శ్రీమాన్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ప్రసిద్ధ కర్ణాటక మరియు లలిత సంగీత విద్వాంసులు, స్వరకర్త, 1948 నవంబర్ 9న ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) 1978 నుండి 2006 వరకు ప్రత్యేక శ్రేణి గాయకుడిగా సేవలందించారు. అన్నమాచార్య కీర్తనలను ప్రజలకు చేరవేయడంలో ఆయన విశేష కృషి చేశారు. 1000కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. వారు వాగ్గేయకారులు కూడా. ఆయన టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా, అహోబిలమఠం ఆస్థాన విద్వాంసులుగా సేవలందించారు. రాష్ట్ర, కేమ్ద్ర ప్రభుత్వాలనుండి అనేక బిరుదులు పొందారు. ఆయన స్వరపరిచిన ప్రసిద్ధ కీర్తనలు "వినరో భాగ్యము విష్ణుకథ", "జగడపు చనవుల", "వచ్చెనూ అలమేలు మంగా", "చూడరమ్మ సతులాల" "మంగాంబుధి హనుమంత’ వంటివి ఎంతో మంది శ్రీవారి భక్తుల హృదయాలను పరవశింపజేశాయి. క్లాసికల్ సంగీతంలో నైపుణ్యంతో పాటు, భక్తి భావంతో కూడిన ఆయన గానం శ్రోతలను శ్రీవారికి చాలా దగ్గర చేసింది. అన్నమాచార్య కీర్తనలను సామాన్య ప్రజలకు చేరవేయడంలో ఆయన అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. 2025 మార్చి 9న ఆయన గుండెపోటుతో తిరుపతిలోని తన నివాసంలో శీవారి పాదపద్మాలను అలంకరించారు. ఆయన లేని లోటు అన్నమయ్య కీర్తనా ప్రపంచానికి తీరని లోటు. అయితే, ఆయన చేసిన సేవలు, సంగీతం ద్వారా ఆయన సృష్టించిన భక్తి భావం ఎప్పటికీ మన హృదయాలలో నిలిచిపోతాయి.
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. నా కన్నీటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఆయన భక్తి పరవశ గాత్రం ద్వారా అన్నమయ్య కీర్తనలను వినిపించి, శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పొందిన అనుభూతిని నాకు కలిగించారు. ఆయన లేరని తెలుసుకొని నా హృదయం ద్రవిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.