Total Pageviews

Monday, February 28, 2011

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ

చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి

శ్రీమహాలక్ష్మియట సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపుకళలకేమరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి


కలశాబ్ధి కూతురట గంభీరలకే మరుదు
తలపలోక మాతయట దయ మరి ఏమరుదు
జలజనివాసినియట చల్లదనమేమరుదు
కొలదిమీర ఈ చూడి కుడుత నాంచారి

అమరవందితయట అట్టీ మహిమ ఏమరుదు
అమృతము చుట్టమట ఆనందాలకేమరుదు
తమితో శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె
కొమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి

ముఖ్యపదాల అర్ధాలు:

సతులాల: పడతులారా, మంచి గుణములున్న స్త్రీలారా
చూడరమ్మ: చూడండి
సోబాన: మంగళప్రదముగా
పాడరమ్మ: పాడండి
కూడుకున్నది పతి: భర్తతో కూడుకుని ఉన్నది (భర్తతో కలసి ఉన్నది)
చూడికుడుత నాంచారి: గోదాదేవి (తమిళంలో లక్ష్మీ దేవి రూపమైన గోదాదేవిని చూడికుడుత్త నాచ్చియార్ అంటారుట). ఈ చూడికుడుత్త నాచ్చియార్ ను కృష్ణదేవరాయలు సంస్కృతీకరించి "ఆముక్తమాల్యద" అనే కావ్యాన్ని రచించారుట.

శ్రీమహాలక్ష్మియట : ఆమె శ్రీమహాలక్ష్మి, సకల సంపదలకు పుట్టిల్లు
సింగారాలకే మరుదు: సింగారాలకు + ఏమి+అరుదు = సింగారాలకు (సంపదలకు) ఏం లోటు?
కాముని తల్లియట: మన్మధునికి తల్లి
చక్కదనాలకే మరుదు: అందాలకేం లోటు?
సోముని తోబుట్టువట: చంద్రునికి చెల్లెలు
సొంపుకళలకేమరుదు: అందమైన కళలకు ఏం లోటు?
కోమలాంగి: కోమలమైన అంగములు కలది
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

కలశాబ్ధి కూతురట: సముద్రుడి కూతురు
గంభీరలకే మరుదు: గంభీరానికి ఏం లోటు (సముద్రమంత గాంభీర్యంగా ఉంటుందన్నమాట)
తలప: తలచగా
లోక మాతయట: ఈ లోకానికే తల్లి
దయ మరి ఏమరుదు: దయకు ఏం లోటు?
జలజనివాసినియట: పద్మము నందు నివసించునది
చల్లదనమేమరుదు: చల్లదనానికేం లోటు?
కొలదిమీర: పరిమితమైన లేనంతగా
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

అమరవందితయట: అమరులచే వందనములు స్వీకరింపబెడెడిది (దేవతలచే స్తుతింపబడెడిది)
అట్టీ మహిమ ఏమరుదు: మహిమలకెం లోటు
అమృతము చుట్టమట: అమృతానికి చుట్టము
ఆనందాలకేమరుదు: ఆనందాలకేం లోటు?
తమితో: కోరికతో
శ్రీవేంకటేశు తానె వచ్చి పెండ్లాడె: వేంకటేశుడు తావె వచ్చి పెళ్ళిచేసుకున్నాడు
కొమెర వయస్సు: యౌవ్వనవతి
ఈ చూడి కుడుత నాంచారి: ఈ గోదాదేవి

భావం:
అన్నమయ్య ఈ సంకీర్తనలో అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు.

ఓ పడతులారా! గోదాదేవి శ్రీనివాసునితో కలసి ఉంది. చూడండి. శుభప్రదమైన మంగళ గీతికలు పాడండి.
ఆవిడ లక్ష్మి. సకల సంపదలకు పుట్టిల్లు. ఆవిడకు సింగారాలకేం తక్కువ?. ఈ లక్ష్మి రుక్మిణీదేవిగా అవతరించినప్పుడు, మన్మధుడు ప్రద్యుమ్నుడు అను పేరుతో ఆవిడ గర్భాన ఉదయించాడు. అంతటి అందగాడైన మన్మధుడికి తల్లి ఆవిడ. ఆమెకు అందచందాలకు లోటేమిటి? పాల సముద్ర మధనంలో ముందుగా చంద్రుడు, తరువాత లక్ష్మి పుట్టారు. అటువంటి పదహారు కళలున్న చంద్రుడికి సాక్షాత్తూ చెల్లెలు ఈమె. ఈమెకు కళలకు లోటేమిటి? ఈ గోదాదేవి అత్యంత సున్నితమైనది. కోమలాంగి.  

ఈమె పాలసముద్రుడి కూతురు. గంభీరాలకు లోటేమిటి? (సముద్రం గాంభీర్యానికి చిహ్నం కదా!). ఈవిడ ఈ లోకానికే తల్లి. ఈ తల్లి దయకు లోటేమిటి? ఈమె పద్మంలో నివశిస్తుంది. పద్మం ఎల్లపుడూ చల్లని నీటిలో ఉంటుంది. అటువంటి పద్మంలో ఉందే ఈవిడకు చల్లదనానికి లోటేముంది?. అపరిమితమైన గుణ సంపద కలిగినది ఈ గోదాదేవి.

నిరంతరం దేవతలచే స్తుతింపబడేది. అటువంటి ఈమె మహిమలకి ఏం లోటు?. (ఈమె మహిమలు ఏమని చెప్పగలం?). ఈమె సకల ఆనందాలకూ నిలయమైన, మృత్యువును దరిచేరనివ్వని అమృతానికి చుట్టం. (అమృతం కూడా పాల సముద్రం నుండి పుట్టిందికదా! అందుకని ఈవిడకి చుట్టం అన్నమాట). అటువంటి ఈమెకు ఆనందాలకు లోటేమిటి?. యౌవ్వనవతి ఐన గోదాదేవిని కోరికతో శ్రీ వేంకటేశుడు తనంతట తాను వచ్చి పెండ్లాడాడు. 
ఈ కీర్తన శ్రావణ్ కుమార్ బ్లాగునందు వినండి.
http://www.esnips.com/doc/478fd782-3e07-4afb-a4f5-cfeb0606493f/Chudaramma-Satulaara-BKP

No comments:

Post a Comment