Total Pageviews

Friday, May 18, 2012

ఏడ వలపేడ మచ్చికేడ సుద్దులు-ఆడుకొన్న మాటలెల్ల నవి నిజాలా


//ప// ఏడ వలపేడ మచ్చికేడ సుద్దులు 
     ఆడుకొన్న మాటలెల్ల నవి నిజాలా
//చ// తొలుకారు మెరుపులు తోచిపోవుగాక
              నెలకొని మింట నవి నిలిచీనా
      పొలతులవలపులు పొలసిపోవుగాక 
              కలకాలం బవి కడతేరీనా
//చ// యెండమావులు చూడనేరులైపారుగాక 
              అండకుబోవ దాహ మణగీనా
      నిండినట్టిమోహము నెలతలమది జూడ 
              వుండినట్టేవుండుగాక వూతయ్యీనా
//చ// కలలోని సిరులెల్ల కనుకూర్కులేకాక 
              మెలకువ జూడ నవి మెరసీనా
      అలివేణులమేలు ఆసపాటేకాక 
              తలపు వేంకటపతి దగిలీనా
ముఖ్యపదాల అర్ధం:
//ప// ఏడవలపు: ఎక్కడ ప్రేమ  
ఏడ మచ్చిక: మోహము ఎక్కడ
ఏడ సుద్దులు: ఎక్కడ కబుర్లు (Talk, chatter, words)
ఆడుకొన్న మాటలెల్ల నవి నిజాలా: చెప్పుకున్న ఊసులన్నీ అవి నిజాలా?
//చ//తొలుకారు: తొలుకు+కారు= The rainy season. వర్షాకాలము. 
మెరుపులు: మేఘాలు ఢీకొన్నప్పుడు వచ్చే కాంతి
తోచిపోవుగాక: తోచు+పోవు = పుట్టి పోతాయి కానీ (తోచు =To arise. పుట్టు)
నెలకొని: నిలకడగా, ఎప్పటికీ, నిలుచుండు (stay forever)
మింట: మిన్ను ఇంట= ఆకాశవీధిలో 
అవి నిలిచీనా: అవి (మెరుపులు) నిలిచి ఉంటాయా? 
పొలతుల: అందమైన స్త్రీ ల
వలపులు: ప్రేమలు, అందాలు
పొలసిపోవుగాక: నశించిపోయేవి గానీ (పొలసు అంటే మాంసము.)
కలకాలం బవి కడతేరీనా: అవి (ఆ అందాలు) శాశ్వతంగా చివరి వరకూ ఉంటాయా?
//చ//ఎండమావులు: మృగతృష్ణలు The mirages
చూడనేరులైపారుగాక: చూడడానికి నీళ్ళు యేరులైపారుతున్నట్టుంటుంది కానీ 
అండకుబోవ: ఆశ్రయించి దగ్గరకు పోతే
దాహ మణగీనా: దాహం తగ్గుతుందా?
నెలతలమది: స్త్రీల మనసుల్లో
నిండినట్టిమోహము జూడ: నిండిపోయిన మోహం (వలపు, చిత్త వైకల్యము Love, fascination, infatuation) చూస్తే
వుండినట్టేవుండుగాక: ఉన్నట్టే ఉంటుంది కానీ
వూతయ్యీనా: సహాయపడుతుందా!
//చ//కలలోని సిరులెల్ల: కలలో వచ్చిన    సంపదలెల్లా
కనుకూర్కు: కను కూరుకు: నిద్రించిన కన్నుల్లోనే గానీ (కూరుకు అంటే నిద్రించు అని అర్ధం)
  మెలకువ జూడ నవి మెరసీనా: మెలకువ వచ్చి కన్ను తెరచి చూస్తే ఆ సంపదలు మెరుస్తాయా?
అలివేణులమేలు: ఆడువారి వల్ల జరిగే మేలు గురించి
ఆసపాటేకాక: ఆశపడటమే తప్ప
తలపు వేంకటపతి దగిలీనా: అది మనసుని వేంకటపతికి తగిలేలా చేస్తుందా?
భావం: 
//ప// ఎక్కడి ప్రేమ, ఎక్కడి మోహం, ఎక్కడి మాటలు. ఆవిడ అందాలను నువ్వు పొగుడుతూ, నీ గొప్పదనాన్ని ఆవిడ పొగుడుతూ, మీరిద్దరూ చెప్పుకున్న మాటలు అవన్నీ నిజాలా? (ఆవిడ అందం శాశ్వతమా?, ఈయన ప్రేమ/మోహం శాశ్వతమా? ఆ రెండూ శరీరాలున్నంత వరకే..శరీరాలు వయసుతో పాటు వడిలిపోతాయి. కాబట్టి, ఆవిడ అందం, దానిపై పెంచుకున్న ఈయన ప్రేమ/మోహం రెండూ నిజాలు కావు.)
//చ// వర్షాకాలం లో వచ్చే మెరుపులు అందంగానే ఉంటాయి. కానీ, అవి ఎప్పటికీ ఆకాశంలోనే ఉంటాయా?. పుడుతుంటాయి, పోతుంటాయి. అలాగే స్త్రీల అందమైన శరీరం కాలంతో పాటు నశించిపోతుంది కానీ, ఎప్పటికీ ఆ అందాలు శాశ్వతంగా ఉంటాయా? (దువ్వుకున్న ఆ నీలి ముంగురులు దూదిపింజల్లా తెల్లగా అయిపోతాయి. కాంతులు వెదజల్లు ఆమె అందమైన కళ్ళు పుసికలు కట్టి వికృతంగా అవుతాయి. అమృతం చిందే ఆ పెదవులు కృశించిపోయి బీడువారిన నేలలా తయారౌతాయి. పాలు పొంగు ఆ స్తనకలశాలు తోలుతిత్తులైపోతాయి. నడుము వంగి, ఒళ్ళు కృంగి, నిగనిగలాడే చర్మం డిలిపోయి వ్రేలాడుతూ, గజ గజ వణికిపోతూ, అవసాన దశను భారంగా మోయాల్సివస్తుంది కానీ, యౌవ్వనంలో ఉన్న ఆమె అందాలు శాశ్వతం కావు.)
//చ// దూరం నుంచి చూస్తే ఎండమావులు నీళ్ళు పారే సెలయేళ్ళలా కనిపిస్తాయి. కానీ దగ్గరగా వెళ్తే దాహం తీరుతుందా?. అలాగే ఆడువారి మనసులో ప్రేమ నిండినట్టే ఉంటుంది కానీ, అది నీవు మోక్షాన్ని చేరడానికి సహాయపడుతుందా?.  
//చ// కలలో వచ్చిన సంపదలన్నీ కన్ను మూసి ఉంచినంత సేపే కనబడతాయి. మెలకువ వచ్చి కన్ను తెరిచి చూస్తే ఆ సంపదల కాంతులు కనబడతాయా?. ఆడువారి వల్ల జరిగే మేలుగురించి (వారితో సాంగత్యసుఖం గురించి) ఆశపడటమే తప్ప, అది మనసుని శ్రీ వేంకటేశ్వరుని తగిలేలా చేస్తుందా??
వ్యాఖ్యానం:
స్త్రీ కి భగవంతుడిచ్చిన వరం సౌందర్యం. ఆ సౌందర్యంతో తన ప్రమేయంలేకుండానే పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది. అది ఆమె తప్పు కాదు. అలా ఆ సౌందర్యం వెంట పడటం మగవాడి నైజం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మగవాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఆడవాళ్ళని కించపరిచే మాట ఇందులో ఒక్కటి కూడా లేదు. కామం ప్రతీ జీవికీ సహజమైన విషయం. అదే లేకపోతే ఈ సృష్టే లేదు. స్త్రీ, పురుషులిద్దరికీ కామం సమానంగానే ఉన్నా ఆడవాళ్ళకి నిగ్రహశక్తి ఎక్కువ. అంత తొందరగా చలించరు. అతి తొందరగా చలించిపోయే పురుషుడు పాపకార్యాలు చేసే అవకాశం ఎక్కువ. అందువల్ల, మోక్షాన్ని చేరుకోవడం కష్టమౌతుంది. భూమిమీద మగ జంతువులన్నీ ఆడజంతువులను కామం కోసం వెంబడిస్తున్నాయి. కానీ ఆడజంతువులు మగ జంతువులను ఎందుకు వెంబడించడంలేదో, ఆ మాయ యేమిటో అర్ధంకావట్లేదని అన్నమయ్య "పురుషుడే అధముడు-పొంచియెందు దగులక" అన్న సంకీర్తనలో వివరించారు. 
స్త్రీలతో కాలక్షేపము పురుషునికి ఏ విధముగానూ ఉపయోగపడదు. స్త్రీకి సంబంధించిన విషయాలను గూర్చి ఆలోచించడం కంటే మనసుని శ్రీ వేంకటేశ్వరుని పై నిలుపుట మంచిదని ఆచార్యులు బోధిస్తున్నారు.  

Saturday, May 5, 2012

ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరి లేదు


//ప//ఆకటి వేళల అలపైన వేళల
             తేకువ హరినామమే దిక్కు మరి లేదు
//చ//కొఱమారియున్న వేళ కులము చెడిన వేళ
             చెఱవడి వొరుల చేజిక్కినవేళ
             వొఱపైన హరినామమొక్కటే గతి గాక
             మఱచి తప్పిననైన మఱి లేదు తెరగు
//చ//ఆపద వచ్చిన వేళ ఆఱడి బడిన వేళ
             పాపపు వేళల భయపడిన వేళ
             వోపినంత హరినామ మొక్కటే గతి గాక
             మాపు దాకా పొరలిన మరిలేదు తెరగు
//చ//సంకెల బెట్టిన వేళ చంప బిలిచిన వేళ
            అంకిలిగా నప్పుల వారాగిన వేళ
            వేంకటేశు నామమే విడిపించ గతినాక
            మంకు బుద్ది పొరలిన మరిలేదు తెరగు
ముఖ్యపదాల అర్ధం:
తేకువ: ధైర్యము
ఒఱపైన: అందమైన, ధృఢమైన
ఆఱడి: నింద
అంకిలి: అడ్డగింత
ఆగిన: నిలబెట్టిన
మంకుబుద్ధి: మూర్ఖత్వముతో
భావం: 
ఆకలి కలిగినప్పుడు, అలసిపోయినప్పుడు ధైర్యము చేకూర్చి రక్షించునది హరినామమొక్కటే. అది తప్ప మరొక దిక్కు లేదు.
తాను ఎందుకూ పనికి రాని దుస్థితి ఏర్పడినప్పుడు, కులము చెడినప్పుడు, ఇతరులచే బంధింపబడి కృశించినప్పుడు, ప్రకాశమానమైన హరినామమొక్కటే గతి, దానిని మరచినచో మరొక గతి లేదు. 
ఆపద కలిగినప్పుడు, నిందకు లోనైనప్పుడు, పాపము మీదపడినప్పుడు, భయపడినప్పుడు మిక్కిలిగా స్మరింపడిన హరి నామమొక్కటే గతి. దానిని విడిచి చివరి వరకూ మీ శక్త్యానుసారం ప్రయత్నించిననూ ఆ దుర్దశలనుండి కాపాడుటకు కాపాడుటకు మరొక మార్గం లేదు.
శత్రువులు సంకెళ్ళతో బంధించినప్పుడు, చంపుటకు పిలచినప్పుడు, అప్పులవారు అడ్డగించి నిలదీసినప్పుడు విడిపించుటకు శ్రీవేంకటేశ్వరుని నామమొక్కటే ఉపాయము. దానిని వదలి మూర్ఖత్వముతో ఎంత ప్రయత్నించిననూ వేరొక ఉపాయము లేదు. 
విశేషాంశం:
అన్నమయ్య శృంగారసంకీర్తన విని సాళ్వనృసింహరాయలు ఆయనను చెరశాల లో బంధించి హింసించినప్పుడు ఆచార్యులు "ఆటివేళల" అను సంకీర్తనను ఆలపించగా సంకెళ్ళు తమకు తామే విడిపోయెనట. అప్పుడు రాజు అచార్యుల పాదాలపై పడి క్షమించమని వేడుకొనగా "శ్రీహరి నిన్ను రక్షించుగాక" అని దీవించెనట. ఈ విషయము అన్నమయ్య మనుమడు చిన్నన్న తాను వ్రాసిన "అన్నమయ్య జీవిత చరిత్ర" నందు ఈ విధముగా ఉన్నది. 
"సంకెల లిడువాళ జంపెడువేళ-నంకిలి రుణదాత లాగెడు వేళ
వదలక వేంకటేశ్వరుని నామంబె-విదలింప గతి గాని వేరొండు లేదు
వనమాలి యతడె నావగ పెల్లనుడుపు-నను నర్ధములతో డ నలవడియుండ
సంకలితాత్ముడై సరగున నొక్క- సంకీర్తనము జెప్పి శరణు సొచ్చుటయు
ఘల్లున వీడి శృంఖలలూడి గుండె-ఝల్లని చూచి యచ్చటి వారు బెగడి
యా విధంబంతయు నారాజు తోడ-వేవేగ బరతెంచి విన్నవించుటయు
నగివడి సింహాసనము డిగ్గనురికి -పగగొన్న బెబ్బులి పగిది నేతెంచి
అన్నయార్యుని జూచి యయ్యరో వద్ద- నున్నవారలకెల్ల నొగిలించి మించి
వేయ నీ సంకెళ్ళు వీడె నటంచు-మాయురె నీవెంత మాయ వన్నినను
నేనేల పోనిత్తు నిది నిక్కమైన-నేనుండి తిరుగ వేయించెద నిపుడు
కిదుకక నీదు సంకీర్తనంబునకు-నది వీడెనా నిజంబని యెన్నవచ్చు
నీ పాలిదైవంబు నిన్ను నీ మహిమ- బాపురె! యని మెచ్చి పాటింపదదును
ననుచు నొద్దనె యుండి యానిగళంబు-తనికి చేనెత్తి యిద్దరు దేర మగుడ
నెక సక్కెమునకు వేయించిన గురుడు-నగి తొంటి సంకీర్తనము సేయుటయును
కాలి సంకెల చిటికిన వ్రేలిపలుము-చీలలు వీడి చెచ్చెర నూడిపడిన...."  

Thursday, April 26, 2012

ఏవం శ్రుతిమత మిదమేవ తద్భావయితు మతఃపరం నాస్తి


//0// ఏవం శ్రుతిమత మిదమేవ త-
              ద్భావయితు మతఃపరం నాస్తి
//1// అతుల జన్మభోగాసక్తానాం
              హితవైభవసుఖ మిదమేవ
              సతతం శ్రీహరి సంకీర్తనం త-
              ద్వ్యతిరిక్తసుఖం వక్తుం నాస్తి
//2// బహుళమరణ పరిభవచిత్తానా-
              మిహపరసాధన మిదమేవ
              అహిశయనమనోహరసేవా త-
              ద్విహరణం వినా విధిరపి నాస్తి
//3// సంసారదురిత జాడ్యపరాణాం
              హింసావిరహిత మిదమేవ
              కంసాంతక వేంకటగిరిపతేః ప్ర-
              శంసైవాం పశ్చాదిహనాస్తి
ముఖ్య పదాల అర్ధం:
0. ఏవం: ఈ చెప్పబోవు రీతిగా
శ్రుతిమతమ్: వేద మతము (శృతి అంటే వేదం)
ఇదమేవ: ఇదియే
తత్: ఆ ప్రసిద్ధమైన 
భావయితుం: భావించుటకు
అతఃపరం: దీనికంటే వేరైనది
నాస్తి: లేదు
1. అతులభోగాసక్తానాం: సాటిలేని జన్మభోగములయందు ఆసక్తులైన వారికి
హితవైభవం: మేలు చేకూర్చు ఐశ్వర్యము (విభవం అంటే సంస్కృతంలో ఐశ్వర్యము)
ఇదంఏవ: ఇదియే
సతతం: ఎల్లప్పుడు
శ్రీహరిసంకీర్తనం: శ్రీమన్నారాయణుని సంకీర్తనయే
తద్వ్యతిరిక్తసుఖం: దానికంటే వేరైన సుఖము
వక్తుం: చెప్పుటకు
నాస్తి: లేదు
2. బహుళమరణపరిభవచిత్తానాం: అనేకములైన మారణావమానములతో కూడిన మనస్సుగలవారికి
ఇహపరసాధనం: ఇహపరలోకమందును, పరలోకమందును (ఉత్తమగతికి) సాధనమైనది
ఇదం ఏవ: ఇదియే
అహిశయన మనోహరసేవా: శేషశయనుడైన శ్రోహరి యొక్క మనోహరమైన సేవ
తద్విహరణం వినా: ఆ సేవా విహారము తప్ప
విధిరపి: (మరొక) విధానము కూడా
నాస్తి: లేదు
3. సంసారదురిత జాడ్యపరాణాం: సంసారపాపమనెడు రోగమునకు వశులైన వారికి
హింసావిరహితం: హింసలేనిది
ఇదమ్ ఏవ: ఇదియే
కంసాంతక వేంకటగిరి పతే: కంసనాశకుడైన శ్రీవేంకటాచలపతి యొక్క (కంసుణ్ణి చంపింది కృష్ణుడు. ఆ శ్రీ కృష్ణుడే వేంకటాద్రి బాల కృష్ణుడు.)
పశంసా ఏవ: గుణ కీర్తనమే
ఇహ: ఈ విషయము నందు
పశ్చాత్: దీని కంటే
నాస్తి: లేదు
భావం:
0. జనులారా! ఇదియే నేను (అన్నమయ్య) ఇప్పుడు ప్రకటించునదే వేదమతము. ఆలోచించిగా ఇంతకంటే శ్రేష్ఠమైన మతము వేరొకటి లేదు.
1. మాటిమాటికీ పుట్టేవారికి, సుఖబోగాలంటే అమితాసక్తి కలవారికీ, మేలైన ఐశ్వర్య సుఖం ఇదే. ఎప్పుడూ శ్రీహరి గుణ, కర్మ, నామముల సంకీర్తనమే ఆ సుఖము. దానికంటే గొప్ప సుఖము వేరొకటి లేదు. 
2. చీటికీ మాటికీ చచ్చే వారికి ఇహలోకమునందును, పరలోకమునందును ఉత్తమ గతికి సాధనము కూడా ఇదే. అదే శ్రీమన్నారాయణుని రమ్యమైన సేవ. ఆ సేవలో పొందే ఆనందము కన్నా మరొక వేదసమ్మతమైన విధానము లేదు. 
3. సంసారమనెడు రోగమునకు వశమైన వారికి బాధింపకుండా నయం చేసే మార్గం ఒక్కటే. అదే కంసహరుడైన శ్రీ వేంకటేశ్వరుని మహిమలను ప్రశంసించుటయే. దాని కంటే మేలైన మార్గం కనిపించుట లేదు. 
విశేషాంశం: చావుపుట్టుకలనే బాధలతో నిండినది సంసారము. దానినుండి సాధ్యమైనంత తొందరగా బయటపడుటయే వివేకవంతుల కర్తవ్యము. హరి సంకీర్తనము, హరి సేవ, హరి ప్రశంస అనేని మాత్రమే ఈ సంసారబంధములను పారద్రోలేవని అన్నమయ్య ప్రబోధిస్తున్నారు. 

Wednesday, April 25, 2012

నీవు సర్వసముడవు నీవు దేవదేవుడవు ఈవల గుణదోషాలెంచనికనేల?


//ప// నీవు సర్వసముడవు నీవు దేవదేవుడవు
              ఈవల గుణదోషాలెంచనికనేల?
//చ// పూవులపై గాసీ పొరి ముండ్లపై గాసీని
              ఆవల వెన్నెలకేమీ హానీ వచ్చీనా?
              పావనులనటుగాచి పాపపుంజమైన నన్ను 
              కావగా నీ కృపకు గడమయ్యీనా?
//చ// గోవుమీద విసరీ కుక్కమీద విసరినీ
              పావనపుగాలికిని పాపమంటీనా
              దేవతల రక్షించి దీనుడనైన నాకు
              దోవచూపి రక్షించితే దోషమయ్యీనా?
//చ// కులజుని యింటనుండి కులహీనుని యింటనుండీ
            యిలలో నెండకు నేమి హీనమయ్యీనా?
            వలసి శ్రీవేంకటాద్రి వరములు యిచ్చి నాలో
             నిలిచి వరములిచ్చి నేడు గావవే..
భావం:   
స్వామీ! నీవు అందరియందు సమభావాన్ని కలిగి ఉన్నావు. నీవు దేవాదిదేవుడవు. ఎక్కువ తక్కువతనములు, తప్పొప్పులు వెదకి చూసే స్వభావము నీది కాదుకదా! అలాంటప్పుడు నాలోని గుణదోషాలను చూడవలసిన అవసరం నీకేమున్నది? (మనలాంటి మనుష్యులు ఇతరుల గుణగోషాలను నిరంతరం ఎత్తి చూపుతుంటారు. భగవంతునికి అందరూ సమానమే. పాపాత్ముడైనా, పుణ్యాత్ముడైనా ఒకేరకంగా చూస్తాడు. పాపాత్ముడు వాడి చేసిన పాపాలకు, కర్మ ఫలాన్ని అనుభవిస్తుంటాడు.) 
(You treat all equally well. You are the Lord of the Lords. Why should you find fault with me?)
వెన్నెల పువ్వులపైనా కాస్తుంది. ముళ్ళపైనా కాస్తుంది. ముళ్ళపై కాసినంత మాత్రాన వెన్నెలకి ఏమైనా హాని కలిగిందా? స్వామీ! నీ దయ ఎందరో పుణ్యాత్ములను కష్టాలనుండి కాపాడింది. నేను పెద్ద పాపరాశిని. నన్ను కాపాడినంత మాత్రాన నీ దయకు కలిగే లోటేమున్నది?
(The moonlight shines on flowers and bushes equally. Is there any harm to the moonlight ? You protect the pious people. Is it a burden for you to protect a sinner like me?)
పవిత్రమైన గాలి ఆవుమీద వీస్తుంది. అలాగే కుక్క మీద కూడా వీస్తోంది. కుక్క నీచ జంతువు కావచ్చు. అయినా కుక్క మీద వీచినంత మాత్రాన గాలికేమైనా పాపం అంటిందా? స్వామీ! నీవు దేవతలను రక్షించావు. నేను దీనుడను. నీ శరణాగతుడను. నాకు కూడా తగిన మార్గము చూపి రక్షించితే నీకేమైనా దోషం అంటుతుందా?
(The wind blows on a cow and also on a dog. Is the wind touched by sin? You protect the devatas. Do you get blemished if you shower mercy on a distressed one like me?)
నిరంతర వేదాధ్యయనం, హోమాలు, యాగాలు చేసే ఉత్తమ కులస్థుని యింటా ఎండ కాయుచున్నది. అదే యెండ జంతువులను చంపుతూ, వాటి మాంసము తిను హీన కులస్థుని యింటా కాయుచున్నది. అందువల్ల ఎండకేమైనా హీనత్వము అంటుకుందా? శ్రీ వేంకటేశ్వరా! వేంకటాచలముపై నుండి ఎందరికో వరములిచ్చి కాపాడినావు. నన్ను కూడా అనుగ్రహించి వరములిచ్చి రక్షింపవయ్యా!
(The Sun shines equally on the houses, irrespective of their high or low status. Does the Sunlight lose its value? Oh Venkatesa,Why don't you protect me granting boons ?)
విశేషాంశం: 
భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ఆయనకి ఒకరిపై ప్రేమ, మరికరిపై ద్వేషం ఉండవు. ఆయనకి కూడా అలా ఉంటే ఇక ఆయన గొప్పతనమేమున్నది? ఆయన దృష్టిలో కులాలు కూడా లేవు. ఉన్నత కులం, హీనకులం అనేవి అసలు లేనే లేవు. ఎవరు ఆయన్ను పూజిస్తారో వారికి ఆయన దగ్గరౌతాడు.       

Monday, April 23, 2012

నే నొక్కడ లేకుండితే నీ కృపకు పాత్రమేది - పూని నా వల్లనే కీర్తి బొందేవు నీవు

ప// నే నొక్కడ లేకుండితే నీ కృపకు పాత్రమేది
        పూని నా వల్లనే  కీర్తి బొందేవు నీవు 
చ//  అతి మూఢులలోన నగ్రేసరుడనేను
        ప్రతిలేని ఘన గర్వ పర్వతమను
        తతి పంచేంద్రియముల ధనవంతుడను నేను
        వెతకి నా వంటివాని విడువక జెల్లునా
చ// మహిలో సంసారపు సామ్రాజ్యమేలే వాడ నేను 
       ఇహమున కర్మ వహికెక్కితిని నేను
       బహుయోని కూపసంపద దేలేవాడ నేను
       వహించుక నావంటి వానిదేనోపేవా
చ// భావించి నావంటి నీచు బట్టి కాచినప్పుడుగా
       యే వంక నీకీర్తి గడు నెంతురు భువి
       నా వల్ల నీకు బుణ్యము నీ వల్ల నే బ్రతుకుదు
       శ్రీ వేంకటేశుడ యింత చేరె జుమ్మీ మేలు. 
ముఖ్యపదాల అర్ధం:
పాత్రము: యోగ్యము
అగ్రేసరుడను: అందరికన్నా ముందు నడచువాడను
ప్రతిలేని: సాటిలేని
ఘన గర్వ పర్వతము: పెద్ద గర్వ పు కొండను
తతిన్: అదనులో
కర్మవహికి: కర్మ విధికి
బహుయోని కూప సంపదన్: అనేకములైన యోని కూపములనెడు సంపదలో
వహించుక: పట్టుబట్టి
భావం: 
స్వామీ! నే నొక్కడని లేకపోతే నువ్వు ఎవరి మీద కృప చూపిస్తావు?. నువ్వు నా మీద కృప చూపించబట్టే కీర్తిని పొందుతున్నావు. కాబట్టీ నీ కీర్తికి కారణం నేను. అలా ఎందుకంటావా? ఐతే విను.
ఈ సృష్టిలో ఉన్న అందరిలో బొత్తిగా తెలివిలేని వారలలో మొదటివాణ్ణి నేను. పైగా నాకు ఒళ్ళంతా పొగరు. ఒక పొగరు కొండను నేను. కళ్ళు, ముక్కు, నాలుక, నోరు, చెవులు  ఈ ఐదు పంచేంద్రియములే నాకున్న సంపద. ఇన్ని గొప్ప లక్షణాలున్న నన్ను వదిలి పెట్టుట నీకు తగునా స్వామీ!
ఈ భూమిపై సంసారమనెడు సామ్రాజ్యాన్ని పాలించే ప్రభువును (భార్యకీ, పిల్లలకీ దిక్కుగా, కుటుంబపెద్దగా పోషించేవాడని అర్ధం). ఇక్కడ చేసే పనులతో బాగా పేరు తెచ్చుకున్నవాడను. యోనికూపములనెడు సంపదలో మునిగితేలుతున్నవాడను (అనేక మంది స్త్రీలతో సంయోగము లేదా ఎన్నో జన్మలనుంచి అనేక యోనులయందు పుడుతున్నవాడను అని కూడా అర్ధం చేసుకోవచ్చు). నా వంటి వానిని పట్టుపట్టియైన నీవు వేరొకచోట వెదకి కట్టేసుకో. మళ్ళీ నీకు నా అంత నీచుడు దొరకడేమో.
నాలాంటి పరమ నీచుని రక్షించినప్పుడు కదా! లోకమంతా నిన్ను కీర్తిస్తారు. నన్ను రక్షిస్తే నీకు పుణ్యం వస్తుంది. నీవల్లనే నేను దుఖా:లు లేని స్థితిని పొందగలను. శ్రీ వేంకటేశ్వరా! మనిద్దరికీ బాగా లంకె కుదిరింది. మనం ఒకరి వల్ల ఒకరు లాభం పొందే సమయం వచ్చింది. కాబట్టి నన్ను కాపాడి పుణ్యం కట్టుకో స్వామీ!...
విశేషాశం: అన్నమయ్య మహా విద్యావేత్త. సకల వేద పురాణేతిహాసములు అవపోసన పట్టిన మహా దిట్ట. భగవంతుడు కరుణామయుడు. ఆయనకు ఉండే కరుణ వల్లనే ఆయన కీర్తి పెరుగుతోంది. పుణ్యాత్ములపై స్వామి తన కృపను ప్రసరిస్తే అందులో వింతేముందీ?. పాపాత్ములలో మేటిఐన జీవుని పరిరక్షించినప్పుడే ఆయన ఘనతని అందరూ కీర్తిస్తారు. జన్మ చేత బ్రాహ్మణుడిగా పుట్టినా, నీచాతినీచంగా దిగజారి, భ్రష్టుడైన అజామీళుని కాపాడినందువల్లనే  భాగవతంలో ఎన్నో రీతులుగా ప్రశంశింపబడినాడు. 
మూఢత్వము, గర్వము, ఇంద్రియలోలత్వము, సంసారసాగరము న తగులుకోవడం, కర్మ బంధాలలో చిక్కుకోవడం, సుఖబోగాలలో తేలియాడటం మనుష్యుని నీచ స్థితికి దిగజారుస్తాయి. వీటినుండి కాపాడమని పై విధంగా అన్నమయ్య కోరుతున్నారు.    

Thursday, January 5, 2012

ఎట్టున్నదో నీచిత్త యెదురాడ నే వెఱతు

//ప//ఎట్టున్నదో నీచిత్త యెదురాడ నే వెఱతు 
గట్టిగా హరి నీ మాయ కడవగరాదు

//చ//నిచ్చ పతితుల జూచి నేను సంసారినైయుందు
అచ్చపు సన్యాసుల జూచి అటువలె నయ్యేనందు
హెచ్చి మెంచి వచ్చితేను యెక్కడి గొడవ యందు
ఇచ్చట నిశ్చల బుద్ధి యెందూ నేగానను

//చ//కర్ముల జూచొకవేళ కర్మము నేఁ జేయబోదు
మర్మపు జ్ఙ్ణానుల జూచి మంచిదందును
అర్మిల రెండూ జూచి అంతలో సందేహింతు
నిర్మలమయిన బుద్ధి నే నెందు గానను

//చ//వారణాసి వోఁజూచి వారివెంట తగులుదు
తేరి కొంత దవ్వు వోయి తిరుగుదును
నేరిచి శ్రీవేంకటేశ నీవే నన్ను గాచితివి
యీరీతి తేరినబుధ్ధి యందు నేగానను

భావం:

ఈ సంకీర్తన ఒక సామాన్య మానవుడు నిరంతరం పడే సంఘర్షణకు అద్దం పడుతుంది. మంచిగా ఉండాలనుకుంటాడు కానీ ఇంద్రియాలకు లొంగిపోతాడు. ప్రతీ విషయంలోనూ సందిగ్ధమే. నిశ్చలమైన బుద్ధి ఎక్కడా ఉండదు. బుద్ధి అటూ ఇటూ ఊగుతూంటుంది. 

స్వామీ! నీ చిత్తం ఎలా ఉందో నామీద. నీకు ఎదురు మాట్లాడే సాహసం నేను చెయ్యను. హరీ! నీ మాయ తెలుకోడానికి సాధ్యపడదు/దాట శక్యము కాదు. 

నిత్యము సంసార సాగరంలో సుఖభోగాలనుభవిస్తూ పాపకృత్యాలు చేసే వారిని చూసి నేనూ సంసారినవ్వాలనుకుంటాను. సన్యాసాశ్రమం తీసుకుని ఈ బంధాలకు అతీతంగా ఎప్పుడూ నీ నామస్మరణలో ఉండే సన్యాసులను చూసినప్పుడు సన్యాసి నవ్వాలనుకుంటాను. కొంచెం ఆధ్యాత్మిక చింతన ఎక్కువయిన క్షణంలో  సన్యాసం తీసుకుని ఓ నాలుగురోజులు అవ్వగానే ఇదెక్కడి గొడవరా బాబూ! అనుకుని సన్యాసాన్ని కూడా సక్రమంగా ఆచరించను. సన్యాసంలో కూడా నా బుద్ధి నిశ్చలంగా ఉండటంలేదు. 

అనేక కర్మలు (ఉద్యోగాలు, విధులు) చేసేవారిని చూసిని నేను కూడా ఏదో ఒకపని చెయ్యాలనుకుంటాను. ఇంతలో నేను చేసే పనివల్ల మోక్షం రాదనుకుని నిరంతరం జ్ఞానసముపార్జన చేసే మహాత్ములను చూసి ఈ పనే మంచిదనుకుంటాను. ప్రేమతో ఈ రెంటినీ పోల్చుకుని చూస్తే మళ్ళీ నాలో నాకే సందేహం కలుగుతుంది. పని చేసుకుని భార్యను సంతోషపెడుతూ పిల్లలతో హాయిగా భోగాలనుభవించడం మంచిదా?. జ్ఞాన సంపన్నుల వెంట జ్ఞాన సముపార్జన చేస్తూ కఠినమైన జీవితాన్ని అవలంబించడం మంచిదా? అని!. అక్కడ కూడా నా బుద్ధి స్వచ్చంగా ఉండట్లేదు. 

కాశీకి పోయేవారందనీ చూసి భక్తి ఎక్కువై వారితో పాటే కాశీ కి పోయి మోక్షం పొందాలనుకుని వారి గుంపులో కలిసి బయలుదేరతాను. కొంత దూరం పోగానే భార్య, పిల్లలు, సంసారసుఖాలు గుర్తొచ్చి మధ్యలో ఆగిపోయి వెనక్కొచ్చేస్తాను. ఈ విధంగా నా బుద్ధి అనేక సంఘర్షణలకు లోనవుతూ స్థిరత్వాన్ని కోల్పోతోంది. మంచి ఏదో తెలిసినా ఆచరించలేని స్థితికి దిగజారిపోతున్నాను. స్వామీ! నీవు నన్ను ఈ విధంగా కరుణిస్తున్నావు. ఇదంతా నీ మాయ. నన్ను మంచి దారిలోకి మార్చుకో..నాకు మంచి బుద్ధిని ప్రసాదించు.       

ఈ కీర్తన ఇక్కడ వినండి. http://annamacharya-lyrics.blogspot.com/