Total Pageviews

Thursday, July 29, 2021

ఏలే యేలే మరదలా చాలు చాలు చాలును [Ele Ele Maradala chalu chalu chalunu]

 //ప// ఏలే యేలే మరదలా  చాలు చాలు చాలును

చాలు నీతోడి సరసంబు బావ


//చ// గాటపు గుబ్బలు కదలగ కులికేవు

మాటల తేటల మరదలా

చీటికి మాటికి జెనకేవే

వట్టి బూటకాలు మానిపోవే బావ


//చ// అందిందె నన్ను అదలించి వేసేవు

మందమేలపు మరదలా

సందుకో తిరిగేవు సటకారివో బావ

పొందుగాదిక పోవే బావ


//చ// చొక్కపు గిలిగింత చూపుల నన్ను

మక్కువ సేసిన మరదలా

గక్కున నను వేంకటపతి కూడితి

దక్కించుకొంటి తగులైతి బావ


ముఖ్యపదార్ధం:


గాటపు:  బిగుతైన, బరువైన

గుబ్బలు: స్తనములు

కులుకు: శృంగారముగా కదులు To move gracefully

సరసము: పరిహాసము crack jokes

చెనకు: తాకు. అంటు, స్పృశించు To touch

బూటకము: మాయ, వంచన, A trick, guile, prank

అదలించు: బెదిరించు, గద్దించు, To frighten, menace

మందమేలపు: బలమైన  

సందు: స్నేహంగా

సటకారితనము: సతాయించు? అవకాశవాదము?

పొందు: ప్రాప్తించు, దొరకు To gain, obtain, get, acquire

చొక్కము: స్వచ్చమైన

గిలిగింత: Tickling, giggling

మక్కువ: ప్రేమ Affection, love; desire

గక్కున: Quickly. శీఘ్రముగా.

కూడు: చేరు, కలయు To unite

తగులము: సంబంధము, ఆసక్తి Connection


భావం:


ఈ సంకీర్తన బావా- మరదళ్ళ మధ్య సంభాషణ రూపంలో వ్రాయబడినది. అంతర్లీనంగా ఆలోచిస్తే, జీవాత్మ ఐహిక బంధాలను వదలి పరమాత్మని చేరుకునే విధానాన్ని వివరించినట్టుంది. 


ఎందుకే, ఎందుకే మరదలా?.. చాలు, చాలు...చాలు నీ తోటి సరసాలు బావా..


బిగువైన పాలిండ్లతో శృంగారంగా కదులుతూ, అందంగా మాట్లాడే మరదలా...

చీటికీ మాటికీ ముట్టుకుంటావు. నీ నాటకాలు, వంచనలు ఇంక చాలు బావా.


దగ్గరగా ఉన్న నన్ను బెదిరించి తోసేస్తావు, బలమైన మరదలా..

స్నేహంగా తిరుగుతూ అవకాశం కోసం చూస్తున్నావు. ఇక మనకి పొందు (సఖ్యత) కుదరదు. పో బావా..


స్వచ్చమైన, గిలిగింత చూపులతో నాలో ప్రేమను/కామాసక్తిని కలిగించిన ఓ మరదలా..

నేను, శ్రీఘ్రముగా వేంకటపతిని కలిశాను. ఆయనతో సంబంధాన్ని దక్కించుకున్నాను.. నన్ను వదులు బావా...


No comments:

Post a Comment