Total Pageviews

Tuesday, July 13, 2021

బాపురే యెంతటి జాణ బాలకృష్ణుడు చూడ [Baapure Yentati Jaana Balakrishnudu cooda]

 //ప// బాపురే యెంతటి జాణ బాలకృష్ణుడు చూడ

బాపని వలె నున్నాడు బలరామకృష్ణుడు


//చ// వొంటి గోపికలచన్ను లుట్లపై కుండలంటా

అంటుచు చేతులు చాచీ నదే కృష్ణుడు

వెంటనే అధరములు వెస మోవిపండ్లంటా

గొంటరియై అడిగీని గోవిందకృష్ణుడు


//చ// సతుల పెద్దకొప్పులు చక్కిలాలగంప లంటా

బతిమాలి వేడీ నప్పటి గృష్ణుడు

చతురత బిరుదులు చక్కెరదీబలంటా

తతిగొని యంటీని దామోదరకృష్ణుడు


//చ// అంగనవొడికట్లు అరటిపండ్లంటా

సంగతి గౌగలించీ వేసాలకృష్ణుడు

అంగడి నింతులెల్లాను అలమేలుమంగ యంటా

చెంగలించి కూడీని శ్రీవేంకటకృష్ణుడు


ముఖ్యపదాల అర్ధం:

బాపురే: అయ్య బోబోయ్

జాణ: నేర్పరి

బాపడు: బ్రాహ్మణుడు

చన్నులు: స్తనములు

ఉట్లు: కుండలు వేలాడదీసే ఉట్టి

అధరములు: పెదవులు

వెస: తొందరగా

మోవి: పెదవులు

కొంటరి: కొంటెగా

చతురత: సమయస్ఫూర్తి

చక్కెరదీబలు: పంచదార దిబ్బలు

తతి: ఆసక్తితో

ఒడికట్టు: వడ్డాణము, A girdle, as part of female dress

చెంగలించు: అతిశయించుచు


భావం:


ఈ సంకీర్తన అన్నమయ్య కుమారుడైన పెదతిరుమలయ్య విరచితమ్.


ఓరి నాయనో! ఈ బాలకృష్ణుడు ఎంతటి నేర్పరి. చూడడానికి ఈ బలరామకృష్ణుడు బ్రాహ్మణుడిలా (పండితుడిలా) ఉన్నాడు.


ఈ కృష్ణుడు, గోపికల స్తనాలను ఉట్లపై ఉంచిన కుండలు అంటూ, చేతులు చాచి అంటుతున్నాడు.

వెంటనే గోపికల పెదవులను మోవిపండ్లు అంటూ.. కొంటెగా అడుగుతున్నాడు. 


ఆడువారి పెద్ద కొప్పులను చక్కిలాల గంపలు అంటూ...చక్కిలాలు ఇవ్వండి అని వేడుకుంటున్నాడు ఈ కృష్ణుడు.

ఎంతో తెలివిగా.. ఈ పంచదార దిబ్బలు అంటూ... వారి గుండ్రని పిరుదులను ఎంతో ఆసక్తిగా తాకుతున్నాడీ కృష్ణుడు...


ఈ దొంగవేషాల కృష్ణుడు..ఆడువారు నడుముకు కట్టుకునే వడ్ఢాణాన్ని... అరటిపండ్లు అంటూ గట్టిగా కౌగిలించుకుంటున్నాడు.

ద్వాపరయుగంలో ఎంతమందితో, ఎలా ఉన్నా, ఈ కలియుగంలో ఆ ఇంతులందరూ అలమేలుమంగలోనే ఉన్నారంటూ...ఆమెను ప్రేమతో కూడి వేంకటాచలముపై ఉన్నాడు, ఈ వేంకట కృష్ణుడు.