Total Pageviews

Thursday, August 11, 2022

ఒకపరి కొకపరి వొయ్యారమై - మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె (Okapari okapari)

 ఒకపరి కొకపరి వొయ్యారమై

మొకమునఁ గళలెల్లా మొలచిన ట్లుండె         // పల్లవి //


జగదేకపతిమేనఁ జల్లిన కర్పూరధూళి

జిగిగొని నలువంకఁ జిందఁగాను

మొగిఁ జంద్రముఖి నురమున నిలిపెఁ గాన

పొగరువెన్నెల దిగఁబోసిన ట్లుండె                 // ఒక //


పొరి మెఱుఁగుఁజెక్కులఁ బూసిన తట్టుపుణుఁగు

కరఁగి యిరుదెసలఁ గారఁగాను

కరిగమనవిభుఁడు గనుక మోహమదము

తొరిగి సామజసిరి దొలఁకిన ట్లుండె               // ఒక //


మెఱయ శ్రీవేంకటేశుమేన సింగారముగాను

తఱచయిన సొమ్ములు ధరియించఁగా

మెఱుఁగుఁబోడి యలమేలుమంగయుఁ దాను

మెఱుపుమేఘము గూడి మెఱసిన ట్లుండె   // ఒక //


ముఖ్యపదార్ధం:


ఒకపరి = విధము, once. Manner

ఒయ్యారము or ఒయారము: అందము, Bloom, grace

మొకము: ముఖము

కళలు: భాగము, sub-division. 

మొలచు: అంకురము, మొలక To sprout

మేని: శరీరము

ధూళి: రజను

జిగి: కాంతి, చల్లని వెలుగు, Brilliancy 

నలువంక: నాలుగు దిక్కుల వైపు

మొగి: పూను, An attempt

ఉరము: వక్షస్థలము

పొగరువెన్నెల: తీక్ష్ణమైన కాంతి Pride, గర్వము

దిగబోయు: దిగువకు వ్యాపించుట, Spreading downwards

పొరి: అత్యంతము, మిక్కిలి, Strong, great

చెక్కు: అద్దము

తట్టుపుణుఁగు: పునుగుపిల్లి తైలము

దెసలు: వైపుల

కరిగమన: యేనుగు వలె నడచు

మదము: మత్తు, పారవశ్యము

సామజము: యేనుగు

తఱచ: దట్టమైన, thick


భావం:

ఈ సంకీర్తన అన్నమాచార్యుల కుమారుడైన పెదతిరుమలయ్య గారి రచన. పెదతిరుమలయ్య, ఆయన తనయుడు చిన్నన్న కూడా అన్నమయ్య అంతటి గొప్ప సంకీర్తనాచార్యులు, పరమ వేంకటేశ్వర భక్తులు. పెదతిరుమయ్య తిరుమల అభివృద్ధికి ఎంతో చేశారు. 


//ప// స్వామి రూపము..అందంగా, మరింత అందంగా, చూసిన ప్రతీసారీ ముఖంలో ఒక్కోసారి ఒక్కో కళ చప్పున మొలిచినట్టుగా ఉంది. 


//చ// జగదేకపతియైన స్వామి శరీరంపై చల్లిన తెల్లని కర్పూర రజను మరింత కాంతివంతంగా మారి నాలుగు పక్కలకీ చిందుతుంటే....ఆయన వక్షస్థలము చంద్రముఖిని (శ్రీదేవిని) పూని చిక్కని, తీక్ష్ణమైన వెన్నెలను కిందకి వెదజల్లుతున్నట్టుంది. 


//చ// మిక్కిలిగా మెరుస్తూన్న నున్నని అద్దాలవలే ఉన్న బుగ్గలపై పూసిన పునుగు తైలము కరిగి రెండువైపులా కారుతుంటే....మదించిన యేనుగు నుంచి వచ్చే స్రావాలు (సామజసిరి) తొలికినట్టు (యేనుగు వంటి నడక కలిగినవాడు కాబట్టి ) ఆయన మోహమదం (శ్రీదేవిపై) కారుతున్నట్టుంది. 


//చ// అందాల, ఆనందనిలయుడైన నల్లని వేంకటేశ్వరుడు దట్టంగా బంగారు ఆభరణాలు ధరించి ఉంటే.... అందాల భరిణయైన అలమేలుమంగ, తాను "మెరుపు - మేఘము” కలిసి మెరుస్తూన్నట్టుంది.      


No comments:

Post a Comment