలు: శృంగారపు ఆటల పందేలు
వొత్తి నేవే: నీవొక్కడవే
కొత్త జాణ: కొత్త నేర్పరిగాడు
వాకున: మాటల్లో
పాయము: యౌవ్వనము
యీయెడ: యియ్యెడ: ఇంకెక్కడికీ
పాయక ఉండరా: విడిచిపెట్టకుండా ఉండరా
బాసలు: మాటలు, ఊసులు
చిమ్ము చీకటి: కారు చీకటి, కటిక చీకటి

భావం:
అన్నమయ్య సాహిత్యంలో జానపద యాసలో సాగే అత్యంత మనోహరమైన సంకీర్తన ఇది. శ్రీవారు సమయాన్నంతా ఎక్కడో గడిపి అప్పుడే కనిపించారు నాయికకి. అంతే, ఆ నాయిక ఎంత విరహాన్ననుభవించిందో స్వామికి చెప్తోంది ఈ కీర్తనలో.

//ప// నీతో కలవాలని, నిన్ను చూడాలని ఎంతో ఆశతో మేడలూ, మిద్దెలూ ఎక్కి చూసి..నువ్వు కనబడక ఎంత వేదన అనుభవించానురా...వేంకటేశా! ఇంతవరకూ ఎక్కడున్నావురా?

//చ// బాగా పెద్దవైన నా వక్షోజాలపై స్వచ్చమైన నీ ఉంగరాన్ని నేను గభాలున అద్దేసుకుంటాను. ఈ వేంకటేశ్వరా చూశావా! లక్కతో ముద్రించినట్టు ఎలా ముద్రపడిందో..(నీ విరహవేదనలో (నాయిక) శరీరం ఎంత వేడిగా అయ్యిందో చెప్పాలనుకుంది)

//చ// చాలా అలసిపోయి వచ్చావని కర్పూరపు కానుకలు నీకిచ్చి, నీవు పక్కనే ఉండటం చేత మూడు రెట్లయిన నా ఒంటి విరహాల వల్ల ఓ వేంకటేశ్వరా! ఆ కప్పురము నిప్పుగా భ్రమ పడ్డాను. (చల్లని కర్పూరము కూడా ఆమెకు నిప్పులా ఎర్రగా కనిపించింది. అంటే, విరహంతో ఆమె కన్నులు అంత ఎర్రబడ్డాయన్నమాట)

//చ// చెట్టంతా పువ్వులైన ఓ చెట్టుమీద ఓ మగకోకిల తోడుకై కూసే అరుపు ఈ ప్రదేశం అంతా మారుమ్రోగుతోంది. శ్రీవేంకటేశ్వరా! ఈ సమయంలో నాకు నీ సహవాసము కావాలని రమ్మన్నాను.

//చ// ఉదయిస్తూన్న చంద్రుని చూసి అది నీ చేతిలోని దివిటీ గా భావించి నువ్వొచ్చేస్తున్నావని నీకు యెదురుపడదామని పరిగెత్తుకొచ్చాను..కానీ, నువ్వు కాదని తెలిసి నా మోము చిన్నబుచ్చుకున్నాను.

//చ// ఊరకే ఆటలాడే సరస్సులో ఉన్న వికశించిన పద్మాలు నీకళ్ళలా కనబడి దగ్గరకి చేరబోతే, ఓ వేంకటేశా! అవి ఆ సుకుమార పువ్వులు మన్మధుని బాణాలు గా గుచ్చుకున్నాయి.. (సున్నితమైన పూరేకులు ఆమె శరీరాన్ని తాకగానే మదనతాపం పెరిగిందని భావన)

//చ//  ఆ పద్మాలపై తేనెకోసం ఆనిన తుమ్మెదలు నీ శరీరపు కాంతిలో ఉన్నాయని చేతపట్టుకుందామని ప్రయత్నించగా..ఓ వేంకటేశా! వేటగాడు వేట కోసం ఎదురుచూసినట్లైంది నా ప్రయత్నం. (అంటే, ఆ తుమ్మెదలు ఆమె చేతికి అందలేదని, వాటికోసం రాత్రంతా కన్నులు ఆర్పకుండా ప్రయత్నిస్తూనే ఉందని భావన)

//చ// చక్కటి సువాసన ద్రవ్యాలను, మంచి గంధపు పొడిని బాగా నా శరీరంపై పట్టించి నిన్ను పొందాలని, నీ స్పర్శలలో పరవశించాలని అనుకున్నాను రా.. ఓ వేంకటేశా! అవి కాస్తా ప్రేమ మందుగా మారి మరింత విరహాన్ని కలగజేశాయిరా..

//చ// చక్కటి బొండు మల్లెల మంచముపై పడుకుని నిన్ను తలచుకుంటూ నీ పాటలు పాడి, పాడి రాత్రంతా మెలకువగానే ఉన్నాను రా..ఓ వేంకటేశా! చల్లని వెన్నెలలు కూడా వేడిని కలిగించే ఎండలుగా మారాయి రా. (శ్రీవారిపై విరహం వెన్నెల చల్లదనాన్ని కూడా భగభగలాడే ఎండవేడిని కలిగించిందన్నమాట)

//చ// చలిజ్వరము వచ్చి క్షణకాలం రెప్పవాల్చాను. కలలో నీవు నా పక్కనే పడుకుని ఉన్నట్టు కలగన్నాను రా..నాకొచ్చిన చలిజ్వరము నువ్వు కనిపించగానే నీమీద ప్రేమగా మారిపోయింది రా.. ఓ వేంకటేశా! ఇంకా ఇలాంటి కొంటె పనులు ఎన్ని చేస్తావో..

//చ// ఆ మంచం మీద ఉన్నమల్లెపూవు చివరలు తాకగానే నా శరీరం ఝల్లుమని పులకించింది. నా మనసు నీకు సమర్పించాను. అబద్ధము కాదు. ఓ వేంకటేశా! మమ్ము రక్షించరా..

//చ// నువ్వు నేను కలిసి చెప్పుకున్న ఊసులన్నీ గోడపై లేని చిత్రపటాల్లా గాల్లో వేలాడుతున్నాయి. ఓ వేంకటేశా! నా మనసులోంచి ఎప్పటికీ వెళ్ళవురా..(నిన్నే ఎప్పటికీ తలుచుకుంటుంటానని భావన)

//చ// అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా ముద్దులొలికే పెదవిపై ఓ గంటు కనిపించింది. అది చూడగానే నిన్న నువ్వు నాతో గడిపిన రాసకేళి గుర్తొచ్చింది. ఓ వేంకటేశా! అది కనబడగానే నా ఒంట్లో మరింత వేడి పుట్టి రాత్రి సరిగ్గా గడవక నీకోసమై ఎదురుచూస్తూ విరహంతో ఉన్నానురా... 

//చ// ఓ పావురం రెక్కకి ఓ ప్రేమలేఖ కట్టి నీవద్దకు పంపి భగవంతుణ్ణి వేడుకుంటూ కూర్చున్నాను. ఓ వేంకటేశా! అది నీకు సురక్షితంగా చేరి నా వద్దకు నువ్వు రావాలని.   

//చ//  బంగారం పీట పైనుంచి మా ఇంటి ముందరకు వచ్చినప్పుడు నేను తలుపు చాటునుండి తొంగిచూసి నిల్చున్నప్పుడు, ఓ వేంకటేశా! నా యెంగిలిపెదవి ఎందుకు అడుగుతావు? 

//చ// నేనప్పుడు బుంగమూతి పెట్టి కోపంతో వచ్చేసరికి ఒక్కసారిగా గట్టిగా కౌగిలించుకున్నావు. ఓ  వేంకటేశ్వరా! నీకు నేను అంత ఇష్టమయ్యానా ఇప్పుడు? (అంత ఇష్టం ఉన్నప్పుడు ఇంతవరకూ ఎక్కడున్నావు? ఇదో దెప్పిపొడుపు మాట)

//చ// నేను కట్టుకున్న పట్టుచీర పమిటకొంగు జారిపోయి..నా గుబ్బలు బయటకు కన్పించకుండా గుట్టుగా తలుపుచాటున ఉంటే, అది చూసి ఎందుకు అలా కొంటెగా నవ్వేవు? ఓ వేంకటేశ్వరా! ఇలాంటి విషయాల్లో నీవు దిట్టవు. నీ అంత వారమా మేము?

//చ// నేనెంతో చక్కగా ముడిచి పెట్టుకున్న నా జడ కొప్పుని వదులు చేసి, దానితో చెప్పలేలన్ని పనులు చేసి, ఇక చాలు ఆపమని నేను చూసేటంతలో వెంకటేశా! ఒక్కసారిగా మీదకొచ్చి చెమటను నీ  అద్దుతావే?

//చ// కోపంతో నా కనుబొమ్మలను ముడిచి నిన్ను ఓ పద్మంలో పడేస్తే అదంతా ఆక్రమించేసి నన్ను తిడతావే? ఓ వేంకటేశా! నీ కోసం ఓ పెద్ద నిమ్మపంటను వెయ్యాలా లేకపోతే!

//చ// పాచికలాడదామని అంటావు. పైగా ఆటలకి శృంగారపు పనులు పందెం గా పెడతావు. కానీ, ఎప్పుడూ నువ్వొక్కడివే ఓడిపోతావే? ఓ వేంకటేశా! ఇదోరకం నేర్పరితనమా? (ఆటల్లో ఎవరు ఓడిపోతే వాళ్ళు పందెం ప్రకారం ఆ శృంగారపు పని చెయ్యాలి కాబట్టి, ఎప్పుడూ ఈయనే ఓడిపోయి ఆమెతో ఆ శృంగారం చేష్టలు చేస్తున్నాడని కవి భావన)

  //చ// ఓ ఉన్నతుడైన వేంకటేశ్వరా! నన్ను మన్నించి నాతో కలుస్తున్నావు. నన్ను నువ్వెంత మెచ్చుకుంటున్నావు. నాతో కలవడానికి నువ్వెంత కష్టపడుతున్నావు. నా కన్నులకి ఇవాళ పండగే తెలుసా!

//చ// మనలో ఉన్న రెండు చిలుకలు కలిస్తే చాలు, ఎన్నో రతిరహస్యాలని పలుకుతుంటాయి. ఓ వేంకటేశ్వరా! ఆ రహస్యాలు తలపులోకి రాగానే నేను నువ్వేం చేసినా, చెప్పినా కాదనలేను, తలాడించేస్తాను.

//చ// నీలో పుట్టిన నాపై ప్రేమ నామనసుని, బుద్ధిని బాగా ఒత్తి ప్రేరేపిస్తోంది. మాటల్లో నేను చెప్పలేనురా. ఓ వేంకటేశ్వరా! ఇది లోకంలో అందరికీ తెలుసు.

//చ// నా యౌవ్వనపు సంపదలు అన్నీ నీకొక్కనికే . ఇప్పుడిప్పుడే యౌవ్వనపు చాయలు ఎత్తుకుంటున్నాను. ఓ వేంకటేశ్వరా! ఇంకెక్కడికీ వెళ్ళక మా ఇంటి విడిచిపెట్టకుండా ఇక్కడే ఉండరా.. (యౌవ్వనాన్ని విందుగా ఇస్తాను ఎక్కడకి వెళ్ళద్దని ప్రాధేయపడుతున్నట్టు కవి భావన)

//చ// ఎప్పటికీ నీవు చెప్పిన మాటలే నమ్మిఉన్నాను నేను. నీ కరుణ నాపై కుమ్మరించరా.. ఓ వేంకటేశా! నీవు నాపక్కనుంటే కటిక చీకట్లన్నీ పోతాయి.. 

Saturday, October 4, 2014

ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు - ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము [Atade brahmanyadaivamu aadimulamainavadu]

//ప// ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు
ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము

//చ// యెవ్వని పేరఁ బిలుతురిలఁ బుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర మాసములను
అవ్వల నెవ్వని కేశవాది నామములే
రవ్వగా నాచమనాలు రచియింతురు.

//చ// అచ్చ మేదేవుని నారాయణనామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరిఁదలఁచి యిత్తురు పితాళ్ళకు
ముచ్చట నెవ్వనినామములనే సంకల్పము.

//చ// నారదుఁడుదలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడుగేటినామకధ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము.

ముఖ్యపదార్ధం:
బ్రహ్మణ్యదైవము: బ్రహ్మజ్ఞానము కలిగిన వారలకు దైవము
ఆదిమూలమైనవాడు: ఈ సృష్టి మూలానికే మూలమైనవాడు
అవిధిపూర్వకము: చేయదగిన పనిగా చెప్పనిది
ఇల: భూమిపై
మాస, నక్షత్ర: పన్నెండు మాసాలు, ఇరవైయ్యేడు నక్షత్రాలు
అవ్వల: ఆవల= తరువాత
కేశవాది: ఆచమనం చేసే విధానంలో వచ్చే కేశవ, నారాయణ, మాధవ మొదలగు నామాలు  
అచ్చమేదేవుని: అచ్చము+యే దేవుని= నిర్మలమైన (Purely, without any mixture) ఏ దేవుని
ఇచ్చ: కోరిక
పితాళ్ళకు: మరణించిన పితృదేవతలకి 
గౌరినుడుగేటి: పార్వతీదేవి అడిగిన
ఏడది: ఎక్కడిది/ఎవనిది?
తారకము: నక్షత్రము వలే స్వయం ప్రకాశితమైన
బ్రహ్మరుద్ర తతికి: బ్రహ్మ, శివుడు మొదలైన గేవతా సమూహమునకు
యీరీతిన: యీ విధంగా

భావం:
అన్నమయ్య వైష్ణవతత్వాన్ని అత్యంత మనోహంగా ప్రచారం చేశారు. విష్ణుభక్తి ని ప్రజల్లో వ్యాప్తి పరచడానికి ఆయన ఎన్నుకున్న విధానం "సంకీర్తన".. ఈ సంకీర్తనల్లో  మనం నిత్యం చేసే పనుల్లో విష్ణువు యొక్క నామాలు ఎంతగా పెనవేసుకుపోయాయో గుర్తు చేస్తున్నారు. ఈ సకల చరాచర సృష్టికీ విష్ణువే ఆది మూలమని, బ్రహ్మరుద్రులకు సైతం ఆయన వరములిచ్చే అభయప్రదాత అని కొనియాడుతున్నారు.

ఆతడే (శ్రీవేంకటేశ్వరుడే) బ్రహ్మజ్ఞానం కలిగిన మహనీయులందరికీ దైవము. ఆతడే ఈ సృష్టికి పూర్వము నుంచీ ఉన్న అనాది దైవము. అతన్ని పూజించకపోవడం అనేది వైదీక ధర్మం చెప్పిన నియమానికి విరుద్ధంగా చేసే పని. (ఈ సృష్టిలో భాగమైన మనం --ఈ సృష్టిని ప్రసాదించిన ఆ దేవదేవుని పూజించకపోవడం కృతజ్ఞతను చూపించకపోవడమే అంటున్నారు అన్నమయ్య).

ఈ భూమి మీద పుట్టిన యే జీవినైనా ఎవ్వని పేరుతో పిలుస్తారు? చైత్ర, శ్రావణ, వైశాఖ అంటూ మాస నామముల చేత.. అశ్వినీ, రోహిణీ, హస్త అంటూ నక్షత్ర నామములచేత.. శ్రీధర, పద్మనాభ అంటూ విష్ణునామముల చేత పిలుస్తారు. (ఈ లోకంలో పేరు మూడు రకాలుగా ఉంటుంది. ౧) మాస నామం, ౨) నక్షత్ర నామం, ౩) దైవ నామం. ప్రతీ మనిషికీ ఖత్త్చితంగా ఈ మూడూ నామాలూ పేరులో రావాలి. ఇప్పుడు ఎవరూ పాటించట్లేదు ఈ నియమాన్ని) ఈ మాసాలు, నక్షత్రాలు, పేర్లు ఎక్కడ నుండి వచ్చాయి? అవన్నీ ఎవర్ని సూచిస్తూంటాయి? ఈ సృష్టికర్తయైన విశ్వేశ్వరుణ్ణే.. శరీరాన్ని శుద్ధి చేసుకోడానికి యే పూజకైనా ముందుగా శుద్ధమైన జలాన్ని చేతిలో పోసుకుని ఆచమనం చేస్తారు. అప్పుడు చదివే నామాలెవరివి? కేశవాయస్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయస్వాహా అని కదూ... అలా, ఆ విష్ణు నామాలు చెప్పిన తర్వాతే ఆచమానాదులు చేస్తారు. అంతటి దైవాన్ని పూజించకపోవడం శాస్త్రవిరుద్ధంగా చేసే పని.

ప్రాణం వదులుతూన్న సమయంలో గానీ, సన్యాసము తీసుకున్న వారికి గానీ, నిర్మలమైన నారాయణ నామమే గతి. పుణ్యలోకాలు పొందడానికి నారాయణ నామమే గతి.. మరణించిన పితృదేవతలకి పిండప్రదానం చేసేడప్పుడు యే కోరికలతో తర్పణం వదులుతారు వారి పుత్రులు?. (తమ పితృదేవతలకి పుణ్యలోకాలు ప్రాప్తించాలని మనసులో కోరుకుంటూ పిండప్రదానాలు చేస్తారు. పుణ్యలోకాలంటే శ్రీ మహావిష్ణువు లోకమే కదా. ఈ పిండప్రదానం చేసేడప్పుడు సంకల్పములో విష్ణువు పేరునే కదా ఉచ్చరిస్తారు)....

నారదుడు నిరంతరము మనస్సులో తలచేటి నామమెవ్వరిదీ? పార్వతీ దేవి చెప్పమని శివుణ్ణి అడిగిన నామ కధ ఎవ్వరిది? (విష్ణుసహస్రంలో "కేనోపాయేన లఘునా విష్నోర్నామ సహస్రకం -పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో" అని శివుని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శివుడు "శ్రీరామరామరామేతి--అంటూ తారకమంత్రం ఉపదేశించన విషయం మనందరికీ తెలుసు).  బ్రహ్మరుద్రాది దేవతాసమూహం నిరంతరం జపించే నామమేది? అదే శ్రీవేంకటేశ్వరుని నామము. ఆయనే వేంకటాద్రి రాముడు, వేంకటాద్రి బాలకృష్ణుడు. ఆయనే శ్రీవేంకటాద్రి పైనుండి వరములిచ్చుచున్నాడు.. 

ఈ కీర్తన శ్రావణ్కుమార్ బ్లాగ్ నందు వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2007/06/225atade-brahmanyadaivamu.html

తొయ్యలి నీ భాగ్యమున దొరకెఁగాక - వెయ్యైనా నీపెకు మరి వెల యేదయ్యా [Toyyali nee bhagaymuna dorakegaka]

//ప// తొయ్యలి నీ భాగ్యమున దొరకెఁగాక
వెయ్యైనా నీపెకు మరి వెల యేదయ్యా

//చ// పలచని పెదవుల పచ్చితేనియలు గారీ
మెలకలై సెలవులు ముత్యాలు రాలీ
నెలకొన్న చన్నులను నిమ్మపండ్లుప్పతిలీ
వెలఁదిజవ్వనానకు వెలయేదయ్యా

//చ// నెఱిఁగుఱులను మంచినీలపురంగులు మించీ
మెఱఁగులు మొగమున మేళవించీని
పిఱుఁదుపెంపరసితేఁ బెరసీఁ గరికుంభాలు
మెఱసేయీజవ్వనము మేలువెల యేదయ్యా

//చ// పాదపుసొబగులను పద్మరాగాలొలికీని
పాదుకొనె దేహమెల్లా బంగారువన్నె
యీదెస శ్రీవేంకటేశ యేలితి వీకె నింతలో
యేదైనా యీజవ్వనాననిఁక వెలయేదయ్యా

ముఖ్యపదాల అర్ధం:
తొయ్యలి: స్త్రీ
ఈపె: = ఈకె =ఆడుది
చన్నులు: వక్షోజాలు
వెలది: స్త్రీ
జవ్వనము: యౌవ్వనము
నెఱిఁగుఱులను: పొడవాటి నల్లని జుట్టు
కరికుంభాలు: ఏనుగు కుంభస్థలములు
పాదుకొను: నెలకొను, ధరించు

భావం: 
ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీవారికి అమ్మవారి అందాన్ని వర్ణిస్తూ...ఎంత డబ్బు పెట్టినా ఇంత అందమైన స్త్రీని పొందడం కష్టం, ఈమె అందానికి వెల కట్టడం అసాధ్యం, కానీ నీ భాగ్యంకొద్దీ నీకు దొరికిందని చెప్తున్నారు.

ఈ అందమైన యువతి నీకు నీ భాగ్యము వల్ల దొరికింది గానీ, వెయ్యి   రూకలు పెట్టినా  ఇంత అందమైన యువతి దొరకదు. అసలు ఆమె అందానికి వెల కట్టలేము..

ఆమె పలచటి పెదవులు తేనియలు కురిపిస్తాయి. ఆమె పెదవులపై మొలిచే మొలకల్లాంటి నవ్వులు ముత్యాలు రాల్చుతున్నట్లుంటుంది.  ఆమె వక్షోజాలు చిన్న నిమ్మపండ్లను పోలి ఉంటాయి. (అన్నమయ్య దృష్టిలో అమ్మవారు అప్పుడే యౌవ్వనంలోకి అడుగుపెడుతూన్న లేత కన్యామణి.) ఇటువంటి ఆ స్త్రీ యౌవ్వనానికి వెల ఎక్కడుందయ్యా!

మంచినీలపు మణుల రంగును మించిన నల్లని పొడవైన జుట్టు ఆమెకుంది. ఆమె ముఖం కాంతులు విరజిమ్ముతున్నట్లుంటుంది. ఆమె పిరుదులు మదించిన యేనుగుల కుంభస్థలాలంత విశాలంగా ఉంటాయి. ఇంతటి గొప్ప యౌవ్వనానికి వెల ఎలా కట్టగలమయ్యా!

ఆమె పాదములు ఎర్రని పద్మరాగ మణులను ఒలికిస్తున్నట్టుగా ఉంటాయి. ఆమె శరీరం అంతా పసిడి ముద్దలా పచ్చగా మిసమిసలాడుతూంటుంది. శ్రీవేంకటేశ్వరా! అటువంటి సౌందర్యవతిని నీవు భార్యగా పొంది ఏలుకుంటున్నావు. యెదేమైనా, ఆవిడ యౌవ్వనానికి వెలకట్టలేమయ్యా!..   

Friday, May 23, 2014

కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును - ఇమ్ముల నీ పతి భాగ్య మెంతని చెప్పేదే [Komma nee chakkadanamu kOti sEsunu]

//ప// కొమ్మ నీ చక్కఁదనము కోటి సేసును
ఇమ్ముల నీ పతి భాగ్య మెంతని చెప్పేదే

//చ// సెలవి నవ్విన నవ్వు చెక్కిట బెట్టిన చెయ్యి
చెలి నీ మొగమునకు సింగారమాయ
తిలకించి చూచేచూపు తేనెగారేమోవిమాట
కలికితనాల కెల్లా కందువలై తోచెను

//చ// మొనచన్నులకదలు మొగిఁగమ్మలతళుకు
వనిత నీవయసుకు వన్నె వచ్చెను
పొనుగులేతసిగ్గులు బొమ్మముడిజంకెనలు
తనివోనియాసలకుఁ దగినగురుతులు

//చ// బలుపిరుదులసొంపు పాదపుమట్టెలరొద
అలమేల్మంగ నీరతి కడియాలము
లలి శ్రీవేంకటేశుఁ గలయు నీచేతులగోళ్ళ-
దలకొన్నరాకులు తారుకాణలు

ముఖ్యపదార్ధం:
కొమ్మ: స్త్రీ
కోటి: అనంతము
ఇమ్ముల: చక్కని, బాగుగా
సెలవి: పెదవి మూల
చెక్కిలి: చెక్కు, కపోలము (చీక్)
మోవి: పెదవి
కలికితనము: చక్కని ఆడతనము
కందువ: అందము
మొనచన్నులు: పొడుచుకొచ్చినట్టు నిటారుగా ఉండే వక్షోజాలు
మొగికమ్మల తళుకు: ఉమ్మడి చెవికమ్మల తళుకులు (రెండు చెవి కమ్మలు అని అర్ధం)
వన్నె: అందము
పొనుగు: చిన్నపాటి, తేజము లేని
బొమ్మముడి: కనుబొమ్మలను దగ్గర చేసినప్పుడు నుదుటిపై చర్మము చేయు ఆకృతి
జంకెన: భయపడు, సంకోచించు
తనివి+పోని+ఆశలు: తృప్తి తీరని కోరికలు
అడియాలము: అడుగు+అలము= గుర్తు
లలి: ప్రేమతో, అందముగా, సొగసుతో, ఉత్సాహముతో
రాకులు: గీతలు, గీరుళ్ళు
తారుకాణలు: తార్కాణాలు= నిదర్శనాలు

భావం:
ఈ సంకీర్తనలో అమ్మవారిని చెలికత్తెలు పొగిడే విధానాన్ని కళ్ళకి కట్టినట్టు చూపించారు.

ఓ పడతీ! నీ అందము అనంతము...ఇంత చక్కని అందాన్ని పొందిన నీ భర్త భాగ్యము ఎంతని చెప్పేదే?

ఓ చెలీ! నీ పెదవి మూలలనుంచి వచ్చే నవ్వు, దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు నీ చెక్కులపై పెట్టిన చెయ్యి - నీ ముద్దైన మోమునకు మరింత ముగ్ధత్వాన్ని చేకూరుస్తున్నాయి... కాంతులీనే కన్నులతో నీవు చూసే చూపు, పెదవులనుండి వచ్చే తియ్యనైన మాట - నీ ఆడతనానికంతటికీ  అందాన్ని తెస్తున్నాయి..

ఓ వనితా! ఏ మాత్రం వాలిపోకుండా పొడుచుకుని వచ్చినట్టుండే   నీ వక్షోజాల కదలికలు, చెవులకు పెట్టుకున్న జంట చెవికమ్మల మెరుపులు - నీ యౌవ్వనపు వయసుకి కొత్త అందాన్ని తెస్తున్నాయి. ఇంకా సరిగ్గా వికశించని లేలేత సిగ్గులు, శ్రీవారు తలపులోకి రాగానే సంకోచంతో ఏర్పడే కనుబొమ్మలు ముడి - నీ శరీరానికి తీరని కోరికలకు తగిన గుర్తులు. 

అలమేల్మంగా! నీ బలమైన పిరుదుల అందమైన ఆకృతి, పాదాలకి పెట్టుకున్న మట్టెలు చేసే ధ్వని  - నువ్వు శ్రీవారితో పొందుతున్న రతికి  గుర్తులు. సున్నితమైన శ్రీవేంకటేశ్వరుని కలసినప్పుడు ఆయన శరీరంపై నీ చేతి గోళ్ళు ఏర్పరచిన గుర్తులే - మీ ఇద్దరి అద్భుత రతికి నిదర్శనము. 

(అంత అందమైన స్త్రీని భార్యగా పొందిన శ్రీవారు ఎంత భాగ్యవంతులో అని పొగుడుతూ, ఆయనతో అలమేల్మంగ పొందిన రతి సుఖాల వల్ల వచ్చిన గుర్తులను గుర్తుచేస్తూ చెలులు ఆటపట్టిస్తున్నారన్నమాట)..    

ఈ కీర్తన ఇక్కడ వినండి:
http://annamacharya-lyrics.blogspot.in/2014/03/820komma-ni-chakkamdanamu-koti-sesunu.html  

Friday, March 7, 2014

అంతకంతకు గాలి నణఁగునా యనలంబు - కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెఁగాక [Antakantaku gali naNagunA yanalambu]

//ప// అంతకంతకు గాలి నణఁగునా యనలంబు
కాంత నిట్టూర్పులాఁకలి చెరిచెఁగాక

//చ// కలువలూరక నీటఁ గందునా యెందైనఁ
జెలియ కన్నీరిట్లఁజేసేఁ గాక
జలజంబుపై వేఁడి చల్లునా రవి యిట్ల
వలఁచి మదనాగ్ని వదనము నొంచెఁగాక

//చ// విరులకునుఁ దుమ్మిదలు వెరచునా యెందైన
మరుబాణముల నెరులు మలఁగెఁగాక
వరుస మంచునఁ దీగె వాడునా యెందైన
అరిది చెమటలనె దేహము నొగిలెఁ గాక

//చ// కుముదహితుఁడెందైనఁ గూడునా జక్కవల
కొమరె గుబ్బలమీఁద గూడెఁ గాక
తిమిరంబు తిమిరమునఁ దెములునా యెందైన
రమణి వేంకటవిభుని రతిమఱపుగాక

ముఖ్యపదాల అర్ధం:
అనలము: నిప్పు, అగ్ని The god of fire
కాంత నిట్టూర్పులు: స్త్రీ నిశ్వాసలు
ఆకలి చెరిచెఁగాక: ఆకలిని పోగొట్టెనట్టు
కలువలూరక నీటఁ గందునా: కలువలు+ఊరక+నీట+కందునా
యెందైనఁ: ఎక్కడైనా
జలజంబు: జలమునందు పుట్టినది (తామెర పై)
విరులకు: పువ్వులకు 
దుమ్మిదలు వెరచునా: తుమ్మెదలు భయపడునా
మరుబాణముల: మన్మధ బాణముల
నెరులు: కురులు 
వరుస మంచునఁ: మంచు వానలకి
దీగె వాడునా యెందైన: తీగె ఎక్కడైనా వాడుతుందా?
అరిది: అపురూపమైన, అశక్యమైన
చెమటలనె దేహము నొగిలెఁ గాక: చెమటల వానలతో దేహము ఒడిలిపోయింది
కుముదహితుఁడెందైనఁ: తెల్లకలువలకి స్నేహితుడు (చంద్రుడు) ఎక్కడైనా
గూడునా జక్కవల: చక్రవాక పక్షులతో ఎక్కడైనా కలుస్తాడా?
కొమరు: యౌవ్వనవతిఐన స్త్రీ
గుబ్బలమీఁద గూడెఁ గాక: చన్నులమీద కలిసినట్టుంది
తిమిరంబు తిమిరమునఁ దెములునా: చీకటి చీకటితో పోతుందా 
రమణి: సుందరమైన స్త్రీ  A beauty, a lovely woman, a grace
రతిమఱపుగాక: మన్మధక్రీడ మరపింపజేస్తుంది.

భావం: ఈ సృష్టిలో కొన్ని పదార్ధాలు కొన్నింటితో ఎల్లప్పుడూ స్నేహాన్ని కలిగి యుంటాయి. కొన్ని కొన్నింటికి ప్రాణం అయ్యుంటాయి. చెట్లకి సూర్యకాంతి, అగ్నికి గాలి, తుమ్మెదలకి పద్మాలు ఎల్లప్పుడూ స్నేహితులే...కానీ, అమ్మవారి విరహానికి ఏవైతే జరగవో అవి జరిగినట్టుగా ఉంది ట. 

గాలి గట్టిగా వీస్తుంటే అగ్ని మరింత ప్రజ్వరిల్లుతుందే కానీ, మంట ఆరిపోతుందా ఎక్కడైనా? కానీ, కాంత విడిచే వెచ్చటి, బలమైన నిట్టూర్పులు ఆకలిని (కడుపులో ఉండే అగ్నిని) చల్లార్చేస్తోంది ట. (అంటే విభుని విరహంతో కాంతకి ఆకలి వెయ్యడం లేదు

కలువపువ్వులు ఊరికే నీటిలో ఉండి ఎక్కడైనా కందిపోతాయా? కానీ, చెలియ కలువపూల వంటి కన్నులను కన్నీరు వాడిపోయేలా చేసింది. (ఇక్కడ నాయిక కళ్ళు కలువ పువ్వులైతే, ఆమె కన్నీళ్ళ వల్ల అవి నల్లగా కందిపోయాయన్న మాట. అంటే, విభుని విరహం వల్ల యే స్థాయిలో ఏడ్చిందో అర్ధం చేసుకోవచ్చు). తామెర పూలపై సూర్యుడు ఎక్కడైనా ఇంత వేడిని జల్లి ఎర్రగా మాడ్చేస్తాడా? కానీ, మన్మధుని ప్రతాపము వల్ల ఆమె తెల్లనైన ముఖము తామెరలా ఎర్రగా కందిపోయింది. 

పువ్వులకి తుమ్మెదలు ఎక్కడైనా భయపడతాయా? కానీ, ఆమె పొడవాటి నల్లని తుమ్మెద రెక్కల్లాంటి కురులు మన్మధబాణాలకి బెదిరిపోయాయి ట. (అంటే, కోరికలతో వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయని భావం కావచ్చు) మంచు వర్షానికి ఎక్కడైనా తీగె వాడుతుందా? కానీ, కోరికల వల్ల పుట్టే వేడికి కురిసే చెమటల వానలకి ఆమె తీగెలాంటి దేహము ఒడిలిపోయింది.    

కలువపువ్వులకి స్నేహితుడైన చంద్రుడు ఎక్కడైనా చక్రవాక పక్షులతో కలిసి ఉంటాడా? (వెన్నెలలో మాత్రమే ఈ పక్షులు ఆహారాన్ని వెతుక్కుంటాయి. వెన్నెలకి మాత్రమే ఈ పక్షులు స్నేహితులు కానీ, చంద్రుడికి కాదు) కానీ, చక్రవాక పక్షుల్లా ఉబ్బెత్తుగా ఉన్న ఈ యౌవ్వనవతి చన్నులతో చంద్రుడు కలిసి యున్నాడు. (అంటే, విభుని తలపు వల్ల ఆవిడ చన్నులు ఉబ్బి ఉన్నాయని భావం) చీకటితో చీకటి ఎప్పటికైనా ముగుస్తుందా? (వెలుగు వస్తేనే చీకటి ముగుస్తుంది) కానీ, ఈ సౌందర్యవతి-వేంకట విభుడు (రతి)కలయిక చీకటిని ఇంకా పొడిగిస్తుంది/మరపింపజేస్తుంది. (అంటే, రాత్రి చాలా దీర్ఘంగా ఉంటుంది వారిద్దరికీ

Friday, February 28, 2014

ఏమి మందు గద్దె యింతులాల యీ - రామ కు తిరుపతి రాముడే మందు [Emi mandu gadde yintulala ee]

//ప// ఏమి మందు గద్దె యింతులాల యీ
రామ కు తిరుపతి రాముడే మందు

//చ// వెలసెటి విరహాన వేగేటి యింతికి
చెలియలాల యేమి సేతమే
చలివేడివలపుల చవిగన్న యీపెకు
వలపించిన తనవరుడే మందు

//చ// పొదిగొన్న తమకానఁ బొరలెటి కాంతకు
చెదరక మమమేమి సేతమే
వుదుటఁ గోరికల నొనరెటి యీపెకు
మదిలోపలి తనమగడే మందు

//చ// పొల్లవోని యాస బొరలెటి మగువకు
చెల్లఁబోమన మేమి సేతమే
కొల్లగా రతి నింతిఁ గూడినాఁ డీపెకు
నల్లని శ్రీవేంకటనాథుడే మందు


ముఖ్య పదాల అర్ధం:
కద్దు: కలదు
యింతులాల: చెలులారా
రామ: స్త్రీ
తిరుపతి రాముడే: వేంకటేశ్వరుడు
చవిగన్న: రుచి తెలుసుకున్న
యీపెకు: యీకె= స్త్రీ
పొదిగొన్న= పొదిగొను: కప్పు, ఆవరించు
తమకానఁ: విరహాన
పొర్లు: పొర్లాడు (To roll over, to roll on the ground)
చెదరక: చెదరకుండా
ఉదుట గోరికల: ఉధృతి/ఎక్కువగా ఉన్న కోరికలు (Bigness, vigour)
ఒనరు: కలుగు
మదిలోపలి: హృదయములోపలి
పొల్లవోని: తగ్గని, తరగని, క్షయించని, To decrease.
యాస బొరలెటి: ఆశతో పొర్లాడే
చెల్లఁబో: తగ్గించడానికి
కొల్లగా: మిక్కిలిగా, ఎక్కువగా
రతి నింతిఁ గూడినాఁ డీపెకు: రతీదేవిని భార్యగా పొందినవాడు చెలిని ఆవహించి ఉన్నాడు (మన్మధుడు)


భావం:
లలితమైన పదాలతో అన్నమయ్య అమ్మవారి విరహవేదనని తెలియజేస్తున్నారు. అమ్మవారు వేంకటేశ్వరుని విరహం వల్ల ఒళ్ళు వేడెక్కి, పరధ్యానంగా పడుకున్నారు. చెలులు వచ్చి అమ్మవారి ఒంటి వేడిని చూసి మనం ఏ మందు ఇవ్వగలము ఈ వేడికి? అని తమలో తాము చర్చించుకుంటున్నారు.

చెలులూ! ఏ మందు కలదే మన వద్ద ఈ  వేడిని తగ్గించడానికి? ఈ అందమైన యువతికి ఆ తిరుపతి రాముడే మందు.

విరహంతో వేగుతున్న ఈ పడతికి మనమేమి చేయగలమే  చెలులూ! తన భర్త వెచ్చని కౌగిళ్ళ రుచిని అనుభవించిన ఈమెకు ఆ ప్రేమని ఇవ్వగల ఆమె మగడే మందు. (ఆయనొచ్చి కౌగిళ్ళలోకి తీసుకుని ప్రేమని కురిపిస్తే ఈమె విరహం తగ్గుతుందన్నమాట).

విరహం బాగా కమ్ముకుని పాన్పు మీద అటూ, ఇటూ పొర్లాడుతున్న ఈమె తమకాన్ని పోగొట్టడానికి మనమేమి సేయగలమే? పెరిగిపోతున్న కోరికలను కలిగియున్న ఈమెకు ఆమె హృదయంలో కొలువైన ఆవిడ భర్తే మందు.   

భర్త వస్తాడని, ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటాడని తగ్గని ఆశతో పొర్లాడే ఈ యువతికి ఆ ఆశని తగ్గించడానికి మనమేమి సేయగలమే.. ఈమె శరీరాన్ని రతీదేవి భర్త ఐన మన్మధుడు పూనాడు, అది వదిలించడానికి నల్లని వేంకటనాధుడే మందు...


ఈ కీర్తన ఇక్కడ వినండి:
http://annamacharya-lyrics.blogspot.in/2014/02/808emi-mamdu-gadde-yimtulala-yi.html 

Thursday, February 27, 2014

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము - యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె [Yemani pogadudumE ee cheli chakkadanamu]

//ప// ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము
యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

//చ// అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు
ధర సింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను
మరుదల్లి యలమేలుమంగమోమై నిలిచె

//చ// బిసములు శంఖమును పెనుచక్రవాకము-లా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను
మసలక దానలమేలుమంగ మేనై నిలిచె

//చ// అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండగాను
ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద
పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె

ముఖ్యపదాల అర్ధం:
చక్కదనము: అందము, Prettiness, beauty
అరచంద్రుడుఁ: ప్రకాశిస్తూన్న అర్ధ చంద్రుడు (నుదురు)
చకోరాలు: చకోరపక్షివంటి కన్నులు 
అద్దాలు: నున్నని ప్రతిబింబాన్ని చూపే (చెక్కిళ్ళు)
సంపెగయు: ముక్కుకి ఉపమానం
ధర: భూమి
సింగిణులు: (సింగాణి, సింగిణీ, శింజినీ)=విల్లు (కను బొమ్మలకి ఉపమానం)
 శ్రీలు: చెవులు (శ్రీ ఆకృతిలో చెవులు)
తలిరు: పల్లవము, చిగురు A sprout, a shoot. (ఎర్రని చిగురు వంటి పెదవులు)
తుమ్మిదలు: నల్లని కురులకి ఉపమానం
మరుదల్లి: మన్మధుడి తల్లి 
బిసములు:  తామెరతూండ్లు (Fibres, film, as of the water lily) (చేతులకి ఉపమానం)
శంఖమును: కంబువు (A conch shell, a conch used as a horn) కంఠమునకు ఉపమానం
పెనుచక్రవాకములు: పెద్ద చక్రవాక పక్షులు (స్తనములకి ఉపమానం)
ఆకసము: విశాలమైన నడుము కి ఉపమానం 
నీలపుఁజేరు: నీలము+చేరు= నీలమణుల తో  చేసిన మొలత్రాడు కరికుంభాలు: ఏనుగు కుంభస్థలము (వంటి పెద్ద పిరుదులు)
పొసగను: చేకూడగా (To agree, fit)
ఇవి యెల్లా: ఇవన్నీ
నొక పోడిమై: ఒక లక్షణము (A sign or mark)
నిలువగాను: నిలబడగా
మసలక: తచ్చాడు, తిరుగు
తాను నలమేలుమంగ మేనై నిలిచె: అలమేల్మంగ శరీరమై నిలిచాయి
అనటులు: ఊతనిచ్చునవి (తొడలు కి ఉపమానం)
అంపపొదులు: అమ్ముల పొది= బాణాలు పెట్టుకును చోటు (వాడియైన గోళ్ళకి ఉపమానం అయ్యుండచ్చు)
అబ్జములు: పద్మములు (పాదాలకి ఉపమానం)
ముత్తేలు: ముత్యములు (తెల్లని గోళ్ళకి ఉపమానం)
ఒనరు: కలుగు, పొసగు 
వరుసఁ గూడి వుండగాను: వరుస గా ఉండగా 
ఉరముమీద: వక్షస్థలము మీద
పనుపడు: ఇముడు, సరిపడు 

భావం: 
ఈ సంకీర్తనలో అన్నమయ్య అలమేల్మంగ అంగాంగవర్ణన చేస్తూ, యే ఒక్క శరీరభాగాన్నీ పేరు చెప్పకుండా ఈ భూమి మీద ఉన్న అత్యంత సుందరమైన వస్తువులను మాత్రమే చెప్తూ వాటితో పోల్చుకుని ఆమె అందాన్ని మనల్నే ఊహించుకోమంటున్నారు. సన్నివేశం ప్రకారం చెలులు ఒకరితో ఒకరు అమ్మవారి అందాన్ని వర్ణించుకుంటున్నట్లుంటుంది. 

ఈ చెలియ (అలమేల్మంగ) అందాన్ని ఏమని పొగడగలమే! ఆవిడ అందం దేనితో పోల్చినా అంతకంటే ఎక్కువగానే ఉంది. 

సగం ప్రకాశిస్తూన్న తెల్లని చంద్రుడు భూమి మీదకొచ్చి నిల్చినట్టు కాంతివంతంగా ఉంది ఆమె తెల్లని ఫాలభాగం (నుదురు). ఆమె కన్నులు చకోరపక్షులంత అందంగా ఉన్నాయి. నున్నని ఆమె మెరిసే చెంపలు ప్రతిబింబాన్ని చూపే అద్దాల్లా ఉన్నాయి. ఆమె ముక్కు విచ్చుకున్న సంపెంగ పువ్వులా నిటారుగా, సొగసుగా ఉంది. ఆమె కనుబొమ్మలు మన్మధుని విల్లులా వొంగి ఉన్నాయి. ఆమె చెవులు "శ్రీ" ఆకృతిలో రమణీయంగా ఉన్నాయి. పెదవులు లేత చిగురులా ఎర్రగా ఉన్నాయి. తుమ్మెద రెక్కల్లా నల్లని అందమైన కురులు కలిగి ఉన్నది. ఇవన్నీ మన్మధుడి తల్లి ఐన శృంగారవతి అలమేలుమంగకి  ముఖముగా నిలిచాయి. (అవన్నీ కలిపితే ఆమె ముఖము అయ్యింది)

ఆమె నున్న ని పొడవాటి చేతులు తామెరతూండ్లు వలే ఉన్నాయి. మూడు గీతలతో ఆమె కంఠము శంఖము వలే ఉన్నది. పెద్దవైన ఆమె చన్నులు చక్రవాక పక్షులు రాశి పోసినట్టుగా ఉబ్బెత్తుగా ఉన్నాయి. నల్లని ఆకాశము తాడుగా మారి చుట్టినట్టుగా ఆమె విశాలమైన నడుము ఉన్నది. యేనుగు కుంభస్థలము వలే విస్తారమైన పిరుదులు కలిగి ఉంది. ఇవన్నీ చక్కగా అమరుకొని ఒకచోట కలిస్తే అది అలమేల్మంగ శరీరమై నిలిచింది.

ఆమె శరీరానికి ఊతాన్నిచ్చే తొడలు అరటిబోదెల్లా బలంగా ఉన్నాయి. ఆమె వాడి గోళ్ళు అమ్ములపొదల్లో బాణాల్లా ఉన్నాయి. ఆమె పాదములు పద్మాల్లా సుతిమెత్తగా ఉన్నాయి. ఆమె కాలిగోళ్ళు ముత్యాల్లా మెరుస్తూన్నాయి. ఇవన్నీ ఒకచోట ఒద్దికగా కలిసి ఘనుడైన శ్రీవేంకటేశ్వరుని వక్షస్థలము మీద కొలువైయున్న అలమేల్మంగ పాదాల్లా ఉన్నాయి. 

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2014/02/807emani-pogadudume-yicheli-chakkadanamu.html        

Saturday, February 22, 2014

సందెకాడ బుట్టినట్టి - చాయల పంట యెంత చందమాయ చూడరమ్మ - చందమామ పంట [Sandekada buttinatti chayala panta]

//ప// సందెకాడ బుట్టినట్టి - చాయల పంట యెంత 
చందమాయ చూడరమ్మ - చందమామ పంట

//చ// మునుపు పాలవెల్లి - మొలచి పండిన పంట
నినుపై దేవతల -  నిచ్చపంట
గొనకొని హరికన్ను- గొనచూపులపంట
వినువీధి నెగడిన - వెన్నెలల పంట

//చ// వలరాజు పంపున - వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి - జాజరపంట
కలిమి కామిని తోడ - కారుకమ్మినపంట
మలయుచు తమలోని - మర్రిమాని పంట

//చ// విరహుల గుండెలకు - వెక్కసమైన పంట
పరగచుక్కలరాశి - భాగ్యము పంట
అరుగై తూరుపుకొండ - నారగ బండిన పంట
యిరవై శ్రీ వేంకటేశు- నింటిలోని పంట

ముఖ్య పదాల అర్ధం:
సందెకాడ: సంధ్యాసమయంలో (సాయంత్రం)
చాయల పంట: వెలుతురుల పంట
చందమాయ: చందము+ఆయ=  విధముగా Manner, way; state, form. 
మునుపు: పూర్వము
పాలవెల్లి: పాల సముద్రం (పాలకడలి, పాల్కడలి, పాలకుప్ప, పాలమున్నీరు, పాలవాగు or పాలవెల్లి)
మొలచు: బయటకు వచ్చు, పుట్టు
నినుపు: పూర్ణమగు become full, filled 
నిచ్చపంట: నిత్యపు పంట
గొనకొను: యత్నించు, To attempt.
హరికన్నుగొనచూపులపంట: విష్ణువు కంటి కొన చూపుల పంట
వినువీధి: ఆకాశవీధి
నెగడు: వర్ధిల్లు, వెలయు
వలరాజు పంపున: మన్మధుడు పంపించిన
వలపు విత్తిన పంట: ప్రేమ నాటిన పంట
చలువ: చల్లని, Coolness, coldness, cold, శైత్యము పున్నమ: పౌర్ణమి 
జాజరపంట: జాజర పాటలు పాడించే పంట
కలిమి కామిని: సంపద కలిగిన శృంగారవతి ఐన లక్ష్మీదేవి తో కలిసి
తోటి కాడు: తోడబుట్టు 
మలయు: తిరుగు, వ్యాపించు 
మర్రిమాను పంట:  విస్తరించిన వటవృక్షము ల పంట
విరహుల: ఎడబాటు, వియోగము
వెక్కసము: మిక్కిలి, ఎక్కువగా, Excess, an extreme.
పరగు: ఉండు, ప్రకాశించు
చుక్కలరాశి: నక్షత్రముల సమూహము
అరుగుగ: ఇంటి ముందటి ఆవరణగా
తూరుపుకొండన: ఉదయాద్రిపై 
ఇరవు: స్థానము
శ్రీ వేంకటేశు యింటిలోని పంట: వేంకటేశ్వరుని ఇంట్లో పంట 

భావం:
అన్నమయ్య చంద్రోదయాన్ని జానపద భాషలో అత్యంత రమణీయంగా రచించారు. శ్రీవేంకటేశుని కీర్తించడానికి ఆయన ఎన్నుకోని పదాలు లేవు...

సంధ్యాసమయంలో ఉదయాద్రిమీద పుట్టిన అందమైన వెలుతురుల పంట చందమామని చూడండి...ఈ పంట ఎంత గొప్పదంటే, 

పాల సముద్రం లో మొలకెత్తి పండిన పంట. ఆకాశంలో ఉండే దేవతలకి నిత్యము ఉండే సంపూర్ణమైన పంట. (మన పంచాంగమే చంద్రమానాన్ని అనుసరించి ఉంది. కాబట్టి చంద్రునితో అన్ని గ్రహాలకూ (ఆయా అధిపతులకూ) సంబంధం ఉంటుంది. ఉదా: చంద్రమంగళ యోగం వంటి చంద్రాది యోగాలన్నింటికీ చంద్రుడే కారకుడు. కాబట్టి అన్నమయ్యవారు చంద్రునికీ దేవతలకి ఉండే అవినాభావ సంబంధాన్ని ఇంత అందంగా చెప్పారు). శ్రీమహావిష్ణువు కంటి కొనల కరుణా కటాక్ష వీక్షణల పంట ఆకాశవీధిలో చల్లని వెలుగు వెన్నెలల పంట. (శ్రీ మహావిష్ణువు ఒక కన్ను సూర్యుడు, మరో కన్ను చంద్రుడు అంటారు కదా! ఆ భావంలో రాసి ఉంటారు అన్నమయ్య)

ఈ భూమిపై అందరి మనస్సులలో మన్మధుడి ప్రభావం వల్ల కలి గే ప్రేమ అనే విత్తును నాటిన వలపు పంట. చల్లని పున్నమినాటి రాత్రులలో అందమైన యౌవ్వనవతులచే జాజరపాటలు పాడించే పంట. సంపదలు కలిగిన, శృంగారవతిఐ న లక్ష్మీ దేవికి తోడబుట్టిన పంట (చంద్రుడికి చెల్లెలు లక్ష్మీదేవి). రసాస్వాదకులకు మెల్లగా మనస్సులో మొదలై విస్తరిస్తూ  మర్రిచెట్టులా పెరిగి పెద్దదయ్యే పంట.

ప్రియురాలు/ప్రియుని ఎడబాటు జనులకు విరహతాపం పెంచే పంట. ప్రకాశించే నక్షత్రముల రాశికి భాగ్యమైన పంట. (అంటే, చంద్రుడు విశాఖా నక్షత్రములో పూర్ణచంద్రుడైతే అది వైశాఖమాసం. కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి వస్తే అది కార్తీక మాసం...అలా చంద్రుడితో ముడి పడిన మాసనామాల వల్ల నక్షత్రాలు గొప్ప భాగ్యాన్ని పొందాయంటున్నారు. ఇన్ని కోట్ల నక్షత్రాలలో కొన్నింటికి మాత్రమే మన పంచాంగంలో స్థాన దక్కడం చంద్రుు వాటికీ ఇచ్చిన భాగ్యమేనని అర్ధం కాబోలు) ఆకాశవీధిలో తూర్పు అరుగుమీద పండిన పంట. యింత గొప్పపంట శ్రీవేంకటేశ్వరుని యింటిలోంచి వచ్చిన పంట. (శ్రీవేంకటేశునికి బావమరిది కదా చంద్రుడు మరి)..

ఈ కీర్తన ఇక్కడ వినండి:
http://annamacharya-lyrics.blogspot.com.au/2006/10/25sandekada-puttinatti-chayala-panta.html

Sunday, February 16, 2014

కంటి శుక్రవారము గడియ లేడింట - అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని [Kanti sukravaramu gadiya ledinta]

//ప// కంటి శుక్రవారము గడియ లేడింట  
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని  

//చ// సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణముగట్టి 

కమ్మని కదంబము కప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు రొమ్ముతల మొలచుట్టి 
తుమ్మెద మైచాయతోన నెమ్మది నుండే స్వామిని

//చ// పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి 

తెచ్చి శిరసాదిగ దిగనలది
అచ్చెరపడి చూడ అందరి కన్నులకింపై 
నిచ్చెమల్లెపూవు నలె నిటుతానుండే స్వామిని

//చ// తట్టు పునుగే కూరిచి చట్టలు చీరిచినిప్పు 

పట్టి కరగించి వెండి పళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది 
బిట్టు వేడుక మురియు చుండే బిత్తరి స్వామిని

ముఖ్య పదాల అర్ధం:
కంటి= చూచితిని (కనుట అంటే చూచుట) 
గడియ లేడింట= తెల్లవారు ఝామున రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి 7x24=168 నిముషాలు. అంటే, తెల్లవారు ఝామున 2:48 ని.లు.)
అంటి అలమేల్మంగ అండ నుండే స్వామిని: అలమేల్మంగ తో కూడిన శ్రీవారిని చూశాను   

సొమ్ములన్నీ కడబెట్టి: ఆభరణాలన్నీ తీసి ఓ మూలన పెట్టి
సొంపుతో గోణముగట్టి: అందముగా గోచీ కట్టి (A waist cloth or modesty piece) 
కదంబము: మిశ్రమము (A mixture) కదంబపొడి kadamba-poḍi. n. Pouncet. A fragrant powder compounded of various essence
చెమ్మతోన: తడితో, Damp, moist
వేష్టువలు: వేష్టనము: చుట్టుకొనడము (Surrounding, encompassing)

పసిడి గిన్నెల నించి: బంగారు గిన్నెలలో నింపి 
శిరసాదిగ: తల మొదలుగ 
దిగనలది: దిట్టముగా అలది
అచ్చెరపడి చూడ: ఆశ్చర్యపడి చూడగా
కన్నులకింపై: కన్నులకు చూడడానికి ఇంపుగా 

తట్టు పునుగే కూరిచి: పునుగుచట్టాన్ని కూర్చుకుని The perfume called Civet (పునుగు పిల్లి ఒక సమయంలో తన వంటిని దగ్గరలో ఉన్న చెక్కలకి గానీ, వస్తువులకి గానీ రుద్దుతుంది. ఆ సమయంలో ఆ పిల్లి నుంచి ఒక ద్రవం ఆ చట్రాలకి అంటుకుంటుంది.)   
చట్టలు చీరిచి: చంపు, చట్టలుపాపు, నాశనము చేయు  
నిప్పు పట్టి కరగించి: నిప్పులమీద పెట్టి కరిగించి 
వెండి పళ్యాల నించి: వెండి పళ్ళేలనిండా పునుగు తైలాన్ని నింపి
దట్టముగ మేనునిండ: శరీరం నిండా గట్టముగా పట్టించి, దిద్ది 
బిట్టు వేడుక: . హెచ్చు, అధికమైన సంతోషముతో Excess. A great action
మురియుచుండే: మురిసిపోతూన్న
బిత్తరి స్వామిని కంటి: ప్రకాశిస్తూ, సొగసుగా ఉండే స్వామిని చూశాను

భావం:
శుక్రవారం శ్రీవారికి అభిషేకం గొప్ప కన్నులపండుగగా జరిగే విశేషమైన సేవ. అన్నమయ్య కాలంలో తప్పక జరిగేది.ఇప్పుడు కూడా జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత "నిజపాద దర్శనం" పేరుతో దర్శనానికి అనుమతిస్తారు. అన్నమయ్య శ్రీవారికి అభిషేకాలు జరుతున్నప్పుడు పక్కనే నిలబడి నలుగు పాటలు, అభిషేకం పాటలు, హారతి పాటలు పాడేవారు. అభిషేకం అయ్యాక చందన తాంబూలాది సత్కారాలు  అందుకునేవారు. అలాంటి ఓ శుక్రవారం శ్రీవారి అభిషేకం జరుగుతున్నప్పుడు రాసిన పాట ఇది. అభిషేకం జరిగే విధానాన్ని కళ్ళకు కట్టినట్టు రాశారు అన్నమయ్య. 

శుక్రవారం తెల్లవారు ఝామున ఏడు గడియలకి (అంటే, రెండు గంటల నలభైయ్యెనిమిది నిమిషాలకి (ఒక గడియ అంటే 24 ని.లు. ఏడవ గడియ అంటే రోజు మొదలు నుంచి (అర్ధరాత్రి పన్నెండు గంటలనుంచి) 7x24=168 నిముషాలు. అంటే, శుక్రవారం తెల్లవారు ఝామున 2:48 ని.లు.) అలమేల్మంగతో కూడిన శ్రీవేంకటేశ్వరునికి అభిషేకాన్ని కన్నులారా చూశాను. 

ముందుగా శ్రీవారి విగ్రహం పై ఉన్న ఆభరణాలన్నీ తీసేసి ఒక మూలగా పెట్టారు. ఒక పట్టు గోచీని చాలా అందంగా, నేర్పరితనం తో  చుట్టారు. అనేక రకాల సుగంధాలను (చందనము, కర్పూరము, కుంకుమపువ్వు) కలిపిన పొడిని (కదంబము) ఓ కప్పు, పన్నీటి నీటి లో కలిపి ఒంటిని అభిషేకించారు. బట్టలని పన్నిటి చెమ్మతో స్వామి వారి తలకి, హృదయము మీద, మొల చుట్టూ చుట్టారు. నల్లని తుమ్మెద రంగులో ప్రశాంతముగా ఉన్న స్వామిని చూశాను.

పచ్చకప్పురము బాగా మెత్తగా నూరి, బంగారు గిన్నెల నిండా నింపి భక్తిగా తెచ్చి, తల నుంచి పాదముల వరకూ బాగా అలదారు (పట్టించారు). నల్లని మేని పై మెరుస్తూన్న పచ్చకప్పురము తో - స్వామిని అందరూ ఆశ్చర్యపడి చూస్తుండగా, అందరి కన్నులకూ విందును కలిగిస్తూ తెల్లని మల్లెపూవు వలే ఉన్న స్వామిని నా కన్నులారా చూశాను.    

పునుగు పిల్లి రుద్ది వదలిన చట్రాలని తెచ్చి, వాటిని శుభ్రం చేసి, ఆ చట్రాలని నిప్పులమీద కరిగించగా వచ్చిన సుగంధపు తైలాన్ని వెండి పళ్ళేలనిండా నింపి పట్టుకొచ్చి శ్రీవారి శరీరానికి బాగా దట్టముగా పట్టించి, నుదుటను తిలకముగా దిద్దినప్పుడు జరిగే ఆ వేడుకలో మురిసి, మెరసిపోతున్న స్వామిని నా కన్నులారా చూశాను.

(ఇప్పటికీ తిరుమలలో పునుగు పిల్లుల్ని తి.తి.దేవస్థానం ప్రత్యేకంగా పెంచుతోంది. శ్రీవారి సేవలలో పునుగు పిల్లి తైలానికి ప్రత్యేకత ఉంది. ఈ పునుగు తైలం తో శ్రీవారి విగ్రహానికి మర్ధన చేయడం వల్లే ఇంతకాలం ఆ సాలగ్రామ విగ్రహం చెడిపోకుండా, పగుళ్ళులేకుండా ఉంది..సాక్షాత్తూ శ్రీవారి సేవకై పుట్టిన పునుగు పిల్లి జాతి ఎంత అదృష్టం చేసుకుందో కదా! ఆ తైలం తయారీ విధానం మనకి తెలియకపోయినా, క్రింది చరణంలో అన్నమయ్య కళ్ళకి కట్టినట్టు వివరించారు)..ఈ కీర్తనని వివరిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందాన్ని పొందాను..    

ఈ కీర్తనని ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2006/10/19kanti-sukravaramu.html

Friday, January 31, 2014

అమ్మమ్మ యేమమ్మ- అలమేల్మంగ నాంచారమ్మ తమ్మియింట -నలరుకొమ్మ ఓయమ్మ [Ammamma yemamma alamelmanga nancharamma]

ప// అమ్మమ్మ యేమమ్మ- అలమేల్మంగ నాంచారమ్మ 
తమ్మియింట -నలరుకొమ్మ ఓయమ్మ 

చ// నీరిలోన తల్లడించి -నీకే తలవంచి 
నీరికింద పులకించి- నీరమణుండు 
గోరికొన చెమరించీ- కోపమే పచరించీ 
సారెకు నీయలుక ఇట్టె- చాలించవమ్మ //ప//

చ// నీకుగానే చెయ్యిచాచీ- నిండాకోపమురేచీ 
మేకొని నీవిరహాన- మేను వెంచీని 
ఈకడాకడి సతుల - హృదయమే పెరరేచి 
ఆకు మడిచియ్యనైన - ఆనతియ్యవమ్మా //ప//

చ// చక్కదనములె పెంచీ -సకలము గాదలంచి 
నిక్కపు వేంకటేశుడు- నీకే పొంచీని 
మక్కువతో అలమేల్మంగ -నాంచారమ్మ 
అక్కున నాతని నిట్టే -అలరించవమ్మ //ప//

ముఖ్యపదార్ధం:
అలమేల్మంగ= అలర్+మేల్+మంగై= పువ్వుమీద కన్యక
నాంచారు= స్త్రీ, దేవత
తమ్మిఇంట= పద్మము ఇల్లుగా చేసుకుని
అలరు= ప్రకాశించు
కొమ్మ= స్త్రీ, అందమైన యువతి
నీరిలోన= నీటిలో
తల్లడిల్లు= చలనము, చలించు Shaking, tremor 
గోరికొన= గోటి చివర
చెమరించి= స్వేదము చిందించు, చెమటను విసర్జించు
పచరించు= ప్రసరించు, వ్యక్తపరచు
సారెకు= మాటిమాటికీ, తరచుగా
అలుక= కోపము
చాలించు= కట్టిపెట్టు, ఆపు
రేచు= రేగు, రేగించు, రెచ్చగొట్టు
మేకొని= కోరి, అపేక్షించి
మేను వెంచీని= శరీరము పెంచెను
ఈకడాకడ= ఈ చివర, ఆ చివర 
పెరరేచు= ప్రేరేపించి
ఆకుమడుచు= తాంబూలము చుట్టు
ఆనతి= ఆజ్ఞ
పొంచు= వేచియుండు
మక్కువతో= ప్రియముగా, ఇష్టముతో
అక్కు= రొమ్ము, వక్షస్థలము
అలరించు= సంతోషపెట్టు

భావం: 
అన్నమయ్య అమ్మవారిమీద చిరుకోపాన్ని ప్రదర్శిస్తున్నారు. విరహంతో ఉన్న స్వామిని దగ్గరకు తీసుకుని సంతోషపెట్టమంటున్నారు. మాటిమాటికీ అలకలు చాలించమంటున్నారు. నువ్వు అన్ని సార్లు కోపం తెచ్చుకోవడం వల్లే స్వామి ఎన్నో అవతారాలెత్తి నిన్ను శాంతిపరచడంకోసం అనేక బాధలు పడుతున్నారంటున్నారు. శృంగార సంకీర్తనలో స్వామి దశావతారాలనూ వర్ణిస్తున్నారు. ఇంతటి ప్రతిభ అన్నమయ్యకే సొంతం. అందుకే స్వామి ఈ సంకీర్తనలకోసం పరితపించిపోయాడు.

ప. ఓ సుకుమారమైన కన్యకా! పద్మమునే నివాసముగా చేసుకుని ప్రకాశించు అమ్మా! విభునికి ప్రాణ సఖివి.....అమ్మమ్మా మమ్మా ఇది? ఇలా చేయదగునా?

చ. నువ్వు నీటిలో ఉన్నావని నీకోసం తలవంచి నీటిలోన కలియతిరుగుతూ తల్లడిల్లిపోయాడు (మీనావతారం).   నీవు నివాసమున్న పద్మము కింద ఉన్న నీటిలో తిరుగుతూ పులకరించిపోయాడు నీ నారాయణుడు. (కూర్మావతారం).
నీవల్ల కలిగిన విరహం వల్ల ఆయనకి శరీరంతో పాటు గోళ్ళుకూడా చెమటని కురిపిస్తున్నాయి (వరాహావతారం). మాటిమాటికీ నీ అలుకలు చూసి విభునికి కోపం వ్యక్తపరుస్తున్నాడు. (నరశింహావతారం). అమ్మా! నీ కోపాలు ఇక కట్టిపెట్టవమ్మా..

చ. నీకోసం ప్రేమ గా చెయ్యిచాచి శరీరాన్ని పెద్దదిగా చేశాడు (వామనావతారం). నీవు అలుకతో ఆయనకి చేయి ఇవ్వనందుకు కోపగించుకుని రెచ్చిపోయాడు (పరశురామావతారం). నిన్ను కోరి, నీపై విరహంతో ఎంతో బాధని అనుభవించాడు (రామావతారం). అక్కడా ఇక్కడా ఉన్న చెలులందరి హృదయాన్నీ అతని బాధతో బాధిస్తున్నాడు (కృష్ణావతారం). (ఆయన బాధని నీకు తెలియజేయమంటున్నాడు. ఆ చెలులేమో శ్రీవారి బాధను చూడలేక, నీకు చెప్పే ధైర్యంలేక బాధపడిపోతున్నారు) కనీసం వారిని తాంబూలమైనా చుట్టి ఇవ్వమని ఆనతీయవమ్మా!. (తాంబూలం వరకూ వ్యవహారం వచ్చిందంటే సంధికుదిరినట్టే).

చ. నీకోసం ఎంతో చక్కటి గుణాలను పెంపొందించుకున్నాడు (బుద్ధావతారం). అంతా తానే అని తలిచాడు (కల్కి అవతారం). ఇన్ని అవతారాలు కేవలం నువ్వు చూపించిన విరహం వల్ల ఎత్తాడు. అన్నింటినీ మించి ఇప్పుడు నిజమైన శ్రీవేంకటేశ్వరుని అవతారం ఎత్తి నీకోసం వేచి ఉన్నాడు.  అమ్మా, కొంచెం ప్రేమతో అతనిని నీ రొమ్ముపై చేర్చుకుని అతన్ని సంతోషపెట్టమ్మా!......
(అమ్మమ్మా అని అన్నమయ్య చివరలో బతిమాలుతున్నట్టుగా)

 ఈ సంకీర్తనని శ్రావణ్ బ్లాగునందు వినచ్చు.
http://annamacharya-lyrics.blogspot.com.au/2007/01/in-english-pa-ammamma-emamma.html