Total Pageviews

Saturday, October 4, 2014

ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు - ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము [Atade brahmanyadaivamu aadimulamainavadu]

//ప// ఆతఁడే బ్రహ్మణ్య దైవ మాదిమూలమైనవాఁడు
ఆతని మానుటలెల్లా నవిధి పూర్వకము

//చ// యెవ్వని పేరఁ బిలుతురిలఁ బుట్టిన జీవుల
నవ్వుచు మాస నక్షత్ర మాసములను
అవ్వల నెవ్వని కేశవాది నామములే
రవ్వగా నాచమనాలు రచియింతురు.

//చ// అచ్చ మేదేవుని నారాయణనామమే గతి
చచ్చేటి వారికి సన్యాసము వారికి
ఇచ్చ నెవ్వరిఁదలఁచి యిత్తురు పితాళ్ళకు
ముచ్చట నెవ్వనినామములనే సంకల్పము.

//చ// నారదుఁడుదలచేటినామ మది యెవ్వనిది
గౌరినుడుగేటినామకధ యేడది
తారకమై బ్రహ్మరుద్రతతి కెవ్వరినామము
యీరీతి శ్రీవేంకటాద్రి నెవ్వఁడిచ్చీ వరము.

ముఖ్యపదార్ధం:
బ్రహ్మణ్యదైవము: బ్రహ్మజ్ఞానము కలిగిన వారలకు దైవము
ఆదిమూలమైనవాడు: ఈ సృష్టి మూలానికే మూలమైనవాడు
అవిధిపూర్వకము: చేయదగిన పనిగా చెప్పనిది
ఇల: భూమిపై
మాస, నక్షత్ర: పన్నెండు మాసాలు, ఇరవైయ్యేడు నక్షత్రాలు
అవ్వల: ఆవల= తరువాత
కేశవాది: ఆచమనం చేసే విధానంలో వచ్చే కేశవ, నారాయణ, మాధవ మొదలగు నామాలు  
అచ్చమేదేవుని: అచ్చము+యే దేవుని= నిర్మలమైన (Purely, without any mixture) ఏ దేవుని
ఇచ్చ: కోరిక
పితాళ్ళకు: మరణించిన పితృదేవతలకి 
గౌరినుడుగేటి: పార్వతీదేవి అడిగిన
ఏడది: ఎక్కడిది/ఎవనిది?
తారకము: నక్షత్రము వలే స్వయం ప్రకాశితమైన
బ్రహ్మరుద్ర తతికి: బ్రహ్మ, శివుడు మొదలైన గేవతా సమూహమునకు
యీరీతిన: యీ విధంగా

భావం:
అన్నమయ్య వైష్ణవతత్వాన్ని అత్యంత మనోహంగా ప్రచారం చేశారు. విష్ణుభక్తి ని ప్రజల్లో వ్యాప్తి పరచడానికి ఆయన ఎన్నుకున్న విధానం "సంకీర్తన".. ఈ సంకీర్తనల్లో  మనం నిత్యం చేసే పనుల్లో విష్ణువు యొక్క నామాలు ఎంతగా పెనవేసుకుపోయాయో గుర్తు చేస్తున్నారు. ఈ సకల చరాచర సృష్టికీ విష్ణువే ఆది మూలమని, బ్రహ్మరుద్రులకు సైతం ఆయన వరములిచ్చే అభయప్రదాత అని కొనియాడుతున్నారు.

ఆతడే (శ్రీవేంకటేశ్వరుడే) బ్రహ్మజ్ఞానం కలిగిన మహనీయులందరికీ దైవము. ఆతడే ఈ సృష్టికి పూర్వము నుంచీ ఉన్న అనాది దైవము. అతన్ని పూజించకపోవడం అనేది వైదీక ధర్మం చెప్పిన నియమానికి విరుద్ధంగా చేసే పని. (ఈ సృష్టిలో భాగమైన మనం --ఈ సృష్టిని ప్రసాదించిన ఆ దేవదేవుని పూజించకపోవడం కృతజ్ఞతను చూపించకపోవడమే అంటున్నారు అన్నమయ్య).

ఈ భూమి మీద పుట్టిన యే జీవినైనా ఎవ్వని పేరుతో పిలుస్తారు? చైత్ర, శ్రావణ, వైశాఖ అంటూ మాస నామముల చేత.. అశ్వినీ, రోహిణీ, హస్త అంటూ నక్షత్ర నామములచేత.. శ్రీధర, పద్మనాభ అంటూ విష్ణునామముల చేత పిలుస్తారు. (ఈ లోకంలో పేరు మూడు రకాలుగా ఉంటుంది. ౧) మాస నామం, ౨) నక్షత్ర నామం, ౩) దైవ నామం. ప్రతీ మనిషికీ ఖత్త్చితంగా ఈ మూడూ నామాలూ పేరులో రావాలి. ఇప్పుడు ఎవరూ పాటించట్లేదు ఈ నియమాన్ని) ఈ మాసాలు, నక్షత్రాలు, పేర్లు ఎక్కడ నుండి వచ్చాయి? అవన్నీ ఎవర్ని సూచిస్తూంటాయి? ఈ సృష్టికర్తయైన విశ్వేశ్వరుణ్ణే.. శరీరాన్ని శుద్ధి చేసుకోడానికి యే పూజకైనా ముందుగా శుద్ధమైన జలాన్ని చేతిలో పోసుకుని ఆచమనం చేస్తారు. అప్పుడు చదివే నామాలెవరివి? కేశవాయస్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయస్వాహా అని కదూ... అలా, ఆ విష్ణు నామాలు చెప్పిన తర్వాతే ఆచమానాదులు చేస్తారు. అంతటి దైవాన్ని పూజించకపోవడం శాస్త్రవిరుద్ధంగా చేసే పని.

ప్రాణం వదులుతూన్న సమయంలో గానీ, సన్యాసము తీసుకున్న వారికి గానీ, నిర్మలమైన నారాయణ నామమే గతి. పుణ్యలోకాలు పొందడానికి నారాయణ నామమే గతి.. మరణించిన పితృదేవతలకి పిండప్రదానం చేసేడప్పుడు యే కోరికలతో తర్పణం వదులుతారు వారి పుత్రులు?. (తమ పితృదేవతలకి పుణ్యలోకాలు ప్రాప్తించాలని మనసులో కోరుకుంటూ పిండప్రదానాలు చేస్తారు. పుణ్యలోకాలంటే శ్రీ మహావిష్ణువు లోకమే కదా. ఈ పిండప్రదానం చేసేడప్పుడు సంకల్పములో విష్ణువు పేరునే కదా ఉచ్చరిస్తారు)....

నారదుడు నిరంతరము మనస్సులో తలచేటి నామమెవ్వరిదీ? పార్వతీ దేవి చెప్పమని శివుణ్ణి అడిగిన నామ కధ ఎవ్వరిది? (విష్ణుసహస్రంలో "కేనోపాయేన లఘునా విష్నోర్నామ సహస్రకం -పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామ్యహం ప్రభో" అని శివుని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు శివుడు "శ్రీరామరామరామేతి--అంటూ తారకమంత్రం ఉపదేశించన విషయం మనందరికీ తెలుసు).  బ్రహ్మరుద్రాది దేవతాసమూహం నిరంతరం జపించే నామమేది? అదే శ్రీవేంకటేశ్వరుని నామము. ఆయనే వేంకటాద్రి రాముడు, వేంకటాద్రి బాలకృష్ణుడు. ఆయనే శ్రీవేంకటాద్రి పైనుండి వరములిచ్చుచున్నాడు.. 

ఈ కీర్తన శ్రావణ్కుమార్ బ్లాగ్ నందు వినండి.
http://annamacharya-lyrics.blogspot.com.au/2007/06/225atade-brahmanyadaivamu.html

1 comment:

  1. అన్నమయ్య కీర్తనలు అనేవి కేవలం స్వామిని కొలిచే సాధనగా చూడలేము, ఆయన కీర్తనల్లో ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పించే పాఠాలు కూడా ఉంటాయి. సంతోషం సుఖం ఫన్ ఎంజాయ్ ఏదైనా అనండి అన్ని మనిషికి క్షణకాలం ఉండేవి. కానీ శాశ్వతమైన ఆనందం ఆ భగవంతుడే ఇవ్వాలి. ఆయన ఎలా ఇస్తాడు అంటే, సంకీర్తనలో మునిగిన మనసుకి కలిగే భావనే ఆనందం. అది భగవంతుని ప్రాప్తి. అంతటి ఆనందాన్ని ఇచ్చిన అన్నమయ్యకు వందనం పాదాభివందనం. అన్నమాచార్య కీర్తనలు అంటే ఇష్టం కాదు పిచ్చి, ప్రాణం. ఎందుకంటే ఆ వేంకటేశ్వర స్వామీ కొలిచేందుకు ఆయన్ని చేరుకునేందుకు ఏకైక మార్గం సంకీర్తనలె. నారాయణ నారాయణ నమో.

    Mallesh

    Hyderabad

    ReplyDelete