Total Pageviews

Tuesday, February 22, 2011

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా

ఫాల నేత్రానల ప్రబల విద్యుల్లతా -
కేళీ విహార లక్ష్మీ నారసింహా

ప్రళయ మారుత ఘోర భస్త్రికా పూత్కార
లలిత నిశ్వాస డోలా రచనయా
కులశైల కుంభినీ కుముద హిత రవిగగన
చలన విధి నిపుణ నిశ్చల నారసింహా

వివర ఘన వదన దుర్విధ హసన నిష్ఠ్యూత -
లవ దివ్య పరుష లాలా ఘటనయా
వివిధ జంతువ్రాత భువన మగ్నీకరణ
నవనవ ప్రియ గుణార్ణవ నారసింహా

దారుణోజ్జ్వల ధగద్ధగిత దంష్ట్రానల వి
కార స్ఫులింగ సంగ క్రీడయా
వైర దానవ ఘోర వంశ భస్మీకరణ -
కారణ ప్రకట వేంకట నారసింహా

అర్ధం:
ఫాలనేత్ర: నుదుటనున్న కన్ను
అనల : అగ్ని
ప్రబల: మిక్కిలి బలము గల, వర్ధిల్లు, అతిశయిల్లు,
విద్యుల్లత: ప్రకాశవంతమైన మెరుపులు
కేళీవిహార: తిరుగుతూ ఆడుట
నారసింహా: తల భాగము సింహము, మిగిలిన భాగము మనుష్య శరీరము కలవాడు

ఘోర ప్రళయ మారుత: ఘోర ప్రళయకాలపు గాలి
భస్తి: అగ్ని??(గభస్తి అంటే సూర్యకిరణము)
పూత్కార: బుసలు కొట్టుట ( Hissing, snorting, snoring, deep breathing)
నిశ్వాస: ముక్కుద్వారా గాలిని విడుచుట, నిట్టూర్పు
డోలా రచనయా: ఊయల వలె ఊగుట
కులశైల: పురాణాలలో ఏడు కులపర్వతాలు ఉన్నాయని చెప్పబడింది. అవి: ఉదయ, అస్త, హిమ, వింధ్య, మేరు, త్రికూట, లోకాలోక పర్వతాలు
కుంభినీ: భూమి
కుముద హిత: చంద్రుడు
రవి: సూర్యుడు
గగన:ఆకాశము
చలన విధి నిపుణ: కదిలించుటలో నిపుణుడు
నిశ్చల నారసింహా: నిశ్చలుడైన నరశింహుడు

వివర : తెరచుట
ఘన వదన: దొప్పదైన ముఖము/ సన్నివేశాన్ని బట్టి ఇక్కడ భయంకరమైన ముఖము అని చెప్పుకోవచ్చు
దుర్విధ: దుస్ + విధ = చెడ్డపనులు చేసే వారు (దుర్మార్గులు)
హసన: నవ్వడం (ఇక్కడ సందర్భానికి తగినట్టైతే అట్టహాసం చేయుట)
నిష్ఠ్యూత : వేయుట
లవ : లవము అంటే కొంచెం, లవలవము అంటే పగిలిన
దివ్య: దివ్యమైన
పరుష: కఠినమైనది
లాలా: లాలాజలము, ఉమ్మి
ఘటనయా: ఘటనా సమర్ధుడు
వివిధ జంతువ్రాత: వివిధ జంతువుల సమూహాలతో నున్న
భువన: భూమి

మగ్నీకరణ: మండించుట, నాశనం చేయుట,
నవనవ: కొత్త కొత్త
ప్రియ గుణార్ణవ: ప్రియమైన/మంచివైన గుణములుకు సముధ్రం వంటివాడు

దారుణోజ్జ్వల: దారుణ+ఉజ్వల: దారుణంగా వెలుగునది
ధగద్ధగిత: ధగ ధగా మెరిసేది
దంష్ట్రా: కోరలు (భయంకర మైన కోరలు)
అనల: అగ్ని
వికార = వికృతమైన
స్ఫులింగ సంగ క్రీడ = కోరలు ఒకదానితో ఒకటి రాసుకున్నప్పుడు వాటి మధ్య పుట్టే నిప్పురవ్వలు స్నేహం చేసుకోవడం
వైరి: శత్రువు
ఘోర దానవ వంశ: ఘోర రాక్షశ వంశ
భస్మీకరణ : భస్మీకరించుట
కారణ ప్రకట: ప్రకటితమైన, తెలియజెప్పే
వేంకట నారసింహా: వేంకట నరశింహుడు

భావం:
ఈ సంకీర్తన అన్నమయ్య రచించిన సంస్కృత సంకీర్తనల్లో అత్యంత గొప్పదైనది గా చెప్పుకోచ్చు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగులగొట్టినపుడు, దైత్య సంహారం కోసం కంభము చీల్చుకుని, ఉగ్రరూపంతో, సూర్యచంద్రులు కన్నులుగా భయంకరమైన అగ్నిజ్వాలలతో, బయటికి వచ్చిన నరసింహస్వామి భయంకరమైన వర్ణన అన్నమయ్య మన కంటితో చూడగలిగేంత అధ్బుతంగా వర్ణించాడు.  

లక్ష్మీ నారసింహా! నుదుటిపైనున్న కంటి నుండి వెలువడే భీకరమైన అగ్నిజ్వాలలు క్షణ క్షణానికీ వృద్ధి చెందుతూ, మెరుపులను కురిపిస్తూ ఆటలాడుకొనే వాడివి.

నారసింహా! నీవు మృదువుగా నిట్టుర్చినా ఆ నిట్టూర్పులో ప్రళయ కాలంలో సంభవించే గాలి ఎంత తీవ్రంగా ఉంటుందో అంత భీభత్సమైన గాలి ఉంది. నిప్పులు రాజేయడానికి అవసరమైన బుస ఉంది. నీ నిట్టూర్పు ఉయ్యాలలా మారి ఏడుకుల పర్వతాలను, భూమిని, చంద్రుడిని, సూర్యుడిని, ఆకాశాన్ని ఒక ఊపు ఊపుతోంది. నువ్వు మాత్రం నిశ్చలంగా ఉన్నావు.

నారసింహా! నీ భయంకరమైన, గొప్పదైన నోటిని తెరిచావు. దుర్మార్గులను చూసి వికటాట్టహాసం చేస్తున్నావు. నీవు వేసిన ఉమ్మి (లాలాజలం) దివ్యమైనది. అత్యంత కఠినమైనది. ఆ ఉమ్మితో వివిధ రకాలైన జీవ సమూహాలు ఉన్న లోకాలను నాశనం చేయగల సమర్ధుడివి. నువ్వు ఎప్పటికప్పుడు కొత్త కొత్త గుణాలకు సముద్రం వంటివాడివి.

నారసింహా! నీ కోర పళ్ళు దారుణంగా, భయంకరంగా, ధగధగలాడుతూ మెరుపులు కురిపిస్తూ, ప్రకాశిస్తున్నాయి. వికృతమైన శత్రువులైన భయంకర రాక్షస వంశాలను భస్మం చేయటం కోసం పటాపటలాడుతూ ఒరుసుకుంటున్న నీ పళ్ళ మధ్య నిప్పురవ్వల స్నేహం చేస్తున్నాయి. వేంకటేశ్వరా ! ఆ వేంకటాద్రిపైన ఉన్న ఆ నరసింహుడివి నీవే. వేంకటనారశింహా!!!వేంకటనారశింహా!!!

Friday, February 18, 2011

కోరిన కోరికలెల్ల

కోరిన కోరికలెల్ల కొమ్మయందే కలిగీని
చేరి కామయజ్ఞ మిట్టే సేయవయ్యా నీవు

సుదతిమోవి తేనెలు సోమపానము నీకు
పొదుపైన తమ్ములము పురోడాశము
మదన పరిభాషలు మంచి వేద మంత్రములు
అదె కామయజ్ఞము సేయవయ్యా నీవు

కలికి పయ్యద నీకు కప్పిన కృష్ణాజినము
నలువైన గుబ్బలు కనక పాత్రలు
కలసేటి సరసాలు కర్మ తంత్ర విభవాలు
చెలగి కామయజ్ఞము సేయవయ్యా నీవు

కామిని కాగిలి నీకు ఘనమైన యాగశాల
ఆముకొన్న చెమటలే యవబృథము
యీమేరనే శ్రీవేంకటేశ నన్ను నేలితి
చేముంచి కామ యజ్ఞము సేయవయ్యా నీవు

అర్ధం:
కొమ్మ: స్త్రీ
సుదతి: స్త్రీ
మోవి: పెదవి, అధరము
సోమపానము: విప్పతీగె రసము త్రాగుట (drinking the juice of the Asclepias)
తమ్ములము: తాంబూలము
పురోడాశము: యజ్ఞార్ధమైన అపూపము (యజ్ఞం నందు వండబడిన అప్పాలు వంటివి)
మదన పరిభాషలు: సరసమైన మాటలు
కామయజ్ఞము: స్త్రీ పురుషులు కలసి ఒక జీవికి ప్రాణంపోసే పరమ పవిత్రమైన యజ్ఞము
కలికి: అందమైన
పయ్యెద: వక్షస్థలమును కప్పు వస్త్రము 
కృష్ణాజినము: జింక చర్మము
నలువైన గుబ్బలు: అందమైన చనుమొనలు
కనకపాత్రలు: బంగారు పళ్ళెములు
కలసేటి సరసాలు: ఒకటయ్యే ఆటలు
కర్మ తంత్ర: యజ్ఞమునందు చేయవలసిన క్రియ
విభవాలు: సంపదలు
కామిని: కోరికతో నున్న స్త్రీ
కాగిని: కౌగిలి
యాగశాల: యాగము చేయు స్థలము
ఆముకున్న: అలముకున్న?
చెమటలు: శరీరము విడుచు నీరు
అవబృథము: యజ్ఞము చేయువారు చేయు చివరిరోజు స్నానము

భావం:
ఈ కీర్తన అన్నమయ్య శృంగార భక్తికి తార్కాణం. ఈ సృష్టికి మూలం స్త్రీ పురుషుల కలయిక. మన పూర్వీకులు ఈ ధర్మబద్ధమైన కలయికను పరమ పవిత్రమైన యజ్ఞంగా భావించేవారు. అందుకేనేమో మన పూర్వీకులు సౌశీల్యులు. నవరసాల్లో శృంగారానికి అత్యంత ప్రాధాన్యాన్నిచ్చారు. అన్నమయ్య అలమేలు మంగ, శ్రీనివాసులు సరససల్లాపాలను ఒక యజ్ఞంతో పోల్చుతూ ఈ కీర్తనలో వర్ణిస్తున్నారు. యజ్ఞం లో చేసే పనులకు కామయజ్ఞం లో చేసే పనులతో పోలికను చూపిస్తున్నారు.
ఆమెయందు కలిగిన కోరికలతో కామయజ్ఞం చేయవయ్యా నీవు!. తేనెలూరు ఆమె పెదవులు సోమపానము నీకు, (యజ్ఞం చేసేవారు విప్పరసము తాగుతారు. అది సారా కాదు. అప్పటుకప్పుడు తీసిన రసము శ్రేష్టమని చెప్పబడుచున్నది. ఈ రసమును పులియబెట్టినచో విప్పసారా గా రూపాంతరము చెందును). ఆమె నీ పక్కన కూర్చుని నీకందించే తాంబూలము పురోడాశము (యజ్ఞం నందు వండే అప్పాలవంటివి). మీ ఇద్దరి మధ్య జరిగే శృంగారభరితమైన మాటలు యజ్ఞంలో చదివే వేదమంత్రాల వంటివి. తన పయ్యెద (పైట) యజ్ఞం లో నీ మీద కప్పిన జింక చర్మము వంటిది. ఆమె యొక్క అందమైన చనుమొనలు యజ్ఞం నందలి బంగారు పాత్రల వంటివి. నీవు ఆమె తో కలిసే క్రియలు యజ్ఞం నందలి తంత్ర క్రియ మరియు సంపదల వంటివి. కామిని కౌగిలి నీకు గొప్పదైన యాగశాల. మీ ఇద్దరి శరీరాల కలయిక వల్ల వచ్చు చెమటలు యజ్ఞము చేయువారు చేయు చివరిరోజు స్నానమునకు ఉపయోగించు నీటివలే  ఉన్నది. శ్రీ వేంకటేశ్వరా! ఈ విధముగా నీవు నన్ను రక్షించితివి. నీవు మెచ్చిన నీ పడతితో కామయజ్ఞము చేయవయ్యా!!!!! 
ఈ కీర్తన  ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/a327b7f5-c660-4f26-8083-47b63a514239/03-KORINA

Thursday, February 17, 2011

నీవనగ నొకచోట

నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు
నీవనుచు కనుగొన్న నిజమెల్లనీవే

తనయాత్మవలెనె భూతముల యాతుమలెల్ల -
ననయంబు కనుగొన్న యతడే నీవు
తనుగన్నతల్లిగా తగని తర కాంతలను
అనఘుడై మదిజూచు నతడే నీవు

సతత సత్య వ్రతాచార సంపన్నుడై
అతిశయంబుగ మెలగునతడే నీవు
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు
హత కాముకుడైన యతడే నీవు

మోదమున సుఃదుఃఖముల నొక్కరీతిగా
నాదరింపుచునున్న యతడే నీవు
వేదోక్తమతియైన వేంకటాచలనాథ
ఆదియును నంత్యంబు నంతయును నీవే

అర్ధం:
కాంతలు: స్త్రీలు
ఆతుమ: ఆత్మ
అనయము: నిరంతరము
అనఘుడు: పాపము లేని వాడు
మది: హృదయము
సతతము: ఎల్లప్పుడు
సత్య వ్రతాచార సంపన్నుడు: నిజమునే మాట్లాడువలెనను ఆచారము కలిగినవాడు
ధృతిదూలి:
ద్రవ్యము: సొమ్ము
తృణము: విలువలేనిది గా
హత కాముకుడు: కోరికలు లేనివాడు
మోదమున: సంతోషంగా

భావం:
ఓ వేంకటాచలనాధా! నీవు ప్రత్యేకంగా ఒక రాతి విగ్రహంలో ఒక్కచోట నిలచి ఉండట్లేదు. నేను గమనించే ప్రతీ నిజము లోనూ నువ్వున్నావు. ఎవడైతే ఇతరులలో తనను తాను దర్శించుకొను వాడు..ఏ జీవినీ హింసించని వాడు. అన్ని ప్రాణులలోనూ దైవాన్ని దర్శించేవాడుగా ఉన్నాడో ఆతడే నీవు. మనసులో ఎటువంటి పాపచింతన లేకుండా పర స్త్రీలను తన కన్నతల్లిగా చూచుకొను ఆ మహాత్ముడే నీవు. నిరతము సత్య సంభాషణము చేస్తూ నిగర్వియై నలుగురికీ సహాయము చేస్తూ ఉంటాడో ఆతడే నీవు. పరుల సొమ్మను ఆశించక, తన కష్టపడి సంపాదించిన ధనాన్ని తృణప్రాయంగా భావించి యే కోరికలు లేకుండా సాత్విక జీవనం సాగించే ఆతడే నీవు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా రెండింటినీ సంతోషంగా స్వీకరించే ఆ మహాత్ముడే నీవు. వేదాలలో కీర్తింపబడినటువంటి వేంకటాచలం పై నున్న శ్రీవేంకటేశ్వరా! ఈ సృష్టికి ఆది, అంతము నీవే.

ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://annamacharya-lyrics.blogspot.com/2008/09/532.html

Tuesday, February 15, 2011

దేవ దేవం భజే

దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రణపుంగవం

రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం

నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం

పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
 
వేంకటేశం సాధు విబుధ వినుతం


ప్రతిపదార్ధం:
దేవ దేవ: దేవదేవుడు
దివ్యప్రభావ: దివ్య ప్రభావుడు
రావణాసురవైరి: రావణాసురుని శత్రువు (రాముడు)
రణపుంగవ: యుద్ధరంగమునందు వీరుడు
భజే: భజింపుము


రాజవరశేఖర: రాజవరులలో ఉత్తముడు
రవికులసుధాకర: రఘువంశమనే సముద్రంలో ఉద్భవించిన సూర్యుడి వంటి వాడు??(సుధాకర: అంటే అమృతానికి నిలయుడు, కాబట్టి సముద్రుడు)
ఆజానుబాహు: పొడవైన చేతులు కలవాడు (నిలబడినప్పుడు చేతి వ్రేళ్ళు మోకాలికి తగులుతుంటే వాళ్లని ఆజానుబాహుడు అంటారు ట)
నీలాభ్రకాయ: నీలాకాశం వలే నల్లని దేహం కలవాడు
రాజారి కోదండ రాజ దీక్షాగురు : రాజులకు శత్రువైన పరశురాముని శివధనస్సును విరిచి ఆతని గర్వము భంగము చేసినవాడు
రాజీవలోచన: రాజీవం అంటే నీలం రంగులో నున్న కలువ. అంటే నీలపు కలువ కన్నులు గలవాడు
రామచంద్ర: రామచంద్రుడు


నీలజీమూత సన్నిభశరీర: వర్షాకాలపు నల్లని మబ్బు (నీల జీమూత) తో సమానమైన (సన్నిభ) శరీరం కలవాడు
ఘనవిశాలవక్షం: గొప్ప విశాలమైన చాతీ కలవాడు
విమల : స్వచ్చమైన
జలజనాభ: పద్మమును నాభి (బొడ్డు) యందు కలిగిన వాడు
తాలాహినగహర: పాములకి శత్రువు ఐన గరుడుడు వాహనం గా కలవాడు?? (ఈ ప్రయోగం అర్ధం చేసుకోవడం కష్టం గా ఉంది)
ధర్మసంస్థాపన: ధర్మ సంస్థాపకుడు
భూలలనాధిప: భూమి కి పతి ((సీత కూడా భూమి నుంచి పుట్టింది కాబట్టి- సీతాపతి)
భోగిశయ: భోగి అంటే పాము. శేషశయన అని అర్ధం .


పంకజాసనవినుత: పంకజము (పంకము అంటే బురద, జ అంటే పుట్టినది =పద్మము), పద్మాసనుడు బ్రహ్మ. బ్రహ్మగారిచే నిత్యము కీర్తింపబడేవాడు
పరమనారాయణ: నారాయణుడు
శంకరార్జిత జనక చాపదళనం: శంకరుని వద్దనుండి పొందబడిన జనకుని యొక్క దనస్సును ఎక్కుబెట్టినవాడు/విరిచినవాడు
లంకా విశోషణ: లంకను జయించిన వాడు
లాలితవిభీషణ: విభీషణుని రక్షించినవాడు
వేంకటేశం సాధు విబుధ వినుతం: సాధువులు, పండితులచే కీర్తింపబడే వేంకటేశుడు
ఈ కీర్తన ఇక్కడ వినండి. 
http://annamacharya-lyrics.blogspot.com/2006/10/53devadevambhajedivyaprabhavam.html

చూచి వచ్చితి

చూచి వచ్చితి నీవున్నచోటికి తోడి తెచ్చితి
చేచేతఁ బెండ్లాడు చిత్తగించవయ్యా
లలితాంగి జవరాలు లావణ్యవతి ఈకె
కలువకంఠి మంచి కంబుకంఠి
జలజవదన చక్రజఘన సింహమధ్య
తలిరుఁబోడిచక్కదనమిట్టిదయ్యా
అలివేణి మిగులనీలాలక శశిభాల
మలయజగంధి మహామానిని యీకె
పెలుచుమరునివిండ్లబొమ్మలది చారుబింబోష్ఠి
కని(లి?)తకుందరద చక్కందనమిట్టిదయ్యా

చెక్కుటద్దములది శ్రీకారకన్న(ర్ణ?)ములది
నిక్కుఁజన్నులరంభోరు నిర్మలపాద
గక్కన శ్రీవేంకటేశ కదిసె లతాహస్త
దక్కె నీకీ లేమ చక్కందన మిట్టిదయ్యా

పదార్ధం:
లలితాంగి: మనోహరమైన
జవరాలు: ప్రేమించిన యువతి
లావణ్యవతి: సుందరమైన
ఈకె: ఈ అమ్మాయి (ఈపె అని కూడా అనొచ్చు)
కలువకంటి: కలువ రేకుల వంటి కన్నులు కలది
కంబుకంఠి:  శంఖము వంటి కంఠము కలిగినది
జలజవదన: పద్మము వంటి విచ్చుకున్న మోము కలిగినది
చక్ర జఘన: చక్రము  వంటి కటి భాగము (మొల)
సింహమధ్య: సింహము వలె సన్నని నడుము గలది
తలిరుబోడి: తలిరు అంటే చిగురు. కాబట్టి చిగురుబోడి. స్త్రీ కి పర్యాయపదం.
అలివేణి: స్త్రీ
మిగుల నీలాలక = = అతిశయించిన నల్లని కురులు కలది
శశిభాల: తెల్లని ఫాలభాగము(నుదురు) కలది
మలయజగంధి: గంధపు వాసన గలది
మహా మానిని: గొప్ప మానము కలిగిన ఆడది. స్త్రీ కి పర్యాయపదం
మరుని విండ్ల బొమ్మలది: మన్మధుని బాణము వలె కనుబొమ్మలు కలది??
చారు బింబోష్టి: అందమైన/రస పూరితమైన పెదవులు కలిగినది (పెదవులు ఎర్రని దొండపండ్ల వలే ఉన్నవి)
కలితకుందరద: మొల్లపువ్వుల వలె తెల్లగా మెరిసే పలువరస కలది, అపరంజి,
చెక్కుటద్దములది: అద్దము వలె నున్నటి బుగ్గలు కలిగినది. చెక్కు అంటే నుదురు అని కూడా అర్ధం. కానీ చెక్కులు అన్నారు కాబట్టి బుగ్గలే అయ్యుంటాయి.
శ్రీకార కర్ణములది: చెవులు "శ్రీ" ఆకృతి లో కలిగినది
నిక్కు చన్నులు: నిగిడిన (కొంత ఉద్రేకపడిన) స్తనములు (వక్షోజములు)
రంభోరు: అరటిచెట్టు వంటి ఊరువులు (తొడలు) కలిగినది
నిర్మలపాద: స్వచ్చమైన పాదాలు కలది. అంటే లేత మామిడి ఆకుల్లా చిరు ఎర్రగా అనుకోండి.
గ్రక్కన: శీఘ్రముగా
కదిసె: పట్టుకొనుట, చేపట్టుట??(కదియు == చేరు, పొందు, సాటియగు, సమీపించు)
లతాహస్త: తీగె వంటి చేయి
నీకీ లేమ దక్కె: లేత అమ్మాయి (స్త్రీ కి మరొక పర్యాయ పదం)  నీకు దక్కినది.

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీ వేంకటేశ్వరునకు పెండ్లి కుమార్తెను వెతికి వచ్చు వానిగా తనను తానూహించుకుని రాసిన కీర్తన. ఇది మధుర భక్తికి తార్కాణం. పల్లవిలో ప్రభూ! ఓ అమ్మాయిని చూసి వచ్చాను. అంతేకాదు నీవున్న చోటికి వెంటబెట్టుకుని వచ్చాను. నువ్వు నిర్ణయించి పెండ్లాడు ఈమెను అంటూ ఆ అమ్మాయి అందం ఎలా ఉందో మిగతా చరణాల్లో వర్ణించాడు.
చాలామంది అన్నమయ్య సంకీర్తనల్లో పచ్చి శృంగారం ఉంది. అని చాలా వ్యంగ్యంగా మాట్లాడటం విన్నాను. అవును మరి. శృంగారాన్ని కేవలం రెండు శరీరాల కలయికగా చూసేవారికి అంతకన్నా గొప్ప ఆలోచనలు ఎలా వస్తాయి. మనం ఎలా ఆలోచిస్తే అలాగే కనబడతాయి అన్నీ. తరువాతలో అన్నమయ్య వైరాగ్యాన్ని చూద్దాం. 
ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగు నుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/88d6733e-2312-42ea-b3b1-a2b7aa84accb/cUcivacciti_nIvunna_cOTikE

చిన్ని శిశువు

చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు ||

తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత
కాయలవంటి జడల గములతోడ
మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ
పాయక యశోద వెంట పారాడు శిశువు ||

ముద్దుల వ్రేళ్ళాతోడా మొరవంక యుంగరాల
నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ
అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత
గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు ||

బలుపైన పొట్ట మీది పాల చారలతోడ
నులివేడి వెన్నతిన్న నోరితోడ
చెలగి నేడిదే వచ్చి శ్రీవేంకటాద్రిపై
నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు ||


ప్రతిపదార్ధం:
తోయంపుకురులు: తోయము అంటే నీరు. తోయంపు కురులు అంటే నల్లని కురులేమో?.(బహుశా అది " తోయము " కాకుండా " తోరము " అయి ఉండవచ్చునేమో. తోరము = పొడవు, గుబురు, లావు, బలిష్ఠము అనే అర్థాలు ఉన్నాయి. అవి భావానికి చక్కగా సరిపోతాయి. ప్రాస మాత్రం సరిపోదు. ఆ కాలంలో వాడే భాష, యాసలో "తోయము" అని వాడవచ్చేమో పరిశీలించాలి :భైరవభట్ల విజయాదిత్య ) 
పాయక: విడువకుండా
పారాడు: పాకుతూ ఆడు
నిద్దపు చేతులు: నున్నటి చేతులు
పైడి బొద్దుల తోడ: బంగారు ఆభరణాల (చేతికి పెట్టుకునేవి =కంకణాలు) తో
అద్దపు చెక్కులు: అద్దము వలె నున్న బుగ్గలు. చెక్కు అంటే నుదురు అని కూడా అర్ధం. కానీ చెక్కులు అన్నారు కాబట్టి బుగ్గలే అయ్యుంటాయి.
అప్పలప్పలని నంత: చిన్న పిల్లలు అప్ప, అప్ప అని చేసే శబ్దము 
గద్దించి: బెదురుతూ
బలుపైన పొట్ట: భారమైన ఉదరము
నులివేడి వెన్న: గోరువెచ్చని వెన్న
చెలగి: ఉద్భవించుట

భావం: బాలకృష్ణుని అందాన్ని అన్నమాచార్యులు ఎంత అందం గా వర్ణించారో చూడండి. ఈ శిశువు ఎవరూ ఎన్నడూ ఎక్కడా చూడనటువంటి చిన్ని శిశువు. నల్లని కురులతో తూగుతున్నటువంటి, చింతకాయల వలె జడలు కట్టి వ్రేలాడుతున్నటువంటి శిరసు, పాదాలకు బంగారపు మువ్వల పట్టీలు పెట్టుకుని, యశోద వెంటే తిరుగుతూ పాకుతూ ఆడుకునే శిశువు.  ముద్దులొలికే వేళ్ళతో, వాటికి బంగారపు ఉంగరాలతో, నున్నటి చేతులతో, చేతికి బంగారు కంకణాలతో, అద్దము వలే చెక్కినటువంటి లేత బుగ్గలతో, అప్ప, అప్ప అంటూ బెదురు నటిస్తూ యశోద శరీరాన్ని గదమాయిస్తూ కౌగిలించినట్టి శిశువు. బరువైన గట్టి పొట్టమీద, అప్పుడే తాగినటువంటి పాలచారల తో, గోరు వెచ్చని వెన్న తిన్న నోటి తో, శ్రీ వేంకటాద్రి మీద ఉద్భవించి ఈ లోకాలనన్నింటిని కాపాడుతూన్నటువంటి శిశువు. ఆతడే వేంకటాద్రి బాలకృష్ణుడు.  


ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగునుండి గ్రహింపబడినది.
http://www.esnips.com/doc/81071a87-f0e7-414b-9de4-bb4c3735f7b5/ChinniSisuvu_BKP/?widget=flash_player_note

Monday, February 14, 2011

నెలమూడు శోభనాలు

ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు 
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
చ|| రామనామమతనిది రామవు నీవైతేను 
చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు  
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు  
కరిగాచెదాను నీవు కరియానవు 
సరి జలధిశాయి జలధికన్యవు నీవు  
బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు 
అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె 
పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||
ప్రతిపదార్ధం:
నెలమూడు: కలకాలం????
శోభనమ్: మంగళము దీన్నే సోబనము అని కూడా అంటారు.
రామ: అందమైన స్త్రీ
చామ: యౌవ్వనవతి ఐన స్త్రీ
వామనయన: మంచి కన్నులు కలిగిన స్త్రీ
హరిణేక్షణ: జింక వంటి చోపులు కలది??
కరియానవు: కరి అంటే ఏనుగు. యానము అంటే ప్రయాణము. అంటే గజగమన అని అర్ధం.
జలధికన్యవు: జలధి అంటే సముద్రం. కాబట్టి సముద్రుడి కూతురు
జలజముఖి: పద్మము వంటి విచ్చుకున్న ముఖం కలది.
బెరసి/వెరసి: లెక్క మొత్తానికి
నిన్నురాన మోచె: నిన్ను ఉరమున (వక్షస్థలమున) మోచె/ఉంచె/మోయుచున్నాడు


భావం:
ఈ సంకీర్తన చూస్తే అన్నమయ్య మధుర భక్తి ఎటువంటిదో తెలుస్తుంది. పద్మావతి వేంకటేశ్వరులకు పెండ్లి చేయడానికి వారిద్దరికీ పేరు బలం చూస్తున్నాడన్నమాచార్యులు. సాధారణంగా మన మనుష్యుల్లో ఐతే అబ్బాయికీ, అమ్మాయికీ పెండ్లి చేయాలంటే వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి జాతకచక్రాన్ని వేసి రాశి బలం, మైత్రీ బంధం, జాతకాలు కలిశాయా లేదా?, వారి సంతాన యోగం, అమ్మాయికి సౌభాగ్యస్థానం అన్నీ గణించి వారిరువురూ వివాహానికి యూగ్యులా కాదా అని నిర్వహిస్తారు. కానీ! పద్మావతీ శ్రీనివాసుల జన్మ నక్షత్రం ఎవరికి తెలుసు? వారి పుట్టుక ఎవరికి తెలుసు? జన్మనక్షత్రమే లేనప్పుడు జాతకం ఎలా?. కాబట్టి అన్నమయ్య అలమేలు మంగ, శ్రీనివాసుల పేర్ల బలం గణించి వారిరువురి వివాహ జీవితం అత్యద్భుతంగా ఉంటుందని. నిరంతరం వారి వైవాహిక జీవితం మంగళప్రదంగా ఉంటుందని తేల్చుతున్నారు.  


అతని పేరు త్రేతాయుగంలో రాముడు. నీవు రామవు (అందమైన స్త్రీవి). అతను కొంచెం చామన వర్ణం (కొంత నల్లని రంగు). నీవు చామవు (యౌవ్వనవతి వి). అతని వామనుడు అని కూడా అంటారు. నీవు వామనయనవు (మంచి కన్నులు కలిగిన స్త్రీవి). ఈ విధంగా మీ ఇద్దరికీ పేరు బలం ఒకటే.
అతని పేరు హరి. నీవు అందమైన తెల్లని కన్నులు కలదానవు/జింకవంటి చూపులు కలదానవు. అతను కరి (యేనుగు) ను రక్షించిన వాడు (గజేంద్రమోక్షం). నీవు కరియానవు (గజగామినివి) (యేనుగు వలే గంభీరమైన మందమైన నడక గలదానవు). అతను పాల సముద్రంలో శయనించేవాడు. నీవి ఆ సముద్రూడి కూతురివి. మొత్తానికి మీ ఇద్దరికీ పేరు బలం ఒక్కటే.
అతను జలజనాభుడు (పద్మము నాభి యందు కలవాడు). నీవు జలజముఖివి (పద్మము వంటి ముఖం కలదానవు). నీవు అలమేలుమంగవు ( తమిళంలో అలర్ అంటే పువ్వు. మేల్ అంటే మీద. మంగై అంటే కన్యక. అలమేలు మంగ అంటే పువ్వుమీద కన్యక. పువ్వే సున్నితం. పువ్వుమీద కన్యక అంటే ఆవిడ సున్నితత్వాన్ని ఎంతని చెప్పగలం?). నిన్ను అలముకున్నాడతడు. ఇలలో శ్రీ వెంకటేశుడు నిన్ను తన వక్షస్థలంలై ఉంచుకుని లోకాలను ఏలుతున్నాడు. ఈ విధంగా మీ ఇద్దరికీ అద్భుతమైన పేరు బలం ఉంది కాబట్టీ మీ వైవాహిక జీవితం సుఖసంతోషాలకు నెలవౌతుందని అన్నమయ్య అంటున్నారు. 

ఈ కీర్తన ఇక్కడ వినండి. శ్రావణ్ కుమార్ బ్లాగు నుండి గ్రహింపబడినది.
http://annamacharya-lyrics.blogspot.com/2007/11/358nelamudu-sobanalu.html


Thursday, February 10, 2011

స్త్రీ అనే పదానికి ఎన్నో పర్యాయపదాలు

అన్నమయ్య కీర్తనల్లో "స్త్రీ" అనే పదానికి ఎన్నో పర్యాయపదాలు వాడారు. అవి యేమిటో తెలుసుకుంటే కీర్తనను అర్ధం చేసుకోవడం కొంత సులభమౌతుంది. అవేంటో ఈ క్రింద చూడండి.
అంగన, అతివ, ఆడది, ఇంతి, ఉవిద, కలికి, కళ్యాణి, కాంత, కొమ్మ, కోమలి, గాల, చాన, చెలువ, చేటి, చేదియ, చిగురుబోడి, జవ్వని, తన్వి, తరుణి, తలిరుబోడి, తెలువ, నాటి, నారి, నవల, నెలత, పడతి, ప్రమద, పెంటి, పైదలి, భామ, భామిని, మహిళ, మగువ, మానిని, ముదిత, ముగుద, మెలత, యువతి, యుగ్మలి, యోష, రత్న, రమణి, లలన, లలామ, లేమ, వనిత, వదుతి, వెలది, సుదతి. 

Saturday, February 5, 2011

Introduction

ఫ్రియమైన మిత్రులకు,
నమో నారాయణాయ!
అన్నమయ్య సంకీర్తనల్లోని ఆధ్యాత్మిక, శృంగార, వైరాగ్య, నీతి తత్వాలు మనకు  ఎనలేని ఆనందాన్ని, వేంకటేశ్వరునిపై అపార భక్తిని పెంపొందిస్తాయి. ఐతే, నిజానికి అన్నమయ్య చాలా కీర్తనలు పామర భాషలోనే రాసినా, మనం ఇప్పుడు వాడే తెలుగు కాలంతో పాటే పల్చబడిపోవడంతో ఆయన వాడిన పదాలు మనకి అర్ధం కావడం కష్టమైపోతోంది. నాకు కొన్ని కీర్తనలు అర్థం పూర్తిగా (ప్రతీ పదానికీ) తెలుసుకున్నప్పుడు నా మనస్సు బయటకు వ్యక్తం చేయలేనంత ఆనందాన్ని పొందుతుంది. కన్నుల వెంబడి కన్నీళ్ళు ధారల్లా వచ్చేస్తాయి. కేవలం చదివి అర్థం చేసుకునే నాకే ఇలా ఉంటే వాటిని రచించి, పాడుకున్న అన్నమయ్య ఎంత సంబరపడి ఉంటాడు. ఆయన పాడుతున్నప్పుడు విని ఆనందించిన తిరువేంకటపతి ఎంత సంతోషించి ఉంటాడు?. ఆయన ఆతుమను తనలో కలుపుకున్నప్పుడు ఎంత ఆవేదన చెంది ఉంటాడు?.
ఈ బ్లాగ్ లో నాకు నచ్చిన చాలా కీర్తనలకి ప్రతీ పదానికి అర్ధాన్ని, తద్వారా భావాన్ని ఇక్కడ పొందుపరచాలనుకుంటున్నాను. ఇది కేవలం శ్రీ వారి సేవలో భాగం, అన్నమయ్య సంకీర్తనలు అందరూ తెలిసికొని, వాటి అర్ధాలను అవగహన చేసుకుని, ఆధ్యాత్మికానందంలో ఓలలాడాలని నా ఆకంక్ష. రోజుకొక సంకీర్తన చొప్పున ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను.  సహకరించ మనవి.  
ధన్యవాదములు
కిరణ్