నాలం వా తవ నయవచనం
చేలం త్యజతే చేటీ భవామి //ప//
చల చల మమ సం సద్ఘటనే కిం
కులిశ హృదయ బహుగుణ విభవ
పులకిత తను సంభృత వేదనయా
మలినం వహామి మదం త్యజామి || నాలం ||
భజ భజ తే ప్రియ భామాం సతతం
సుజనస్త్వం నిజ సుఖనిలయ
భుజరేఖా రతి భోగ భవసి కిం
విజయీభవ మద్విధిం వదామి || నాలం ||
నయ నయ మామను నయనవిధంతే
ప్రియ కాంతాయాం ప్రేమభవం
భయహర వేంకటపతే త్వం
మత్ప్రియో భవసి శోభితా భవామి || నాలం ||
ప్రతిపదార్ధం:
నాలం వా: న+అలం = చాలవా?
తవ= నీయొక్క
నయవచనం= ప్రియమైన మాటలు
చేలం: కొంగు
త్యజతే: నీవు విడువుము
చేటీ భవామి: దాస్యము చేస్తాను (దాసి అయి ఉన్నాను)
చల చల: కదులు కదులు
మమ సం సద్ఘటనే కిం: నాకు దగ్గరగా ఎందుకు వస్తావు?
కులిశ హృదయ: కఠినమైన హృదయము కలవాడా
బహుగుణ విభవ: ఎన్నో సద్గుణాల చే ప్రకాశించేవాడా
పులకిత: పులకించబడిన
తను: శరీరము
సంభృత: చక్కగా భరింపబడిన
వేదనయా: వేదన చేత
మలినం వహామి: మలినాన్ని మోస్తోంది
మదం త్యజామి" చమటను విసర్జిస్తోంది
భజ భజ: వెళ్ళు వెళ్ళు
తే ప్రియ భామాం: నీ ప్రియ భామలతో
సతతం: ఎల్లప్పుడూ
సుజనస్త్వం: సుజనః+త్వం = మంచివాడవైన నీవు
నిజ సుఖనిలయ: అద్భుత సుఖనిలయుడవు
భవసి కిం: అయ్యావా ఏంటి?
భుజరేఖా రతి భోగ: రతి భోగము వలన భుజము మీద ఏర్పడిన రేఖలు (ఆ రతి సుఖాలకి చిహ్నాలు అవేనా?)
విజయీభవ: నీకు విజయము చేకూరు గాక
మద్విధిం వదామి: మత్+విధిం+వదామి=నా విధి ని చెప్పుకుంటున్నాను.
నయ నయ: తొలగు తొలగు
మాం అనునయనవిధం: నన్ను నువ్వు ఓదార్చే విధానం
తే ప్రియ కాంతాయాం ప్రేమభవం: నీ ప్రియకాంతలకు ప్రేమను కలిగిస్తుంది (నాకు కాదు!)
భయహర: భయాల్ని తొలగించేవాడా
వేంకటపతే: ఓ వేంకటపతీ
త్వం: నీవు
మత్ప్రియో: మత్+ప్రియ: =నాకు ప్రియమైన వాడవు
భవసి: అగుచున్నావు (ఐతే)
శోభితా భవామి: నేను సంతోషిస్తాను
భావం:
ఈ సంకీర్తన లలితమైన సంస్కృత పదాలతో అన్నమయ్య భావ సముద్రంలోనుంచి వచ్చిన ఒక అలలా రమణీయంగా ఉంది. రాత్రంతా శ్రీవారు పరస్త్రీలతో రతి సలిపి ఇంటికి వచ్చారు. శ్రీవారంటే ప్రగాఢమైన ప్రేమ ఉన్న వేరే నాయిక ఈర్ష్య పడుతూ ఆమె వేదనని ఇలా తెలియజేస్తోంది.
చాలు చాలు. నీ ప్రియమైన కల్లబొల్లి మాటలు చాలవా?. నా కొంగు విడువు నీకు దాస్యము చేస్తాను.
కఠినమైన హృదయము గలవాడా! దగ్గరగా వస్తావెందుకు? కదులు కదులు. నీ మంచి గుణాలకి పులకరించి పోయి, నా శరీరం చెమటలు విసర్జిస్తూ మలినమైపోతోంది. (ఎత్తిపొడుపు మాటలు ఇవి. నిజానికి ఆవిడకి చెమటలు పట్టినది శ్రీవారి పైన విరహంతో..రాత్రంతా ఆయనకోసం ఎదురు చూసి నిద్రలేక వళ్ళు వేడెక్కడం వల్ల ఐనా ఉండి ఉండవచ్చు)
మంచివాడవే! వెళ్ళు, వెళ్ళు. నీ ప్రియ భామల దగ్గరకే వెళ్ళు. నీవు వాళ్ళల్తో ఎంత రతి సుఖాలనుభవించావో నీ భుజాలపై మచ్చలు చూస్తేనే తెలుస్తోంది. (తీవ్రమైన రతిలో నాయికలు శ్రీవారి భుజాలమీద గోళ్ళతో గిచ్చడం, గీరడం వల్ల రేఖలు గా ఏర్పడి ఉంటాయి. అవి చూసిన నాయికలతో ఎంత గొప్ప రతి సల్పి ఉంటారో అని ఊహించుకుంటోంది.) ఆ గుర్తులు అవేనా?. నీకు నీ నాయికలతో రతి భోగంలో విజయం కలుగు గాక. నిన్నని ఏం ప్రయోజనం. నా ఖర్మకి నేనే అనుకుంటున్నాను.
తప్పుకో, తప్పుకో...ఆహా! చేసినదంతా చేసేసి, ఎంత బాగా ఓదారుస్తున్నావు. నువ్వు ఓదార్చే విధానం నువ్వంటే ప్రేమను ఒలకబోసే నీ ప్రియ కాంతలకు నచ్చుతుంది, నాకు కాదు. అన్ని భయాల్నీ తొలగించేవాడా! వేంకటపతీ! నీవు నాకు ప్రియమైన వాడవు. ఇకపై అయినా నా ఒక్కదానికే ప్రియుడవైతే నేను సంతోషిస్తాను..