శృంగార సంకీర్తన, రేకు: 14-5, సంపుటము: 5-84, రాగము: ఆహిరి
//ప// లంజకాఁడవౌదువురా
లంజకాఁడవౌదువు నీ లాగులెల్లఁ గానవచ్చె
ముంజేతఁ బెట్టిన సొమ్ములకద్దమేలరా ॥పల్లవి॥
//చ// కొంకక యెవ్వతో కాని కోరి నీబుజము మీఁద
కంకణాల చేయి వేసి కౌఁగిలించఁ బోలును
వంకలైన వొత్తులెల్ల వడిఁ గానవచ్చె నింక
బొంక నేమిటికిరా నీ బూమెలెల్లఁ గంటిమి ॥లంజ॥
//చ// ఒద్దిక నెవ్వతో గాని వోరి నీవురము మీఁద
నిద్దిరించఁ గంటమాల నీలములొత్తినది
తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో
బద్దనేఁటికిరా నేఁ బచ్చి సేయఁ జాలను ॥లంజ॥
//చ// వేడుక నెవ్వతో తిరువేంకటేశ్వర నిన్ను
కూడిన నీమేనితావి కొల్ల వట్టుకొన్నది
తోడనె నాకౌఁగిటిలో దొరకొంటి వింక నిన్ను-
నాడ నేమిటికిరా నా యలపెల్లఁ దీరెను ॥లంజ॥
ముఖ్యపదార్ధం:
లంజకాఁడు: విటుడు A whoremonger
లాగులెల్లఁ: పనులన్నీ
ముంజేతఁ: ముందు + చెయ్యి
కొంకక: భయపడకుండా/సంకోచొంచకుండా (Fear. Timidity, shyness లేకుండా)
యెవ్వతో కాని కోరి నీబుజము మీఁద
కంకణాల చేయి వేసి కౌఁగిలించఁ బోలును
వంకలైన: వంపులైన
వొత్తులెల్ల: భుజకీర్తులు
గానవచ్చె: కనిపించె
బొంకు: అబద్ధము. అసత్యము
బూమెలెల్లఁ: గంటిమి: మాయలు/వంచనలన్నీ చూశాము
ఒద్దిక నెవ్వతో: పొందికైన/అనుకూలవతియైన ఎవతో గాని
నీ వురము మీఁద: నీ వక్షస్థలము మీద
నిద్దిరించఁ: పడుకొనగా
కంటమాల నీలము: మెడ హారములోని కౌస్తుభమణి
తిద్దిన జాణవు: నేర్పరి యైన జాణకాడవు
బద్దనేఁటికిరా: అబద్ధాలెందుకురా/వేరు చేయడం ఎందుకురా
నేఁ బచ్చి సేయఁ జాలను: నేను నీ సాంగత్యాన్ని విడువలేను
వేడుక నెవ్వతో: ఎంతో సంతోషంతో ఎవతో
నిన్ను కూడిన: నీతో కలసిన
నీమేనితావి: నీ శరీరపు పరిమళము
కొల్ల వట్టుకొన్నది: చాలా పట్టుకుంది
తోడనే: వెంటనే
దొరకొంటి: లభించు, దొరకు
యలపెల్లఁ దీరెను: బడలిక అంతా తీరిపోయింది.
భావం:
అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుని కేవలం శిలలో మలచిన రూపంలో నే కాక, అనేక స్వరూపాలలో దర్శించారు. ఈ సంకీర్తనలో చెలులు శ్రీవారి కోసం ఎదురు చూస్తూ, ఆయన కనబడగానే, కోపంతో మాటలంటూ, "సరేలే, నువ్వు నేర్పరియన జాణకాడవు. చేసిన వన్నీ చేసి మాతో ఈ వేషాలెందుకు, ఎంతచేసినా నిన్ను విడిచి ఉండలేమని, వారి తన్మయ భక్తిని చాటుతున్నట్టు", ఉంటుంది. ఎన్నో అద్భుత ప్రయోగాలు ఈ భావనా శిల్పంలో ఉన్నాయి. చదివి, భావించి...తరించండి.
ప// లంజకాడ వౌతావురా, నువ్వు లంజకాడవు. నీవు చేసిన పనులన్నీ నీ వేషాలని తెలియజేస్తున్నాయి. ఐనా, ముందు చేతికి ధరించిన కంకణాన్ని చూసుకోడానికి అద్దమెందుకు...[అంటే...నువ్విలాంటివాడివని తెలిసికూడా ఇంకా ఆనవాళ్ళు ఎందుకు?, అని]
చ// సిగ్గులేనిదెవతో కానీ నీ భుజము మీద తన కంకణాల చేతిని వేసి కౌగిలించ బోయింది కాబోలు. నీ భుజాలపై వొంపులు తిరిగి ఉండే భుజకీర్తులు కింద పడి పోయి కనిపిస్తున్నాయి. ఇంకా ఈ అబద్ధాలెందుకురా, నీ వంచనలన్నీ చూస్తున్నాము.
చ// పొందికైనది ఎవతో నీ వక్షస్థలముపై పడుకుని ఉంటుంది. అదిగో, నీ కంఠ హారములోని కౌస్తుభ మణి లోపలకి పోయింది. బాగా నేర్పరియైన జాణకాడవు కాబట్టి, ఎవరెవరితోనో తిరిగి తిరిగి మాతో ఈ అబద్ధాలు, ఆటలెందుకురా.. నేను నీ సాంగత్యాన్ని విడువలేను.
చ// తిరువేంకటేశ్వరా! వేరే ఎవతో ఎంతో సంతోషంతో నీతో సంగమించి నీ శరీరపు చెమట గంధాన్ని చాలా పట్టుకుంది. వెంటనే నిన్ను నాకౌఁగిటిలో దొరక పుచ్చుకున్నాను. ఇంక నిన్ను వదిలిపెట్టను. నా అలసట అంతా తీరిపోయింది.