Total Pageviews

Tuesday, July 23, 2013

చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు - ఇలనింత పచ్చిదేరీ ఇదివో నీ భావము [Cheli neevu modalanE siggari peMDli kUturavu]

//ప//చెలి నీవు మొదలనే సిగ్గరి పెండ్లి కూతురవు
ఇలనింత పచ్చిదేరీ ఇదివో నీ భావము

//చ// చెక్కులవెంటా గారె చెమట తుడుచుకోవే
చక్కవెట్టుకొనవే నీ జారిన కొప్పు
అక్కుమీద పెనగొన్న హారాలు చిక్కు దీయవే
ఇక్కువల నీ కోరికె లీడేరెనిపుడు

//చ// పెదవి మీద కెంపులబట్లు రాలుచుకోవే
చెదరిన ముంగురులు చేత దువ్వవే
వదలిన పయ్యెద చివ్వన బిగించుకొనవే
పది(బదిగా నీనోము ఫలియించె నిపుడు

//చ// తిలకము కరగెను దిద్దుకోవే నొసలను
కలసిన గురుతులు గప్పుకొనవే
యెలమి శ్రీవేంకటేశు( డేలె నలమేలుమంగవు
తలచిన తలపులు తలకూడె నిపుడు

ముఖ్యపదార్ధం:
సిగ్గరి=సిగ్గు కలిగిన స్త్రీ 
పచ్చిదీరె= బయటపడు
చెక్కు= The cheek. కపోలము 
అక్కు= రొమ్ము The breast or chest
పెనగొన్న=ఒకదానిపై ఒకటి పెనవేసుకొను
ఇక్కువ= జీవస్థానము, రహస్య అంగములు
కెంపులబట్లు=కెంబట్టు= కెంపు+పట్టు= ఎర్రని దారంలాంటి తీగ (Red silk) 
ముంగురులు= ముందు + కురులు = ముందుకు రాలే జుట్టు
పయ్యెద= స్త్రీలు వక్షస్థలము కప్పుకొను వస్త్రము
చివ్వని=చివ్వు+అని= ఒక్కసారిగా, గబుక్కున
పది(బదిగా=పదింబదిగ= పదులు, చాలా several or many
గురుతులు= చిహ్నాలు
యెలమి= సంతోషముతో

భావం:
అమ్మవారు మొదటిరాత్రి స్వామిని కలిసి గదిలోంచి అలానే బయటకి వచ్చింది. పక్కనున్న చెలికత్తెలు ఆమెను చూసి ఇలా అంటున్నారు.

అమ్మా! నీవు కొత్త పెళ్ళికూతురివి. నీకు అసలే సిగ్గు ఎక్కువ.  నిన్ను ఇలా చూస్తే నీవు స్వామితో అనుభవించిన సుఖాలేమిటో బహిర్గతం అవుతున్నాయి. కొంచెం సరిచేసుకో..

నీ నుదుటన కారే ఆ చెమటని తుడుచుకోవే. జారిపోయిన నీ కొప్పుని మళ్ళీ చక్కబెట్టుకోవే. నీ రొమ్ము మీద పెనవేసుకుపోయిన హారాలను చిక్కుతీయవే. ఇవన్నీ చూస్తుంటే నీ సుఖస్థానాలకి కోరికలు తీరినట్లనిపిస్తోంది. 

ఆ పెదవి మీద ఎర్రని దారాలు రాల్చుకోవే (స్వామి పెదవులని గ్రోలినప్పుడు వారిద్దరి లాలాజలం అలా తీగలుగా కట్టిందని ఊహ కాబోలు). ఆ చెదిరిన జుట్టు ముందుకు రాలుతోంది, అది సరి చేసుకోవే. నీ పయ్యెద (రవిక) వదులుగా అయిపోయింది, గభాలున బిగించుకోవే. నీ పతితో చేసిన యౌవ్వనపు నోము నీకు మిక్కిలిగా ఫలించిందని తెలుస్తోంది.

నీవు నుదుటన ధరించిన తిలకము మీ ఇద్దరి కలయికలోని వేడికి కరిగిపోయి నొసటలకి అంటుకుంది, అది దిద్దుకోవే. నీవు శ్రీవారితో కలిసిన సంభోగపు గుర్తులు (పెదవుల ముద్రలు, పంటి గాట్లు, గోళ్ళ గిచ్చుళ్ళు వంటివి) బయటకి కనబడకుండా కప్పుకోవే. సంతోషముతో శ్రీవేంకటేశ్వరుడు చేరదీసిన అలమేలుమంగవమ్మా నువ్వు. నీవు తలచిన తలపులన్నీ నిరవేరాయిప్పుడు. 

No comments:

Post a Comment