Total Pageviews

Thursday, July 18, 2013

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప - నగరాజ ధరుడ శ్రీనారాయణ

//ప// నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడ శ్రీనారాయణ

//చ// దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
నోపకకదా నన్ను నొడబరపుచు
పైపైనె సంసారబంధముల గట్టేవు
నాపలుకు చెల్లునా నారాయణా

//చ// చీకాకు పడిన నా చిత్త శాంతము సేయ
లేకకా నీవు బహులీలనన్ను
కాకుసేసెదవు బహుకర్మల బడువారు
నాకొలదివారలా నారాయణా

//చ// వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
భవసాగరముల నడబడ జేతురా
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీత చోర శ్రీ నారాయణా


ముఖ్యపదార్ధం:
నిగమము= వేదము
నిగమాంత= వేదాంతము= ఉపనిషత్తులు The theological part of the Vedas, i.e., the Upanishads, ఉపనిషత్తులు
వర్ణిత= వర్ణించబడిన
మనోహర రూప= మనస్సులను హరించే అందమైన రూపము గలవడా
నగరాజ ధరుడు= నగము అంటే కొండ (which is immovable). గోవర్ధనము అనే పెద్ద కొండను ధరించినవాడా
నారాయణ=నార+అయనుడు= నీటిమీద నివసించే వాడు (విష్ణువు)
దీపించు= వెలుగుతున్న, కాంతివంతమైన
వైరాగ్య దివ్య సౌఖ్యము= వైరాగ్యము అనే దివ్య సుఖము
ఈయక నోపకకదా= ఇవ్వడానికి ఒప్పక కదా
నొడబరచు= తప్పులు ఎంచు
చిత్త శాంతము= మనశ్శాంతి
బహులీల= అనేక లీల
కాకుసేయు= కలత చేయు
నిర్బంధములు= తప్పించుకోలేని బమ్ధములు, ఇష్టములేకున్నా ఇతరుల ఒత్తిడి మీద చేసే పనులు
భవసాగరములు= పాపము సముద్రాలు
అడపడు= అడ్డుపడు
దివిజేంద్రవంద్య= దివిజ+ఇంద్ర+వంద్య= దేవరలచేత, దేవతలకి రాజైన ఇంద్రుని చేత కొలవబదేవడా
చోర= దొంగ


భావం:
అన్నమయ్య శ్రీవారిని ఈ బంధాలపై వ్యామోహాన్ని తెంచమని, శాశ్వతమైన వైరాగ్య సుఖాన్ని ఇప్పించమని కోరుతున్నారు. ఇహ భోగాల్లో చిక్కుకున్న ఆయన పలుకులు స్వామిని చేరుతున్నాయా? అని అడుగుతున్నారు.

పాల సముద్రంలో శయనించే స్వామీ! వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ మహత్తరంగా వర్ణించబడిన విధంగా మనస్సులను హరించే కోటి మన్మధుల సౌందర్య రూపము గలవాడా, గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుతో ఎత్తి ధరించిన శ్రీమన్నారాయణా.

నాయందు తప్పులు ఎంచి, నాకు జ్ఞానకాంతితో వెలుగుతున్న దివ్యమైన వైరాగ్య సుఖాన్ని ఇవ్వడానికి వెనకడుతున్నావు. ఈ పైపై సంసార బంధాల్లో (సంసారము, భార్య, పిల్లలు, బంధువులు వంటి ఆశలు) నన్ను కట్టిపాడేశావు. నా వేడుకోలు పలుకులు నిన్ను చేరుతున్నాయా? చేరినా అవి చెల్లుతాయా?

కామ, క్రోధాది అరిషడ్వర్గాలతో నా మనస్సు చీకాకుకి గురి అవుతున్నప్పుడు నీ దివ్యలీలలతో నా మనసుకి శాంతము చేకూర్చకుండా నీ ఆటలతో నన్ను మరింత కలత చెందించి వినోదిస్తున్నావు. నన్ను కూడా అందరిలాగానే చూస్తున్నావా? నిన్నే నమ్ముకున్న నాకు, నిన్ను గుర్తించక అనేక పాపకర్మలు చేస్తున్న మిగతావారికీ తేడా లేదా?

నాకు ఇష్టంలేని పనులను నిర్బంధించి చేయించాలని చూడకుండా ఈ పాప సముద్రాలని ఈదలేకపోతున్న నాకు అడ్డుపడి నన్ను బయటపడేసి ఉద్దరించు స్వామీ! ఓ వెన్నదొంగా, దేవతల చేత, దేవేంద్రుని చేత నిత్యము కొలవబడే వాడా, శ్రీమన్నారాయణా...

2 comments:

  1. EXCELLENT AND WONDERFUL HARD WORK TO BRING ANNAMAYYA'S KEERTHANAS IN TO DIGITAL FORM.. THANKS TO YOU SIR.
    krishnamurthy

    ReplyDelete
  2. చక్కని వివరణతో కూడిన భావార్థం. కృతజ్ఞతలు

    ReplyDelete