Total Pageviews

Friday, July 3, 2015

పూవుబోణుల కొలువే పుష్పయాగము - పూవక పూచె నీకిట్టె పుష్పయాగము [Poobonula koluve pushpayagamu]

//ప// పూవుబోణుల కొలువే పుష్పయాగము
పూవక పూచె నీకిట్టె పుష్పయాగము //ప//

//చ// కలువ రేకులవంటి ఘనమైన కన్నుల
పొలతుల చూపులె నీ పుష్పయాగము
తలచి తలచి నిన్ను తమమేనుల (బొడమే
పులక జొంపములె నీ పుష్పయాగము //ప//

//చ// కరకమలములను కందువగోపికలెల్లా
పొరసి నిను( జూపుటే పుష్పయాగము
సరసపు మాటలే సారెనాడి తమనవ్వు
పొరి నీపై జల్లుటే పుష్పయాగము //ప//

//ప// గాటపు కొలనిదండ కాంతలు సిగ్గున నిన్ను
బూటకానకు( దిట్టుటే పుష్పయాగము
యీటున శ్రీవేంకటేశ యిట్టె యలమేలుమంగ
పూటవూటరతులివి పుష్పయాగము //ప//

ముఖ్యపదాల అర్ధం:
పూబోణి: అందమైన యువతి
పొలతి: స్త్రీ
మేను: శరీరము
పొడము: పుట్టు, కలుగు
జొంపము: గుబురు [ వెదురు జొంపము: వెదురు గుబురు]
కందువ: అందమైన
గాటపు: పెద్ద

భావం:
శ్రీవారు శృంగారమూర్తి.. సుగంధలేపనాలు, తరుణులు, పువ్వులు, అలంకరణలు ఆయనకు మహా ప్రీతిపాత్రమైనవి. అందుకు గుర్తుగా, ప్రతీ సంవత్సరం తిరుమలలో శ్రీవారికి పుష్పయాగము పేరిట సుగంధాలను వెదజల్లే మేలు రకపు జాతుల పువ్వులతో సేవ కన్నులపండుగ గా జరుగుతుంది.  అన్నమయ్య ఈ సంకీర్తనలో- పువ్వులాంటి తరుణులతో సరసపు ఆటలే శ్రీవారికి పుష్పయాగమని, ప్రత్యేకంగా పువ్వులతో యాగం అక్ఖర్లేదని అంటున్నారు. 

మొగ్గ పువ్వుగా మారుతున్న [పూవక పూచె - అప్పుడే యౌవ్వనప్రాయంలోకి అడుగుపెడుతున్న] సున్నితమైన యువతుల సాంగత్యము, వారి కొలువే నీకు పుష్పయాగము.  

నల్లని కలువరేకుల్లాంటి కన్నులున్న అందమైన యువతుల శృంగారపు చూపులే నీకు కలువల పుష్పయాగము.
నీవు తలపులోకి రాగానే, సిగ్గుతో వారి అందమైన శరీరాలపై మొలిచే పులకల గుబురులే నీకు పుష్పయాగము.

నిన్ను పొందిన తమకంలో, అందమైన గోపికలంతా వారి ఎర్రని తామెరల వంటి చేతుల్లో నిన్ను చూపటమే- పుష్పయాగము.
ఎన్నోమార్లు సరసపుమాటలాడుతూ, వారి నవ్వు పువ్వుల్ని నీ మీద జల్లడమే - నీకు పుష్పయాగము. 

ఆ పెద్ద కోనేటి గట్టున స్త్రీలు సిగ్గుపడుతూ, నీపై కోపము నటిస్తూ నిన్ను తిట్టుటే పుష్పయాగము [ కృష్ణుడు గోపికా స్త్రీల వస్త్రములను అపహరించినప్పుడు, వారు ఆయన చేసిన పనికి లోలోపల ఆనందపడుతూనే, బయటకు కోపము నటిస్తూ తిట్టారని కవిభావన]
 [ఇంతవరకూ చెప్పింది కృష్ణావతారం గురించి], ఇకపై ( కలియుగంలో) శ్రీవేంకటేశ్వరా! నీ భార్య అలమేలుమంగతో ప్రతీ పూటా జరిపే రతి ఆటలే నీకు పుష్పయాగము.