Total Pageviews

Sunday, August 14, 2011

సకలం హే సఖి జానామి

ప|| సకలం హే సఖి జానామి తత్ 
ప్రకట విలాసం పరమం ధధసే ||

చ|| అలిక మృగమదమయ మషీకల నో- 
జ్జ్వలతాం హే సఖి జానామి |
లలితం తవ పల్లవిత మనసి ని- 
శ్చలతర మేఘ శ్యామం ధధసే ||

చ|| చారు కపోలస్థల కరాంచిత వి- 
చారం హే సఖి జానామి |
నారాయణ మహినాయక శయనం 
శ్రీ రమణం తవ చిత్తే ధధసే ||

చ|| ఘనకుచ శైలాగ్ర స్థిత విధుమణి 
జననం హే సఖి జానామి |
కనదురసా వేంకట గిరిపతే | 
వినుత భోగసుఖ విభవం దధసే ||


ప్రతిపదార్ధం:

హే సఖి: ఓ సఖీ 
సకలం జానామి: నాకు అంతా తెలిసింది/నేను మొత్తము తెలుసుకొనుచున్నాను.
తత్: తత్పూర్వము 
ప్రకట విలాసం: నీవు వ్యక్తం చేసిన చేష్టలన్నీ  
పరమం దధసే: పరమార్ధాన్ని ధరించి ఉన్నాయి.

ఉజ్వలతాం: ప్రకాశించునట్టి
అలిక: లలాటము, నుదురు నందు The forehead. 
మషీ: నల్లని 
మృగమదమయ: మృగమద (కస్తూరీ లేపనము) మయం   
కలన:  చేయడము, కావించడము Making, effecting.
హే సఖీ జానామి: ఓ సఖీ నాకు తెలుసు
లలితం: మనోజ్ఞమైన. సుందరమైన (Beautiful, graceful, charming)
తవ: నీ యొక్క
పల్లవిత: చిగిరించిన (Sprouted)
మనసి: మనసునందు
నిశ్చలతర మేఘ శ్యామం: కదలని నీరు కలిగిన గొప్ప నల్లని రంగు కలిగిన మేఘమువంటి దేహము కలిగిన వానిని 
దధసే: ధరించావు 

చారు: అందమైన
కపోలస్థల: చెక్కిలి యందు
కరాంచిత విచారం: చేతులను ఆన్చి ఆలోచిస్తున్నట్టి
హే సఖి జానామి: ఓ సఖీ నాకు తెలుసు
నారాయణం: నారాయణుని
అహినాయక శయనం: శేష శయనుని 
శ్రీరమణం: శ్రీ రమణుని
తవ చిత్తే: నీ మనసునందు
దధసే: ధరించి ఉన్నావు

ఘనకుచ శైలాగ్ర స్థిత: ఎత్తైన కొండల్లాంటి స్తనముల చివర ఉంచబడిన  
విధుమణి జననం: చంద్రరేఖ ల యొక్క పుట్టుక
హే సఖీ! జానామి: ఓ సఖీ నాకు తెలుసు
కనదురసా: మిక్కిలి కాంతులు విరజిమ్ముతున్నటువంటి (Bright, shining) 
వేంకటగిరిపతే: -వేంకటేశ్వరుని తో/యొక్క 
వినుత: గొప్పగా పొగడబడునటువంటి
భోగసుఖ: సంభోగ సుఖముల
విభవం : సంపదలు 
దధసే: ధరించి ఉన్నావు



భావం:

ఈ సంకీర్తనం అన్నమాచార్యుల అనంత భావనా విశ్వం నుండి జాలువారిన అధ్బుత, మృదు మధుర సంస్కృత కృతి. 
    
అమ్మవారు తన ఏకాంత మందిరంలో పరధ్యానంతో/స్వామిధ్యానంతో చేసే పనులన్నింటినీ చుట్టూ ఉన్న చెలులు గమనించి ఆమెను ఆట పట్టిస్తున్నారు. అన్నమయ్యే అమ్మవారిని ఈ విధంగా స్తుతిస్తున్నాడని కూడా అనుకోవచ్చు. 

ఓ ప్రియసఖీ! నాకు అంతా తెలుసు. నీవు తత్పూర్వము ప్రకటించిన పనులన్నీ పరమార్ధాన్ని తెలియజేస్తున్నాయి.

ప్రకాశించే నుదుటి భాగమందు నల్లని కస్తూరీ తిలకాన్ని అలుముకున్నావు. అదెందుకో నాకు తెలుసు. నీ సుందరమైన చిగిరించిన నీ మనసులో నల్లని రంగు కలిగిన మేఘము వంటి దేహము కలిగిన నీ ప్రియుని ధరించావు కాబట్టి.

అందమైన నున్నని నీ చెక్కిలి పై చేతులు ఆనించుకుని ఏదో ఆలోచిస్తున్నావు. అదెందుకో నాకు తెలుసు. నీ ప్రియుడు నారాయణుడు వైకుంఠములో పాలసముద్రములో శేషుని పై అదేవిధంగా చేతిని తన చెక్కిలిపై ఆనించి పడుకుని ఉంటాడు, అటువంటి నారాయణుని, నీ మనసునందు ధరించావు కాబట్టి.

అద్భుతమైన నీ స్తన పర్వతాల చివరన మిక్కిలి తేజస్సుతో చంద్రవంక ఎందుకు జనించిందో తెలుసు. అది నీవు స్వామితో అత్యంత గొప్పగా అనుభవించిన సంభోగ సుఖాల సంపదలకు చిహ్నాలు. అవునా!...
(స్వామి విపరీతమైన కోరికతో నీ చన్నులను గట్టిగా నొక్కేడప్పటికి ఆయన గోళ్ళు అక్కడ గుచ్చుకుని అవి చంద్రవంకల్లా (crescent moon) ఏర్పడ్దాయి. ఆ చంద్రవంకలు మిక్కిలి తేజముతో ప్రకాశిస్తున్నాయి.) 
(ఇదే భావం "ఏమొకో చిగురుటధరమున" కీర్తనలో పడతి పయ్యెదలోంచి వచ్చే మిక్కిలి కాంతి యొక్క రహస్యమేమిటే చెలులూ అని అడిగినప్పుడు "ఉడుగని వేడుకతో ప్రియు - డొత్తి న నఖ శశి రేఖలు వెడలగ వేసవి కాలపు -వెన్నెల కాదు కదా" అని తమలో తాము తెలుసుకునే సన్నివేశం ఇక్కడ సరిపోతుంది.)