Total Pageviews

Saturday, June 17, 2017

కలదింతె మాట కంతుని యాట - తెలుసుకో నీలోనిదియె పూటపూట [Kaladinte mata kantuni yaata]

//ప// కలదింతె మాట కంతుని యాట
తెలుసుకో నీలోనిదియె పూటపూట //ప//

//చ// అలమేలుమంగా హరియంతరంగా
కలితనాట్యరంగ కరుణాపంగ
చెలువుడు వీడె చేకొను నేడె
వలరాజుతూపులివి వాడిమీది వాడి //ప//

//చ// అలినీలవేణి యంబుజపాణి
వెలయంగ జగదేకవిభునిరాణి
కలయు నీ పతి వచ్చె గక్కన నిన్నిదె మెచ్చె
పలికీని చిలుకలు పచ్చి మీదబచ్చి //ప//

//చ// సితచంద్రవదనా సింగారసదనా
చతురదాడి మబీజచయరదనా
యితవైన శ్రీ వేంకటేశుడు నిన్నిదె కూడె
తతి దలపోతలు తలకూడె గూడె //ప//

ముఖ్యపదాల అర్ధం:
కంతుడు= మన్మధుడు
అపాంగము: చూపు
చెలువుడు: సుందరుడు, ప్రియుడు
వలరాజు: మన్మధుడు
తూపులు: బాణాలు
వాడి: పదును
అలినీలవేణి: నల్లని కురులు కలది
అంబుజపాణి: చేతియందు కలువ/తామెర ఉన్నది
విభుడు: భర్త
సితచంద్రుడు: పూర్ణచంద్రుడు
సింగారము: శృంగారము
సదనము: ఇల్లు
చతుర: తెలివైన
దాడిమబీజ: దానిమ్మగింజ
చయము: సమూహము
తతి: సమూహము
తలపోత: ఆలోచన

భావం:
ఈ సంకీర్తనలో అన్నమయ్య - అమ్మవారి ఆలోచనలు శ్రీవారి పైనే ఉంటూ ఆమెను ఎందుకు వేదనను గురిచేస్తున్నాయో, వాటికి కారణం ఎవరో తెలియజేస్తూ అమ్మను లలితమైన పదాలతో కీర్తిస్తూ వ్రాశారు.   

అమ్మా! వేరొక మాట లేదు. ఉన్నదొక్కటే. అదే, నీ మనస్సులోంచి పుట్టిన మన్మధుడి ఆట. ఇది నీవు ప్రతీసారీ తలచుకో.  

ఓ అలమేలు మంగా ! నీవు హరి మనస్సునందు నివశించుదానవు. నాట్యమునందు నేర్పరివి. దయాపూరిత చూపులు కలిగినదానవు. సుందరుడైన నీ ప్రియుడు ఈరోజు నిన్ను కలుసుకుంటాడు. ఆతడి చూపులు మన్మధబాణాలు. చాలా పదునుగా ఉంటాయి. 

నీవు నల్లని కురులు కలదానవు. చేతియందు పద్మమును కలిగినదానవు. సాక్షాత్తూ ఈ జగత్తుకు భర్తయైన వానికి భార్యవు. నీ ప్రియుడు నిన్ను కలవడానికి వచ్చి నిన్ను మెచ్చుకుంటుండగా, పక్కనున్న చిలుకలు నీ స్నేహానికి పచ్చి చెప్తున్నాయి.

నీవు పూర్ణచంద్రుని వంటి ముఖము గలదానవు. శృంగారానికి నిలయవు. చాలా తెలివైనదానవు. దానిమ్మగింజల సమూహము వంటి పలువరుస గలిగినదానవు.  హితుడైన శ్రీవేంకటేశ్వరుడు నిన్ను కలిసాడు. ఆయన గురించిన ఆలోచనల సమూహాలు నీకు పదే పదే నీకు జ్ఞప్తికి వస్తున్నాయి. 

1 comment: