Total Pageviews

Saturday, May 4, 2013

తరుణి జవ్వనపుదపము సేయగను-వరుసతోడ జాతివైరములుడిగె


//ప// తరుణి జవ్వనపుదపము సేయగను
 వరుసతోడ జాతివైరములుడిగె //ప//

//చ// జక్కవపులుగులు జంటవాయవివె
 గక్కన వెన్నెలగాసినను
 యెక్కడగోవిలయెలుగులు చెదరవు
 గుక్కక వానలు గురిసినను //ప//

//చ// గుంపుదుమ్మెదలు గొబ్బున బెదరవు
 సంపెగతావులు చల్లినను
 ముంపున జకోరములు వసివాడవు
 సొంపుగళలు పెనుసూర్యుడుండగను       //ప//

//చ// చిలుకలు సందడిసేసిన దొలగవు
 కలసినసమరతి కయ్యమున
 యెలమిని శ్రీవేంకటేశుడు గూడగ
 చెలియంగములని చెప్పగ బొసగె //ప//

ముఖ్యపదార్ధం:
తరుణి: స్త్రీ
జవ్వనపుదపము: యౌవ్వనము అనే తపస్సు
జక్కవ: జంటగా 
పులుగులు: గుడ్లగూబలు
జంటవాయవివె: జంటను విడువవు
గక్కన: శీఘ్రముగా
గోవిలయెలుగులు: కోయిల గొంతులు
గుక్కక: ఎడతెరిపిలేకుండా/ఆపకుండా/ఏకబిగిన
గొబ్బున: వేగముగా
వసివాడవు: కాంతి హీనముగా కావు
కయ్యమున: జగడమున
గూడగ: కలువగా
బొసగె: ఇముడు, సరిపడు

భావం: ఈ సంకీర్తనలో యౌవ్వనము అనునది ఒక తపస్సుగా వర్ణింపబడినది. తపస్సు చేయుచోట సకల జీవజాతులూ భయములేకుండా స్వేచ్చగా జీవితమును గడుపుతాయి..అదేవిధంగా శ్రీవేంకటేశుడు, అలమేల్మంగల కలిసే శృంగారసమయంలో పక్షులు ఏ మాత్రం బెదరకుండా అవి వాటి లక్షణాలను సైతం మరచి పరవసిస్తున్నాయని చాలా గొప్ప భావాన్ని అన్నమయ్య పలికించారు.

అలమేల్మంగ,  శ్రీవేంకటేశ్వరులు యవ్వనము అనే తపస్సు చేస్తూన్నప్పుడు చిలుకలు, పక్షులు వాటికి మనుష్యులతో ఉండే శత్రుత్వాన్ని విడిచి నిర్భీతిగా సంచరిస్తున్నాయి. (జాతి వైరము అంటే, మనుష్యుల వల్ల వాటికి ఎప్పుడూ అపకారమే జరుగుతుంది, కాబట్టి పక్షులు, జంతువులు మనుష్యులని శత్రువులుగానే చూస్తాయని అర్ధం...ఆ వైరాన్ని, భయాన్ని మరిచి స్త్రీ చేసే యౌవ్వన తపస్సును దగ్గరనుంచీ చూస్తున్నాయన్నమాట)..

తెల్లని వెన్నెల కాస్తూన్నా, గుడ్లగూబలు శ్రీవేంకటేశ్వరుని, అలమేల్మంగల జంటను వీడటంలేదు. (గుడ్లగూబలు వెన్నెల లో ఆహారాన్ని వెతుక్కుంటూంటాయి. శ్రీవారు తన ప్రియురాలి వక్షోజాల జంటమీద ఒత్తినప్పుడు ఆయన చేతివేళ్ళు గుచ్చుకుని అర్ధచంద్రాకృతిలో గుర్తులు ఏర్పడి, అవి ఆమె పమిటలోనుంచి వెన్నెలలు వెలువరిస్తుంటే ఆ వెన్నెలలు చూసి కూడా గుడ్లగూబలు ఆహారంకోసం వెళ్ళడంలేదని ఊహ...). వసంతకాలంలో పరవశంతో పాడే కోయిలలు వీరిద్దరి రతి వల్ల పుట్టిన చెమట వర్షంలా కురుస్తున్నా, కాలాన్ని మరచి (వసంతకాలంలో వర్షాలు కురవవు కదా!)  పాటలు పాడుతూ వారి శృంగారానికి మరింత చక్కటి వాతావరణాన్ని కల్పిస్తూ సహకరిస్తున్నాయి..

వారిద్దరి రతి సమయంలో వేడి నిట్టూర్పుల సవ్వడికి తుమ్మెదల గుంపు కొంచెం కూడా బెదరట్లేదు... (అమ్మవారి ముక్కు సంపంగె పువ్వు..కానీ, అటువంటి సంపంగె వేడి నిట్టూర్పులని విడచినా తుమ్మెదలు కొంచెం కూడా బెదరట్లేదని కవి భావన)..శ్రీవారి కాంతి వేయి సూర్యుల వెలుగు. కానీ, అంత వేడిమిని తట్టుకుంటూ కూడా చకోరపక్షులు కాంతివంతంగా ఉన్నాయి. (చకోరపక్షులు  వర్షంకోసం ఆశగా ఎదురుచూస్తుంటాయి, ఎండను ఎక్కువ భరించలేవు, కానీ పెద్ద సూర్యుడు లా వెలిగిపోతున్న శ్రీవారిని చూసి అవి తమ తాపాన్ని మరచిపోయాయి, అని కవి ఊహ)

సమరతి అంటే (పద్మినీ జాతి స్త్రీ, అశ్వజాతి పురుషుల కలయిక).. అటువంటి నాయికానాయకుల కలయిక చాలా గొప్పగా ఉంటుంది. ఒకరి మీద ఒకరు రతిలో ఆధిక్యతను పొందాలని చూసే జంట అది.  ఇద్దరి మధ్యా అది ఒక యుద్దము లాంటిదే, ఇద్దరూ గెలవాలని పట్టుదలతో ఉండేదే..కానీ, అటువంటి సమయములో ఎంత నిట్టూర్పులు విడచినా, తియ్యని అరుపులు అరిచినా, చిలుకలు బెదరకుండా అక్కడే కూర్చుని అవి కూడా ఆ రతి ధ్వనులనే అనుకరిస్తున్నాయి.. ప్రేమతో శ్రీవేంకటేశుడు చెలిని కలుస్తున్నప్పుడు చిలుకలు ఆమె అంగాంగ వర్ణనను చేస్తున్నట్టుండెను, అని కవి భావన..

గమనిక: ఈ కీర్తన ని ఊహించడానికి నాకు చాలా సమయం పట్టింది. అన్నమయ్య ఏం చెప్పాలనుకున్నారో అని చాలా ఆలోచించాను...ఆ వేంకటేశ్వరుని కృపతో సరిగానే ఊహించానని అనుకుంటున్నాను...ఇది శృంగారకీర్తన అనిపించినా చాలా తత్వం దాగి ఉంది. విజ్ఞులెవరైనా ఆధ్యాత్మిక కోణంలోంచి వివరించగలిగితే ధన్యుడను..ఎంతో పరిపక్వత చెందిన వారు మాత్రమే ఈ కీర్తనలో ఆధ్యాత్మికను చూడగలరు.. 

No comments:

Post a Comment