Total Pageviews

Friday, July 12, 2013

సంగడికి రాగదవే సరిచూచేను - యింగిత మెరుగుకుంటే నిద్దరికిగూడెను

//ప// సంగడికి రాగదవే సరిచూచేను
యింగిత మెరుగుకుంటే నిద్దరికిగూడెను

//చ// తుంమిదలు వ్రాయబోతే తొయ్యలి నీ తురుమాయ
నెమ్మిజందురు వ్రాసితే నీమోమాయనే
వుమ్మడి సంపెంగ వ్రాయనున్నతి నీ నాసికమాయ
కమ్మగలువలు వ్రాయగన్నులాను

//చ// గక్కన శంఖము వ్రాయ గన్నెరో నీగళమాయ
జక్కవల వ్రాయగా నీ చన్నులాయను
అక్కరదామరలు వ్రాయగ నీకరములాయ
నిక్కి సింహము వ్రాయగా నీ నడుమాయను

//చ// పులినము వ్రాయగాను పొలతి నీ పిరుదాయ
తెలియ నరటుల వ్రాసితే దొడలాయ
కలసితివి శ్రీవేంకటేశ్వరుడను దాను
బలుచిగురులు వ్రాయ బాదాలాయను

ముఖ్యపదార్ధం:
సంగడి= స్నేహము
ఇంగితము= గుర్తులు, జ్ఞానము
తొయ్యలి= స్త్రీ
నెమ్మి చందురు= గుండ్రని చంద్రుడు
గళము= కంఠము
జక్కవలు= జక్కవ పక్షి (The poetical swan, always described as being in pairs, to which poets liken fair breasts)
పులినము= ఇసుకదిన్నె

భావం:
అన్నమయ్య అమ్మవారితో చెప్తున్నారు. [ఈ సృష్టిలో ఉన్న అందమైన ఉపమానాలతో అమ్మవారి సౌందర్యాన్ని పోల్చి చూసి కీర్తిస్తున్నారు అన్నమయ్య.] 
అమ్మా! నీవు మదన జనకుడైన శ్రీవేంకటేశ్వరుడను కలిశావు. 
కొంచెం స్నేహంగా ఉండమ్మా నాతో..నిన్ను సరిగా చూస్తాను. కొంచెం సరైన గుర్తులతో పోల్చుకుంటే మీ ఇద్దరికీ బాగా కుదురుతుంది.   

తుమ్మెదల వలె...అని వ్రాయబోతే, అవి నీ కురులయ్యాయి.
చందురుడు అని రాసితే ...నీ ముఖమయ్యింది.
సంపెంగ అని వ్రాస్తే...అది నీ ముక్కు అయ్యింది. 
కలువలు అని రాసితే...నీ కన్నులయ్యాయి.

ఓ కన్యా! శంఖం అని వ్రాస్తే...అది నీ కంఠం అయ్యింది. 
జక్కవ పక్షులు అని రాసితే...ఎప్పుడూ జంట విడని నీ చన్నులు అయ్యాయి.
తామెరలు అని వ్రాయ...నీ చేతులయ్యాయి.
సింహం అని రాయగా...నీ సన్నని నడుమయ్యింది. 

ఇసుకదిన్నెలు అని వ్రాయగా... అవి విశాలమైన నీ పిరుదులయ్యాయి.
అరటి అని వ్రాస్తే...నీ తొడలు అయ్యాయి.
లేతచిగురులు అని వ్రాయ...నీ పాదాలయ్యాయి.


కవి భావన:
నల్లని నీ కొప్పు తుమ్మిదలు రెక్కలంత నల్లగా ఉంది. 
నీ ముద్దైన ముఖము గుండ్రని చంద్రుడు వలే కాంతివంతంగా ఉంది. 
నీ ముక్కు సంపెంగె మొగ్గ లా నిటారుగా ఉంది. {కోతేరు ముక్కు అంటాం కదా!]
నీ కన్నులు నల్లని కలువల వలే నిగనిగలాడుతూ ప్రశాంతంగా ఉన్నాయి . 

ఓ యౌవ్వనవతీ! నీ కంఠం శంఖము వలే ఉంది. 
నీ వక్షోజాలు ఎప్పుడూ జంట విడువని జక్కవ పక్షుల వలే ఉన్నాయి. 
నీ చేతులు తామెరల వలే నునుపుగా, లేతగా, ఎర్రగా ఉన్నాయి. 
నీ నడుము ఉన్నతమైన సింహము నడుము వలే సన్నగా ఉంది. 

నీ పిరుదులు ఇసుకదిన్నెలంత విశాలంగా ఉనాయి. 
నీ తొడలు లావైన అరటి బోదెల వలే బలంగా, నున్నగా ఉన్నాయి. 
నీ పాదాలు లేత చిగురుల వలే ఎర్రగా ఉన్నాయి. 
ఇటువంటి నీవు శ్రీవేంకటేశుడనే నాతో కలిశావు. మీ ఇద్దరికీ జంట బాగా కుదురుతుంది.