Total Pageviews

Saturday, June 3, 2017

నమో నారాయణాయ - సమధికానందాయ సర్వేశ్వరాయ [ Namo Narayanaya samadhikanandaya]

//ప// నమో నారాయణాయ  
సమధికానందాయ సర్వేశ్వరాయ           //నమో//

//చ// ధరణీసతీ ఘనస్తన శైలపరిరంభ-
పరిమళ శ్రమజల ప్రమదాయ 
సరసిజ నివాసినీ సరసప్రణామయుత 
చరణాయతే నమో సకలాత్మకాయ        //నమో//

//చ// సత్యభామా ముఖకాంచన పత్రవల్లికా-
నిత్యరచన క్రియా నిపుణాయ 
కాత్యాయినీ స్తోత్రకామాయతే నమో 
ప్రత్యక్షనిజ పరబ్రహ్మ రూపాయ           //నమో//

దేవతాధిపమకుట దివ్యరత్నాంశు సం-
భావితామల పాదపంకజాయ
కైవల్యకామినీ కాంతాయ తే నమో 
శ్రీవేంకటాచల శ్రీనివాసాయ               //నమో//

ముఖ్యపదాల అర్ధం:
నార+అయనుడు = నీటి మీద శయనించు వాడు
సమ్+అధిక ఆనందము= బాగైన మిక్కిలి సంతోషము
సర్వ+ఈశ్వరుడు= అన్నింటికీ అధిపుడు
ధరణీ= భూమి
సతి= భార్య
ఘనస్తనశైల= గొప్పదైన వక్షోజాల కొండలు
పరిరంభ= చుట్టుకుని
పరిమళ శ్రమజలము= సుగంధభరితమైన చెమట
ప్రమదాయ: సంతోషించెడి వాడు
సరసిజ= పద్మము
తే= నీకు
చరణాయ= పాదములకు
కాంచన పత్ర = బంగారపు ఆకు
వల్లిక= లత
కాత్యాయినీ= పార్వతీ దేవి
దేవత+అధిప+మకుట= ఇంద్రుని కిరీటము
సంభావితము: బాగుగా ప్రకాశించునట్లు
పంకజము: బురదనుంచి పుట్టునది = కమలము
కైవల్యకామినీ = క్వైవల్యము కోరు వారలకు
కాంతాయ= భర్త వంటివాడవు

భావం: 
ఓ నారాయణా! బాగైన మిక్కిలి సంతోషాన్నిచ్చు వాడా, సర్వేశ్వరుడా, నీకు నమస్సులు.

నీ భార్యయైన భూదేవి ఘనమైన చన్ను కొండలను గట్టిగా చుట్టుకుని పరిమళభరితమైన చెమటను వదులుతూ సంతోషము పొందుచున్నవాడా!
పద్మనివాసినియైన లక్ష్మీదేవి సంతోషముతో నమస్కరించు పాదములను కలిగినవాడా, సృష్టి సకలము ఆత్మయందు కలిగిన వాడా, నీకు నమస్సులు

సత్యభామా దేవి బంగారు వన్నె ముఖముపై చెమట తీగెలను నిత్యం రచించుటలో నేర్పరితనము కలవాడా, పార్వతీదేవిచే స్తుతింపబడేవాడా, కోర్కెలుతీర్చేవాడా, పరబ్రహ్మస్వరూపుడా, నీకు నమస్సులు.

ఇంద్రుని కిరీటమునందు పొదగబడిన దివ్యరత్నాల వెలుగు వలన  ఎర్రని తామెరల వలే ప్రకాశించు పాదములు కలిగిన వాడా, కైవల్యముకోరు భక్తులకు భర్త వంటి వాడా, వేంకటాచలముపై నివశించే రమాపతీ నీకు నమస్సులు.   

No comments:

Post a Comment