Total Pageviews

Monday, July 22, 2013

పొలతి జవ్వనమున (బూవక పూచె - యెలమి నిందుకు మనమేమి సేసేదే

//ప// పొలతి జవ్వనమున (బూవక పూచె
యెలమి నిందుకు మనమేమి సేసేదే

//చ// సతిచింతాలతలలో సంపెంగపూవులు పూచె
మతివిరహపు మేన మల్లెలు పూచె
అతనునితలపోతను అడవిజాజులు పూచె
హితవు తెలియదింకను ఏమిసేసేదే

//చ// తొయ్యలిచెమటనీట దొంతితామెరలు పూచె
కొయ్యచూపు కోపముల కుంకుమ పూచె
కయ్యపు వలపుల (జీకటి మాకులు పూచె
నియ్యేడ చెలియభావ మేమి చేసేదె

//చ// మగువరతుల లోన మంకెన పువ్వులు పూచె
మొగికొనగోళ్ళనే మొగలి పూచె
పొగరు శ్రీవేంకటేశు పొందుల కప్రము పూచె
ఇగురు(బోండ్ల మింక నేమి సేసేదే

ముఖ్యపదార్ధం:
 పొలతి= స్త్రీ
జవ్వనమున=యౌవ్వనమున
యెలమి= సంతోషముతో
సతిచింతాలతలలో= ఆమె ఆలోచనా అల్లికలలో
మతి= తలపు, కోరిక 
విరహపు మేన= ఎడబాటు, వియోగపు శరీరాన 
అతనునితలపోతను= తనువులేని ఆయన ఆలోచనలో
హితవు= మంచి
తొయ్యలి= స్త్రీ, ఆడు హంస
కొయ్యచూపు= కోసేలా ఉండే చూపు
కయ్యపు= జగడపు
చీకటి మాకులు= చీకటి చెట్లు (night queen)
మగువరతుల= స్త్రీ కోరికలోన
మొగికొనగోళ్ళనే= కొన గోళ్ళ సమూహము
కప్రము= కప్పురము
ఇగురుబోడి= యౌవ్వనవతిఐన స్త్రీ

భావం:
చెలులు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. స్వామి గురించిన ఆలోచనల్లో, ఆయనతో రతి జరిపే సమయంలో, ఆయనపై కోపం వచ్చినప్పుడు..వాళ్ళ శరీరాల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో, అవి పువ్వులతో పోల్చి చెప్పుకుంటున్నారు. స్వామి విరహంతో బాధను అనుభవిస్తూనే, ఆడవాళ్ళగా పుట్టాం, ఇక ఏమి చేయగలమే, అందాన్ని ఆయనకి అర్పించడం తప్ప...అనుకుంటున్నారు.   

పడతి యౌవ్వనము సంతోషంతో పూయకనే పూచింది. ఇప్పుడు మనమేమి చేసేదే?

మగని గురించిన దీర్ఘాలోచనలో ఉన్నప్పుడు పచ్చని సంపంగె పువ్వులు పూచినట్టుంది. కోరిక కలిగినప్పుడు శరీరంలో మల్లెలు పూచినట్టుంది. విశ్వాంతరాత్ముని తలపోతలో ఆమె శరీరంలో అడవి జాజిపువ్వులు పూచాయి. ఇది మంచిదేనా? నేనేమి చేసేదే?.

చెలి చెమట నీటిలో తామెరల దొంతరలు పూచాయి (తామెరలు చాలా నీరున్న ప్రదేశాలలోనే పూస్తాయి. అంటే, స్వామి మీద విరహంతో ఒళ్ళు వేడెక్కి ఆమెకి చెమట వానల్లా కురుస్తోందన్నమాట.) పతి పైన కోపపు చూపులలో ఎర్రని కుంకుమలు పూస్తున్నాయి. (అంటే కోపంలో కన్నులు ఎర్రబారాయన్నమాట) జగడాల ప్రేమల్లో చీకటి చెట్లు (night queen) పూచాయి. భావము ఈ విధముగా ఉంది, నేనేమి చేసేదే?

పతితో రతులు చేసేడప్పుడు శరీరంలో మంకెన పువ్వులు పూసినట్టుంది. (రతి సమయంలో ఆమె శరీరం కోరికతో ఎర్రగా మారిందన్నమాట) ఆమె కాలి, చేతి వేళ్ళ కొనగోళ్ళకి పదునైన మొగలి పూవులు పూసాయి.(గాఢాలింగనాల్లో స్వామి వీపుపై, భుజములపై సతి చేసే నఖక్షతాలు, గీరడాలు చూసి ఆమె చేతి వేళ్ళ గోళ్ళు పదునైన మొగలిరేకుల్లా ఉన్నాయని కవి భావన).. శ్రీవేంకటేశ్వరుని పొందులో ఉన్నప్పుడు పొగరు కప్పురము పూస్తుంది. (నల్లని స్వామి పై చెలి చెమట అంటుకుని ఆ తెల్లని బిందువులు కప్పురపు పొడిలా ప్రకాశిస్తోందని కవి భావన) ఆడవాళ్ళం మనము ఏమి సేసేదే?  

No comments:

Post a Comment