Total Pageviews

Wednesday, June 21, 2023

ఎక్కువకులజుడైన హీనకులజుడైన - నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||

 ప|| ఎక్కువకులజుడైన హీనకులజుడైన | 

నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు ||


చ|| వేదములు చదివియు విముఖుడై హరిభక్తి | 

యాదరించలేని సోమయాజికంటె |

యేదియునులేని కులహీనుడైనను విష్ణు | 

పాదములు సేవించు భక్తుడే ఘనుడు ||


చ|| పరమమగు వేదాంత పఠన దొరికియు సదా |

హరిభక్తిలేని సన్యాసికంటె |

సరవి మాలిన యంత్యజాతి కులజుడైన |

నరసి విష్ణు వెదుకునాతడే ఘనుడు ||


చ|| వినియు జదివియును శ్రీవిభుని దాసుడుగాక | 

తనువు వేపుచునుండు తపసికంటె |

ఎనలేని తిరువేంకటేశు ప్రసాదాన్న- | 

మనుభవించిన యాతడప్పుడే ఘనుడు ||


ముఖ్యపదార్ధం:

నిక్కము: నిజము

కులజుడు: కులమునందు పుట్టిన వాడు

విముఖుడు: ఇష్టత లేనివాడు

కులహీనుడు: క్రింది కులస్థుడు (జాత్యహంకారం ఎక్కువ ఉన్న రోజుల్లో మాట)

సోమయాజి: A sacrificer, యజ్ఞము చేసినవాడు [యజ్ఞములో సోమరసముత్రాగువాడు]

పఠన: చదువుట

సరవిమాలిన: వరుసలో చివరన ఉండుట (లేదా లెక్ఖల్లో లేని)

అంత్యజాతి: చివరి కులము

శ్రీవిభుడు: లక్ష్మీదేవి భర్త

తనువు: శరీరము

ఘనుడు: A great man. గొప్పవాడు


భావం:

అన్నమయ్య శ్రీవేంకటేశ్వరునికి పరమ భక్తుడేగాక, తన సంకీర్తనలతో ఆనాటి సాంఘిక అనమానతలను తీవ్రంగా ప్రతిఘటించాడు.

ఉన్నత కులంలో పుట్టి, సకల దుర్వ్యసనాల బారిన పడి కర్మ చండాలుడైన వాడికంటే కులహీనుడైనా, సకల సద్గుణ సంపన్నుడై, విష్ణు పాదములు సేవించువాడే ఘనుడు అని తీర్మానం చేశారు. ఈ విధంగా అన్నమయ్య ను గొప్ప సంఘ సంస్కర్త అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. 


//ప// ఎక్కువ కులంలో పుట్టినా, తక్కువ కులం లో పుట్టినా ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో, వాడే గొప్పవాడు. [కర్మచేత గాని, జన్మచేత ఎవ్వడూ గొప్పవాడు కాడని అర్ధం]


//చ// వేదాలన్నీ చదివి, యజ్ఞాలు చేసి, అరిషడ్వర్గాల బారిన పడి, హరి భక్తిలేని బ్రాహ్మణుడి కంటే.....ఏ చదువులూ లేకుండా, అబ్రాహ్మణ కులంలో పుట్టినా, పరమ భక్తి, శ్రద్ధలతో విష్ణు పాదములు ఎవడైతే  సేవిస్తాడో...వాడే గొప్పవాడు...


//చ// గొప్పవైన వేదవేదాంతములు చదువుకునే అవకాశం దొరికి కూడా, ఎప్పుడూ కనీసం హరిభక్తిలేని సన్యాసి కంటే... వరుసలో చివరన ఉండే కులములో పుట్టి, నిరంతరము విష్ణువును వెదకే వాడే గొప్పవాడు.  


//చ// శాస్త్రాలు, పురాణాలు ఎన్నో విని, చదివి కూడా విష్ణు దాసుడు కాకుండా, తపస్సు పేరుమీద శరీరాన్ని మాడ్చుకునే తాపసి కంటే... అన్నిటికన్నా ఘనమైన శ్రీవేంకటేశ్వరుని ప్రసాద మాధుర్యాన్ని భక్తితో అనుభవిస్తూ, శ్రీవారికి దగ్గరగా ఉండి, ఆయన సేవను చేసుకునే  వాడే ఘనుడు.   

ఈ సంకీర్తన మాతృ స్వరూపిణి,  శ్రీవేంకటేశ్వరుని పరమ భక్తురాలు, జీవితాన్ని మొత్తం అన్నమయ్య సంకీర్తన ప్రచారానికై వినియోగిస్తూన్న శ్రీమతి పద్మశ్రీ డా. శోభారాజు గారి గానంలో వినండి. [https://youtu.be/PnC3REthVs0]