Total Pageviews

Thursday, February 27, 2014

ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము - యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె [Yemani pogadudumE ee cheli chakkadanamu]

//ప// ఏమని పొగడుదుమే యీచెలి చక్కదనము
యీమేటి యలమేల్మంగ యెక్కువైతానిలిచె

//చ// అరచంద్రుడుఁ జకోరాలద్దాలు సంపెగయు
ధర సింగిణులు శ్రీలు తలిరులును
అరుదుగాఁ దుమ్మిదలు నందముగా గూడగాను
మరుదల్లి యలమేలుమంగమోమై నిలిచె

//చ// బిసములు శంఖమును పెనుచక్రవాకము-లా
కసము నీలపుఁజేరు కరికుంభాలు
పొసగ వివెల్లా నొక పోడిమై నిలువగాను
మసలక దానలమేలుమంగ మేనై నిలిచె

//చ// అనటులంపపొదులు నబ్జములు ముత్తేలు
వొనరి వరుసఁ గూడి వుండగాను
ఘనుడైన శ్రీవేంకటేశునురముమీద
పనుపడలలమేల్మంగ పాదములై నిలిచె

ముఖ్యపదాల అర్ధం:
చక్కదనము: అందము, Prettiness, beauty
అరచంద్రుడుఁ: ప్రకాశిస్తూన్న అర్ధ చంద్రుడు (నుదురు)
చకోరాలు: చకోరపక్షివంటి కన్నులు 
అద్దాలు: నున్నని ప్రతిబింబాన్ని చూపే (చెక్కిళ్ళు)
సంపెగయు: ముక్కుకి ఉపమానం
ధర: భూమి
సింగిణులు: (సింగాణి, సింగిణీ, శింజినీ)=విల్లు (కను బొమ్మలకి ఉపమానం)
 శ్రీలు: చెవులు (శ్రీ ఆకృతిలో చెవులు)
తలిరు: పల్లవము, చిగురు A sprout, a shoot. (ఎర్రని చిగురు వంటి పెదవులు)
తుమ్మిదలు: నల్లని కురులకి ఉపమానం
మరుదల్లి: మన్మధుడి తల్లి 
బిసములు:  తామెరతూండ్లు (Fibres, film, as of the water lily) (చేతులకి ఉపమానం)
శంఖమును: కంబువు (A conch shell, a conch used as a horn) కంఠమునకు ఉపమానం
పెనుచక్రవాకములు: పెద్ద చక్రవాక పక్షులు (స్తనములకి ఉపమానం)
ఆకసము: విశాలమైన నడుము కి ఉపమానం 
నీలపుఁజేరు: నీలము+చేరు= నీలమణుల తో  చేసిన మొలత్రాడు కరికుంభాలు: ఏనుగు కుంభస్థలము (వంటి పెద్ద పిరుదులు)
పొసగను: చేకూడగా (To agree, fit)
ఇవి యెల్లా: ఇవన్నీ
నొక పోడిమై: ఒక లక్షణము (A sign or mark)
నిలువగాను: నిలబడగా
మసలక: తచ్చాడు, తిరుగు
తాను నలమేలుమంగ మేనై నిలిచె: అలమేల్మంగ శరీరమై నిలిచాయి
అనటులు: ఊతనిచ్చునవి (తొడలు కి ఉపమానం)
అంపపొదులు: అమ్ముల పొది= బాణాలు పెట్టుకును చోటు (వాడియైన గోళ్ళకి ఉపమానం అయ్యుండచ్చు)
అబ్జములు: పద్మములు (పాదాలకి ఉపమానం)
ముత్తేలు: ముత్యములు (తెల్లని గోళ్ళకి ఉపమానం)
ఒనరు: కలుగు, పొసగు 
వరుసఁ గూడి వుండగాను: వరుస గా ఉండగా 
ఉరముమీద: వక్షస్థలము మీద
పనుపడు: ఇముడు, సరిపడు 

భావం: 
ఈ సంకీర్తనలో అన్నమయ్య అలమేల్మంగ అంగాంగవర్ణన చేస్తూ, యే ఒక్క శరీరభాగాన్నీ పేరు చెప్పకుండా ఈ భూమి మీద ఉన్న అత్యంత సుందరమైన వస్తువులను మాత్రమే చెప్తూ వాటితో పోల్చుకుని ఆమె అందాన్ని మనల్నే ఊహించుకోమంటున్నారు. సన్నివేశం ప్రకారం చెలులు ఒకరితో ఒకరు అమ్మవారి అందాన్ని వర్ణించుకుంటున్నట్లుంటుంది. 

ఈ చెలియ (అలమేల్మంగ) అందాన్ని ఏమని పొగడగలమే! ఆవిడ అందం దేనితో పోల్చినా అంతకంటే ఎక్కువగానే ఉంది. 

సగం ప్రకాశిస్తూన్న తెల్లని చంద్రుడు భూమి మీదకొచ్చి నిల్చినట్టు కాంతివంతంగా ఉంది ఆమె తెల్లని ఫాలభాగం (నుదురు). ఆమె కన్నులు చకోరపక్షులంత అందంగా ఉన్నాయి. నున్నని ఆమె మెరిసే చెంపలు ప్రతిబింబాన్ని చూపే అద్దాల్లా ఉన్నాయి. ఆమె ముక్కు విచ్చుకున్న సంపెంగ పువ్వులా నిటారుగా, సొగసుగా ఉంది. ఆమె కనుబొమ్మలు మన్మధుని విల్లులా వొంగి ఉన్నాయి. ఆమె చెవులు "శ్రీ" ఆకృతిలో రమణీయంగా ఉన్నాయి. పెదవులు లేత చిగురులా ఎర్రగా ఉన్నాయి. తుమ్మెద రెక్కల్లా నల్లని అందమైన కురులు కలిగి ఉన్నది. ఇవన్నీ మన్మధుడి తల్లి ఐన శృంగారవతి అలమేలుమంగకి  ముఖముగా నిలిచాయి. (అవన్నీ కలిపితే ఆమె ముఖము అయ్యింది)

ఆమె నున్న ని పొడవాటి చేతులు తామెరతూండ్లు వలే ఉన్నాయి. మూడు గీతలతో ఆమె కంఠము శంఖము వలే ఉన్నది. పెద్దవైన ఆమె చన్నులు చక్రవాక పక్షులు రాశి పోసినట్టుగా ఉబ్బెత్తుగా ఉన్నాయి. నల్లని ఆకాశము తాడుగా మారి చుట్టినట్టుగా ఆమె విశాలమైన నడుము ఉన్నది. యేనుగు కుంభస్థలము వలే విస్తారమైన పిరుదులు కలిగి ఉంది. ఇవన్నీ చక్కగా అమరుకొని ఒకచోట కలిస్తే అది అలమేల్మంగ శరీరమై నిలిచింది.

ఆమె శరీరానికి ఊతాన్నిచ్చే తొడలు అరటిబోదెల్లా బలంగా ఉన్నాయి. ఆమె వాడి గోళ్ళు అమ్ములపొదల్లో బాణాల్లా ఉన్నాయి. ఆమె పాదములు పద్మాల్లా సుతిమెత్తగా ఉన్నాయి. ఆమె కాలిగోళ్ళు ముత్యాల్లా మెరుస్తూన్నాయి. ఇవన్నీ ఒకచోట ఒద్దికగా కలిసి ఘనుడైన శ్రీవేంకటేశ్వరుని వక్షస్థలము మీద కొలువైయున్న అలమేల్మంగ పాదాల్లా ఉన్నాయి. 

ఈ కీర్తన ఇక్కడ వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2014/02/807emani-pogadudume-yicheli-chakkadanamu.html