Total Pageviews

Tuesday, April 21, 2020

తందనాన అహి - తందనాన పురె తందనాన భళా తందనాన [Tandanana ahi tandanana pure]

తందనాన అహి - తందనాన పురె
తందనాన భళా తందనాన

//ప// బ్రహ్మమొక్కటె పర - బ్రహ్మమొక్కటె
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె

//చ// కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకులమంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ

//చ// నిండారు రాజు నిద్రించు నిద్రయు నొకటె
అండనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలుడుండేటి సరిభూమి యొకటే

//చ// అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు

//చ// కొరలి శిష్టాన్నములు గొను నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే

//చ// కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద పొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె

ముఖ్యపదార్ధం:
ఆహి, పురె, భళా: ఇప్పటి కాలంలో "ఆహా", ఒరే, భలే గా చెప్పుకోవచ్చు [Expression of excitement, appreciation]
తందాన: వంత పాడే శబ్దము. 
కందువ: మోసపూరితమైన, మాయ, Cunning, false, fictitious
జంతుకులము: మనుష్యులతో సహా సకల జీవరాశులు 
నిండారు: పూర్ణత్వము నిండిన, చక్రవర్తి, నిండైన
మెట్టు: నడచు
అనుగు: ప్రియమైన (beloved, desired)
ధనాఢ్యుడు: ధనవంతుడు 
ఒనర:  కలుగు, సంభవించు, పొసగు 
కొరలు: కలుగు, ఉండు
పరగ:  ప్రసరించు
కడకి: చివరకి 
పుడమి: భూమి
శునకము: కుక్క 
పొలయు: ప్రకాశించు 
కడు: గొప్ప 
సరిగావ: సమానముగా రక్షించుటకు
జడియు: భయపెట్టు

భావం:
తందనాన అహి, తందనాన పురె, తందనాన భళా....బ్రహ్మౌ ఒక్కటే, పరబ్రహ్మము ఒక్కటే. ద్వితీయము లేదు. 

మాయా/మోసపూరితమైన భావమైన "అధికులు, హీనులు" లేరిక్కడ. అందరి ఆత్మలతోనూ శ్రీహరే ఉన్నాడు.
ఇందులో రెండుకాళ్ళతో, నాలుగు కాళ్ళతో నడిచే జంతువులంతా ఒక్కటే. అందరి ఆత్మలతోనూ శ్రీహరే ఉన్నాడు.

పరిపూర్ణుడైన రాజు, పక్కనే ఉన్న బంటు... నిద్రించే నిద్ర ఒక్కటే. 
వేదశాస్త్రాలు తెలిసిన బ్రాహ్మణుడు, చండాలుడు... నడిచే భూమి ఒక్కటే.

ప్రియమైన దేవతలకు, పశు, పక్ష్యాదులకు, కీటకాలకు... లైంగిక సుఖం ఒక్కటే. 
ధనము కలవానికి, నిరుపేదకు... పగలు, రాత్రీ ఒక్కటే

మంచి మృష్టాన్నమును, కుళ్ళిన మాంసము మొదలైనవి...తినేటి నాలుక ఒకటే.
చెడు వాసనలపైన, చక్కటి పరిమళ ద్రవ్యములపైన... వీచే వాయువు ఒక్కటే.

భూమిపై యేనుగు మీద, చివరకు కుక్క మీద... ప్రకాశించే ఎండ ఒక్కటే.
మిక్కిలి పుణ్యము చేసినవారిని, పాపకర్మములు చేసి భయపడు వారిని సమానంగా రక్షించుటకు శ్రీవేంకటేశ్వరు నామము ఒక్కటే.

1 comment:

  1. Dear Mr.Kiran,

    It is really god driven effort you put in and it is life achievement. But your frequency of posting the Vivarana on annamaacharya kirtanalu dropped drastically. We need your continued effort like previous. Any help needed from my side, please let me know.

    ReplyDelete