Total Pageviews

Wednesday, July 8, 2015

అంగనకు విరహమే సింగారమాయ - చెంగట నీవేయిది చిత్తగించవయ్యా [Anganaku virahame singaramaya]

//ప// అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవేయిది చిత్తగించవయ్యా!

//చ// కలికి నిన్ను తలచి గక్కున లోలో కరగి
జలజల చెమరించి జలకమాడె
బలు తమకాన నీకు పక్కన నెదురువచ్చి
నిలువున కొప్పు వీడి నీలి చీర గప్పెను

//చ// సుదతి నిన్ను చూచి సోయగపు సిగ్గులను
పొదలి చెక్కుల దాకా పూసె గంధము
మదన మంత్రములైన మాటల మర్మము సోకి
ముదురు పులకలను ముత్యాలు గట్టెను

//చ// గక్కన కాగిట నిన్ను కలసి ఈ మానిని
చొక్కి చంద్రాభ్రణపు సొమ్ములు వెట్టే
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
దక్కి సరసములను తలబాలు వోసెను

ముఖ్యపదాల అర్ధం:
అంగన: స్త్రీ
చెంగట: సమీపము
చిత్తగించు: చూడు (ఇక్కడ అర్ధంలో)
కలికి: చక్కనైన ఆడుదు
గక్కున: వెంటనే
చెమరించి: చెమటలు విడుచు
జలకమాడె: స్నానమాడె
బలు తమకాన: బలమైన కోరికతో
సుదతి: అందమైన పలు వరుస కలిగినది
పొదలి:  పెరిగి
మానిని: మానము కలిగిన ఆడుది
చొక్కి: పరవశము
అక్కున: రొమ్ము
తలబాలు: తలంబ్రాలు

భావం:
అలమేల్మంగకు విరహమే సింగారము అయ్యింది, నీవే ఇది చూడవయ్యా అని శ్రీవేంకటేశ్వరునితో చెలులు చెప్తున్నట్టు, అన్నమయ్య రచించిన శృంగారకీర్తన ఇది.  అన్నమయ్య సంకీర్తనలు చూస్తే - మొదటి రెండు చరణాలూ శ్రీవారి కోసం నాయిక భరించలేని విరహాన్ని అనుభవిస్తున్నట్టూ ఉండి, చివరి చరణంలో ఆ విరహం తీరి, శ్రీవారి సాంగత్యము పొంది, ధన్యురాలైనట్టుగా - రచన సాగుతుంది. 

నీ వలన కలిగే విరహతాపమే నీ భార్యకు సింగారమయ్యింది. ఆమె చెంతకు చేరి నీవే చూడు.

నీ అందమైన భార్య నిన్ను మనసులో తలుచుకోగానే, ఆ వెచ్చని తలపులకు సున్నితమైన శరీరం లోలోపలే కరిగిపోయి, చెమటలు పట్టి, ఆ చెమటల్లో స్నానం చేసినట్టుంది.     
నీపై బలమైన కాంక్షతో, నీ ఎదురుగా వచ్చేడప్పటికి, నిటారుగా పెట్టుకున్న కొప్పును విడదీసి, నల్లని పొడవాటి జుట్టును తన శరీరం అంతా చీరలా కప్పేసింది. [ఆయనంటే సిగ్గు మరి, మన్మధుని తండ్రి కదా! ఎలాగూ ఆ కొప్పు కాసేపు పోతే ఉండదని ఆమెకు తెలుసు. పైగా, కొప్పును అలా విడదీయడమంటే, స్త్రీ తన భర్తతో శృంగారాభిలాషని తెలియజేయడమని అర్ధం కాబోలు!!]

నీ ఆలోచనల్లో ఉండి, చక్కని పలు వరస కలిగిన ఈ యువతి, సిగ్గులతో ఎరుపెక్కిన చెక్కిళ్ళపై బాగా ఎక్కువగా గంధాన్ని పూసింది.
నీ శృంగారపు మాటల్లో ఉన్న లోతైన అర్ధాన్ని పసిగట్టి, శరీరంపై పులకలు మొలిచి, చెమట బిందువులన్నీ గట్టిగా మారి, ఆమె మేని అంతటా ముత్యాలు పేర్చినట్టుగా ఉంది. 
   
మానము కలిగిన ఈ పడతి, వెంటనే నీ కౌగిట్లో కలిసిపోయి, పరవశంతో నీ మెడలో చంద్రాభరణంలా ప్రకాశించింది. 
ఆపై, అలమేల్మంగ నీ రొమ్ముపైకి జేరి, నీపై మురిపెంపు సరసాలు అనే తలంబ్రాలు పోసింది. 

3 comments:

  1. నమస్కారం అండి కిరణ్ గారూ!
    చాల అద్భుతమైన టపాలు పెట్టారు
    శుభాభినందనలు. . మా నల్లనయ్య మీకు సకల శ్రేయస్సులు అనుగ్రహించి గాక
    - భాగవత గణనాధ్యాయి.

    ReplyDelete
  2. తాత్చాపర్యాలు చాలా బాగున్నాయి.

    ReplyDelete