అధ్యాత్మ సంకీర్తన, రేకు: 3-7, సంపుటము: 1-20, రాగము: శ్రీరాగం
//ప// అన్నియును నతని కృత్యములే
యెన్నియైనా నవు నతఁడేమి సేసినను ॥అన్ని॥
//చ// అణురేణుపరిపూర్ణుఁ డవలిమోమైతేను
అణువౌను కమలభవాండమైన
ఫణిశయనుని కృపాపరిపూర్ణమైతే
తృణమైన మేరువౌ స్థిరముగా నపుడే ॥అన్ని॥
//చ// పురుషోత్తముని భక్తి పొరపొచ్చమైతేను
ఎరవులౌ నిజసిరులు ఎన్నైనను
హరిమీఁది చింత పాయక నిజంబైతే
నిరతిఁ బట్టినవెల్లా నిధానములే ॥అన్ని॥
//చ// మదనగురుని సేవ మదికి వెగటైతేను
పదివేలు పుణ్యములు పాపంబులే
పదిలమై వేంకటపతి భక్తి గలిగితే
తుదిపదంబునకెల్ల దోడవువు నపుడే ॥అన్ని॥
ముఖ్యపదార్ధం:
అన్నియును – అన్ని
నతని – అతని
కృత్యములే – కర్మలే
యెన్నియైనా నవు– ఎన్నైనా అవుతాయి/ఏమైనా అవుతాయి
నతఁడేమి – అతడు ఏమి
సేసినను – చేసినా
అణు – అణువు
రేణు – ధూళి కణం
పరిపూర్ణుఁ – సంపూర్ణంగా
డవలిమోమైతేను – అవతలి వాడైతే
అణువౌను – అణువు అవుతుంది
కమలభవాండమైన – కమలంలో పుట్టిన సృష్టి (బ్రహ్మాండం) కూడా
ఫణిశయనుని – పాము పైన నిద్రిస్తున్న వాడు (విష్ణువు)
కృపాపరిపూర్ణమైతే – కృపతో సంపూర్ణమైనప్పుడు
తృణమైన – గడ్డి మొక్క కూడా
మేరువౌ – మేరువు (పర్వతం) లా
స్థిరముగా – స్థిరంగా అవుతుంది.
పురుషోత్తముని – పురుషోత్తముడి (శ్రేష్ఠమైన మనిషి, శ్రీమహావిష్ణువు)
భక్తి – భక్తి
పొరపొచ్చమైతేను – పొరపాటవు అయితే/తేడాలొస్తే
ఎరవులౌ – తక్కువ అవుతాయి
ఎన్నైనను నిజసిరులు – నిజమైన సంపదలు ఎన్నైనా
హరిమీఁది – హరివైపు
చింత – ఆలోచన
పాయక – విడవకుండా
నిజంబైతే – నిజమైనప్పుడు
నిరతిఁ – నిరంతర
బట్టినవెల్లా – పట్టినవన్నీ
నిధానములే – నిధులే
మదనగురుని – కామదేవుడి గురువు (మన్మధుడి తండ్రి, విష్ణువు)
సేవ – సేవ
మదికి – మనస్సుకు
వెగటైతేను – చిరాకు వేస్తే
పదివేలు – పదివేలు
పుణ్యములు – పుణ్యములు
పాపంబులే – పాపాలే
పదిలమై – భద్రంగా
వేంకటపతి – వేంకటేశ్వరుడు
భక్తి – భక్తి
గలిగితే – కలిగితే
తుదిపదంబున కెల్ల– మోక్షపదము చేరేవరకు
తోడవువు నపుడే – తోడు వస్తుంది
భావం:
అన్నీ శ్రీ వేంకటేశ్వరుడి కర్మలు మాత్రమే. అతడు ఏమీ చేసినా, ఎన్నైనా అవుతాయి.
అణు రేణు పరిపూర్ణుడైన స్వామి అటుపక్కనుంటే, బ్రహ్మాండం కూడా అణువంత అయిపోతుంది.
శ్రీ మహావిష్ణువు కృప సంపూర్ణంగా ఉంటే, గడ్డి పరక కూడా మేరు పర్వతం అంత స్థిత్రం గా ఉంటుంది.
పురుషోత్తముడైన వేంకటేశ్వరుడిపై భక్తి లో పొరపాట్లు జరిగితే ఎన్ని నిజమైన సంపదలు ఉన్నా, అవన్నీ తక్కువగానే కనిపిస్తాయి.
హరి (విష్ణువు) పై ధ్యానం విడువకుండాలిగితే, పట్టినవన్నీ నిజమైన నిధులుగా మారతాయి.
మన్మధుని తండ్రైన విష్ణువు సేవ, మనస్సుకి చిరాకు తెస్తే, పదివేల పుణ్యాలు కూడా పాపాల్లా అయిపోతాయి.
భద్రంగా వేంకటేశ్వరుడిపై భక్తి ఉంటే, ఆ భక్తి మనకు మోక్షం అందించే చివరి సహాయం చేస్తుంది.
Meaning in English:
All actions are only the deeds of Lord Venkateswara. Whatever He does, it will happen, no matter how big or small.
If the Lord, who is complete even in the tiniest particle, is by your side, even the entire universe becomes as small as an atom.
When the grace of Lord Vishnu is complete, even a blade of grass can stand as firm as the great Meru mountain.
If there are mistakes in the devotion towards Lord Venkateswara, no matter how much real wealth one possesses, it will seem insignificant.
If one's meditation on Lord Hari (Vishnu) is unwavering, everything they hold will turn into true treasures.
If serving Lord Vishnu, the father of Manmatha, becomes tiresome for the mind, even ten thousand merits will appear like sins.
If there is firm devotion to Lord Venkateswara, that devotion will be the final aid in granting us salvation.
No comments:
Post a Comment